Home » Yandamuri veerendranath » Prarthana
"బెదరకు, నేనే శేఖరాన్ని! నీ దయవల్ల మాట్లాడలేను. కాబట్టి కంఠం అరువు తెచ్చుకున్నాను. అగు కదలకు! సైనేడ్ ఏమాత్రం తగిలినా నీ మరణం ఖాయం".
శేఖరం టేప్ రికార్డర్ దూరంగా పెట్టి మంచం దగ్గరగా వెళ్ళాడు. నాయుడిని తడిమి చూశాడు. ఆపాటికే అతడి వళ్ళు చల్లగా భయంవల్ల చెమటతో తడిసి ముద్దయిపోయింది. అతడోకంపెనీ యజమాని. సైనేడ్ గురించి అతడికి బాగా తెలుసు. మృత్యువు రెండంగుళాల దూరంలో నిలిచి వుంటే చెమటలు పట్టకేం చేస్తుంది?
శేఖరం పెదవులమీద నవ్వు వెలసింది.
"ఒకప్పుడు నేనూ ఇలాగే బాల్కనీ గోడ పట్టుకుని వేలాడాను మిస్టర్ నాయుడూ! బ్రతుక్కీ, చావుకీ మధ్య ఊగిసలాడాను. అప్పుడేమైందో తెలుసా?"
శేఖరం తనతోపాటూ తెచ్చిన ద్రవాన్ని నాయుడు శరీరంమీద పూర్తిగా చల్లాడు. రెండు మూడు చుక్కలు అంచులకి రాశాడు.
టేప్ రికార్డర్ లో వస్తున్న మాటలు, వాక్యానికీ, వాక్యానికీ మధ్య టైమింగ్, ఏ వాక్యం ఎప్పుడొస్తుందీ, దీని తర్వాత ఏ పని చెయ్యాలీ- ఇవన్నీ దాదాపు ఇరవైసార్లు రిహార్సల్ వెయ్యడం వలన ఎక్కడా తడబడకుండా తనే మాట్లాడుతూ పనులు చేసుకుంటూ పోతున్నట్లు వుంది. కేవలం కంఠం మాత్రం స్త్రీది- అంతే!
"ఈ ద్రవం తేనె, నువ్వు ఎయిర్ పోర్టు నుండి ఇంటికి వచ్చే సమయానికి చీమల్ని నీ మంచంవరకూ ఆహ్వానించాను. ఇప్పుడిక ఇవి మంచం ఎక్కి నీ శరీరాన్ని ఆక్రమిస్తాయి".
శేఖరం తడుముకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
"ఇప్పుడు నీ మొహాన్ని చూడాలని నాకెంతో కోరికగా వుంది. నా తీరని ఆశల్లో ఇదొకటిగా మిగిలిపోయింది. నీ కసలు తెలివిలేదు నాయుడూ! నీ దగ్గరలో సైనేడ్ వుందని నాకు తెలుసు. నీకే మాత్రం తెలివి తేటలున్నా నేను తడిమి చూడటానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు నా శరీరానికి ఏ ఒక్కముల్లు గీసుకుపోయేటట్లు చేసినా నేనక్కడికక్కడే మరణించి ఉండేవాణ్ణి. ప్రాణభయంతో నీకే ఆలోచన కూడా- రాకపోవడం నీ దురదృష్టం. నీకామాత్రం ఆలోచన కూడా రాదని నేను ముందే ఊహించి అదికూడా టేప్ చేశాను.
మిస్టర్ నాయుడూ! అరవడానికి ప్రయత్నించకు. అరిచినా ఈ గదిలోనుండి - బయటికి వినిపించదు. ఇంకో అయిదు, పది నిముషాల్లో చీమలు కుట్టటం ప్రారంభిస్తాయి ఓర్చుకోవడానికి ప్రయత్నించు, తప్పదుమరి, తెల్లవారేవరకూ ఓర్చుకుంటే పొద్దున్న వరకూ నువ్వు బ్రతికుంటే నీ అదృష్టం బాగుంటే పొద్దున్న ఎవరోవచ్చి రక్షిస్తారు. లేదూ- ఇంత బాధ భరించలేనూ అంటే... చాలా సులభం! నీ చేతిని కొంచెం విసురుగా పైకెత్తు క్లాంప్స్ గుచ్చుకుని క్షణాలమీద చచ్చిపోతావు. అత్యంత సులభమయిన మరణం కావాలో, ఈ రాత్రి నీ జీవితపు కాళరాత్రిగా మార్చుకుంటావో నీ మీద ఆధారపడి వుంది" టేపు ఆగింది.
శేఖరం టేపు రికార్డర్ చేతిలోకి తీసుకున్నాడు. గుమ్మంవరకూ నడిచాడు. అక్కడ ఆగి తన మనసులోని ఆఖరి వాక్యాలకోసం ఒక క్షణం నిలబడ్డాడు.
"ఆ రాత్రికూడా నేను ఇలాగే నిస్సహాయంగా ఎముకలు విరిగి క్షణం క్షణం భయంతో రాత్రంతా గడిపాను. ఇదిగో ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళూ ఎదురు చూసాను. ఏ చీమలయితే నన్ను అంధుణ్ణి చేశాయో ఆ చీమలే నీ భవితవ్యాన్ని నిర్థారణ చేయబోతున్నాయి. ఈ శిక్షకేవలం నా తరఫు నుండి వ్యక్తిగతమయిందేకాదు, మందుల్లో కల్తీచేసినందుకూ, ధరల్లో మోసం చేసినందుకూ నీ పాపానికి పరిహారం.... గుడ్ బై".
* * *
అతడు బయటికి రావటానికి కొద్దిగా కష్టం అయింది. అందులోనూ చేతిలో టేప్ రికార్డర్ ఉండటంచేత రావడానికి దాదాపు యిరవైనిముషాలు పట్టింది. వీధి మొదట్లో ప్రియ ఎదురుచూస్తూ వుంది. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేసరికి దాదాపు పన్నెండు కావస్తోంది.
"నువ్వు ఇంటికి వెళ్ళవా?"
"ఉహుఁ! వెళ్ళను. ఇక్కడే వుంటాను" ఆమె వ్రాసింది.
"ఈ కథ ఎలా ముగుస్తుందో నాకు తెలీదు ప్రియా! నాయుడు బ్రతికివున్నా, చచ్చిపోయినా నేను అరెస్టు అవటం ఖాయం. హత్యచేసినా, చెయ్యటానికి ప్రయత్నించినా శిక్ష దాదాపు సమానమే. నాలాంటి నేరస్తుడితోపాటు ఈ రాత్రి వుండి నీ కారెక్టర్ కి మచ్చ తెచ్చుకోకు"
ఆమె వినలేదు. అతడు బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చింది. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. అనుక్షణం నాయుడ్ని ఊహించుకుంటూనే గడిపాడు.
తెల్లవారింది. దాదాపు తొమ్మిది అవుతుండగా శేఖరం ఆమెకి సూచన ఇచ్చాడు. "ఈ పాటికి ఎవరో ఒకరు లోపలికి ప్రవేశించి వుంటారు. అక్కడి పరిస్థితి ఎలా వుందో ఫోన్ చెయ్యి. నువ్వెవరో చెప్పకు. కేవలం నాయుడి కోసం చేసినట్లు మామూలుగా ఎంక్వయిరీ చెయ్యి."
ఆమె ఫోన్ అందుకుని డయల్ చేసింది. అటునుండి రింగ్ వినబడుతోంది. నిముషం తరువాత అవతలవైపు రిసీవర్ ఎత్తిన ధ్వని వినిపించింది. "హలో" అంది. "కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ నాయుడు?"
శేఖరం ఊపిరి బిగపట్టాడు.
మరో నిముషం మాట్లాడి, ప్రియ ఫోన్ పెట్టేసింది.
ఆమె చెప్పబోయే విషయం వినటం కోసం అతడు ఆతృతపడుతున్నాడు. అతడి గుండె వడివడిగా కొట్టుకుంటూంది. 'ఏమైంది' అన్న ప్రశ్న అతడి మొహంలో స్పష్టంగా కనబడుతూంది...
ఆమె బ్రెయిలీలో చెప్పింది. "నాయుడిని అపస్మారక స్థితిలో వుండగా ప్రొద్దున్న నౌకరు చూశాడట. ఒళ్ళంతా దద్దుర్లతో ఆస్పత్రిలో చేర్పించారట."
శేఖరం బిగ్గరగా నవ్వేడు. అతడింత గట్టిగా నవ్వటం ఆమె ఎప్పుడూ చూడలేదు.
"అదృష్టవంతుడు బ్రతికి బయటపడ్డాడు. పాపం రాత్రంతా భయంతో బిర్రబిగుసుకుపోయి ఉంటాడు. ఒక్కొక్క చీమా ఒక్కొక్క చోట కుడుతూ వుంటే కదల్లేక మెదల్లేక సతమతమైపోయి ఉంటాడు... పూర్ ఫెలో... పాపం తన చుట్టూ క్లాంప్స్ కు నిజంగా సైనేడ్ పూయబడిందనే అనుకుంటున్నాడు, దాన్ని ముట్టుకోవటానికి భయటపడి ఉంటాడు. అంత సైనేడ్ సంపాదించటం ఈ పరిస్థితుల్లో నాకు సాధ్యంకాదు అన్న కనీసపు వూహకూడా అతడికి ఎందుకు రాలేదో?... తలుచుకుంటే జాలేస్తూంది. ప్రొద్దున్నే నౌకర్ కి ఈ సైనేడ్ సంగతేమీ తెలీదు కాబట్టి మామూలుగా చేతితో వాటిని తీసేసి వుంటాడు".
ఆమె అచేతనంగా వుండిపోయింది. క్లాంప్స్ కి సైనేడ్ పూయబడలేదన్న విషయం ఆమెకు కూడా తెలుసు. శేఖరం ఆమెకు ముందేచెప్పాడు.
"కేవలం చీమకాటువల్ల స్పృహ తప్పడు. భయంవల్ల కలిగిన అపస్మారక స్థితినుంచి ఈపాటికి అతడు బయటపడి వుంటాడు. పోలీసులకి జరిగినదంతా చెప్పుతూ ఉండి ఉంటాడు. ఇంకో గంటలోనో- రెండు గంటల్లోనో నన్ను అరెస్టు చేయటానికి పోలీసులు వస్తారు".



