Home » Yandamuri veerendranath » Rakshasudu
వెల్లకిలా పడుకుని, కదులుతున్న ఆకాశం కేసి చూస్తూ అతనన్నాడు- "ఏం చేస్తూ వుండి వుంటుందో నా తల్లి-"
"ఆశ వదిలేసుకుని వుంటుంది".
"సింహం"
"కానీ తన కొడుకు తనని కలుసుకోవటానికి - కేవలం తనని కలుసుకోవటానికే ఇన్ని అపాయాలు దాటి వచ్చాడని తెలిసిన క్షణం ఆ తల్లి ఎంత ఆనందిస్తుందో నేను ఊహించగలను. నీలాటి కొడుకుని కన్న ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో నా మాటలకి అందటం లేదు. కొన్ని కోట్లమంది స్త్రీలు తల్లులవుతారు. కానీ నీలాటి ఒక్కడిని కన్న ఆమె మాత్రం నిజంగా మాతృమూర్తే".
"ఇది నా స్వార్థమే సింహం. ఊహతెలిసాక ఇరవై సంవత్సరాలుగా దొరకని రవ్వంత ఆప్యాయత కోసం ఈ వెతుకులాట".
"చెప్పానుగా! నీ తల్లి నీకు దొరుకుతుంది, తన చల్లని వడిలోకి నిన్ను తీసుకొని ఇన్నేళ్ళ శ్రమ మర్చిపోయేటట్టూ సేద తీరుస్తుంది".
పడవ నెమ్మదిగా మలుపు తిరగటంతో ఇద్దరూ తలతిప్పి చూశారు.
కొండ... శిఖరం మీద గుడి- తళతళలాడే గోదావరీ తరంగ దర్పణంలో భద్రాచల రాములవారి గుడిలోంచి బయటపడిన వెలుగు కిరణం వేయి దీపాలుగా విశ్లేషణమై వాళ్ళిద్దర్నీ తిరిగి నాగరిక ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్టు కనిపించింది.
* * *
రంగడు ఏదో బూతుపాట పాడుతూ గుడిసె దగ్గిర ఆగాడు. మనిషి తూలుతున్నాడు. వయసూ, తాగుడూ-అతడి శరీరంమీద తమ ప్రభావం బాగా చూపించాయి. వణికే వేళ్ళతో గుడిసె తలుపు తెరవబోయి, అది తీసే వుండటంతో ఆశ్చర్యపడి, తాగుడు మైకంలో తనే తీసేననుకుని భ్రమపడి, లోపలికి ప్రవేశించాడు. అయితే లోపల హరికెన్ లాంతరు వెలుగుతూ వుండటంతో కళ్ళని నమ్మలేక చిట్లించి చూశాడు. అతడి రాకకోసమే చూస్తున్నట్టు లాంతరు పక్క మసక చీకట్లోంచి ఒక ఆకారం పైకి లేచింది.
"బాగాన్నావా అన్నా".
"ఎవరూ? ... ఎవరదీ?"
"నన్నే మర్చిపోయావా అన్నా? పదేళ్ళ క్రితం పావలా డబ్బుల కోసం అమ్మేసి లాంచీ మీద పంపేసినవాడిని..."
రంగడికి అందలేదు. "ఎవడ్రా నువ్వు" అన్నాడు.
"నీ కోసం బస్సులక్రిందా, లారీలక్రిందా పడినవాడిని. నీ మాటలు నమ్మి లాంచీ ఎక్కిన వాడిని".
రంగడికి గుర్తొచ్చింది. "నువ్వా" అన్నాడు.
"నేనే అన్నా!" అన్నాడు అతడు దగ్గిరకొస్తూ "నేను నిన్ను తప్పుపట్టను. వ్యాపారం వ్యాపారమే. ఆరోజు సీసా సారా కోసం నన్ను అమ్మేసేవు. అమ్మని చూపిస్తానని చెప్పి మోసం చేశావు. ఇప్పుడు నేనూ నీతో వ్యాపారం చేస్తాను. ఈ రోజు నుంచీ నువ్వు వెతుకుతావు... రంగన్నా. నన్ను నీకు అమ్మిన మోళీవాడిని వెతకటం మొదలుపెట్టబోతున్నావు".
"వెతక్కపోతే?"
"చెప్పానుగా అన్నా, ఇది వ్యాపారమని, దీనికి నేనిచ్చే ధర 'నీ ప్రాణం'. ఆ మోళీవాడిని పట్టుకోవటంలో నువ్వేమాత్రం నిర్లక్ష్యం చేసినా, నన్ను మోసం చేయటానికి ప్రయత్నించినా నీ ప్రాణం తీస్తాను".
రంగడు విసురుగా ముందుకు వచ్చాడు. ఒకప్పుడు వాడొక పెద్దరౌడీ. ఇంకా పాత వాసనలు పోలేదు. అయితే అవతలి వ్యక్తి గురించి తక్కువ అంచనా వేశాడు. సరిగ్గా నిముషం తరువాత నోట్లోంచి కారుతున్న రక్తంతో కోరలు తీయబడ్డ సింహంలా మోకాళ్ళమీద కూలబడి వున్నాడు.
"ఏం? వెతుకుతావా?"
"ఎప్పుడో పదేళ్ళక్రిందటిసంగతి. అందులోనూ వాడు వూరూరా తిరిగే మోళీవాడు. వాడు దొరకడు. వెతకటం కుదర్దు".
"ఈ ప్రపంచంలో కుదరదు అమ్మమాట ఏదీలేదు రంగన్నా. దానికి నా జీవితమే ఉదాహరణ. నువ్వు నాకు చేసిన అన్యాయానికి, జీవిత కాలంలోకెల్లా విలువైన పది సంవత్సరాల చీకట్లోకి తోసేసిన నేరానికి, నిన్ను నిలువునా చంపాలి. కానీ నువ్వీ సాయంచేస్తే దానికి నీకు రుణపడి వుంటాను. నా పని చేస్తావో.... ప్రాణాలు పోగొట్టుకుంటావో ఆలోచించుకో..."
రంగడు నెమ్మదిగా తలెత్తి- 'సరే' అన్నట్టు ఊపాడు.
వేట మొదలైంది.
అతడన్నట్టు పట్టుదల వుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏమీ లేదు.
సరిగ్గా ఇరవైరోజుల తరువాత మోళీవాడు కనబడ్డాడు.
* * *
రైలు వేగంగా వెళుతూంది. వెనుక చెక్కకి తల ఆన్చి కళ్ళు మూసుకుని వున్నాడు అతడు. అతడి మనసంతా ఉద్వేగంతో నిండి వుంది. దొరుకుతుందా?
ఇన్నాళ్ళు తమ వెతికినా అమ్మ చిరునామా- ఈ చివరి క్షణంలో ఇంతవరకూ వచ్చాక.... దొరుకుతుందా? రైలు ఆగగానే అతడు దిగాడు. అతడితో పాటూ ఒక సిద్ధాంతి కూడా.
స్టేషను నుంచి అరగంట ప్రయాణంచేశాక చిన్న సందుమొదట్లో ఆగి, సిద్ధాంతి "ఇదే..." అన్నాడు. అతడు అటువైపు చూశాడు. చెత్తకుండీ. ఈ ప్రపంచంలోకి రాగానే, వడిలోకి తీసుకున్న చెత్తకుండీ.
అతడు తలెత్తి తను ఏ కిటికీ గుండా బయటకు విసిరివేయబడ్డాడో ఆ కిటికీ తలుపుల్ని చూశాడు. వాటి పైగా రంగు వెలిసిపోయి, శిథిలమైన అక్షరాలతో కనిపిస్తూంది.
"వర్కింగ్ వుమెన్స్ హాస్టల్.."
రంగడు- మోళీవాడు- జమీందారు- సిద్ధాంతి... గత ఆరునెలలుగా పడ్డ శ్రమకి ఓదార్పుగా-
తన జన్మస్థలం తెలిసింది!
ఇక జన్మ కారకురాలు తెలియాలి. కారణాలు తెలియాలి.
వెనక నుంచి సిద్ధాంతి అన్నాడు. "నాకు బాగా జ్ఞాపకం. ఆరోజు కార్తీక పౌర్ణమి. ఆ రోజే రాజుగారికి, ప్రహరీగోడ బయట పుత్రుడు లభిస్తాడని జ్యోతిష్కం చెప్పాను. భుజంమీద మచ్చ వుంటుందని చెప్పిచుట్టతో కాల్చాను. నీ భుజం మీద మచ్చ అదే! ఆ తరువాత రాజుగారికి కోపం వచ్చి నిన్ను బయటపారేయిస్తే ఆ మోళీవాడు తీసుకువెళ్ళటం కళ్ళారా చూశాను. రాజభోగం అనుభవించవలసినవాడు ఇలా అయి పోవటం ఏమిటా అనుకున్నాను కూడా".
అతడు విసుగ్గా, "ఆ ముష్టివాళ్ళు ఏం చెప్పారు?" అని అడిగాడు.
"అదిగో ఆ చెత్తకుండీలోనే నువ్వు వారికి దొరికావని చెప్పారు. ఆ రోజుల్లోనే ఇక్కడో రూమరు పాకింది- ఆ హాస్టల్లోంచి ఎవరో గంటల పిల్లాడ్ని బయటకు విసిరేశారని. ఆ విషయం నిశ్చయంగా చెప్పాలంటే ఆ హాస్టల్ లో అప్పుడు పనిచేసిన ఏ పనివాడినయినా పట్టుకోవాలి..."
* * *



