Home » Yandamuri veerendranath » Prarthana
అంతలో ఓ పోలీసు ఫ్లాస్క్ తో టీ తీసుకువచ్చాడు. ఇద్దరూ తాగారు. చేసే పనేమీలేదు. చూస్తూ ఉండడమే... అవకాశం రావాలి... వస్తుంది... వస్తుందన్న నమ్మకం వుంది రవూఫ్ కి... అతడెన్నో కేసులు చూశాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట నేరస్థులు రిలాక్స్ అవుతారు. పులిపంజా విసిరినట్లు ఊహించని వేగంతో అప్పుడు విసరాలి? దానికోసమే ఎదురు చూస్తున్నాడు....
* * *
ఈ ఎత్తులూ, పైయెత్తుల యుద్ధంలో ఎటూ దారి తోచనిది వసుమతి ఒక్కతే.
ఆస్పత్రిలో ప్రార్థన కనబడలేదనగానే మహేంద్రజైన్ పోలీసు స్టేషన్ కి ఫోన్ చేస్తున్నప్పుడు ఆమె ఫోన్ ప్రక్కనే వుంది. అయితే ఆమెకు ఒక మాట కూడా వినబడలేదు. అనూహ్యమైన ఈ సంఘటనకి ఆమె శరీరం సన్నగా కంపించసాగింది. దాదాపు గంటా రెండు గంటల వరకూ ఆమె తేరుకోలేదు. 'ప్రార్థన కనబడటంలేదు' అదొక్కటే ఆమె కర్థం అయింది. ప్రార్థనను ఆమె తండ్రి తీసుకువెళ్ళి వుంటాడన్న ఆలోచన రాలేదు. ఈ సంఘటనకి ఆ కుటుంబం మొత్తానికి తను జవాబుదారీ అన్న భావంతో ఆమె వణికిపోతూంది. తనుకూడా ఆ కుటుంబంలో ఒక సభ్యురాలినే అన్న సంపూర్ణమైన భావం పెళ్ళైనతర్వాత ఆమెకి ఎప్పుడూ కలగనేలేదు. అదేం ప్రారబ్ధమో పరిస్థితులన్నీ కూడబలుక్కున్నట్లు ఆమెని ఆ కుటుంబం నుండి వేరుగా ఉంచుతూనే ఉన్నాయి.
రవూఫ్ తో మాట్లాడి మహేంద్ర ఫోన్ పెట్టేస్తూండగా, ఆస్పత్రి సూపరింటెండెంట్ దగ్గరనుండి అర్జంటుగా రమ్మని కబురొచ్చింది. అప్పుడే ఈ విషయం అక్కడివరకూ పాకిపోయిందా అనుకొంటూ మహేంద్ర హడావుడిగా వెళ్ళిపోయాడు. గదిలో ఆమె ఒక్కతే మిగిలిపోయింది. ఎంతసేపటికే మహేంద్ర వెనక్కి రాలేదు. ఆమెకి కనీసపు ఓదార్పు మాటలుకూడా కరువయ్యాయి. ఆ గదిలో ఒంటరితనం మరింత భయంకరంగా తోచి గది బయటకి వచ్చింది. చిరు ఆశతో తిరిగి తమ గదికి వెళ్ళింది. ఖాళీగా వున్న పక్క వెక్కిరించింది. నర్సులూ, డాక్టర్లూ అందరూ తమపని తాము చేసుకుపోతున్నారు. ఇదేదో చాలా సామాన్యమైన సంఘటనా వుంది వాళ్ళకి. ఆమెకు పిచ్చెక్కిపోతూంది. బిగ్గరగా ఏడవాలనీ, ఆస్పత్రి గోడలకేసి తల కొట్టుకోవాలనీ, పెరుగుతున్న కసిని అతికష్టంమీద అణుచుకుంది. అకస్మాత్తుగా ఆమెకీ విషయం తోచింది. తనకీ ఆస్పత్రికీ ఇక సంబంధం లేదు. ప్రార్థన లేకపోతే ఇక తను ఇక్కడ వుండే అవసరం ఏముంది?
ఆమె వెతుక్కుంటూ మహేంద్ర దగ్గరికి వెళ్ళింది. అప్పుడే బయటికి వస్తూన్న అతడు ఆమెను చూడగానే ఓదార్పుగా "మీరేమీ కంగారు పడకండి. ఎక్కడున్నా పట్టుకుంటారు. ఇన్ స్పెక్టర్ కి వివరాలు చెప్పాంకదా!" అనేసి హడావుడిగా ఆపరేషన్ థియేటర్ లోకి నడిచాడు. "మీరిక ఇంటికి వెళ్ళచ్చు" అన్న అర్థం అతని మాటల్లో ఆమెకి కనబడింది. నిజమే అక్కడ వుండి చేసేదేముంది? రంగస్థలం ఆస్పత్రినుండి పోలీసుస్టేషన్ కి మారింది. ఇంట్లో మిగతా పిల్లలిద్దరూ లేరు. అంత పెద్ద ఇంట్లోకి ఒంటరిగా ప్రవేశించేసరికి ఆపుకున్న దుఃఖం అంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకుని ప్రవహించినట్టూ పెల్లుబికింది. పక్కమీద పడుకుని బిగ్గరగా చాలాసేపు రోదించింది. అన్నినాళ్ళనుండి ఆపుకున్న నిస్సత్తువ ఆమెని నెమ్మది నెమ్మదిగా ఆక్రమించింది. ఆ మైకంలో అలా ఎంతసేపు వుండి పోయిందో తెలీదు. ఆమె కళ్ళువిప్పి చూసేసరికి బయట చీకటిపడింది. చాలాసేపటివరకూ ఆమెకి తనెక్కడుందో, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి మళ్ళీ దిగులు ఆవరించింది. డాక్టర్ మహేంద్ర పోలీసుస్టేషనని చెప్పాడుగానీ ఏ స్టేషనో ఏమోకూడా తెలీదు.
ఆమెకి పరిచయాలూ, పలుకుబడీ ఏమీలేవు. భర్త ఎక్కడున్నాడో కూడా తెలీదు. తెలిసిందల్లా స్కూలు ఒక్కటే. ఆమె తిరిగి మహేంద్రకి ఫోన్ చేసింది. ఈ సమయంలో అతడొక్కడే కాస్త ఆప్తుడిగా కనిపించాడు. అట్నుంచి అతడు ఫోన్ ఎత్తి "ఎవరూ?" అని అడిగాడు.
"నేనండీ! వసుమతిని. మా పాప సంగతి..." ఆ మాట పూర్తవకుండానే అతడు "మీకింకా తెలీదా? ఆస్పత్రి నుండి పాపని ఎత్తుకు పోయింది భార్గవే! ప్రస్తుతం ఇన్ స్టిట్యూట్ లో దాక్కొని ఉన్నాట్ట. ఇంకెంతసేపులెండి, పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్టుచేసి పాపని తీసుకురావడమే!"
ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. "ఆ... ఆయన్నా!" అంది వణుకుతున్న కంఠంతో.
"ఆ! భార్గవే! లోపల బాంబ్స్ కూడా పెట్టుకున్నార్ట. అందుకే ఆలస్యం అవుతోంది."
"బాంబులా!" అన్న ఆమె మాట పూర్తికాకుండానే పెద్ద చప్పుడుతో ఆమె చేతిలో రిసీవర్ జారిపోయింది.
* * *
రాత్రయింది. ఛాంబర్ లోపల కిటికీ దగ్గర నీడ కదులుతూనే ఉంది. అప్పటివరకూ దూరంగా ఉన్న యస్సై ఏదో గొప్ప ఆలోచన స్ఫురించినట్టూ దగ్గరికి వచ్చి-
"లోపలికి స్మోక్ బాంబు విసిర్తే!" అని అడిగాడు. రవూఫ్ అతన్ని విసుగ్గా చూసి "లోపల అనారోగ్యంతో ఓ పేషెంటు ఉంది. మన ఉద్యోగాలు పోతాయి" అన్నాడు. మొహం చిన్నది చేసుకుని యస్సై తన యధాస్థానానికి వెళ్ళిపోయాడు.
దట్టమైన చీకటి చుట్టూ అలుముకుంది.
రాత్రి పదయింది.
పదకొండు...
పన్నెండు....
లోపల భార్గవ తన ప్రయోగంలో లీనమై ఉన్నాడు. వాళ్ళు ముందనుకున్న ఒప్పందం ప్రకారం ఎవరిపని వాళ్ళు చేసుకుపోతున్నారు. శేఖరానికి పగలూ, చీకటీ తేడాలేదు. టైమ్ ప్రసక్తే రాదు. అతడలా తిరుగుతూనే వున్నాడు. తనేమాత్రం ఏమరుపాటుగా వున్నా వాళ్ళు దగ్గరకు రావచ్చు. తలుపు తూట్లు తూట్లుగా రివాల్వర్ తో కాల్చేయవచ్చు. లోపల భార్గవతోపాటు వున్నది ఒక అంధుడు అన్న విషయం ఒక్కసారి తెలిసిందంటే ఇక వాళ్ళనెవరూ ఆపలేరు. తనున్నా లేకపోయినా ఒకటే. భార్గవని గాయపరచి నిస్సహాయుల్ని చేస్తారు. ఇక్కడ కావల్సింది వాళ్ళని దూరంగా వుంచడం- భార్గవ ప్రయోగం కొనసాగేలా చూడడం.
దాదాపు అర్థరాత్రి కావస్తూ వుండగా హఠాత్తుగా నిద్రలోంచి మేల్కొన్నట్టు భార్గవ ఈ లోకంలోకి వచ్చి తన పరికరాల మధ్యనించి శేఖరాన్ని చూశాడు. అతడింకా పచార్లు చేస్తూ వుండటంచూసి మిల్లర్సు ఫ్లాస్కు ప్రక్కకి జరిపి శేఖరం దగ్గరకు వచ్చి ఆప్యాయంగా అతడి చేతిమీద చెయ్యి వేసేడు.
"ఎంతవరకూ వచ్చింది?" అన్నట్టూ సైగ చేశాడు శేఖరం.
1966 వరకూ వచ్చింది" వ్రాస్తూ వుంటే భార్గవ పెదాలమీద పేలవమైన నవ్వు కదలాడింది.
"అంటే?"
"కృత్రిమంగా క్లోరోఫిల్ తయారు చెయ్యడం వరకూ. అంతకన్నా ముందుకి వెళ్ళడం లేదు. 1966లో కెనడాకి సంబంధించిన బయోకెమిస్టులు పత్రహరితంలో ముఖ్య పదార్థమైన ఒకదానిని కృత్రిమంగా సృష్టించవచ్చని కనుక్కున్నారు" అంటూ ఆ వివరాలన్నీ వ్రాసి చూపించాడు.



