Home » Yandamuri veerendranath » Prarthana


    భార్గవ గతుక్కుమన్నాడు. ఇంతవరకూ తనకీ విషయమే గుర్తురాలేదు. అణు నిర్మాణం, కణ విచ్చేదంలాంటి విషయాల గురించే ఆలోచించగలడు తప్ప ఇలాటి సమస్యలు తట్టవు. కేవలం ప్రార్థనకి అవసరమయినవి మాత్రమే తీసుకున్నాడు.

 

    ఈ లోపులో శేఖరం ప్రియ వున్నవైపు తిరిగాడు. "విషయం అర్ధమయిందిగా! నాయుడి కేసుతో నీకీ క్రిమినల్స్ బాధ అయిపోయిందను కున్నాను. ఇప్పుడీ రెండో కేసు వచ్చిపడింది. చెప్పు, సహకరిస్తావా సెక్రటరీ?"

 

    ఆమె వస్తూన్న కోపాన్ని అణుచుకుంది. "అనుమానాల్తో సమయం వేస్టు చెయ్యకండి. ఏమేం కావాలో త్వరగా చెప్పండి"

 

    "తిండి... వారం రోజులకి సరిపడా ఏ గడ్డి దొరికితే అది" ఆమె వేగంగా బయలుదేరబోయింది.

 

    "ప్రియా" అన్నట్టూ సైగ చేశాడు. ఆమె ఆగింది. అతడు అందించిన కాగితం అందుకుంది. అందులో ఇలా వుంది.

 

    ".... ఏదైనా జరగోచ్చు. మా తలకు మించి మేము చేస్తూన్న ఈ సాహసంలో మా ప్రాణాలకే మోసం రావచ్చు. అలాగే కానీ అయితే- ఇదే చివరి..."

 

    అర్థంతరంగా ఆగిపోయిన ఈ వాక్యాన్ని చూసి ఆమె తల ఎత్తింది.

 

    అతడు కుడి అరచేతిలో ఎడమచెయ్యి పిడికిలి బిగించి రెండు చూపుడు వేళ్ళూ గోపురంలా ఆనించాడు.

 

    ఆమె సిగ్గుపడలేదు. ఎందుకో అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కానీ సెంటిమెంటుకి ఇది టైమ్ కాదు. దాదాపు పరుగెడుతున్నట్టూ ఆమె అక్కడ్నించి కదిలింది.

 

                                      *    *    *

 

    శంకర్ లాల్ దగ్గిరనుంచి రవూఫ్ తిన్నగా ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళలేదు. తన స్టేషన్ కి వెళ్లాడు. భార్గవ ఎక్కడున్నాడో తెలిసిన తర్వాత ఇక అతడికి తొందరలేదు. ఒక్కో వేపునుంచి వల పన్నుకుంటూ వస్తున్నాడు.

 

    సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. కావలసినచోట మాత్రం 'కొద్దిగా' విశ్లేషణాలు చేర్చాడు. ఆస్పత్రి నుంచి ఒక పాప అపహరణ... కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ప్రయోగశాల ఆక్రమణ... దగ్గిరకొచ్చి బంధించటానికి ప్రయత్నిస్తే పాపని చంపేస్తామని బెదిరింపు... వగైరా...

 

    అతడికి కావాల్సిన ఫలితాన్ని పై అధికారి నించి పొందగలిగాడు. "ఇది దాదాపు హైజాకింగ్ తో సమానం. యూ ట్రీట్ ది బాస్టర్డ్ అకార్డింగ్లీ" అన్నాడు యస్.పి.

 

    రవూఫ్ కి కావల్సింది అదే!

 

    ముందు చేసి తరువాత చెప్పటం వేరు, చెప్పి తరువాత చేయటం వేరు.

 

    అతడు తెలివయినవాడు.

 

                                                             *    *    *

 

    వారం రోజులకు సరిపడా ఏం కావాలో ఆమెకు తెలియలేదు. బ్రెడ్, జామ్ కొన్నది. ఫ్రూట్స్ కూడా తీసుకుంది. లాబ్ లోనే ఫ్రిజ్ చూసిందామె.

 

    అయినా అసలు వాళ్ళేం చెయ్యబోతున్నారో ఆమెకి పూర్తిగా అర్థంకాలేదు. ముందు ముందు ఏం జరుగుతుందో కూడా ఆమెకు అనూహ్యంగానే వుంది. ఆలోచన్లతోనే పని పూర్తిచేసుకుని ఆటోని తిరిగి ఇన్ స్టిట్యూట్ కి పొమ్మంది.

 

    ఊరి చివర ఇన్ స్టిట్యూట్. ఇంకో రెండు కిలోమీటర్లు వుందనగా చిన్న శబ్దంతో ఆటో ఆగిపోయింది. డ్రైవర్ దిగి తను కూర్చున్న సీట్ ఎత్తి ప్లగ్ విప్పసాగేడు. ఈ ఆలస్యం ఆమెని కంగారు పెట్టింది. డ్రైవర్ ఇసుక కాగితంలో వేసి ప్లగ్ ని శుభ్రం చెయ్యసాగేడు.

 

    "నేనింకో ఆటోలో వెళ్ళిపోతాను" అందామె.

 

    "క్యోం మేంసాబ్! ఏక్ మినిట్ మే హోజాతానా!!" అన్నాడు అతడు. కానీ మొత్తం అయ్యేసరికి పదినిముషాలు పట్టింది. ఈ పది నిముషాలు ఆమెకి ముళ్ళమీద కూర్చున్నట్టే వుంది. ఆమె మనసెందుకో కీడు శంకించసాగింది.

 

    ఇన్ స్టిట్యూట్ ప్రహరీగోడ పక్కనుంచి ఆటో వెళుతుండగా లోపలి ఆవరణలోకి తొంగిచూసి అప్రయత్నంగా 'ఆపు' అని అరిచింది.

 

    రోడ్డు మధ్యలో కీచుమని శబ్దం చేస్తూ ఆటో ఆగింది.

 

    కాళ్ళలో సత్తువ లేనట్టూ, దిగటానికి ఓపిక లేనట్టూ ఆమె అలానే కూర్చుండిపోయింది. కాళ్ళముందు తిండి పదార్థాల బుట్ట పరిహసిస్తున్నట్టూ కనబడింది.

 

    ఇన్ స్టిట్యూట్ ఆవరణలో ప్రతి చెట్టుకి దాదాపు ఒక పోలీసు చొప్పున నిలబడి వున్నాడు. వ్యాన్ పక్కనే వున్న రవూఫ్ వాళ్ళకి ఆదేశాలిస్తున్నాడు.

 

    పోలీసుల ఉనికిని మొట్టమొదట గమనించినవాడు భార్గవ. వాళ్ళని చూసి అతడు స్థంభించిపోయాడు. అంత తొందరగా వాళ్ళు తనని కనుక్కుని, చుట్టుముడతారని ఊహించలేదు.

 

    అతడు శేఖరానికి బయట జరుగుతున్నది వివరించి చెప్పాడు. అయితే శేఖరం భార్గవలా కంగారు పడలేదు. ఎప్పుడో ఒకప్పుడు దీనిని ఎదుర్కోవలసి వస్తుందని అతడికి తెలుసు. అతడు ఆందోళన చెందింది ప్రియ గురించి. ఈ పోలీసుల మధ్య నుండి ఆమె ఆహారపదార్థాలను తీసుకువచ్చి అందివ్వడం దాదాపు అసాధ్యం.

 

    వీళ్ళిలా తమ తమ ఆలోచనలలో వుండగా రవూఫ్ ఇద్దరు పోలీసులతో గుమ్మంవైపు వస్తూ కనబడ్డాడు. భార్గవ టేబుల్ మీద ఉన్న ఎక్స్ ప్లోజివ్ తీసుకున్నాడు. కిటికీలోనుండి బయట ఖాళీ ఆవరణలోకి విసిరి పేల్చడంద్వారా తన దగ్గిర బాంబ్స్ వున్నాయనీ, దగ్గరకు రావడం ప్రమాదం అనీ అవతలివాళ్ళని హెచ్చరించాలని భార్గవ ఆలోచన. కానీ దీనికి శేఖరం వప్పుకోలేదు. చూడటానికి ఖాళీ ఆవరణే అయినా విసిరే సమయానికి అటువైపు ఎవరయినా వస్తే అప్పుడు హత్యానేరం కూడా పైనబడుతుందనీ, అది మరింత ప్రమాదకరం అనీ అతడు భావించాడు. అదీగాక అది పేలినప్పుడు దాని ప్రభావం ఎంతదూరం వరకూ వుంటుందో! చుట్టూ వున్న ప్రయోగశాలలోని విలువైన పరికరాల్ని అది ఎంతవరకూ నాశనం చేస్తుందో తెలీదు. అవసరమైతే ఎలాగూ తప్పదు. కేసు పెద్దది చేసే అనవసరమైన తొందరపాటు చర్యలు ఇప్పుడే ఎందుకు?

 

    "అయితే ఏం చేద్దాం?" అడిగాడు భార్గవ. శేఖరం చెప్పాడు.

 

    రవూఫ్ అదే సమయానికి అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళున్న గదివేపు వస్తున్నాడు. గుమ్మానికి దూరం చెరోవైపు నుండీ ఇద్దరు పోలీసులు కూడా రహస్యంగా సమీపిస్తున్నారు. ఇంకో పది అడుగుల్లో గుమ్మం ఉందనగా అకస్మాత్తుగా గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఇది ఊహించని రవూఫ్ ఒక్క గెంతులో స్తంభం చాటుకి దూకాడు. అయితే అతడు అనుకున్నట్టు రివాల్వర్ చప్పుడేమీ వినబడలేదు. ఒక బంతిలాంటి పదార్థం వరండాలో దొర్లుకుంటూ వచ్చి కొంత దూరంలో ఆగింది. చూడగానే దానిని గుర్తుపట్టాడతను.

 

    హాండ్ బాంబ్!

 

    ప్రొఫెషనల్ అనుభవంతో ఒక్క గెంతులో అక్కడినుండి దూరంగా పరుగెత్తబోయి ఏదో అనుమానం వచ్చి ఆగాడు.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More