Home » Yandamuri veerendranath » Rakshasudu


    తమ ప్రాణాలకి ఏ అపాయమూ లేదని అనుకున్నంతవరకూ రాజన్ ని రక్షించాలనుకున్నారు. అపాయం వచ్చేసరికి అతడినే బలిపెట్టి ప్రాణాల్ని కాపాడుకున్నారు. తర్కంతో ఆలోచిస్తే నిజమే. అతడెలాగూ చనిపోయేవాడే. శరీరాన్ని నీటిలో తోసేయటంలో తప్పులేదు.

 

    కష్టాలు దగ్గిరకొచ్చేసరికి మనిషి అభిప్రాయాలు ఎంత దారుణంగా మారతాయి. దానికి తామే ఒక ఉదాహరణ! నరమాంస భక్షకులకన్నా తాము తక్కువేమీలేదు. వాళ్ళు తింటారు, తాము ఆహారంగా వేశారు. రాజన్ బ్రతికి ఉండకపోవచ్చు, కానీ తాము బ్రతికివున్న మనిషిని బలిపెట్టారు.

 

    ...పడవ నదిలో మలుపు తిరుగుతూంది. అందువల్ల ప్రవాహవేగం తగ్గింది అదిచూసి గార్డులు ఆఖరిప్రయత్నంగా గుళ్ళవర్షం కురిపిస్తున్నారు. ఇన్నేళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారి ఇద్దరు వ్యక్తులు అక్కడనుంచి తప్పించుకుపోవటం వారికి దిగ్భ్రమ కలిగిస్తూంది. పిచ్చెక్కినట్టు పిస్తోళ్ళు పేలుస్తున్నారు.

 

    అతడు వెనక్కి చూశాడు. దూరంగా కాలువ మధ్యలో ఎర్రటి మడుగు క్రమక్రమంగా విస్తరిస్తూంది. కదిలే మొసళ్ళ మధ్య రాజన్ తాలూకు బట్టలు తేలుతున్నాయి. అతడు చూడలేక తలతిప్పుకున్నాడు.

 

    అంతలో దూరంగా శబ్దం వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి అటుచూశారు. గార్డులు పంపినవార్త అందకుని మోటారుబోటు వేగంగా వస్తూ కనిపించింది. దీన్ని ఊహించలేదు వాళ్ళు. నది దాటితే చాలు అనుకున్నారు. గార్డుల దగ్గిర ఆఖరి అస్త్రంగా బోటులు ఉంటాయనీ, వాటితో వేటాడుతారనీ ఆలోచించలేదు. వాళ్ళదే తప్పు.

 

    చూస్తూ ఉండగానే బోటు దగ్గిరగా వచ్చింది. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారు. గోదావరికి అటువైపు అడవి ఆహ్వానిస్తున్నట్టు కనబడింది. ఇటువైపు అడవి పిలుస్తున్నట్టు కనిపించింది. మధ్యలో కాలువ వైతరణిలా వుంది. మూడువైపులా మృత్యువే! తరుముకొస్తున్న మృత్యువు... ఎటూ దారిలేదు.

 

    అతడో నిశ్చయానికొచ్చినట్టు... "సింహం నువ్వు పడవలోనే వుండు" అంటూ సమాధానాన్ని ఆశించకుండా, పడవకి అటువైపు నుంచి నీళ్ళలోకి నిశ్శబ్దంగా జారిపోయాడు. అతడేం చేయదల్చుకున్నాడో అర్థంకాక సింహం ఏదో అనబోయేలోపులోనే అతడు నీళ్ళలో అదృశ్యమయ్యాడు. ఒక్కక్షణం ఆలస్యమైవుంటే ఆ మొసళ్ళమధ్య నీళ్ళలో దిగటానికి సింహం చచ్చినా ఒప్పుకొనేవాడు కాదు.  

 

    బోటులో ముగ్గురున్నారు. ఒకడు డ్రైవరు. మరో ఇద్దరు తుపాకుల్తో పడవవైపు చూస్తున్నారు. రేంజిలోకి రాగానే కాల్చిచంపాలని వాళ్ళ ఉద్దేశ్యం. వాళ్ళెంత ధీమాగా ఉన్నారంటే ... తుపాకీ గుళ్ళుకూడా అనవసరంగా వృధాచేయటం ఎందుకన్న చిరునవ్వు వాళ్ళ మొహాల్లో కనిపిస్తూంది.

 

    నీళ్ళలో లీలగా బోటు దగ్గిరకి వస్తున్న దృశ్యం కనిపించింది అతడికి! బోటు క్రింది చక్రం నీళ్ళని వేగంగా జరుపుతూ ముందుకువస్తోంది అతడు అడుగునుంచి దానిదగ్గరకు వెళ్ళాడు. ప్రాణాలతోకూడిన రిస్కు అది. రంపంకన్నా వేగంగా కదులుతున్నాయి ఆ చక్రం పళ్ళు. అతడి చేతిలో గార్డులనుంచి లాక్కొన్న రైఫిల్ వుంది. గుళ్ళు ఎప్పుడో అయిపోయాయి. దాన్ని రెండుచేతుల్తో పట్టుకుని చక్రం పళ్ళమధ్యలో బలంగా పెట్టాడు. ఆ వేగానికి అతడు కాళ్ళకింద ఆధారం లేకపోవటంతో గిర్రున వెంటవెంటనే నీళ్ళలో పల్టీలు కొట్టాడు. విసురుగా వెళ్ళి అతడి శరీరం చుక్కాని చెక్కకి బలంగా కొట్టుకుంది. ఎముకలు విరిగిపోయాయే అనుకున్నాడు. చేతిలో తుపాకి మధ్యకి విరిగిపోయింది. అతడి భుజంలోకి చుక్కాని అంచు లోతుగా గుచ్చుకుపోయింది.

 

    అయితే అతని ప్రయత్నం ఫలించింది !

 

    పడవ ఒక్కసారిగా గిర్రున తిరిగింది. అప్పటివరకూ ధీమాగా బోటు డ్రైవరు ప్రక్కన నిలబడివున్న గార్డులు తుపాకీతోసహా పైన నిలదొక్కుకోలేక నీటిలో కూలిపోయారు. ఆ వేగానికి పడవ సర్రున పక్కకి దూసుకుపోయింది.

 

    అతడు క్షణంకూడా ఆలస్యం చేయలేదు. చేస్తే జరిగే ప్రమాదమేమిటో తెలుసు. అప్పటికే అతడి రక్తం దూరంగావున్న మొసళ్ళకి సూచన అందిస్తోంది. బోటు శబ్దానికి భయపడి దూరంగావున్న మొసళ్ళకి సూచన అందిస్తోంది. బోటు శబ్దానికి భయపడి దూరంగావున్నవి, అది ఆగిపోగానే దగ్గిరికి రాసాగినయ్. అదృష్టవశాత్తు అవి వచ్చేసరికి అతడు తనపడవ చేరుకున్నాడు. మొసళ్ళు రక్తం దగ్గరికి వచ్చి ఆగినయ్. బోటులో నుంచి జారిన గార్డులు బోటుదగ్గరికి చేరుకోటానికి వేగంగా చేతులు కదుపుతూ వెళ్ళసాగారు. అలా అలికిడి చేయడమే వారు చేసిన తప్పు. నీటిలో మొసలి వేగంతో ఎవరూ సరిరారు. క్షణాల్లో వారి ఆక్రందనలు ఆ చుట్టు పక్కల ప్రతిధ్వనించాయి.

 

    జరిగినదంతా ప్రేక్షకుడిలా చూస్తున్న సింహం కొద్దిసేపటి వరకూ తిరిగి మనిషి కాలేకపోయాడు. అంతలో పడవపక్కగా వచ్చిన "అతడు" చెయ్యి పైకి అందించాడు. అతడిని చప్పున పైకిలాక్కొన్నాడు సింహం.

 

    పైకిరాగానే అతడికి స్పృహ తప్పింది.

 

    రక్తం చాలా కోల్పోయిన అతడు అలా ఎంతకాలం వుండిపోయాడో తెలీదు. మెలకువ వచ్చేసరికి నెత్తిన నిందు చంద్రుడున్నాడు. "ఎంత దూరం వచ్చేం" అతడి గొంతు హీనంగా ఉంది.

 

    అప్పటివరకూ ఆందోళనగావున్న సింహం, అతడు కనులు విప్పటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుని అతడి ప్రశ్నకి సమాధానంగా "చాలా దూరం వచ్చేసేం! గండంనుంచి బయటపడ్డట్టే" అన్నాడు. అతడు తన భుజంవైపు చూసుకున్నాడు. చుక్కాని లోతుగా గుచ్చుకోవటంతో అయిన గాయానికి సింహం చొక్కా చింపి కట్టబడి వుంది. అతడి కళ్ళు కృతజ్ఞతతో మెరిసినయ్. దూరంగా గోదావరి మలుపు తిరిగేచోట కొండలు వెన్నల్లో తెల్లగా కనబడుతున్నాయి. ఇంతకుముందులా సుడులు తిరగటం లేదు. గోదావరి నిండుగా ప్రవహిస్తూంది. అపాయాలూ మొసళ్ళూ వెనక పడ్డాయి.

 

    "సింహం"

 

    "ఊఁ?"

 

    "నేను నా తల్లిని కలుసుకోగలనంటావా".

 

    "తప్పకుండా కలుసుకోగలవు"

 

    ఆ కంఠంలో కనబడిన నిబ్బరానికి చకితుడై అతడు సింహంవైపు చూశాడు. దూరంగా కొండలమీద కదిలే మేఘాలవైపు చూస్తూ సింహం అన్నాడు.

 

    "పది సంవత్సరాల క్రితం నువ్వీ ప్రశ్న అడిగివుంటే లేదనే వాడిని. ఆ అమాయకమైన ప్రశ్నకి నవ్వుకునేవాడిని కూడా. కానీ ఇప్పుడు.. ఇప్పుడు నేను నిశ్చయంగా చెప్పగలను. భూగోళాన్ని కదిలించి అయినా సరే నువ్వు నీ తల్లిని కనుక్కోగలవు. చిన్న ప్రాణికూడా తప్పించుకోవటానికి సాహసం చేయలేని ఈ అడవినుంచి బయట పడటానికి నువ్వు చేసిన సంవత్సరాల తరబడి కృషీ, దాని వెనుక వున్న దీక్షా చూసి ఎవడనగలడు నువ్వు నీ తల్లిని కలుసుకోలేవని... ఇంతవరకూ నాకు ఏ కొద్దిపాటైనా అనుమానం వుంటే... ఇదిగో... ఇప్పుడు కొన్ని గంటల క్రితం నువ్వు ప్రాణాలకు తెగించి బోటు క్రింద ప్రొఫెల్లరును ఆపటానికి వెళ్ళినప్పుడే పోయింది. చెపుతున్నాను విను- ఆ దేవుడు అడ్డుపడినా నిన్నూ నీ తల్లినీ కలుపకుండా ఆపుచేయలేడు".


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More