Home » Yandamuri veerendranath » Prarthana


    బాంబ్ తోపాటు ఓ కాగితం కూడా వుంది. దూరంగానే అయిదు నిముషాలు వేచిచూసి తటపటాయిస్తూ దగ్గిరకి వెళ్ళి కాగితాన్ని తీసి చదివాడు. రెండే వాక్యాలు.

 

    "కావాలంటే పరీక్షించండి. ముందుకు రావడం మీకే ప్రమాదకరం".

 

    రవూఫ్ మొహం క్రోధంతో ఎర్రబడింది. కసిగా పళ్ళు కొరుక్కున్నాడు. లోపల ఒకరుకాదు, ఇద్దరు వ్యక్తులున్నారు. తలుపు తెరుచుకున్నప్పుడు అతడ్ని చూశాడు.

 

    శేఖరం వేసిన ఈ ఎత్తు సరి అయిన ఫలితాన్నే ఇచ్చింది. బాంబు పేల్చివుంటే ఆ హడావుడిలో రవూఫ్ ఫైరింగ్ ఆర్డరు ఇచ్చేవాడేమో! అప్పుడు రక్తపాతం అనివార్యం అయివుండేది.

 

    కానీ ఇప్పుడు రవూఫ్ ఇరకాటంలో పడ్డాడు. వాళ్ళదగ్గర ఏ రివాల్వరో ఉందనుకున్నా అతడు కాస్త సాహసం చేసి వుండేవాడు. నాలుగువైపులనుండీ చుట్టుముడితే ఒక్క రివాల్వర్ తో అవతలి వ్యక్తులు ఏమీ చెయ్యలేరు. కానీ ఇప్పుడు వున్నవి బాంబులు. అదీ శత్రువులు ముందు హెచ్చరికలు చేశారు కూడా. ఇప్పుడు తన బలగాన్ని ముందుకు పంపించడం అనాలోచితమే అవుతుంది.

 

    అంతలో అతనికి అసలీ బాంబు నిజమైనదా కదా అని అనుమానం వచ్చింది. దానిని అనాలిసిస్ కి పంపించాడు.

 

    ఈ విధంగా భార్గవకి మరో అయిదారు గంటల సమయం లభ్యమయింది.

 

    లోపల భార్గవ, శేఖరం భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చిస్తున్నారు.

 

    "ప్రియ ఇంకా రాలేదు".

 

    "అవును, ఇక రాదుకూడా. ఆ ఆశ వదులుకోవడం మంచిది. మనం ఉండగలిగినన్ని రోజులు ఆకలితోనే వుండాలి".

 

    "ఇన్ స్పెక్టర్ ని చూస్తుంటే అంత సులభంగా మనని వదిలేటట్టు లేడు. ఒక్కక్షణం ఏమరపాటుగా వున్నా ప్రమాదమే".

 

    "దాన్ని గురించి మీరేమీ ఆలోచించకండి. మీరు మీ ప్రయోగం మీద పూర్తి దృష్టి నిలపండి".

 

    "నువ్వేం చెయ్యగలవు శేఖరం?"

 

    శేఖరం నవ్వాడు. "లోపల వున్నదెవరో తెలీదు. ఆ వున్నవాడికి కళ్ళూ, చెవులూ లేవన్న సంగతికూడా తెలీదు. అందువల్ల ఛాంబర్ అవతల వున్న కిటికీ బయటకి నీడ పడేటట్టు నేను పచార్లుచేస్తూ వుంటాను. నేను వాళ్ళని చూడకపోవచ్చు. కానీ మనిషి గుమ్మం దగ్గిర పచార్లుచేస్తూ వుండగా, అందులోనూ బాంబు వుందని తెలిశాక వాళ్ళు దగ్గిరకి రావటానికి సాహసించారు. మనం చెయ్యవలసిందల్లా మనం మేల్కొని వున్నామని వాళ్ళకి తెలిసేలా ప్రవర్తించడమే".

 

    "కానీ ఎంతసేపలా పచార్లు చేస్తూ వుండగలవు శేఖరం?"

 

    "కనీసం అయిదారు రోజులు. కొద్దిగా రాత్రిపూట రెస్టుతో పదిరోజుల వరకూ కాపు కాయగలను అనుకుంటున్నాను. ఆఫ్టరాల్ ప్రపంచ రికార్డు 344 మైళ్ళుంది. అందులో మూడోవంతయినా సాధించలేనా?- చూద్దాం".

 

    భార్గవ కన్నార్పకుండా అతడివైపు చూశాడు. చూస్తూండగానే తన కళ్ళముందు ఎదిగిపోయిన శేఖరాన్ని ప్రేక్షకుడిగా చూస్తూండట తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు.

 

    శేఖరమే మరో విషయం ప్రస్తావించాడు.

 

    "అయితే ఓ షరతు! మాటిమాటికీ నా దగ్గిరకి రావొద్దు. జాలీ, సానుభూతీ చూపించవద్దు. మీ ప్రపంచంలో మీరు, నా నడకతో నేను మెదడులోనూ, శరీరంలోనూ ఆఖరినరం అలిసిపోయేవరకూ పోరాడదాం. మీ ఏకాగ్రతనుండి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. బయట ప్రపంచమూ, పోలీసులు ఇవన్నీ నాకు వదిలేసి మీరు మర్చిపోండి. మీ దగ్గిరనుండి ఓ అద్భుతమైన విజయాన్ని ఆశిస్తున్నాను నేను. నా ఆశ వమ్ము చెయ్యకండి-"

 

    తనపై అతడుంచిన నమ్మకాన్ని చూసి భార్గవ కళ్ళు చెమ్మగిల్లాయి. కేవలం మాటలేకాదు, శేఖరం తను చెప్పినదాన్ని చేతల్లా పెట్టి చూపించాడు. తలుపునుండి ఛాంబర్ కిటికీవరకూ ఆరడుగులు వేసి మరుక్షణం మళ్ళీ వెనక్కి నడవడం సాగించాడు. సరిగ్గా రెండు నిముషాలలో అతనికి అది అలవాటయి పోయింది. నడుస్తూనే వున్నాడు.

 

    గంట- రెండు గంటలు -- మూడు గంటలు --

 

    బయట రవూఫ్, మరో యస్సై ఇది చూస్తూనే వున్నారు. లోపల జరుగుతున్నది గమనించి, "ఎంతసేపు తిరుగుతారిలా?" కసిగా అన్నాడు రవూఫ్ అటే చూస్తూ.

 

    "అతడటు వైపుకు వెళ్ళినప్పుడు కిటికీ దగ్గరగా వెళ్ళి అతడిటు తిరిగి వస్తున్నప్పుడు పేల్చేస్తే?" అనడిగాడు యస్సై దృష్టి మరల్చకుండా.   

 

    "అతడు అటు వెళ్ళినప్పుడు మనం స్పీడుగా కిటికీ దగ్గిరకు చేరుకోవచ్చు, అది పెద్ద సమస్య. కానీ లోపల ఒకరుకాదు- ఇద్దరున్నారు. వాళ్ళు వంతుల ప్రకారం కాస్తున్నారు. ఒకణ్ని కాల్చేస్తే ఇంకొకరు ఆవేశంతో బాంబు విసిరేస్తాడు. హైజాకర్స్ మనస్తత్వం అలాగే వుంటుంది. వాళ్ళిద్దర్నీ బంధించాలంటే మనం ఎలాగో ఓలాగ లోపలికి ప్రవేశించాలి".  

 

    "ఎలా?"

 

    రవూఫ్ మొహంమీద సాడిజంతో కూడిన నవ్వు కదలాడింది.

 

    "ఎంతకాలం తిరుగుతారో చూద్దాం. కొంతసేపటికి చీకటి పడుతుంది, రాత్రవుతుంది. అప్పుడు కూడా నిద్రపోరా?" అన్నాడు.

 

    యస్సై మాట్లాడలేదు.

 

    అంతలో దూరంగా కారు వస్తున్న చప్పుడయ్యింది. కారులోనుండి శంకర్ లాల్ దిగాడు. దూరంగానే వున్న పోలీసుల్నీ, రవూఫ్ ని చూసి చిరాకు మిళితమైన స్వరంతో "ఏమిటి ఇంకా అరెస్టు చెయ్యలేదా" అని అడిగాడు.

 

    రవూఫ్ అక్కడ పరిస్థితిని వివరించి చెప్పాడు. అది వింటున్న కొద్దీ శంకర్ లాల్ మొహం కఠినంగా మారసాగింది.

 

    "మైగాడ్! ఇంతకు తెగించాడా?" అన్నాడు విస్మయంతో.

 

    రవూఫ్ మాట్లాడలేదు.

 

    "ఏమిటతని ఉద్దేశ్యం? అసలిక్కడి నుండి ఎలా బయటపడదామని?" తనలోతనే అనుకున్నట్లు అన్నాడు శంకర్ లాల్. అంతలో ఏదో స్ఫురించి అతని మొహంమీద చిరునవ్వు కదలాడింది. "ఇంతకు ముందంటే కేవలం క్రిమినల్ ట్రిస్-పాసే! ఇప్పుడు ఈ ఎక్స్ ప్లోజివ్స్, ఈ బెదిరించటం వీటితో అతడిచుట్టూ చట్టం గట్టిగా బిగుసుకుంటోంది కదా!"

 

    "చట్టం వరకూ ఎందుకు సార్? ఏ మాత్రం వీలు దొరికినా వాణ్ణి ఖండఖండాలుగా పేల్చేస్తాను" ఇరిటేషన్ అణుచుకుంటూ అన్నాడు రవూఫ్.

 

    "పేల్చేయగలిగితే మంచిదే! కానీ మీ పోరాటంలో ఏ ఒక్క పరికరానికి నష్టం కలిగినా ఊరుకోను. లోపల ఒక్కో ఇన్ స్ట్రుమెంట్ లక్షలు ఖరీదు చేసేది?" హెచ్చరించాడు.

 

    రవూఫ్ ముఖం కందగడ్డలా మారింది. "అలాగే సర్!" అన్నాడు గొణుగుతున్నట్లు.

 

    "ఏమిటి మీ ప్లాను?"

 

    "రాత్రవ్వాలి సర్. తెల్లవారుజామువరకూ అలా తిరుగుతూ ఉండలేరుకదా! చిన్న కునుకు తియ్యనివ్వండి. అప్పుడు చూద్దురుగాని!"

 

    శంకర్ లాల్ కారువైపు వెళ్ళడానికి ఆయత్తమవుతూ "ప్రొద్దున్న కల్లా వీళ్ళ నెలాగయినా ఇక్కడినుండి ఖాళీ చేయించాలి. రేపు ఈ ఇన్ స్టిట్యూట్ ఒక తీర్థంలా తయారవడం నా కిష్టంలేదు" అని అక్కడనుండి వెళ్ళిపోయాడు. అటే చూస్తున్న రవూఫ్ పళ్ళు కొరుక్కున్నాడు. 'ప్రొద్దున తనతో ఎంతో లోపాయికారిగా మాట్లాడిన మనిషి, ప్రక్కన ఇంకో పోలీసు ఆఫీసరు ఉండేసరికి ఇలా మారిపోయాడు. అందుకే వ్యాపారంలో ఇంతగా రాణించగలిగాడు.'


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More