Home » Yandamuri veerendranath » Rakshasudu
అతడొక్కడే మిగిలాడు. ఎలా? ఎలా ఒక్క రోజులో పదివేలు సంపాదించడం?
ఇక్కడ అతడు ఇలా కొట్టుమిట్టాడుతూ వుండగా, అక్కడ నరసింహం లోహియాని కలుసుకుని తన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. "...నిజంగా మీ తెలివే తెలివి సార్! ఒక్క రోజులో పదివేలు సంపాదించేలా చేశారు".
"అప్పుడే ఏమైంది? చూస్తూ వుండు. ఇంకా ధర పెరగొచ్చు" అన్నాడు నవ్వుతూ లోహియా. అతనికి ఈ ఆట గమ్మత్తుగా వుంది.
ఒక రాత్రి గడిచింది. గడువు ఇంకా పన్నెండు గంటలుంది. పన్నెండు గంటల్లోగా పదివేలు సంపాదించాలి. ఎలా? అతడు సింహాన్ని కలుసుకున్నాడు. సమస్య చెప్పాడు.
"ఆ నరసింహంగాడిని ఏ ఎముక్కా ఎముక విరిచెయ్యలేక పోయావా?"
"ఆ రికార్డు లోహియా అనే వాడి దగ్గర వుంటుందట..."
"వాడి ఎముకలు కూడా"
"లాభంలేదు సింహం..."
సింహం ఒక క్షణం ఆలోచించి "దొంగతనం చేద్దాం" అన్నాడు. అతడు అయోమయంగా సింహంవైపు చూశాడు.
"ఇంతకాలం అడవిలో జంతువుల్లా బ్రతికేం ఇక్కడి మనుష్యులు అంతకన్నా ఎక్కువ ఆకలిగా కనబడుతున్నారు. వీరికి ఆటవిక న్యాయమే సరి అయినది. ఇక ఎదురు చెప్పక".
* * *
"ఈ ఇల్లు మనం చేయబోయే దొంగతనానికి కరెక్టుగా వుంటుందనుకొంటున్నాను". అతడంత టెన్షన్ ఎప్పుడూ అనుభవించలేదు.
జీవితంలో ఇంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎన్నిటినో ఎదుర్కొన్నాడు. ప్రాణాపాయం వెంట్రుకవాసిలో తప్పిపోయే సంఘటనలు అప్పటికే ఎన్నో వచ్చి వెళ్ళిపోయినాయ్! కానీ ఇది న్యాయానికి విరుద్ధం. అంతకాలం... హత్యలుచేసినా అది అడవిలో ఆత్మరక్షణార్థమే చేశాడు. కానీ ఇప్పుడు చట్టవిరుద్ధంగా దొంగతనం చేయబోతున్నారు.
ఎదురుగా ఎత్తయిన బిల్డింగ్ కనబడుతూ వుంది! చుట్టూ తోట. బెడ్ రూమ్ లోంచి లైటు డిమ్ గా కనబడుతూంది. అడవిలో జాగిలాలను మరిపించి చెట్లెక్కినవాళ్ళకి, గూర్ఖా కన్నుగప్పటం, భవనంలోకి ప్రవేశించటం పెద్ద కష్టం కాలేదు. పావుగంట కష్టపడితే ఇనప్పెట్టె తెరుచుకుంది. లోపల నోట్లకట్టలు కనపడుతున్నాయి.
"తప్పు చేస్తున్నామేమో సింహం మనం"
"ఇంతవరకూ వచ్చాక ఇక సంశయించకు..."
ఇద్దరూ ఇలా వాగ్వివాదంలో ఉండగా లైటు చటుక్కున వెలిగింది. ఇద్దరూ చప్పున తిరిగారు. రివాల్వర్ తో ఒకమనిషి నిలబడి ఉన్నాడు. అతడికి నలభై ఏళ్ళదాకా వయసు ఉంటుంది.
"చేతులెత్తి అలాగే ముందుకు నడవండి.. ఏ మాత్రం నాటకాలాడినా కాల్చేస్తాను..."
ఇద్దరూ ముందు గదిలోకి వచ్చారు. ఇద్దరూ భయపడటం లేదు. భయం వాళ్ళని భయపెట్టడం మానేసి చాలాకాలమయింది. అక్కడ వాతావరణం చూసి మాత్రం కొద్దిగా ఆశ్చర్యపోయారు. సోఫాలో భగవద్గీత పుస్తకం ఉంది. దూరంగా కృష్ణుడి విగ్రహం ముందు అంత అర్థరాత్రి కూడా అగరొత్తి వెలుగుతూంది. బీరువాలో ఆధ్యాత్మిక పుస్తకాలున్నాయి. ఆ వాతావరణానికి సరిపోనిది... యజమాని చేతిలో పిస్తోలు ఒక్కటే.
"దొంగతనం చేసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు అన్న విషయం కూడా తెలియని మీరు ఇంత సాహసానికి ఎలా పూనుకున్నారు?"
సింహంగానీ, అతడుగానీ మాట్లాడలేదు.
"మీరు ఇనప్పెట్టె మీద చెయ్యి వేయగానే అలారం మ్రోగే ఏర్పాటు ఈ ఇంటిలో వుంది. అది మీకు తెలియకపోవటం మీ దురదృష్టం..."
"మమ్మల్ని వదిలెయ్యండి. వెళ్ళిపోతాం".
రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి బిగ్గరగా నవ్వి "మీరు పేరంటానికి వచ్చారా? దొంగతనానికి వచ్చారా? వెళ్ళిపోవటానికి. నేనాలోచిస్తూంది ఏ పోలీసు స్టేషన్ కి ఫోన్ చెయ్యాలా అని".
"మేము మీ చేతిలో రివాల్వర్ చూసి భయపడటంలేదు. అనవసరంగా గొడవ ఎందుకూ అని" అన్నాడు సింహం- అదేదో తామే ఆ వ్యక్తికి సాయం చేస్తున్నవాడిలాగా.
"మీరు దొంగలా? పిచ్చాసుపత్రి నుంచి వచ్చారా?"
"ప్రపంచం అంతా డబ్బుపట్ల పిచ్చిగా వుంటే, ఒక పిచ్చివాడి డబ్బు దాహం తీర్చటానికి వచ్చినవాళ్ళం" మనసులో అనుకున్నాడు 'అతడు'.
"నీ పేరేమిటి?"
"సింహం".
"ఒహో అందుకేనా రివాల్వర్ అంటే భయపడటంలేదు" అంటూ నవ్వేడా వ్యక్తి "కాస్త రుచి చూపించమంటావా?"
అప్పుడా వ్యక్తి అనుకోని సంఘటన ఒకటి జరిగింది. కేవలం వేటకుక్కలకే వుంటుంది ఆ శక్తి, ఆ వేగం!! ఆ వేగంతో వాళ్ళిద్దరూ చెరోవైపునుండి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళారు. అడవిలో చిరుత వెంటాడినప్పుడు తప్పించుకోగలిగే వేగం అది! గార్డు తుపాకి గుండు నుంచి తప్పించుకోగల వేగం అది!! ఆ వేగాన్నీ, మనుషుల్లో అంత చురుకునీ ఆ వ్యక్తి కలలో కూడా ఊహించి ఉండడు. ఎటు పేల్చాలో తెలియక అరక్షణం తబ్బిబ్బు అయ్యాడు. ఆ అరక్షణం వాళ్ళకి సరీగ్గా సరిపోయింది- అరక్షణం తరువాత రివాల్వర్ అతడి చేతిలో వుంది.
దాంట్లో బుల్లెట్స్ తీసి జేబులో వేసుకుంటూ, "వెళ్ళొస్తాం" అన్నాడు.
"డబ్బు" అన్నాడు సింహం ఇనప్పెట్టెవంక ఆశగా చూస్తూ.
"వద్దు సింహం. ఇంకోలా సంపాదిద్దాంలే" రివాల్వర్ ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తూ అన్నాడు. "మేము ఈ క్షణం మీ ప్రాణాలు తీయదల్చుకుంటే, అడ్డుకునేది ఎవరూలేరు. అలాగే మీ ఇనప్పెట్టె పూర్తిగా దోచుకుపోయినా అడిగేవాళ్ళు ఎవరూ లేరు. మేము అది చేయనందుకు ప్రతిఫలంగా మా గురించి మీరు పట్టించుకోకుండా వుండాలి".
ఆ వ్యక్తి రివాల్వర్ తిరిగి తీసుకుంటూ, "నేను నా మాట మీద నిలబడతానని మీకు నమ్మకం ఏమిటి?" అన్నాడు.
"సాటి మనిషిమీద నాకా నమ్మకం వుంది".
ఆ వ్యక్తి అతడి వైపు సూటిగా చూశాడు. ఆ వ్యక్తి కళ్ళల్లో ఇంకా కొద్దినిముషాల క్రితం వారు తన మీదపడిన వైనమే కదులుతూంది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు అతడు.
"ఇంత చురుకయినవాళ్ళు, ఇంత వేగం వున్నవాళ్ళు... యిలా దొంగతనానికి ఎందుకు దిగారు? శుభ్రంగా పనిచేసి పొట్ట పోషించుకోవచ్చుగా..."
వాళ్ళు మాట్లాడలేదు. ఆ వ్యక్తి సింహంవైపు తిరిగి, "నీ స్నేహితుడిని చూస్తూంటే ఇతగాడికి దొంగతనం అంటే ఇష్టం లేనట్టూ కనబడుతూంది. అటువంటప్పుడు ఇంతకన్నా మంచిమార్గం వెతుక్కోవచ్చుగా" అన్నాడు.



