Home » Yandamuri veerendranath » Rakshasudu


    కానీ అప్పటికే జరగవలసిన అపాయం జరిగిపోయింది. ఒక్కసారిగా నాలుగు జాగిలాలు వడ్డుకి పరుగెత్తుకు వచ్చాయి. వెనుకే గార్డులు.

 

    ఆ అరుపుకి అడవిలో వుండే పక్షులన్నీ మేల్కొన్నట్టు- అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న అడవి కేకల్తో, అరుపుల్తో, జాగిలాల మొరుగుల్తో దద్దరిల్లిపోయింది.

 

    "తొందరగా... తొందరగా...." సింహం అరుస్తున్నాడు.

 

    అతడు బలంగా తెడ్లు వేయసాగాడు. రాజన్ చేసే అలజడికి పడవ అటూ ఇటూ కదిలిపోతూంది. అంతలో వడ్డునుంచి రైఫిల్ పేలింది. గుళ్ళు జల్లెడలా వచ్చి పడసాగాయి. రాజన్ ని నొక్కిపట్టే ప్రయత్నం వదిలేసి, సింహం తల క్రిందికి వంచాడు. అతడు కూడా తెడ్డు వదిలేసి తల వంచి కూర్చున్నాడు. రైఫిల్ గుళ్ళనుంచి ఆ చెక్కపడవవారి ప్రాణాల్ని రక్షించలేదని ఇద్దరికీ తెలుసు, అయినా ఏదో ఒక అడ్డు.

 

    వంచిన ఇద్దరి తలలమధ్యా నేలమీద పడిన చేపపిల్లలా కొట్టుకుంటున్న రాజన్ శరీరం, ఆ తాకిడికి తుఫానులో తాడిచెట్టులా వూగిపోతున్న పడవ...

 

    ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి. అతడి కళ్ళలో "నీ మాట విననందుకు తగిన శాస్తి జరిగింది సుమా" అన్న భావం. చూపులు తిప్పుకుని సింహం కళ్ళు మూసుకున్నాడు. బహుశా దేవుడ్ని ప్రార్థిస్తున్నాడేమో... తొందరగా నది చేర్చమని!  

 

    అయినా అతడి ప్రార్థన దేవుడిని చేరలేదు. ఒక గుండు పడవని చీలుస్తూ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అంతే- అప్పటివరకూ ఆపిన ప్రవాహాన్ని ఒక్కసారిగా వదిలినట్టు- జల వూరినట్టు చివ్వున నీళ్ళు లోపలికి చిమ్మాయి.

 

    అతడు చేత్తో ఆ ప్రవాహాన్ని ఆపుచేయటానికి ప్రయత్నించాడు. సింహం లోపలికి వస్తున్న నీటిని బయటికి పారబొయ్యటానికి చేతుల్ని డొప్పలుగా ఉపయోగిస్తున్నాడు. ఈ లోపల మరొక బుల్లెట్ గాలిలోవచ్చి రాజన్ కాలిలోంచి దూసుకుపోయింది. అతడు వికృతంగా అరిచాడు. బంధింపబడివున్న చేతుల్ని టపటపా కొట్టాడు. ఈలోగా పడవలో నీళ్ళు ఎర్రబడ సాగాయి. సింహం చేతులు మిషన్ కన్నా వేగంగా కదులుతున్నాయి. నీళ్ళు తోడి బయటకు పారబోస్తున్నాడు- రక్తం కలిసిన నీళ్ళు! అంతలో ఏదో అడ్డినట్టు పడవ చిన్న కుదుపుతో పక్కకివంగింది. ఇద్దరూ పడవలోంచి దాదాపు నీళ్ళలోకి జారబోయి, అంచుని పట్టుకుని ఆగారు. అప్పుడే నీళ్ళలోంచి క్రమక్రమంగా వస్తున్న నల్లటి ఆకారం మీద పడింది.

 

    ఎర్రటి నీళ్ళలోంచి ఓ మొసలి నోరు తెరుచుకుని నెమ్మదిగా పైకి వచ్చింది.

 

    అతడి గుండె ఒక్కసారి ఆగినట్టయింది.

 

    ...ఎర్రటి రక్తపు వాసనకి మరో రెండు మొసళ్ళు పడవకి చెరోవైపు నుంచీ లేచినయ్. మృత్యువు చుట్టూ చేరి నాట్యం చేస్తున్నట్టు వుంది.

 

    "ఏం చేద్దాం" అన్నట్టు అతడు సింహంవైపు చూశాడు. సింహం ఇంకా పడవలోంచి బయటకి నీళ్ళు తోడివేసే కార్యక్రమంలో మునిగివున్నాయి. ఒక క్షణం తలెత్తినా నీళ్ళు నిండిపోయేటంత వేగంగా ప్రవహిస్తున్నాయి నీళ్ళు!

 

    ఈ లోపులో పడవ మరొకసారి అటూ ఇటూ వూగింది!!

 

    మొసళ్ళకి పడవలోనున్న 'ఆహారం' సంగతి తెలిసిపోయింది. తుఫాను ఊపినట్టు పడవని అటూ ఇటూ వూపుతున్నాయి. వాటి ఉధృతానికి అది ఆగేట్టులేదు. ఈ లోపులో దూరంనుంచి వస్తూన్న బుల్లెట్ల వర్షం- దాదాపు శరీరాన్ని రాసుకుంటూ వెళుతున్నాయి తుపాకి గుళ్ళు.

 

    "నువ్వీ పని చూడు" అన్న మాటలకి సింహంవైపు చూశాడు అతడు. సింహం వగరుస్తున్నాడు. అతడు చప్పున వెళ్ళి నీళ్ళని దోసిళ్ళతో బయటికి పారబోయటంలో సాయం చేయటం మొదలు పెట్టాడు. అతడాపని తన చేతుల్లోకి తీసుకోగానే సింహం అక్కడ్నుంచి తప్పుకోవడాన్ని గమనించలేదు.

 

    వేగంగా వెళుతున్న పడవతోపాటు వడ్డున పరుగెత్తులేక గార్డులు వెనుకబడ్డారు. ఈసారి వాళ్ళ బుల్లెట్స్ పడవకి కాస్త దూరంలో పడుతున్నాయి. కానీ ప్రమాదం అంతకన్నా దగ్గిరగా, మొసళ్ళ రూపంలోవుంది. పడవ సాగుతున్న కొద్దీ అవి మరింత ఆవేశంతో రెచ్చిపోతున్నాయి. గార్డులు కూడా, మొసళ్ళ బారినుంచి వారెలాగూ తప్పించుకోలేరన్న ధీమాతో వున్నారు. అతడు వంగి నీళ్ళు బయటకు పారబోస్తున్నాడు. కాస్త తల పైకి కనబడిందంటే బుల్లెట్స్ దూసుకుపోవటం ఖాయం. ఇంతలో ఒక మొసలి వేగంగా వచ్చి పడవని ఢీకొంది.

 

    అతడు నీళ్ళలోకి తూలిపడబోతూ పడవ అంచుని పట్టుకుని తలెత్తాడు. డబ్బున శబ్దమైంది. చివ్వున పైకి జిమ్మిన నీళ్ళలోంచి కనబడిన శరీరపు అంగాన్ని చూసి అతడు నిశ్చేష్టుడై తలతిప్పి పడవలోకి చూశాడు. పడవలో సింహం ఉన్నాడు.

 

    అతడి చేతిలో కత్తివుంది.

 

    పడవలోవున్న నీళ్ళలో రాజన్ ని బంధించి ఉంచిన తాళ్ళు అటూ ఇటూ తేలుతున్నాయి.

 

    పడవలో రాజన్ లేడు!

 

    ఏదో అనుమానం అతడిలో సూక్ష్మంగా ప్రవేశించి క్షణంలో పెద్దదయింది. ఆ అనుమానాన్ని ధృవపరుస్తూ ఒక పిచ్చికేక నీళ్ళలోంచి వినబడింది. సాగిపోతున్న పడవవెనక రక్తం మడుగు కట్టింది. ఇప్పుడు మొసళ్ళు పడవని కుదపటంలేదు. వెనుకే మాంసఖండాన్ని పంచుకోవటంలో నిమగ్నమై ఉన్నాయి. వాటినుంచి దూరంగా పడవ సాగిపోతోంది.

 

    అతడు ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక కసి, నిస్సహాయతా, రోషం, దుఃఖం ముప్పిరిగొనగా సింహం వైపు చూశాడు. పడవ మధ్యలో నిశ్చేష్టుడై సింహం పడవలోంచి నీళ్ళని బయటకు పోస్తున్నాడు. ఒక మనిషి తగ్గిపోవటంతో పడవవేగాన్ని పుంజుకుంది.

 

    రాజన్ ఇంకా బ్రతికే ఉన్నాడు.

 

    మొసళ్ళ మధ్యనుంచి అతడి కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్. నీళ్ళలోకి దూకి మొసళ్ళతో పోరాడి అతడిని రక్షించవచ్చు. లేక ఆ పోరాటంలో తన ప్రాణాలే పోగొట్టుకోవచ్చు. ఆ రెండింటిలో ఏది చేసినా మానవత్వమే.

 

    కానీ రెండురోజుల్లో "ఎలాగూ" చచ్చిపోయే మనిషే అతడు. ఇప్పటికే కుక్కకాటువల్ల జీవచ్చవమై ఉన్నాడు. ఆ శవాన్ని మొసళ్ళకు ఎరచూపించి తాము బయటపడటంలో తర్కంలేదా?

 

    కానీ ఒక బతికున్న మనిషిని నీళ్ళలోకి తో...సి...

 

    అతడికి రెండురోజుల క్రితం అన్నమాటలు గుర్తొచ్చినయ్! "మనసుకి సంతృప్తి కలిగించే ప్రతివిషయానికి తర్కం అవసరం లేదు. పాతిక సంవత్సరాలుగా ఈ జైలునుంచి బయటపడదామని ప్రయత్నించి చివరిక్షణంలో ఈ కుక్కకాటుకి బలయిన అభాగ్యుడి ప్రాణాలు రక్షించడం కోసం- మనం ఆఖరివరకూ పోరాడామన్న సంతృప్తిముందు ఇతడి ప్రాణాలు ఎలాగూ కాపాడలేమన్న తర్కం నిలవదు. మనం ఇతడిని ఈ అడవిలో వదిలేస్తే ఆ తరువాత ఆ అసంతృప్తి మనల్ని వదలదు".

 

    వదలదా? మరి ఇప్పుడు తాము చేసిందేమిటి!


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More