Home » Yandamuri veerendranath » Rakshasudu
"మరి".
"భగవద్గేత నా ఆరాధ్యపుస్తకం. 'యస్యాంతఃకరణం నిత్యం గీతా యం రమతే సదా'.. అన్నాడు గీతలో కృష్ణుడు. నిత్య జీవితంలో ఏ చిక్కుప్రశ్న తటస్థించినా గీతలో ఏదో ఒకశ్లోకం దానికి అర్థం చెప్పగలదు. మర్డర్లు చేయాలంటే ముఖ్యంగా ప్రాణభీతి వుండకూడదు. 'జాతస్యహి ధృవోమృత్యుః" అన్న శ్లోకాన్ని నమ్మేవాడే పెద్ద రౌడీ, హంతకుడు కాగలడు. నిన్న మీరు నా మీదకి దూకినవైనం, కనురెప్పపాటులో నా చేతిలోంచి పిస్తోలు లాక్కున్న విధానం చూసి నాకు మతిపోయింది. తరువాత, క్షణంలో చిటికెనవేలు కోసి ఇచ్చిన వైనం చూసి దిగ్భమ చెందాను. ప్రాణభీతిలేని మీలాంటివాళ్ళు నా వెనుక ఇద్దరుంటే మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించెయ్యగలను. కానీ మీ ఇద్దర్నీ నా వెనుక ఎలా వుంచుకోవటం? ఇది ఆలోచిస్తూండగా మీ సింహం నీ సమస్య చెప్పాడు. నిన్ను చూస్తుంటేనే నీవు నీ తల్లి గురించి ఏమైనా చెయ్యగలవు అని అర్థమైంది. గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? 'యదా యదాహి ధర్మస్య' అన్నాడు. మన శత్రువు లందరూ దుష్టులే. రివాల్వర్ తో చంపినా పాపం లేదు. అసలు విషయానికి సూటిగా వస్తాను. నీ తల్లి గురించి చెప్పటానికి నరసింహం నిన్ను పదివేలు అడిగాడు. అతగాడి నుంచి ఈ రహస్యాన్ని పదిహేను వేలకి నేను కొనుక్కుని, మిగతా ఎవరికీ అది తెలియకుండా సమూలంగా నాశనం చేశాను. నీ తల్లి గురించి నీకు తెలియాలంటే నువ్వు పది సంవత్సరాలు నాతోపాటూ పనిచెయ్యాలి. అదీ కాంట్రాక్టు".
అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. అతడిలో అంత కోపాన్ని సింహం ఎప్పుడూ చూడలేదు. మొత్తం ఆ భవనాన్నే కాల్చేసేటంత ఎర్రగా వున్నాయి ఆ కళ్ళు. పిడికిళ్ళు బిగించి, "మిమ్మల్ని చంపి అయినా ఆ రహస్యం తెలుసుకుంటాను" అన్నాడు.
టేప్ లో వస్తున్న భక్తిగీతాన్ని ఆపుచేస్తూ "చంపలేవు. ఎందుకంటే నేను మరణిస్తే ఆ విషయం ఇక పూర్తిగా చీకట్లోనే వుండి పోతుంది" అన్నాడు.
గాఢమైన నిశ్శబ్దం. అతడు ఆలోచనలో వున్నాడు. వాదన అనవసరం. అవతలి వ్యక్తి వాదనకిగానీ, బెదిరింపుకిగానీ లొంగడు అని తెలుస్తూనే వుంది. మళ్ళీ ప...ది...సం...వ...త్స...రా...లు.
రోషం, ఉక్రోషం, కోపం, నిస్సహాయతా అన్నీ కలగలిసిన భావం కంఠంలో కదులుతూ వుండగా "నేనేం చెయ్యాలి?" అని అడిగాడు.
"అదీ! అలా అన్నావు బావుంది. నీలో నాకు నచ్చేది అదే. తొందరగా నిర్ణయాలు తీసుకోవటం! పోతే నీకో మంచి వార్త ఏమిటంటే, నువ్వు ఎలా ఎదురుచూస్తున్నావో, నీ తల్లి కూడా నీ కోసం అలాగే ఎదురుచూస్తోంది. ఇక మన కాంట్రాక్టుకి వస్తాను. నీలా చావంటే భయం లేని, చిరుతకన్నా చురుకైన వ్యక్తి నాకు కావాలి. ఈ రంగంలో ఇద్దరు శత్రువులు నాకు. వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ... మరోవైపు మన వ్యాపారాలు చూసుకుంటూ..."
"ప్రాణాలకు తెగించైనా, మీకు మరిన్ని లాభాలు సంపాదించి పెట్టాలి" కసిగా పూర్తిచేశాడు సింహం.
"కరెక్టు, కరెక్టుగా చెప్పావు. అదే నాకు కావల్సింది! పది సంవత్సరాలు చాలు. తరువాత ఎవరిదారి వారిదే. అంతేకాదు. నీకు ఇందులో వాటాకూడా ఇస్తాను. వాటా అంటే వేలల్లో వుండదు. లక్షల్లో వుంటుంది. మన వ్యవహారాలన్నిటికీ ముందు నువ్వుంటావు- వెనుకే నేను వుంటాను".
అమ్మా అమ్మా ....
"...ఎలాగూ నీకు ఇప్పుడు పనేంలేదు. తల్లి దొరికినా పోషించే డబ్బు లేదు".
అమ్మా అమ్మా..
"చెప్పు. చేస్తావా?"
అతడొక నిర్ణయానికి వచ్చినట్టు, మరో గత్యంతరం లేనట్టు... "చేస్తాను" అన్నాడు. కాంట్రాక్టు కుదిరింది.
"ఈ వ్యవహారాల్లో మనకున్న శత్రువులు ఇద్దరూ ఎవరు?"
"ఒకరు లోహియా."
అతడు ఉలిక్కిపడి... "లోహియా... అంటే హాస్టల్ గౌరవ ప్రెసిడెంటు. అతడేనా" అన్నాడు.
"అది చాలా చిన్న పదవి. ఈ నగరపు కోటేశ్వరుల్లో ఒకడు" అన్నాడు.
"ఇంకొకరు ఎవరు?"
"వంకచెక్కా రామ్మూర్తి అని..."
తన చెవుల్నే నమ్మలేకపోయాడు అతడు. అడవిలో పట్టు బాలీసుల మీద పడుకుని జ్యోతిష్యం అడిగిన విషయం గుర్తొచ్చింది. ఆ రోజు అతడితో తనన్న మాటలు.. "ఒక మనిషి మీ మీద పగబట్టి వున్నాడు. సింహం బోనులోనుంచి బయటకు వచ్చినట్టు అతడు కొద్దిరోజుల్లో బయటకు వచ్చి మీ మీద పగతీర్చుకుంటాడు. ఇంతమందిని బానిసలుగా మార్చి హింసించినందుకు వారి తరఫు ప్రతినిధిగా నీ రక్తం కళ్ళజూస్తాడు".
"ఇంతకీ మీ పేరు చెప్పలేదు?" సింహం అడిగాడు.
ఆ వ్యక్తి నవ్వేడు. "చెప్తాను. పది సంవత్సరాలు కలసి పనిచెయ్యబోతున్నావుగా! నా పేరు చెప్పకుండా ఎలా? నా పేరు జి. కృష్ణమూర్తి. అందరూ జి.కె. అంటారు. ఈ క్షణం నుంచీ నువ్వు నా పెంపుడుకొడుకువి. ఇదిగో ఈ రివాల్వర్ మీద ఆన.."
ఆ రాత్రి ప్రపంచం అంతా నిద్రపోయాక ఇంకో చీకట్లోకి చూస్తూ అనుకున్నాడు-
"అమ్మా! నిన్ను కలుసుకోవటానికి ఇంకో పది సంవత్సరాలు పడుతుందట. ఇంతకన్నా విషాదం ఏముంది? కానీ ఇంత విషాదంలోనూ నాకొక్కటే ఆనందమమ్మా. నిన్ను నా నుంచి ఇంతకాలం వేరుచేసిన ఆ ఇద్దరిమీదా పగ తీర్చుకునే అవకాశం లభించింది. నీ ఆచూకీ తెలిసిన మరుక్షణం మూడోవాడైన ఈ జి.కె.కి కూడా పాఠం చెపుతాను. అంతవరకూ నన్ను క్షమించు. నిస్సహాయుణ్ని!"
మానవత్వానికి కట్టుబడి- నరసింహాన్ని బెదిరించకుండా వున్న అతడు- న్యాయానికి కట్టుబడి ఇనప్పెట్టెని వదిలేసిన అతడు-- ఆ క్షణం నుంచీ అలా ..
ఆ రెంటినీ వదిలిపెట్టాడు.
* * *
"అది సుమతీ జరిగింది" అంటూ ముగించాడు.
15
ఆమె వైపునుంచి ఏవిధమైన జవాబూ రాకపోవటంతో తలతిప్పి చూశాడు అతడు. కనుకొలకుల్లో నీరు నిలవగా ఆమె చాలాసేపు అలాగే వుండి, నెమ్మదిగా అంది. "మనిషి జీవితం-తర్కానికి అందని ఓ గొప్ప సత్యం- అని ఎక్కడో చదివాను. అది అక్షరాల నిజమని ఇప్పుడు నమ్ముతున్నాను. నేనేమీ చెప్పలేను- కానీ ఒక మాట మాత్రం అనగలను. నీ తల్లి ధన్యురాలు. అంతే".
తెగిన చిటికెనవేలు, పచ్చబొట్టు పూర్తికాక కాలిన చర్మం, భుజం మీద చుట్టకాల్చిన మచ్చ, ఛాతీలో గుచ్చుకున్న పడవతాలూకు చెక్క-అతడి శరీరం మీద అతడి తల్లి ప్రేమ తాలూకు చిహ్నాలుగా మిగిలి పోయాయి.



