Home » Yandamuri veerendranath » Rakshasudu
"ఇంకో మార్గం లేదు"
ఆ వ్యక్తి నవ్వాడు. "భగవద్గీతలో కృష్ణుడు ఒకమాట చెప్పాడు. కర్మణ్యేవాధి కారస్తే మాఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి అని... అంటే కర్మే మనిషి యొక్క కర్తవ్యము. అతడి ఆశయము. ఫలితమేమవుతుందా అన్న ఆలోచన రాకూడదు అని. ఒక రాజు గారిని ఒక బిచ్చగాడు నిలదీశాడట... 'రాజా! నీకు ఇంత ఐశ్వర్యం వుంది. నాకు దేవుడు ఇమీ ఇవ్వలేదు. కారణం ఏమిటి' అందుకా రాజు గారు - 'ఓయీ నాకింత ఐశ్వర్యం వుందికదా అందులోంచి ఒక వెయ్యి వరహాలిస్తాను. నీ చెవి కోసి ఇవ్వగలవా' అని అడిగాడట. బిచ్చగాడు ఇవ్వనన్నాడట. 'పోనీ లక్ష వరహాలిస్తాను నీ చెయ్యి ఇవ్వగలవా' అని అడిగాడట. బిచ్చగాడు మౌనం వహించాడట. అప్పుడు రాజుగారు... 'దేవుడు నీకు ఇన్ని లక్షల విలువచేసే అవయవాలిచ్చాడు. మరేమీ ఇవ్వలేదంటావేం?' అని అడిగితే, బిచ్చగాడు సిగ్గుతో తలవంచుకున్నాడట. కాబట్టి నాయనలారా! మీరీ పని వదిలిపెట్టండి. మీకు దేవుడిచ్చిన శక్తితో మరేదయినా పని చూసుకోండి".
"ఆ రోజుల్లో రాజుగారు కాబట్టి ఆ ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ శక్తి విలువ ఎవరు గుర్తిస్తారు?"
"శక్తి విలువ ఎప్పుడూ ఒకటే నాయనా! భారతంలో వ్యాసుడు అదే అన్నాడు. కాలం బట్టి వాటి విలువ మారదు. ఉదాహరణలకి పదివేలు ఇస్తాను. మీలో ఎవరైనా చిటికెన వేలు కోసి ఇవ్వగలరా?"
సాలోచనగా అవతలి వ్యక్తి బోధనలను వింటున్న అతడు చటుక్కున తలెత్తి "తప్పకుండా ఇస్తారా?" అని అడిగాడు. ఆ వ్యక్తి అవుననేసరికి సింహం తెప్పరిల్లి అతడిని వారించబోయే లోపులో అతడు పక్కనున్న కత్తి తీసుకుని చటుక్కున వేలు నరుక్కున్నాడు.
కనురెప్పపాటు కాలంలో ఇదంతా జరిగిపోయింది. భగవద్గీత మాట్లాడిన వ్యక్తి కూడా ఈ అనూహ్యమయిన సంఘటనకి నిశ్చేష్టుడయ్యాడు.
"ఎంత పని చేశావ్. నీ కేమయినా మతిపోయిందా?" సింహం కోపంగా అరిచాడు.
అతడు నెమ్మదిగా తల తిప్పి సింహం వైపు చూశాడు. అతడి మొహం నిర్వేదంగా వుంది. తెగిన అరక్షణం వరకూ ప్రాణం వున్నట్టు నేలమీద కొట్టుకున్న చిటికెను వేలు చలనం ఆగిపోయింది. చేతి నుంచి రక్తం ధారాపాతంగా కారుతూంది. అయినా అతడు దాని గురించి పట్టించుకోలేదు. తల వంచుకుని, తనలో తనే అనుకుంటున్నట్టు నెమ్మదిగా అన్నాడు. "నాకు మతిపోయిందన్నావ్! నిజమే సింహం. నాకు మతిపోయింది. ఎవరో తెలియని అమ్మకోసం వేలు నరుక్కోవటం మతి పోవటం కాక మరేమిటి? కానీ... కానీ..నాకు.. నా...కు.." ఆపైన దుఃఖంతో మాట పెగల్లేదు.
ఎలా చెప్పను ఈ ప్రపంచానికి.. నాకో మంచి అమ్మ కావాలని... అమ్మని కనుక్కోవటం కోసం నేనేమైనా చేస్తానని... ఎలా చెప్పివప్పించను? ఏం చెప్పినా అదో పిచ్చితనంలా కనబడుతుంటే వీళ్ళకి...!!! ఈ ప్రపంచంలో మనుషులందరికి 'నా' అనే వాళ్ళెవరూ లేకుండా చేస్తే అప్పుడు అర్థమవుతుందేమో... ఆప్యాయత కోసం మనిషి ఎంత అర్రులు సాచుతూ వుంటాడో- నా బాధని ఎవరూ అర్థం చేసుకోరేం? చివరికి సింహం కూడా...
అతడి కళ్ళలోంచి నీళ్ళు రాలుతున్నాయి. అవి శరీరం తెగిన బాధవల్ల వచ్చినవికావు. మనసు పొరలు కదలటంవల్ల వచ్చినవి. తన బాధని బయటివాళ్ళు పిచ్చితనం అని అనుకోవటం వల్ల వచ్చినవి. అయితే అదే అతడు ఆఖరిసారి ఇతరుల ముందు ఏడవటం. ఆ తరువాత అంతా తన దుఃఖానికి రాత్రుళ్ళు చీకటిని తోడుగా చేసుకున్నాడు.
అతడి దుఃఖానికి సింహం కదిలిపోయాడు. దగ్గిరగా వెళ్ళి "క్షమించు" అన్నాడు. "తెలియని గురువు కోసం బొటనవేలు అర్పించిన వాడు పూజ్యుడుగా గౌరవించబడుతున్న ఈ దేశంలో నువ్వు చేసిన పని తెలివి తక్కువగా కనపడటం.. ముఖ్యంగా నాకు- అది నా తాత్కాలికమైన అజ్ఞానానికి నిదర్శనం. నేను నిన్ను అర్థం చేసుకోగలను. దొంగతనం చేయటానికి అంతరాత్మ వప్పుకోని కారణంగా వెనుకంజవేసిన నువ్వు, ఈ క్షణం నీకు కావలసిన డబ్బుని న్యాయబద్ధంగా సంపాదించుకున్నావు. పద. ఇక నీ తల్లి ఆచూకీ తెలియకుండా దేవుడు కూడా ఆపలేడు..."
* * *
"నరసింహం.. నరసింహం...." పిల్చాడు అతడు. అతడి చేతిలో నోట్లకట్ట వుంది. నరసింహం లోపల్నుంచి ఇచ్చాడు. (ఇలాంటి పనులకు ఇంటి దగ్గిర కలుసుకోవటం మంచిదని నరసింహమే సూచించాడు.) వాళ్ళని చూసి నరసింహం మొహంలో విస్మయం స్పష్టంగా కనపడింది.
"డబ్బు తెచ్చాను. ఇదిగో పదివేలు".
"అదేమిటి.. అరగంట క్రితం వచ్చిన వాళ్ళు మీరు కాదా?"
ఈసారి ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతయింది. "అరగంట క్రితమా?" అన్నాడు సింహం.
"అవును. వచ్చి పదివేలూ ఇచ్చి ఆ రికార్డు తీసుకెళ్ళారుగా. మీ తరఫు వాళ్ళే అనుకున్నాను. వాళ్ళు ఎగస్పార్టీ వాళ్ళా? అసలిదంతా ఏమిటి? ఏదైనా లిటిగేషను వ్యవహారమా? కోర్టుకేసా?"
వాళ్ళు వినటంలేదు. "ఎవరు తీసుకెళ్ళారు పాత రికార్డుని?"
ఈ ప్రశ్నలకి సమాధానంగా అన్నట్టు, దూరంగా నిలబడి అప్పటి వరకూ ఆ ఇంటివైపే చూస్తూన్న ఒక వ్యక్తి వాళ్ళ దగ్గిరికి వచ్చాడు. "మీరేనా సింహం అంటే?" అని అడిగాడు.
"అవును".
"మిమ్మల్ని మా అయ్యగారు తీసుకురమ్మంటున్నారు".
"ఏ అయ్యగారు?"
"నిన్న రాత్రి మీరు వచ్చిన ఇంటి అయ్యగారు".
ఇద్దరూ ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ కారెక్కారు. అయిదు నిముషాల్లో కారు ఆ భవంతిని చేరుకుంది. రాత్రి డబ్బు ఇచ్చిన వ్యక్తి డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని వున్నాడు. టేప్ రికార్డర్ లోంచి తిరుప్పావై భక్తి సంగీతం వస్తూంది.
"రండి... రండి... మీ గురించే చూస్తున్నాను" అంటూ ఆహ్వానించాడు వాళ్ళని. ఆ గదంతా అదొక రకమైన పొగతో నిండి వుండడాన్ని గమనించాడు 'అతడు'.
అది చూసి ఆ వ్యక్తి "ఇప్పుడే కొన్ని పాత రికార్డులు తగలబెట్టాను. ఒక హాస్టల్ తాలూకువి. అందుకే ఈ పొగ" అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ అదిరిపడ్డారు. "కంగారుపడకండి. మీకు కావలసిన స్త్రీ అడ్రసు నా దగ్గిర వుంది. దాన్ని నోట్ చేసుకున్నాకే తగలబెట్టాను".
"మీకేం కావాలి? మీ పదివేలూ మీకు వెనక్కి కావాలి. అంతేగా"
ఆ వ్యక్తి నవ్వేడు.
"పదివేలు నాకొక లెక్కలోది కాదు. నేను చిటికెన వేలితో సంపాదించగలను. చిటికెనవేలు ధర అది. ఆ డబ్బు నీదే".



