Home » Yandamuri veerendranath » Rakshasudu


    తన పడవగురించి, తన ఆలోచనలని పొగిడి, చివరికి ఆమె ఇలా చేస్తుందని భావించలేదు. కేవలం తన కోర్కె తీర్చలేదన్న కక్షతో ఇలా చేసిందా? అలా కక్ష తీర్చుకోవాలనుకుంటే పడవ సంగతే వెల్లడించవచ్చుగా. అప్పుడు గార్డులు తన శరీరాన్ని... ఆపైన ఊహించలేకపోయాడు.

 

    రాత్రి తొమ్మిది దాటింది. అందరూ పడకకి ఆయత్తమవుతున్నారు. 'హై కమాండ్' కుటుంబంతో సహా వెళ్ళిపోవటంవల్ల రిలాక్స్ డ్ గా వున్నారు. బాధపడుతున్నది ముగ్గురే. అర్థరాత్రి కూడా మరోమారు చెక్ చెయ్యాలన్న వినియమం వచ్చిన సంగతి రాజన్, సింహంలకి తెలిసింది. తమ అదృష్టం శాశ్వతంగా సీల్ చేయబడిన సంగతి వారు గ్రహించారు.

 

    అతడు మూలగా వున్న తన పక్క దగ్గరకి వెళ్ళిదాన్ని పరిచి పైన పడుకోబోయాడు.

 

    తల దగ్గిర గురుగ్గా తగిలింది! తడిమిచూస్తే కాగితం!!

 

    అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. తీయబోతూ వుండగా ఖైదీల్ని లెక్కించటానికి గార్డు వచ్చాడు. ఆ తతంగం అరగంటసేపు జరిగింది. ఆ అరగంటా అమితమైన టెన్షన్ అనుభవించాడు. ఏముంది ఆ కాగితంలో?

 

    గార్డు అటెండెన్స్ వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే నిగ్గర్ లు పక్కన మారి ఓ మూలగా చేరారు. వారిని గమనించనట్టు మిగతావారు కళ్ళు మూసుకున్నారు.

 

    పాము వస్తే పారద్రోలటం కోసం ప్రతి టెంట్ లోనూ ఒక హరికేన్ లాంతరు వుంచుతారు. అతడు దాని దగ్గిరకి పరుగెత్తి, వణికే వేళ్ళతో ఆ కాగితాన్ని విప్పి చదివాడు. ఎన్నో వాక్యాలు లేవు. కొన్నే వున్నాయి. కానీ గమ్మత్తుగా వున్నాయి.

 

    'తెలివితేటలు ఎక్కడున్నా నేను గౌరవిస్తాను. ఈ ఏడు ముక్కల 'ఈ'తో నువ్వు బయటపడితే, బయట ప్రపంచంలో కలుసుకుందాం. ఎప్పుడో .. ఎక్కడో ..."

 

    అంతే వుంది. ఆ క్రింద ఏడు బొమ్మలు వేసి వున్నాయి. అంతే ... అతడు ఆ కాగితంవైపు తదేకంగా చూశాడు. ఆ కాగితాల మీద పెన్సిల్ తో కొన్ని బొమ్మలు వేసివున్నాయి.


           

    ముందతని మనసు ఆమెపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. టెంట్ కి వచ్చి ఖైదీల స్థలాన్ని పరీక్షించటం ఒక నెపం మాత్రమే. కేవలం తనకి ఈ కాగితం అందజెయ్యటం కోసమే ఆమె వచ్చింది.

 

    ఆమె ధైర్యానికి, తెలివితేటలకి ఆశ్చర్యపోయాడు. ఆమె రావాలనుకుంటే ఎలాగో ఒకలా తనని కలుసుకునో, పిలిపించో ఈ ఉత్తరం రహస్యంగా అందజెయ్యవచ్చు.

 

    కానీ, అలా చేయకుండా ధైర్యముగా గార్డుల మధ్యకొచ్చి, తన పక్కేదో (వాళ్ళకి అనుమానం రాకుండా) తెలుసుకుని, అందులో ఉత్తరం పెట్టింది.

 

    అంత తెలివితేటలు తనకి వుండాలని ఆమె అనుకోవడంలో తప్పులేదు.

 

    ఇప్పుడు తనే ఆలోచించాలి ఇక.

 

    ఈ ఏడు ముక్కల 'ఈ'తో నువ్వు బయటపడితే-

 

    ముక్కలు లెక్క పెట్టాడు. నాలుగే వున్నాయి. కానీ మూడో ముక్కలో నాలుగు భాగాలున్నాయి. వాటిని నాలుగుగా కత్తిరించాడు. మొత్తం ఏడు ముక్కలయినాయి. తరువాత?

 

    ముక్కల 'ఈ'తో-

 

    "ముక్కలతో" అనకుండా ముక్కల 'ఈ'తో అని ఎందుకంది.

 

    అతడి తల ఆలోచనలతో పగిలిపోసాగింది.

 

    తన అదృష్టం ఈ ఏడు ముక్కల మీద ఆధారపడి వుందా?

 

    ఈ.

    E.

 

    కాగితం వెనక్కి తిప్పి చూశాడు. వెనుక రకరకాల బొమ్మలున్నాయి. అకస్మాత్తుగా స్ఫురించింది అది.

 

    ఆ తరువాత ఈ ముక్కల్ని ఆ ఆకారంలో అమర్చటానికి అతడు చాలా కష్టపడ్డాడు. మామూలు మనుష్యులకి అయితే పది నిముషాల్లో వస్తుంది. కానీ అతడికి అంత భాషా పరిజ్ఞానం లేదు. హోటల్లో - సీనియర్ నేర్పిన ఇంగ్లీషు అక్షరాలు కాస్త జ్ఞాపకం వున్నాయంతే. అదీగాక 'ఈ' అంటే ఆ ఇంగ్లీషు అక్షరమే అవునో కాదో అతడికి నమ్మకం లేదు. అయినా అతడు పట్టు వదలలేదు.

 

    దాదాపు గంట పట్టింది అక్షరం తయారవడానికి. చివరికి తయారయింది.

 

    అప్పుడు ఆ 'E' ని వెనక్కి తిప్పి చూసాడు. ప్లాను యధాతథంగా అచ్చుగుద్దినట్టు సరిపోయింది. కానీ దానివల్ల ఏం తెలుస్తుంది?

 

    అతడికి దాదాపు ఆ ప్రదేశం అంతా తెలుసు.


           

    
    క్రింద వున్నవి తమ టెంట్లు. అది అర్థమవుతూనే వుంది. దూరంగా నది వుంది. అది తనకి ముందే తెలుసు. మొదటి రెండు పోస్టింగులూ తనకి తెలుసు. మూడో గార్డు సంగతి తెలీదు. (అంత దూరం వెళ్ళే అవసరం తనకి ఎప్పుడూ కలగలేదు.)

 

    అంతలో అతడి దృష్టి నక్షత్రం మీద పడింది. ఏమిటది?

 

    అతడు దాన్నే చాలాసేపు పరిశీలించి చూశాడు. అర్థం కాలేదు. ఉత్సుకత ఆగలేదు.

 

    చాలావరకు సాధించాడు. కానీ ఏం సాధించాడో తెలీదు. ఆ భావం అతడిని నిద్రపోనివ్వలేదు. క్షణక్షణానికీ అదేమిటో కనుక్కోవాలనే కోర్కె పెరగసాగింది.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More