Home » Yandamuri veerendranath » Rakshasudu


    "అవును. ఒకామె వుండేది. హాస్టల్ లోనే ప్రసవించింది. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంగతే అయినా చాలాకాలం దాని గురించి చెప్పుకున్నాం" అన్నాడు ముసలి వాచ్ మెన్.

 

    వేగంగా కొట్టుకుంటూన్న గుండెతో అతడు, "ఆమె ఇప్పుడు ఎక్కడ వుంది?" అని అడిగాడు.

 

    "ఆ సంవత్సరపు హాస్టల్ రికార్డు వెతకాలి. ఆమె ఎక్కడ పని చేస్తూ వుందో అందులో దొరుకుతుంది. ఒకవేళ రాజీనామా చేసినా, స్వంత అడ్రస్ దొరుకుతుంది".

 

    అతడు ఆత్రంగా "హాస్టల్ రికార్డు ఎక్కడ వుంటుంది?"

 

    "నరసింహం అని గుమాస్తా వున్నాడు. అతడిని అడిగితే చూపిస్తాడు".

 

                                                       *    *    *

 

    "చాలా పాత రికార్డు అది. ఎప్పటి పుస్తకాలో వెతికి చూడాలి. రేపు రండి".

 

    "రేపటివరకూ కాదు. ఇప్పుడే కావాలి".

 

    నరసింహం తేలిగ్గా చూసి, "అసలు మీకు చూపించవలసిన అవసరం మాకేముంది?" అన్నాడు.

 

    అతడు జేబులోంచి వందరూపాయలు తీశాడు. కడుపు నిండా సరిగ్గా తిండికూడా తినకుండా దాచుకున్న డబ్బు అది. ఇన్నాళ్ళ వెతుకులాటలో ఖర్చయినది ఖర్చవగా మిగిలింది అది. కాళ్ళు కరిగేలా పనిచేసి సంపాదించిన డబ్బు అది.

 

    నరసింహం మొహంలో, వందనోటు చూడగానే ప్రసన్నత ఏర్పడింది "నిజంగా కష్టమే సార్. ఆ గోడవున్ లో వెతికి తియ్యాలి. రేప్రొద్దున్నకి తీసివుంచుతాను. ఆఫీసు ఇంకోగంట వుంది. ఈ గంటలో వెతకడం కష్టం..."

 

    అతడు అయిష్టంగానే 'సరే' అన్నాడు వందనోటు అందిస్తూ.

 

                                                        *    *    *

 

    లోహియా బ్రాందీగ్లాసు పక్కనపెట్టి "ఏమిటి ఇంకా రాలేదు" అన్నాడు విసుగ్గా. అప్పటికి అతను మూడోరౌండులో వున్నాడు. హాస్టల్ నుంచి రావలసిన అమ్మాయి ఇంకా రాలేదు. వార్తాహరుడు మాత్రం వచ్చేశాడు. అతడెవరోకాదు... క్లర్కు నరసింహమే! అతడికి లోహియాలాటి వాళ్ళ నుండి మంచి బహుమతులు లభిస్తూ వుంటాయి. వాటికి తగిన ఏర్పాట్లు చేస్తూవుంటాడు. లక్షల్లో వ్యాపారంచేసే లోహియాకీ, చిన్న గుమాస్తా నరసింహానికి సంబంధం వుండటానికి అదీ కారణం! యజమాని 'విసుగు'ని తగ్గించడానికి నరసింహం.. సాయంత్రం జరిగిన సంఘటన చెప్పాడు. తను చెప్పిన దానిపట్ల ఉత్సాహం కలిగినట్టు కనిపించడం చూసి ఒకటికి రెండు కల్పించి చెప్పాడు.

 

    అంతా విని లోహియా మత్తుగా అన్నాడు... "నరసింహం నీకు బ్రతకటం చేతకాదోయ్!"

 

    "ఎందుకు సార్!"

 

    "అతడంతకాలం తరువాత వెతుక్కుంటూ వెనక్కి వచ్చాడంటే... అందులో లిటిగేషను అర్థంకావటం లేదూ? ఏదో ఆస్తి వ్యవహారమో, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారమో అయివుంటుంది. నువ్వుకాబట్టి వంద అడిగావు. నన్ను సలహా అడిగుంటే పదివేలకి తక్కువ అడిగివుండమనే వాడినికాదు".

 

    నరసింహం గొంతు తడారిపోయింది. "...పదివేలా?" అన్నాడు.

 

    "అవును, అడిగిచూడు ఇవ్వకపోతే నన్నడుగు" లోహియా తన వ్యాపారశక్తిని సూచిస్తూ నవ్వేడు.

 

    "మరీ అంత డబ్బంటే... పై అధికార్ల వత్తిడి తెస్తాడేమో.."

 

    "ఇంత భయపడే వాడివి లంచమెలా తీసుకుంటావోయ్! ఆ హాస్టల్ కి గౌరవ ప్రెసిడెంట్ ని నేనేగా! అంతగా కావాలంటే నా పేరు చెప్పు. రికార్డులు ప్రెసిడెంట్ గారి దగ్గిరున్నాయను".

 

    నరసింహం లోహియాకాళ్ళమీద పడినంత పనిచేసి "మీరునిజంగా గొప్పవారు సార్" అన్నాడు. "ప..ది..వేలు నేను కలలో కూడా వూహించలేదు. మీరడగమన్నట్టే అడుగుతాను. ఇదింతా మీధర్మమే".

 

    "మనకి కావలసినవాళ్ళని ఎలాగైనా చూసుకోవాలి కదయ్యా.."

 

    ఆ విధంగా ఒకవ్యక్తి జీవితపు తపనకి... ఇన్నాళ్లూ పడిన కష్టానికీ, జీవన్మరణపు అంచులమీద నడుస్తూ చేరుకున్న గమ్యపు ఆఖరి అవకాశానికి ఖరీదు పదివేలుగా మారింది.

 

                                                        *    *    *

 

    "పదివేలా?" అన్నాడు అతడు. ముందు కోపం, తరువాత నిస్సహాయత. కళ్ళలో ముందు ఎరుపు, తరువాత వేదన. "ఇంత చిన్న పనికి పదివేలా?"

 

    నరసింహం మాట్లాడలేదు.

 

    "నిన్న సాయంత్రం వందన్నావు".

 

    నరసింహం దానికీ మాట్లాడలేదు.

 

    "రాత్రికి రాత్రి రేటెందుకు మారింది?"

 

    "నేకావిడ సంగతులెందుకు? ముందు అది చెప్పు".

 

    "ఆ విషయం నీ కనవసరం".

 

    "సరే అయితే నువ్వు ఈ విషయం మర్చిపో".

 

    "కానీ నిన్న నా దగ్గిర వందరూపాయలు తీసుకున్నావు".

 

    "వందరూపాయలా? ఏం రూపాయలు? నాకే సంగతీ తెలీదు".

 

    అతడు పిడికిలి బిగించాడు. ఆ దెబ్బేగానీ తగిలివుంటే నరసింహం నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళిపడి, వెతకి పాత రికార్డులు తెచ్చివుండే వాడేమో. కానీ అతడు అంతలోనే తమాయించుకుని, బ్రతిమాలుతున్నట్టు "ప్లీజ్! నాకా విషయం ఎలాగైనా కావాలి" అన్నాడు. ...దాంతో నరసింహం తిరిగి కొండెక్కిపోయాడు.

 

    "ఈ డబ్బు నాక్కాదు. మా గౌరవ ప్రెసిడెంటు లోహియాగారికి".

 

    "ఇది.... ఇది దారుణం."

 

    "దారుణమేమీలేదు. ప్రస్తుతం ఆ రికార్డు ఆయన దగ్గిరేవుంది" అబద్ధమాడాడు నరసింహం. 'లోహియా... లోహియా...' మనసులో కసిగా అనుకుంటూ.

 

    "సరే. నేనే ఆ లోహియాని కలుసుకుంటాను" అన్నాడు.

 

    "అఖ్ఖర్లేదు. ఆయన్ని కలుసుకున్నా తనకేం తెలీదంటాడు. ఆయన తరఫున నేను చెపుతున్నాగా."

 

    "పదివేలు ఎక్కణ్నుంచి తేను?"

 

    "అది నువ్వు చూసుకోవలసిందే! నేనేమీ చెయ్యలేను. రికార్డు లోహియాగారు పట్టుకెళ్ళారు. బహుశా ఇంత పాత రికార్డులెందుకని కాల్చెయ్యవచ్చు కూడా".

 

    అతడు అదిరిపడి, "కాల్చేస్తారా?" అన్నాడు.

 

    "గవర్నమెంటులోనే అంత పాత రికార్డులుంచరు. మేమెందుకు వుంచాలి?" ఓరగా చూస్తూ అన్నాడు నరసింహం. అతడి ఆత్రం చూస్తున్న కొద్దీ నరసింహానికి ఏనుగెక్కినట్టువుంది. అనవసరంగా పదివేలే అడిగేనే అని బాధపడుతున్నాడు. ఇలాంటి పిట్టని పట్టి ఇచ్చినందుకు మనసులోనే లోహియాకి కృతజ్ఞత చెప్పుకుంటూ. అతడేమీ మాట్లాడకపోయేసరికి, "సరే... ఎల్లుండి సాయంత్రం వరకూ చూస్తాను. రేపటిలోగా పట్రా" అని హాస్టల్ లోకి వెళ్ళిపోయాడు.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More