Home » Yandamuri veerendranath » Rakshasudu


    "అదే నాకూ తెలీలేదు. అందుకే అంతదూరంనుంచి వచ్చి చెప్పాను. ముందైతే పారిపోతున్నాడేమో అనుకున్నాను. కానీ వెనక్కి వచ్చేశాడు".

 

    "బండి వదిలేసి వెళ్ళాడంటే ఏదో ప్లాను వుండే ఉంటుంది. ఇంకెంతలే. రేపు కమాండర్ వచ్చాక యాక్షన్-1 మొదలుపెడితే క్షణాల్లో తెలిసిపోతుంది".

 

    వింటున్న అతడు నిలువెల్లా వణికాడు. యాక్షన్-1

 

    అయిపోయింది చివరి వరకూ వచ్చినది చేజారిపోయింది. ఆమె చేసిన సాయాన్ని తను కేవలం తొందరపాటు వల్ల పోగొట్టుకున్నాడు. ప్రాణాలు అర్పిస్తున్నాడు. గార్డుకి ఎందుకు అనుమానం వచ్చిందో అర్థమైంది. వచ్చినవాడు రెండో కాంపు గార్డు. తను తొందరలో పరిసరాలు చూసుకోకుండా పరుగెత్తాడు. బండిని వదిలిపెట్టాడు. ఒకటీ ఒకటీ కలుపుతే రెండు. గార్డుకి అందుకే అనుమానం వచ్చింది. ఎలా?

 

    చీకటి పడింది. అక్కడ సింహం, రాజన్ లు ఎదురు చూస్తూ ఉంటారు.

 

    అడవిలో...

 

    అయిదు... పది... పదిహేను.... నిమిషాలు వేగంగా కదిలిపోతున్నాయి.

 

    అక్కడ సింహం, రాజన్ లు బయల్దేరి ఉంటారు. తను వెళ్ళక పోతే, మళ్ళీ వాళ్ళు వెనక్కిరాలేక, అక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ అడవిలో దిక్కుతోచనట్టు తిరుగుతూ వుంటారు. ఈ లోపులో గార్డులకి అనుమానం వస్తే వెంటనే 'వేట' ప్రారంభం అవుతుంది. కుక్కలు వాళ్ళని వేటాడతాయి. చీల్చి చెండాడుతాయి. ఈ ఆలోచన రాగానే అతడి వళ్ళు గగుర్పొడిచింది. ఏదో చెయ్యాలి.

 

    అతడి దృష్టి వరండాలో వున్న గార్డు కోటుమీదపడింది. కుర్చీ కోడుకి పెట్టి వెళ్లాడు. బయట చలిగా ఉన్నప్పుడే వేసుకొనే కోటు అది. దాని జేబులోంచి సగం బయటకు వచ్చిన తాళం చెవుల గుత్తి వేలాడుతూంది. అక్కడ చాలాసేపు కూర్చుని కబుర్లాడిన గార్డులు కోటు వదిలేసి గాలికోసం బయటకి వెళ్ళారు.

 

    అతడి దృష్టి దాని మీద పడి గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. అదృష్టానికీ దురదృష్టానికీ మధ్యదూరం కేవలం ఎనిమిది అడుగులు. అక్కణ్నుంచి ఎలాగైనా తాళం చేతులు గార్డు వచ్చేలోపులో సంపాదించగలిగితే...

 

    అతడు గదిలో పచార్లు చేయసాగాడు. ఇక్కడ్నుంచీ ప్రతీక్షణమూ విలువైనదే. సింహం వాళ్ళు తొందరపాటు నిర్ణయం ఏదో తీసుకోకముందే ఇక్కడ నుంచి బయటపడాలి.

 

    అంతలో అతడి దృష్టి చీపిరికట్ట మీద పడింది.

 

    కన్నార్పకుండా దాన్నే క్షణంసేపు చూశాడు. తరువాత తలతిప్పి కోటు జేబులోంచి సగం కనబడుతున్న తాళం గుత్తికేసి చూశాడు. గదిలో మరేమీ లేవు. ఒక మూల మాత్రం సగంపగిలిన కూజా వుంది ఎప్పుడో పెట్టిన నీళ్ళు కాస్త వున్నాయి. వాటిని చూస్తూంటే ఒక ఆలోచన మెరిసింది. మరి ఆలస్యం చేయకుండా చొక్కా విప్పాడు. అతడి ఆలోచన అమలు జరపాలంటే చొక్కా తప్ప మరే పరికరమూ లేదు.

 

    కూజాలో వున్న నీళ్ళతో చొక్కాని తడిపాడు. కూజా బ్రద్ధలుకొట్టి ఆ పెంకుతో చొక్కాని పీలికలుగా చేశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు అతడి దృష్టి ముందు ద్వారం మీదే వుంది ఏ క్షణమైనా గార్డువస్తాడేమో అని గుండెలు పీచుమంటున్నాయి. మొత్తం పేలికలు తయారవటానికి అరగంట పట్టింది.

 

    ఆ తరువాత చీపిరికట్ట విప్పి పుల్లల్ని నేలమీద పరిచాడు. వాటిలో బలమైన వాటిని ఏరి మూడు-మూడు పుల్లలుగా బిగించి, ఒక కట్ట వెనుక మరొకకట్ట పెట్టి తిరిగికట్టాడు. అయిదు నిమిషాల్లో పొడవాటి కర్రలా తయారైంది. ఆకారమైతే తయారైంది కానీ, పుల్ల పొడవుగా ఉండటం చేత వంగిపోసాగింది.

 

    జాగ్రత్తగా కటకటాల సందులోంచి దాన్ని బయట కోటువైపు పోనిచ్చాడు. కోటు జేబు దగ్గిరకి పైకి లేపి, తాళాలకున్న రింగు మధ్యలోకి పుల్లని పోనిచ్చాడు. దాంతో తాళాల గుత్తిని లేపటానికి ప్రయత్నించాడు. కానీ పుల్లల బలం సరిపోక వంగిపోసాగింది.

 

    అతడి అరచేతులు టెన్షన్ తో చెమటలు పట్టసాగాయి.

 

                                        *    *    *

 

    రాజన్ సింహంవైపు ఏం చేద్దాం అన్నట్టు చూశాడు. దూరంగా వేటకుక్కలు మొరగటం వినిపిస్తూంది. తిరిగి వెనక్కివెళ్ళి బారక్స్ చేరటం అసంభవం. మరికొంత చీకటిపడితే అడవిలో ఉండటం ప్రమాదకరం. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది పరిస్థితి.

 

    రాజన్ కి అంత తెలివితేటలు లేవు. కానీ సింహం ఆలోచించగలడు. "వెనక్కి వెళ్దాం" అన్నాడు. రాజన్ అతడివైపు ఆశ్చర్యంగా చూశాడు. ఈ పరిస్థితిల్లో వెనక్కి వెళ్ళి గార్డుల కళ్ళబడటం అంటే మరణానికి ఆహ్వానం పలకటమే. అయినా సింహం వెళ్దామనే పట్టుబట్టాడు. "అక్కడ అతడు ఎలా వున్నాడో. కమాండర్ అతడిని ఎందుకు పిలిచాడో..." ఇదే అనుమానం సింహాన్ని వేధిస్తూంది. వెళ్ళి చూడాలని మనసులో అనిపిస్తూన్నది.

 

    ఇద్దరూ వెనక్కి బయల్దేరారు. గార్డ్ రూమ్ దగ్గిర దీపం మినుక్కు మినుక్కుమంటూ వెలుగుతూంది. చూసుకోకుండా రాజన్ కాలు గుంటలో పడి జారాడు. ఎండుటాకులు గలగలలాడాయి.

 

    కళ్ళు సగం చేసి ఆలోచనలో వున్న వేటకుక్క "భౌ" మంటూ ఒక్కసారిగా గాలిలోకిలేచి, చప్పుడు వచ్చిన దిక్కుగా పరుగుతీసింది. "ఎవరదీ" అని అరుస్తూ గార్డు తుపాకి సరిచేసుకుంటూ అటునడిచాడు. సింహం పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినయ్. రాజన్ ని పట్టుకుని పైకి లేవటానికి ప్రయత్నించాడు. కానీ ఆ లోపులోనే వేటకుక్క గాల్లోంచి దూసుకువచ్చి అతని మీద పడింది.

 

                                                        *    *    *

 

    అతడు జాగ్రత్తగా పుల్లని తాళాలగుత్తి మధ్య రింగులోకి జొనిపి నెమ్మదిగా వెనక్కి లాగాడు. కొద్ది కొద్దిగా వెనక్కి వచ్చింది. అయిదారుక్షణాల్లో అతడు దాన్ని అందుకున్నాడు. కటకటాల్లోంచి చెయ్యి బయటకి పెట్టి తాళం తీసి అతడు బయటకొచ్చాడు.

 

    స్వేచ్చా గాలి అతడిని ఒక్కసారిగా చుట్టుముట్టింది.

 

    అంతలో దూరంగా ఆర్తనాదం వినిపించింది.

 

    ఆ గొంతు రాజన్ ది.

 

    అతడు మరి ఆలస్యం చేయలేదు. చీకట్లోకి దూసుకుపోయాడు. అప్పటికే రాజన్ హోరాహోరీ ఆ జాగిలంతో పోరాడుతున్నాడు. ఈ లోపులో గార్డు విజిల్ వినపడేసరికి జాగిలం వెనక్కి తగ్గింది.

 

    వళ్ళంతా రక్తంతో, వెనుక నుంచి తుపాకి బోయినెట్ కసుక్కున పొడుస్తూ వుండగా రాజన్ లేచి నుంచున్నాడు. సింహం చేతులు పైకెత్తి చీకట్లోంచి ముందుకొచ్చాడు. ఈ లోపులో రెండో గార్డుకూడా అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు గార్డుల మొహాలమీద పైశాచిక మందహాసం నాట్యం చేస్తూంది. వాళ్ళ సాడిజాన్ని సంతృప్తిపరచే ఇలాటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి.

 

    ముందు రాజన్, సింహం నడవగా గార్డులు తుపాకుల్తో వాళ్ళని తోసుకుంటూ రాసాగారు. పక్కనే ఠీవిగా కుక్క.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More