Home » Yandamuri veerendranath » Prarthana
శంకర్ లాల్ దగ్గరనుంచి రవూఫ్ వ్రాతపూర్వకమైన కంప్లయింట్ తీసుకుంటున్న సమయానికి శేఖరం ప్రియతో కలిసి యింటిమెట్లు దిగుతున్నాడు. "మనం ఎక్కడికి వెళుతున్నాం" ఐ అడుగుతోందామె.
బ్రెయిలీ బాగా అలవాటు అయితే షార్టుహాండ్ లాగే షార్టుకట్ లో వ్రాసుకోవచ్చు. చిన్న స్కేలులాటి పరికరంతో నడుస్తూనే వాళ్ళు సంభాషిస్తున్నారు.
"నాయుడికి జరిగిన పరాభవం సంగతి తెలిస్తే సంతోషించేవాళ్ళు ఇంకొకరున్నారు. అతడి దగ్గరికి వెళుతున్నాం మనం".
"ఎవరు?"
"భార్గవ"
"ఇంటికా" అతడికి తీసుకువెళ్ళటం కోసం అడిగింది.
"కాదు, ఇన్ స్టిట్యూట్ కి".
"ఈ రోజు ఆదివారం, శలవు".
"భార్గవలాటి సైంటిస్టులకి ఆదివారాలూ, శలవలూ ఉండవు".
'కన్నకూతురు మరణశయ్య మీద వుంటే ఏ తండ్రీ ప్రయోగాలు చేస్తూ కూర్చోడు' అని చెపుదామనుకొని, మళ్ళీ అతడు బాధపడతాడని ఊరుకుంది. ఇప్పుడు భార్గవకి కూడా నాయుడి విషయం- అసలు జరిగింది- చెప్పాలి.
వాళ్ళు ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళేసరికి పావుతక్కువ రెండయింది.
ఇన్ స్టిట్యూట్ వాచ్ మెన్ శేఖరానికి శాల్యూట్ చేశాడు. అయితే అతడు కొత్తగా వచ్చినవాడు. శేఖరం, ప్రియ అందులో పనిచేసే ఉద్యోగులే అనుకున్నాడు.
ఆ రోజు శలవు అవటం వల్ల ఆ వాతావరణమంతా నిర్మానుష్యముగా ఉంది. దూరంగా ఒక కారు దగ్గిర మాత్రం ఇద్దరు పోలీసులు నిలబడి ఉన్నారు. వాళ్ళు తమ ఇన్ స్పెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. తమకు రెండువందల గజాల దూరంలోనే తాము వెతుకుతున్న వ్యక్తి వున్నాడని వారికి తెలీదు.
శేఖరం ప్రియతో సహా తనకి అలవాటయిన కారిడార్ గుండా భార్గవ లాబ్ చేరుకున్నాడు.
ఇన్ స్టిట్యూట్ ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వుంది. సముద్ర గర్భములో అగ్నిపర్వతం పేలటానికి కొద్దికొద్దిగా ఆయత్తమవుతున్నప్పుడు, రాబోయే ప్రమాదాన్ని గ్రహించి సకల చరాలూ దూరంగా వెళ్ళిపోగా స్థబ్దత పొందుతున్న సాగర జలాల్లా వుంది అక్కడ ప్రశాంతత.
వాళ్ళు వెళ్ళే సమయానికి భార్గవ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ఇన్ ఫ్యూజ్ చేసే కల్చర్ ఛాంబర్ దగ్గిర వున్నాడు. కల్చర్ ఛాంబర్ ని మూడు నాలుగు నెలలపాటూ రోగి శరీరంలోనే ఆపరేషన్ చేసి అమరుస్తారు. అది తన పని తాను చేసుకుపోతుంది. దాన్ని శాశ్వతంగా అమర్చటం పట్ల ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఛాంబర్లో వాడబడే హోమోపోలిమర్ ని అతడు తన ప్రయోగంలో ఉపయోగించదల్చుకున్నాడు. ఈ పలుచటి పొరే యాంటీబాడీస్ డిఫ్యూజ్ అవటానికి తోడ్పడుతుంది.
ఒక కన్ను బయట ద్వారంమీద ఉంచి, మరోవైపు తన పని చూసుకోవటం అతడికి కష్టం అవుతూంది. తానెక్కడున్నదీ గుర్తించటానికి బహుశా పోలీసులకి ఎక్కువకాలం పట్టకపోవచ్చు. ఏ క్షణమైనా వాళ్లు వస్తారు... మాటిమాటికీ ద్వారంవైపు చూస్తూ ఉండటం వల్ల అతడి ఏకాగ్రత ప్రయోగం మీద నిలవటంలేదు.
సరీగ్గా అదే సమయానికి దూరంగా అడుగులచప్పుడు వినబడింది. అతడు చప్పున టేబిల్ దగ్గరికి పరుగెత్తాడు. కానీ అతడూహించినట్టూ కాక, శేఖరం, ప్రియ వస్తూ కనబడ్డారు. అ సమయంలో వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తున్నారో అతడికి అర్థంకాలేదు. ప్రియ, భార్గవని అక్కడ చూసి తన అభిప్రాయం తప్పయినందుకు విస్మయం చెందింది. మరో రెండడుగులు వేయగానే లోపల దృశ్యం కనబడింది. లోపల ప్రార్థన పడుకుని వుంది.
ఆమె అవాక్కయి నిలబడింది.
ఇదేమీ శేఖరానికి తెలీదు. అతడు ఆమెకి భార్గవ ఉన్నాడా అని సైగ చేయబోతున్నాడు. అదే సమయానికి భార్గవ వచ్చి శేఖరం చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
కొన్ని జ్ఞానేంద్రియాలు పోతే, మిగిలిన ఇంద్రియాలు మరింత కొత్తశక్తిని సంతరించుకుంటాయంటారు. కేవలం స్పర్శని బట్టి భార్గవ ఏదో టెన్షన్ ని వున్నాడని శేఖరం. 'ఏమైంది' అన్నట్టు సైగ చేశాడు....
పది నిముషాల్లో భార్గవ జరిగినదంతా సంక్షిప్తంగా అయినా ఏ విషయమూ వదలకుండా శేఖరానికి చెప్పాడు.
జరిగినదంతా చదువుతూంటే శేఖరం మొహంలో రంగులు మారసాగేయి. ఇది.... యిదంతా నిజమేనా అన్న అనుమానం కలిగి, ఒకటికి రెండుసార్లు చదవవలసి వచ్చింది. తన పరోక్షంలో ఇన్ని విషయాలు జరిగాయని అతడికి తెలీదు. చదవటం పూర్తి చేసేసరికి అతడి కళ్ళు వుండాల్సిన స్థానంనుంచి రెండు నీటి చుక్కలు చంపల మీదకు జారినయ్!
నిజాయితీతో- పట్టుదలతో తను నమ్మిన ఒక అంశం మీద ప్రయోగం చెయ్యాలనుకున్న ఒక సైంటిస్టుకి యెన్ని కష్టాలు? జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు విప్పి చెప్పటం కోసం తాపత్రయపడ్డ ఒక మనిషి చుట్టూ ఎంత వ్యతిరేకత!! మానవ కళ్యాణం కోసం అన్నీ త్యాగం చెయ్యబోతూన్న ఒక మహర్షి చుట్టూ ప్రశాంతమయిన ఆలయాన్ని నిర్మించవలసింది పోయి ఈ ప్రజలు, పోలీసులు, న్యాయస్థానాలు, అధికారులు- చివరికి భార్యకూడా అతడిమీద తలోరాయీ విసరటానికి ప్రయత్నిస్తున్నారు.
నిస్సహాయతా, వేదనా, సానుభూతీ మొదలయిన భావాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టి అతడు చిగురుటాకులా కదిలిపోయాడు, ఇంతకన్నా పెద్ద సమస్యల్ని ఎదుర్కొన్న శేఖరం....
కాగితం తీసుకుని ఒకే ఒక వాక్యం వ్రాసి భార్గవకు అందించాడు.
"నేనూ నీతో ఉంటాను"
భార్గవకు అర్థంకాలేదు. "... ఏమిటీ?"
"ఈ క్రతువులో నన్నూ పాలుపంచుకోనివ్వు. వేదోక్తంగా మంత్రాలు చదవలేను కానీ మంట ఆరకుండా అరచేతులు అడ్డు పెట్టగలను".
భార్గవ కళ్ళు చెమ్మగిల్లాయి. అతడు ఈ మాత్రం ఆప్యాయతకు చాలాకాలం నుండీ నోచుకోలేదు. గాద్గదికమైన కంఠంతో 'సరే' అన్నాడు.
ఆ మాటలు శేఖరానికి వినిపించలేదు. భార్గవ ఏం చెపుతున్నదీ అతడికి అనవసరం కూడా! అతడో నిర్ణయానికి వస్తే బ్రహ్మ రుద్రాదులు వచ్చినా దానికి తిరుగులేదు. సైన్యంలో అధికారాన్ని అప్పుడే చేతిలోకి తీసుకున్న లెఫ్టినెంట్ లా "మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉండవలసి వుంటుంది?" అని అడిగాడు.
"నాకు వచ్చిన వూహ సరైనదో కాదో ప్రయోగంలో తేలే వరకూ.... ఈ లోపులో ప్రార్థనకి ఏదైనా అయితే..." వాక్యం పూర్తి చేయలేకపోయాడు భార్గవ.
దాన్ని పట్టించుకోలేదు శేఖరం. ఇతడు ప్రాక్టికల్ మనిషి.
"ఈ గదిని మనం దాదాపు ఎయిర్-టైట్ చెయ్యాలి. మనకు తెలియకుండా ఎవరూ ఈ గదివైపు కనీసం చూడటానికి కూడా సాహసం చెయ్యకుండా బందోబస్తు చెయ్యాలి. అదంతా సరే.... మరి ఇన్ని రోజులూ తిండి?"



