Home » Yandamuri veerendranath » Rakshasudu
లేచి వెళ్ళి టెంటు తాడు లాగాడు. దూరంగా గంట మ్రోగిన శబ్దం వినిపించింది. కొద్దిసేపట్లో తుపాకి పట్టుకున్న గార్డు తలుపు కాస్త తెరిచి కర్కశంగా "ఏం కావాలి" అని అడిగాడు.
"కమాండర్ ని కలుసుకోవాలి".
"ఇంత రాత్రప్పుడు ఏం పని?" అనుమానంగా చూశాడు.
"పనుంది"
మామూలుగా అయితే ఆ సమాధానానికి తుపాకి మడమ కాలిమీద పడి వుండేదే. కానీ అతడికున్న ప్రత్యేక స్థానం (పైగా ఆ రాత్రే హై కమాండర్ అతడిని పిలిపించింది.) వల్ల గార్డు అతడిని కమాండర్ దగ్గిరకి తీసుకెళ్ళాడు.
"నేను అడవిలోకి వెళ్ళాలి".
తాగుతున్న సారా ఆపి, "ఎందుకు" అని అడిగాడు మత్తులో.
"నెమలి కూతలు వినిపిస్తున్నాయి. ఏదో జంతువు దగ్గరలో తిరుగుతూంది తీసుకొస్తాను".
కమాండర్ అంత మత్తులోనూ అనుమానంగా చూశాడు.
అంతలో మరోసారి నెమలి దూరం నుండి వికృతంగా కేకపెట్టింది.
"అదిగో" అన్నాడు. "నిశ్చయంగా పులే అయివుంటుంది. లేకపోతే అలా కేక పెట్టదు?"
అబద్ధం. అబద్ధమని అతడికి తెలుసు. కానీ కమాండర్ కి తెలీదు. తలూపి "వెళ్ళు" అన్నాడు. అతడు గార్డుతో సహా బయటికి వచ్చాడు. తోపుడు బండి తీసుకుని బయలుదేరాడు. చెట్లచాటుకి కొంతదూరం వెళ్ళగానే బండిని తుప్పల మాటున వదిలి పరిగెత్తటం ప్రారంభించాడు. ఊపిరి తీసుకోవటానికి కూడా ఆగలేదు. ప్లానులో నక్షత్రం వున్న చోటికి చేరుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి.
తెల్లవారే లోపులో వెనక్కి రావాలి. మొదటి గార్డు పోస్టు వరకూ తెలిసిన దారే. అక్కడివరకూ సులభంగా వెళ్ళాడు. రెండో పోర్టు కేవలం ఒకటి రెండుసార్లు మాత్రమే అంతకుముందు వెళ్ళాడు. అక్కడ్నుంచీ, ఆ పైన ఏముందో తెలీదు. చీకట్లో ఏ మాత్రం తప్పినా ఇక అంతే... వెనక్కొచ్చే ప్రశ్న లేదు.
అయినా అతడు పరుగు ఆపలేదు. అడవి మిడతలు టప్ టప్ మంటూ వచ్చి మొహానికి తగుల్తున్నాయి. చెట్లు రాసుకుని చర్మం గీసుకుపోతూంది. ఆ అడవి నుంచి ఎవరూ ఎందుకు తప్పించుకోలేరో అర్థమయింది.
రెండో పోస్టు దాటాక అసలు దారి లేదు. చెట్లు మరింత దట్టమయ్యాయి. అతడి మనసులో యధాతథంగా మ్యాపు చిత్రీకరించబడి వుంది. అయినా అది విస్తృతమైన మ్యాపు కాదు. వివరాలు లేవు.
దాదాపు తెల్లవారుతూ వుండగా అతడు పరుగు ఆపి రొప్పుతూ నిలబడ్డాడు.
దూరంగా మూడు తాటిచెట్లు నిలవెత్తున కనపడుతున్నాయి. మ్యాప్ లో చూపినట్టే వున్నాయవి. పక్కనే కాలువ.
అతడు మళ్ళీ పరుగు కొనసాగించాడు. అయితే ఈసారి క్రింద ఇసుక వుండటం వల్ల పరుగు సులభమయింది. దాదాపు రెండు ఫర్లాంగులు అలా పరిగెత్తాక కాలువ నదిలో కలిసే చోటు వచ్చింది.
ఆ రాత్రి నిశ్శబ్దంలో నది హోరు హృదయాన్ని జలదరింపజేసేలా వినిపిస్తూంది. రెండు తాటిచెట్ల నిడివి కన్నా ఎక్కువ లోతుంటుంది అక్కడ. అయినా నది వేగంగానే ప్రవహిస్తూంది. దాన్ని బట్టే తెలుస్తూంది. ఆ నది ముందు కెళ్ళే కొద్దీ ఎంత వేగాన్ని సంతరించుకుంటుందో...
నది ఒడ్డునే వెన్నెల్లో నల్లగా మెరుస్తూన్న రెండు మొసళ్లు అలికిడికి నిద్రనుంచి మేలుకున్నట్టు ఇసుకలోంచి పాకి నదిలోకి జారిపోయాయి. నదికి ఇరువైపులా దట్టంగా పెరిగిన రెల్లుగడ్డి దుబ్బులున్నాయి. కాలువ నదిలో కలిసే చోట దుబ్బుల్లో అస్పష్టంగా కనబడుతున్న దాని మీద దృష్టి పడగానే అతడి గుండె ఒక క్షణం ఆగి, వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది.
ప....డ...వ...!
అతడెంతో కాలం కష్టపడి తయారుచేసిన పడవ- ఇక పోయిందని ఆశ వదిలేసుకున్న పడవ- అక్కడ నీళ్ళలో తేలుతూ వుంది.
* * *
అతడు తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నమైంది. జంతువు తేలేదేమని కమాండర్ ప్రశ్నించలేదు. అతడు వచ్చే సమయానికి కమాండరు తోటలోకి వెళ్ళాడు.
అతడి మనసంతా ఉద్వేగంతో నిండి వుంది. ఎంతో కష్టపడితే గానీ అడవి మధ్య నుంచి నది వరకూ చేరుకోలేని నావని ఆమె మూడో కంటికి తెలియకుండా ఎలా చేర్చిందో అతనికి తెలియలేదు.
అతడు టెంట్ లోకి ప్రవేశిస్తూ వుంటే గార్డు ఆపాడు.
"రాత్రి ఎక్కడికి వెళ్ళావు?"
"చెప్పానుగా.... జంతువుల వేటకి".
"తోపుడు బండి?"
"తీసుకునే వెళ్ళా..." అంటూ ఆగిపోయాడు. దూరంగా బండి కనబడుతూంది.
పడవ కనబడిన ఆనందంలో బండి తిరిగి వెనక్కి తీసుకురావాలన్న విషయం మర్చిపోయాడు. అది గార్డుల కళ్ళబడి వుంటుంది. సర్వనాశనం అయిపోయింది.
తనని తానే మనసులో తిట్టుకున్నాడు. రాత్రి తను వేటకి వెళ్ళలేదన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. కాస్త నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది.
"ఈ రోజు పనికి వెళ్ళకు. కమాండర్ వచ్చిన తరువాత విచారణ ప్రారంభిస్తాడు".
అతడి మనసు కుదించుకుపోయింది. 'విచారణ' అంటే ఎలా వుంటుందో అతడికి తెలుసు. అనుమానం రానంతకాలం ఫర్వాలేదు. ఒకసారి వస్తే మాత్రం నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటం చాలా కష్టం. అంతకుముందు చాలాసార్లు తను జంతువుల్ని తీసుకురాకుండా ఉట్టి చేతుల్తో వచ్చాడన్న విషయం తెలుస్తుంది. మొత్తం అంతా బయటపడుతుంది.
కమాండర్ వచ్చేవరకూ అతడు ప్రతిక్షణమూ నరకంలో ఉన్నట్టే గడిపాడు. అదృష్టవశాత్తు ఆ సాయంత్రం కమాండర్ కాంప్ కి తిరిగి రాలేదు.
చీకటి పడింది. విచారణ మరుసటి రోజుకి వాయిదా పడింది. భోజనాల దగ్గిర అతడు రాజన్ కీ, సింహానికి చెప్పాడు. "ఈ రాత్రి మనం తప్పించుకు పోతున్నాం".
కానీ అది అంత సులభం కాలేదు. అ రోజు అతడిని విడిగా వేరే కాంప్ లో ఒంటరిగా వుంచారు. చాలా చిన్న గది అది. అంతకు ముందు అందులో ఎవరు ఉండే వారో తెలీదు. గదంతా అంగుళం ఎత్తు దుమ్ము పేరుకొని వుంది. చీపిరివున్నా వూడుస్తున్నట్టులేదు.
గదికి నాలుగు అడుగులు ఎత్తులో కిటికీ వుంది. అందులోంచి బయటకు చూశాడు. తనని బంధించిన గార్డు ఇంకొక గార్డుతో మాట్లాడుతున్నాడు.
"అయితే పరుగెత్తుకు వెళ్ళాడా?"
"అవును"
"అంత వేగంగా అడవిలో పరుగెత్తుకు వెళ్ళాల్సిన అవసరం ఏముందబ్బా?"



