Home » Yandamuri veerendranath » Rakshasudu
అంతలో రాజన్ కి తిరిగి మెలకువ వచ్చింది. దూరంగా వున్న కాలువ నీటిని చూసి గుండె లవిసేలా కేక పెట్టాడు. పిడికిళ్ళు బిగించాడు. నాలుక బాగా ముందుకు సాగింది. నోట్లోంచి చొంగ కారసాగింది. కుక్క లక్షణాలు ఈసారి స్ఫుటంగా కనపడ్డాయి. వళ్ళు బాగా వెచ్చబడింది. మనుషుల్ని చూసి కరవటానికి ఆయత్తమవసాగాడు.
సింహం ఆలస్యం చేయలేదు. నాలుగు అడవి తీగలు తీసుకొచ్చి రాజన్ చేతులు వెనక్కి కట్టాడు. చేతిరుమాలుతో నోరు కట్టేశాడు. అంతాచేసి, తిరిగి భుజం మీద వేసుకుంటూ "ఇతడి గోళ్ళు, పళ్ళు మన శరీరంలో గుచ్చుకుంటే ప్రమాదం. మనమూ పిచ్చెక్కిపోతాం" అన్నాడు.
అతడి మనసు సింహంపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. "కేవలం నా మాటమీద ఇతడిని భరించడానికి వప్పుకున్నావు. ఒక్కసారి వప్పుకున్నాక, తిరిగి మళ్ళీ ఎదురు ప్రశ్న వేయటంకానీ, విసుక్కోవటం కానీ చేయలేదు. నీకెలా థాంక్స్ చెప్పుకోను?" అన్నాడు.
సింహం నవ్వేడు. "చిన్నప్పుడెప్పుడో చదివాను- జరిగే ప్రతీదీ మన మంచికేనట. చూద్దాం, ఏం మంచి జరుగుతోందో-"
మళ్ళీ నడక.
రెండు రోజులు నడక సాగించారు. కానీ క్రమంగా పెద్దదికాసాగింది. రాత్రిళ్ళు దోమలు కుట్టటంవల్ల ఇద్దరి మొహాలూ గుర్తుపట్టలేనంతగా వుబ్బిపోయాయి. రాజన్ స్థితి అయితే మరీ భయంకరంగా తయారైంది. వున్నట్టుండి చెవి పక్కనుంచి అతడు అడవి దద్దరిల్లిపోయేలా పెట్టే కేకకి కర్ణపుటాలు బ్రద్ధలైపోయేవి. గార్డుల కెక్కడ వినపడుతుందో అని వాళ్ళు భయపడ్డారు. వర్షం పడటంవల్ల చిత్తడి నేలలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. అయినా నడక ఆపలేదు.
నిరాశ, నిస్పృహ పెనవేసుకుని వాళ్ళని రోజు రోజుకీ కృశింపచేస్తున్నాయి.
ఆ సాయంత్రం అతడు సింహంతో అన్నాడు- "రేపటితో మన ప్రయత్నం ఆఖరవబోతూంది. బలి కాబోతున్నాం".
సింహం అర్థంకానట్లు చూశాడు.
"కాలువ విశాల మవుతూందీ అంటే మనం నది దగ్గరికి చేరబోతున్నా మన్నమాట... రెండో గార్డు పోస్ట్ దగ్గరికి.."
సింహం మొహం వాడిపోయింది. అయిపోయింది. ఇక అక్కడ నుండి ఎటు వెళ్ళడానికీ దారిలేదు. రాజన్ తోపాటు తామూ సమాధి కాబోతున్నారు. రెండోగార్డు పోస్టు దగ్గిర కాలువ గోదావరిలో కలుస్తుంది. మొసళ్ళు, వేటకుక్కలు, ఆ రెండింటికన్నా భయంకరమైన గార్డులు.
.... ఆలోచనలతో ఎప్పుడో నిద్రపట్టింది.
అర్థరాత్రి దాటుతూ వుండగా, ఎవరో లేపినట్టు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. సింహం గాఢనిద్రలో వున్నాడు. చెట్టు దగ్గిర రాజన్ నిద్ర పోతున్నాడు. అతడి ఒక చేతిని సింహం చెట్టుకి కట్టేశాడు.
తనకంత అకస్మాత్తుగా ఎందుకు మెలకువ వచ్చిందో అతడికి అర్థంకాలేదు. ఏదో భయం గొలిపే ఫీలింగు. ఏదో జరిగింది. అతడి అనుమానాన్ని నివృత్తి చేయటానికా అన్నట్టు, నిశ్శబ్దాన్ని చీలుస్తూ దూరం నించి చీకట్లో వినపడింది...
జాగిలం అరుపు!
అతడు నిలువెల్లా వణికాడు. మృత్యువు దూరం నుంచి లాంతరు పట్టుకుని వెతుక్కుంటూ వస్తున్న భావం... చప్పున సింహాన్ని లేపాడు. సింహం కూడా అనుకోని ఈ పరిస్థితికి అయోమయంలో పడ్డాడు.
"ఏం చేద్దాం? పారిపోదామా?"
"వద్దు. ఎదురెళ్దాం."
సింహం అమితమైన ఆశ్చర్యంతో "ఎదురా" అని అడిగాడు.
"ఎలాగో మన జాడ ఆ వేటకుక్క పట్టుకోగలదు. చీకట్లో ఎంతో దూరం పరుగెత్తలేం కూడా. అందువల్ల మనమే ఎదురెళదాం. మనం అలావస్తామని వాళ్ళు ఊహించరు. ఆ పరిస్థితి మనకి ఉపయోగపడవచ్చు".
అతడి ఆలోచనకి అభినందిస్తున్నట్టు చూశాడు. ఇద్దరూ చీకట్లో పాముల్లా నిశ్శబ్దంగా, ఆ మొరుగు వినిపిస్తున్న వైపుకి పయనించారు. దాదాపు పది నిముషాలు ప్రయాణం చేశాక, అరుపు మరింత స్పష్టంగా వినిపించసాగింది. ఇద్దరూ మౌనంగా చెరోవైపుకి విడిపోయారు. రెండు వైపుల్నుంచీ ఒకేసారి శత్రువుని ఎదుర్కొనే ప్రయత్నంలో, ఆ అరుపుని సంకేతంగా పెట్టుకుని చెరోవైపు నుంచీ ఒక్కసారిగా బయటకొచ్చారు.
చెట్లలోంచి బయటకు రాగానే అక్కడి దృశ్యం కళ్ళనే నమ్మలేనట్టు చేసింది.
వాళ్ళని గార్డు మధ్యనుంచి వేరు చేసిన కుక్క అక్కడ వుంది ... అదికాదు వాళ్ళు చూస్తున్నది...
రెల్లుగడ్డిలో చిక్కుకుని పడవ అటూ ఇటూ వూగుతూంది.
* * *
ఇద్దరూ చెరోవైపు పట్టుకుని రాజన్ ని పడవ ఎక్కించారు. దానికి ముందు ఇద్దరి మధ్య వాదన సాగింది. అప్పటికే రాజన్ స్థితి మరీ శిధిలమైపోయింది. మెడ వెనక్కి వాలిపోతూ వుంది. గురక ఎక్కువైంది. ఇంకొకటి రెండు రోజులకన్నా ఎక్కువ బ్రతకడని అర్థమవుతోంది. అయినా అతడు తమతో తీసుకు వెళ్ళాలని పట్టుబట్టాడు.
ముగ్గురూ పడవలోకి చేరుకున్నారు. జాగిలం వారివైపే చూస్తూ వుంది. సింహం తెడ్డు వేశాడు. పడవ నీళ్ళలో కదిలింది. అతడు అటే చూస్తున్నాడు.
పడవ ముందుకు వెళ్తూంటే జాగిలం క్రమక్రమంగా చెట్ల వెనుక అదృశ్యమై పోయింది. అతడి మనసంతా అదోలాటి కృతజ్ఞతతో నిండింది. ఆ కుక్క కనబడకుండా వుంటే తమ జీవితం అడవిలో సమాప్తమయేదే...! ఒక కుక్క వారిని రక్షించింది- మరో కుక్క వారి సహచరుడిని మరణం అంచుకు తీసుకువెళ్ళింది.
వెన్నెల్లో పడవ నెమ్మదిగా కదులుతూంది. సింహం తెడ్డు వేయటం లేదు. ప్రవాహ వేగానికి పడవ కదులుతూంది అంతే! జాగిలాన్ని జాగృతం చేయటానికి చిన్న తెడ్డు చప్పుడు చాలు.
గార్డుల ప్రదేశం దగ్గిర పడుతూంది. ఇద్దరూ అప్రయత్నంగా ఊపిరి బిగపట్టారు.
వెలుగు మరింత ఎక్కువైంది. పడవ నిశ్శబ్దంగా సాగిపోతూంది. దూరంగా విశాలమైన గోదావరి నిండుగా కనబడుతూంది. గార్డుల టెంట్ చెట్లమధ్య స్థబ్దంగా వుంది.
ఇంకొక్క అయిదు నిముషాలు అలా గడిచివుంటే వాళ్ళు నదిలోకి ప్రవేశించేవారే.
కానీ అనుకోని కోణంలోంచి హఠాత్తుగా ప్రమాదం పులిలా దూకింది. అప్పటివరకూ నిద్రలో వున్న రాజన్- ఎప్పుడు మేల్కొన్నాడో తెలీదు. అసలే హైడ్రోఫోబియా తీవ్రస్థాయిలో వున్న రోగి. అంత నీటిని ఒక్కసారిగా చూసేసరికి గుండెలవిసేలా కేక పెట్టాడు. శరీరాన్ని భీకరంగా అష్ట వంకరలు తిప్పుతూ అరవసాగాడు. పక్కనున్న సింహం చేయి సాచి బలంగా రాజన్ ని కొట్టాడు. ఆ దెబ్బకి రాజన్ కి స్పృహ తప్పింది.



