Home » Yandamuri veerendranath » Prarthana
ఆమె దానికి సమాధానం చెప్పలేదు.
గంట గడిచింది.
ఎవరూ రాలేదు.
శేఖరం టెన్షన్ పెరగసాగింది. అయిపోవటం వేరు, ఏదో అవుతూందని ఎదురుచూడటం వేరు. ఇక ఆపుకోలేక ఆమెను తిరిగి నాయుడు ఇంటికి ఫోన్ చెయ్యమన్నాడు. ఆమె ఫోన్ చేసి, రిసీవర్ పెట్టేసి, "నాయుడు ఆస్పత్రినుంచి తిరిగి వచ్చేశాడని, రెస్టు తీసుకుంటున్నాడని" చెప్పింది.
అతడు ఆశ్చర్యపోయాడు, 'పోలీసులకేమీ చెప్పలేదా?'
"అసలు పోలీసు లెవరూ రానేలేదట".
"రాలేదా?"
"లేదు. క్లాంప్స్ విషయం కూడా ఎవరికీ చెప్పవద్దని నౌకర్ని హెచ్చరిస్తున్నాడు. నేను కొంచెం బెదిరించేసరికి నాతో చెప్పేశాడు".
శేఖరం ఆలోచనలో పడ్డాడు. అంతలో ఏదో స్ఫురించి "ఓ! అదన్నమాట సంగతి" అన్నట్టూ తల పంకించాడు.
"అతడిమీద నేను పోలీసు రిపోర్టు యివ్వలేదు. నా పగ నేనే తీర్చుకున్నాను. ఇప్పుడు అతడు కూడా అదే విధంగా నా మీద 'స్వయంగా' తనే పగ తీర్చుకోవటానికి ఏదో పథకం ఆలోచిస్తున్నాడన్న మాట... చూద్దాం ఏం చేస్తాడో!"
ఆమె దానిక్కూడా ఏమీ మాట్లాడలేదు.
అయితే ఆ తర్వాత ఎన్ని రోజులు గడిచినా నాయుడి దగ్గిర్నుంచి రెస్పాన్స్ రాలేదు. రాదన్న సంగతి ఆమెకి తెలుసు. శేఖరం అటువంటి భ్రాంతిలో ఉండటమే మంచిది.
నాయుడు ఆ రాత్రి విమానంలో రాబోవటంలేదన్న విషయం తనకి ముందే తెలుసుననీ, కావాలనే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనీ, ఆ రాత్రి శేఖరంతో పాటూ తను కూడా ఆ ఇంట్లో ప్రవేశించి నాయుడు వాడే సెంట్ సీసా ఉపయోగించిందనీ, శేఖరం తడిమి చూసింది తనచేతినేననీ, శేఖరం నాయుడు ఇంటినుంచి బయటకు రాగానే అతడు బిగించిన క్లాంప్స్ విప్పి వాటిని తీసుకుని తనూ బయటకు వచ్చేసిందనీ, శేఖరానికి ఎప్పటికీ తెలిసే వీలులేదు. తన కాబోయే భర్త అంధత్వాన్నీ, చెముడునీ ఆ విధంగా ఉపయోగించుకోవలసి రావటం విచారకరమే అయినా హంతకుడుగా తననుంచి వేరుపడటం ఇష్టంలేక ఆమెకి ఈ రిస్కు తీసుకోక తప్పలేదు.
శేఖరం మాత్రం నాయుడు ఎప్పటికయినా తనమీద పగ తీర్చుకుంటాడని ఎదురుచూస్తూనే ఉన్నాడు.
6
రవూఫ్ ఒకవైపు నుండి చకచకా ఎంక్వైరీ పూర్తిచేసుకుంటూ వస్తున్నాడు. 'ప్రార్థన కనబడటంలేదు' అన్న న్యూస్ అందిన వెంటనే హుటాహుటిన ఆస్పత్రికే వెళ్ళాడు. వసుమతికి 'డాక్టర్ జైన్ పిలుస్తున్నాడు' అని కబురందించిన నర్సుని వాకబుచేస్తే తనకా విషయం చెప్పిన వ్యక్తి పోలికల్ని ఆమె వివరించింది.
అవి భార్గవకి సరిగ్గా అతికినట్లు సరిపోయాయి. క్రింద మెట్ల దగ్గర లాన్ లో పడివున్న చక్రాలకుర్చీ మిగతా విషయాల్ని ఋజువు పరచింది. భార్గవ ప్రార్థనని తన కారులోనే తీసుకువెళ్ళాడని నిర్థారణ అయింది.
రవూఫ్ వెంటనే పోలీస్ స్టేషన్ కి తిరిగివచ్చాడు. ఊరి బయటకు వెళ్ళే దార్లన్నింటిలో ఉన్న పోలీస్ స్టేషన్లకి భార్గవ కారు నెంబరుచెప్పి దానిని తక్షణం ఆపుచేయమని మెసేజ్ ఇచ్చాడు. ఆ తరువాత సిటీలో ఎక్కడయినా అ కారు కనబడుతుందేమోనని సెర్చ్ పార్టీని నలువైపులకి పంపించాడు.
భార్గవ ఒకవేళ కూతుర్ని ఇంటికి తీసుకు వెళ్ళాడేమోనని అక్కడికి కూడా పంపించాడు. కానీ అక్కడ దొరకలేదు. సరిగ్గా ఒంటిగంట అవుతూండగా అతడి ముందున్న ఫోన్ మ్రోగింది. దానికోసమే ఎదురు చూస్తున్నట్టు రిసీవర్ చప్పున అందుకున్నాడు రవూఫ్. అవతల్నించి మెసేజ్ వచ్చింది.
మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ ఆవరణలో కారు కనపడ్డట్టు.... రవూఫ్ ఆనందంతో సన్నగా విజిల్ వేశాడు. ఆస్పత్రి ఆవరణలో నుండి కంటెప్ట్ ఆఫ్ కోర్టుక్రింద పేషెంటుని తీసుకువెళ్ళడం కన్నా ఇంకొకరి ఆవరణలోకి క్రిమినల్ ట్రిస్ పాస్ క్రింద ప్రవేశించడం మరింత పెద్దనేరం. శంకర్ లాల్ నుండి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటే దొంగతనం చేస్తూ పట్టుబడి, పారిపోవడానికి ప్రయత్నించాడనీ అప్పుడు షూట్ చెయ్యవలసి వచ్చిందని పై అధికారులకి చెప్పవచ్చు.
హుషారుగా బయటకు నడిచాడు రవూఫ్.
అతడు శంకర్ లాల్ దగ్గరకు చేరుకునేసరికి ఒంటిగంటన్నర కావొస్తూంది. రవూఫ్ చెప్పిందంతా విని శంకర్ లాల్ విచలితుడయ్యాడు.
"కారు మా ఆవరణలో వుందా?"
"అవును సార్. మీరు కంప్లయింట్ వ్రాసిచ్చారంటే ఎక్కడ వున్నా అరెస్ట్ చేస్తాను."
"ఎక్కడున్నా- అన్న ప్రశ్నలేదు. అతడు మా ఇన్ స్టిట్యూట్ లోనే- మా లాబ్ లోనే వున్నాడు" సాలోచనగా అన్నాడు శంకర్ లాల్. ఇన్ స్పెక్టర్ అవాక్కయ్యాడు.
"అవును ఇన్ స్పెక్టర్. అతడు అక్కడికి ఎందుకు చేరుకున్నాడో కూడా నేను వూహించగలను. పాపం తను ఇంతకాలం వున్న లాబ్ మీదా, తన థియరీమీదా ఇంకా మమకారం పోలేదన్నమాట".
"మనం పోగొడ్దాం సార్" నవ్వేడు రవూఫ్. శంకర్ లాల్ కూడా నవ్వుతూ, "అతడిని అక్కడనుండి లేవగొట్టటానికి కంప్లయిట్ వ్రాసివ్వాలి. అంతేగా" అన్నాడు.
"ప్రవేశించినందుకు వ్రాసివ్వండి సార్. ఎక్కణ్నుంచి లేవగొట్టాలో నేను చూసుకుంటాను."
"ఎందుకు అతడిమీద నీకు అంత పగ?" వ్రాస్తూ అడిగాడు.
"నన్ను కొట్టినవాడు ఇంతవరకూ లేడు సార్. ఆ రోజు స్టేషన్ లో దానికి జవాబు చెపుదామంటే మీరు వచ్చి విడిపించారు. అప్పటి ఋణం అలాగే వుండిపోయింది".
"విడిచి పెట్టినందుకు మా ఋణం తీర్చుకున్నాను కదయ్యా" కాగితం అందిస్తూ అన్నాడు. "... ఈ రోజు శలవు కాబట్టి సరిపోయింది. కానీ రేప్రొద్దున్న తొమ్మిదింటికి ఉద్యోగులందరూ వచ్చేస్తారు. వాళ్ళు చేరుకునే లోపులో అంతా పూర్తవ్వాలి. అక్కడో సీను తయారవటం నాకిష్టంలేదు".
"రేపు తొమ్మిదా! అంతవరకూ ఎందుకు సార్. ఇంకో అరగంటలో మొత్తమంతా పూర్తిచేసెయ్యనూ".
"మంచిది ఇన్ స్పెక్టర్. మళ్ళీ మేం మీకు ఋణపడే అవకాశాన్ని కల్పిస్తున్నారన్నమాట" గుంభనంగా నవ్వేడు.
రవూఫ్ మొహం ఆనందంతో విశాలమైంది. రివాల్వర్ సర్దుకుంటూ "థాంక్యూ సాబ్... థాంక్యూ" అన్నాడు.
ఇద్దరికీ జరగవలసింది అర్ధమయింది. పద్మశ్రీ చంపాలాల్, శంకర్ లాల్ కి చాలా కావల్సినవాడు.
* * *



