Home » Yandamuri veerendranath » Prarthana
చదవటం పూర్తిచేసి శేఖరం తలెత్తాడు. అతని మొహంలో సన్నటి విచారరేఖ ప్రతిబింబించింది.
"ఇప్పటివరకూ నేను అంధుణ్ణయినందుకు ఎప్పుడూ బాధపడలేదు. మీకు ఇంకా ఉపయోగకరంగా వుండలేకపోతున్నందుకు ఈ క్షణం బాధ పడుతున్నాను".
భార్గవ వెంటనే రియాక్టయ్యాడు. "ప్రాణాలకి తెగించి ఈ అర్థరాత్రి నువ్వు చేస్తున్న సహాయం సామాన్యమైనదేమీకాదు శేఖరం. నిజాన్ని చూడగలిగే చాలామంది మనుషుల కన్నా ఏమీలేని నువ్వే జరుగుతున్న వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగావు".
ఈ ప్రసక్తి ఇష్టంలేని శేఖరం "టైమెంతయ్యింది?" అని మాట మార్చాడు.
"ఒంటిగంట. కొద్దిసేపు నువ్వు రెస్టు తీసుకో శేఖరం, నేనిక్కడ చూస్తూంటానులే!?"
"అదేమిటి మీరు....?" అతడు వాక్యం పూర్తి చెయ్యలేదు.
"ఇప్పుడు నేను చూసేది కూడా ఏమీలేదు. ఛాంబర్స్ లో రియాక్షన్స్ గమనిస్తూనే వుంటాను. రేపంతా మేలుకుని వుండాల్సిన అవసరం నీకు వుంటుంది. ఇప్పుడు నువ్వు రెస్టు తీసుకోవడం చాలా అవసరం. నేనిక్కడ వుంటాను, నువ్వు పడుకో".
శేఖరానికి అది నిజమే అనిపించింది. అతను రెస్టు తీసుకోడానికి వెళ్ళిపోయాడు.
భార్గవ మెయిన్ హాల్ గుమ్మం దగ్గర నిలబడి ఆలోచనలలోకి జారుకున్నాడు. దూరంగా కిటికీలోంచి ఆకాశం కనబడుతోంది. నక్షత్రాలూ, చంద్రుడూ, మేఘాలు అన్నీ ఈ సైంటిస్టు ఏం చేస్తాడా? అని చూస్తూన్నట్టు నిశ్చలంగా చూస్తున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తూ తన లోకంలోనికి వెళ్ళిపోతే ఆ అచేతనత్వం నుండి భంగం కలగటానికి అతడికి చాలాసేపు పడుతుంది. శూన్యంలోకి చూస్తూ ఆ ఊహా లోకంలోనే చాలాసేపు వుండిపోయాడు.
కిటికీ రెక్కమీద అతడి నీడకూడా అతడిలాగే నిశ్చలంగా వుంది. అదే సమయానికి అక్కడికి రెండువందల గజాల దూరంలో చెట్టు వెనుక చిన్న కదలిక...
రవూఫ్ చెట్టుచాటునుండి నెమ్మదిగా బయటికి వచ్చాడు. సరిగ్గా ఈ అవకాశం కోసమే అతడు చీకటి పడినప్పటినుండీ వేచి చూస్తున్నాడు. తన ప్రయత్నం ఫలించిందని అతడు ఊహించాడు. శేఖరం-భార్గవల సంభాషణ పూర్తి అయి శేఖరం పడుకోవడానికి వెళ్ళి, భార్గవ నీడ కదలకుండా కిటికీ రెక్కలమీద అలాగే వుండేసరికి రవూఫ్ వేరేవిధంగా ఆలోచించాడు.
ఈ ట్రిక్ అతడికి బాగా తెలుసు.
మనిషి ఆకారంలో నీడపడేటట్లు వస్తువుల్ని పేర్చి అవతల వాళ్ళకి భ్రమ కలిగిస్తూ లోపల తమ పని తాము చేసుకోవడం, ఈ ట్రిక్ తో లోపలివాళ్ళిద్దరూ తమని వెధవల్ని చేసి నిద్రకుపక్రమిద్దామనుకున్నారన్నది.
రవూఫ్ చప్పుడు కాకుండా కిటికీ వద్దకు చేరుకున్నాడు. కానీ అతడు ఊహించని విధంగా కేవలం రెండడుగుల దూరంలో భార్గవ వున్నాడు. అతడిని చూసి ఉలిక్కిపడి చప్పున అక్కడినుండి వెనక్కి పరుగెత్తబోయాడు.
మళ్ళీ అంతలోనే ఏదో స్ఫురించినట్టు ఆగిపోయాడు.
భార్గవలో తనని చూసిన కదలికే లేదు.
ఆ సైంటిస్టు ఎప్పుడో ఆలోచన్లలోకి జారుకుని తన చుట్టూ జరిగే దాన్ని గ్రహించే స్థితిలో లేడు.
రవూఫ్ ఒక్క క్షణం కదలకుండా నిలబడి ఈ విషయాన్ని ధ్రువపరచుకున్నాడు. భార్గవ వెనుక గదిలో దూరంగా పడుకుని వున్న రెండవ వ్యక్తి కూడా రివాల్వర్ రేంజిలోనే వున్నాడు.
ఇలాంటి అవకాశం మరి దొరకదు.
అతడు చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా బెల్టునుండి రివాల్వర్ తీశాడు.... నల్లటి రివాల్వర్ మీద తెల్లటి వెన్నెల తళుక్కుమని ప్రతిబింబించింది. అతడు కిటికీలో నుండి రివాల్వర్ లోపలికి జార్చి పడుకున్న శేఖరాన్ని గురి చూస్తూ ట్రిగ్గర్ నొక్కాడు.
కానీ ఒక్క క్షణం ఆలస్యం అయింది.
రివాల్వర్ మీద పడిన వెలుగు కళ్ళలోకి రిఫ్లెక్టు అవటంతో ఏదో మెరిసినట్టయి భార్గవ చప్పున ఈ లోకంలోకి వచ్చి అటువైపు దృష్టి తిప్పాడు. కొద్దిదూరంలో మిలమిలా మెరుస్తున్న రివాల్వర్ కనబడింది. ఒక్క క్షణంపాటూ అర్థంకాలేదు. అర్థం అయిన వెంటనే స్పాంటేనియస్ గా చేతనావస్థలోనికి వచ్చి ఒక్క గెంతులో గాలిలా దూసుకుపోయి, అదే వేగంతో కిటికీ రెక్కని కాలితో తన్నాడు.
కిటికీ రెక్క రివాల్వర్ కి కొట్టుకోవటం, రివాల్వర్ పేలడం ఒక క్షణంలో జరిగాయి.
బుల్లెట్ తగిలి భళ్లుమన్న శబ్దంతో అద్దం బ్రద్దలయింది. పడుకున్న శేఖరంపై నుండి అయిదారడుగుల తేడాలో బుల్లెట్ దూసుకుపోయింది. ఛాంబర్ నిండా గాజుపెంకులు విసిరేసినట్టు పడ్డాయి. కానీ దానితోపాటు ఎవ్వరూ గమనించని మరో చిన్న సంఘటన కూడా జరిగింది. రవూఫ్ పేల్చిన బుల్లెట్ గురితప్పి ఛాంబర్ లో ఓజోన్ లేయర్ కి అమర్చిన ట్యూబ్ ని రాసుకుంటూ శేఖరంవైపు వెళ్ళింది.
భార్గవ శేఖరానికి చెప్పినట్టు తన ప్రయోగాన్ని రెండు రంగాలుగా విభజించి చేస్తున్నాడు. ఒకటి మైటాసిస్ సమయంలో మ్యూటేషన్ కలిగించడం, రెండు కృత్రిమ కణ నిర్మాణ సమయంలో కార్సినోజిన్ ని పంపించడం. రవూఫ్ పేల్చిన బుల్లెట్ వల్ల ట్యూబ్ ఛాంబర్ లోని ఓజోన్ ని ఆపు వుంచే పొరకి రంధ్రం చేసింది. ఇది యిలా వుండగా...
ఈ లోపులో భార్గవ కనురెప్పపాటు సమయంలో బల్లమీద ఎక్స్ ప్లోజివ్ ని చూసి అందుకుని కిటికీ గుండా బయటకు విసిరాడు. మీదకు వస్తున్న బాంబుని చూసి రవూఫ్ భయభ్రాంతుడై మూడు అంగల్లో దూరంగా వెళ్ళిపోయాడు.
ఒక క్షణం... ఒక నిముషం... రెండు నిముషాలు... గడిచాయి. బాంబు పేలలేదు.
అయినా రవూఫ్ దాని దగ్గరకు వెళ్ళే సాహసం చెయ్యలేదు. అతడికి అంతకుముందు సాయంత్రమే అవి నిజమైన బాంబులే అన్న రిపోర్టు వచ్చింది.
ఈ హడావుడికి బయట పోలీసులూ, లోపల శేఖరమూ నిద్రలేచారు.
"ఏం జరిగింది?" శేఖరం అడిగాడు.
భార్గవ జరిగినదంతా చెప్పాడు. "ఆ కంగారులో బాంబు సీలు విప్పటం మర్చిపోయాను".
"అదే మంచిదయ్యింది. బాంబు పేలి ప్రాణనష్టం జరిగితే మనకోసం బయట ఉరికంబం సిద్ధంగా వుండేది. మన గమ్యం అదికాదు. ఇంక మీరు పడుకోండి, ఇలా కాపలా కాయడాలూ అవీ మీకు అచ్చిరావు"
"అదికాదు శేఖరం. నేనూ..." అని ఇంకేదో వ్రాయబోతూంటే శేఖరం ఆపుచేసాడు.
"మీరు చెప్పబోయేది నాకు తెలుసు. ఇంక ఏ వాదనలూ వద్దు. మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచించాలీ అంటే ఇలాటి డిస్ట్రబెన్సెస్ ఉండకూడదు".
శేఖరం తిరిగి పచార్లు చెయ్యటం మొదలుపెట్టాడు.
.... రాత్రి రెండు కావస్తూంది.



