Home » Yandamuri veerendranath » Prarthana
ఈ విషయం రహస్యం అర్థంకాక సైంటిస్టులు దాదాపు నలభై సంవత్సరాలు బుర్రలు బద్దలు కొట్టుకున్నాయి. ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసినవాడు 'కెకులే' అన్న శాస్త్రజ్ఞుడు.
బెంజిన్ అణువులో ఏరకంగానయినా ఆరు ఉదజని, ఆరు కార్బన్ పరమాణువుల్నీ పట్టి బంధించి వుంచటం కష్టమని ఆపాటికే తేలిపోయింది. 1865లో ఒక రోజు కెకులే సిటీబస్ లో వెళుతూ యధాలాపముగా కిటికీలోంచి వీధి కిరువైపులా వున్న ఇళ్ళనీ, బాల్కనీ ఆర్చిలనీ చూడసాగేడు. బస్ ముందుకు వెళుతూంటే రకరకాల భంగిమల్లో ఆర్చీలు వెనక్కి వెళుతున్నాయి. ఆ తర్వాత బస్ లోనే కొద్దిసేపటికి అతడు నిద్రలోకి జోగసాగాడు. ఆ మగతనిద్రలో కార్బన్ పరమాణువులు అతడి కళ్ళముందు గుండ్రంగా నృత్యం చేయసాగాయి.
అప్పటివరకూ వేధిస్తున్న ప్రశ్నకి అతడికి అకస్మాత్తుగా సమాధానం దొరికింది- బెంజిన్ అణువులో పరమాణువుల అమరిక ఉంగరం ఆకారంలో ఆర్చీలా వుండి వుండవచ్చునని-
ఆ విధంగా బెంజిన్ రింగ్ రహస్యం బయటపడింది. ఈ చిన్న మెలిక విడివడటంతో పరిశోధనలు తిరిగి పుంజుకున్నాయి.
ప్రస్తుతం భార్గవ పరిస్థితి కూడా అలానే వుంది. అతను లాజికల్ గ- ఒక్కో విషయమే వేరుచేసుకుంటూ ఒకదానికొకటి సమన్వయ పర్చుకుంటూ ఆలోచిస్తున్నాడు. 1. మామూలు జీవకణానికీ కేన్సర్ కణానికీ తేడా ఇంతవరకూ ఎవరికీ తెలీదు. 2. ప్రయోగశాలలో ఇంతవరకూ మొట్టమొదటి జీవకణం కృత్రిమంగా తయారవకపోవటానికి కారణం- దానికి కావల్సిన పరిస్థితులలో 'ఏదో ఒకటి' లేకపోవటం. 3. హుంజాజాతి కోయలకి కేన్సర్ రాదు. ఇప్పటికీ రావటంలేదు. దానికి కారణం వాళ్ళ శరీరాలు ఇమ్యూన్ అయిపోవటం- అంటే వాళ్ళ పూర్వీకుల 'జీన్' లోనే ఈ ప్రత్యేకత వుండి వుండటం. 4. శత్రువుల తలలు కుదించుకుపోవటానికి కారణం మూలికల రసాయనం కాదు అని ముందే పాత్రో పరిశీలించి చూసేడు. 5. నృత్యం చేస్తూ చేస్తూ కోయలు స్పృహతప్పి పడిపోవటానికి కారణం పొదల మీదనుంచి వచ్చే పొగే అయివుంటుందనీ, ఆ వాయువూ, సామ్సన్ కంపెనీనుంచి వచ్చే విషవాయువూ కార్సినోజిన్ సంతతికి సంబంధించిన వాయువులేనని అనుకుంటే కేన్సర్ ని కలిగించే ఆ కార్సినోజిన్నే చచ్చిపోయిన మనిషి కుదించుకుపోయేలా చేస్తున్నదన్నమాట. కానీ శత్రువుల తలలన్నీ కత్తిరించగానే అవి నిర్జీవమైపోతాయి కదా. అటువంటప్పుడు కుదించుకుపోవటం ఎలా సాధ్యం అవుతుంది? అందులోనూ ఎముకలతో సహా?
నిర్జీవాకృతిలో సజీవకణ సృష్టి జరుగుతుందా? జరిగిందీ అంటే- అంటే- కోయవాళ్ళు తలల్ని వేసే మూలికల రసాయనం, అది వాళ్ళు తమకు తెలియకుండానే తయారుచేసే అమినో ఆసిడ్స్ మిశ్రమం అన్నమాట. ఈ లాజిక్ నిజమయితే అమినో ఆసిడ్స్ మీదుగా, కార్సినోజిన్ ని పంపిస్తే జీవకణం (అఫ్ కోర్స్ కేన్సర్ కణం) సృష్టింపబడాలి.
'యురేకా' అని అరుచుకుంటూ నీళ్ళగదిలోంచి బయటకు పరుగెత్తిన ఆర్కెమెడీస్ లా అతడు అరవలేదు. నడుస్తున్న బస్సులోంచి 'నేను కనుక్కున్నాను' అని ఎగిరి క్రిందకు గంతేసిన కెకులేలా అతడు గెంతలేదు. 'హారతి తీసుకోబాబూ' అన్న పూజారి మాటలకి నెమ్మదిగా కళ్ళు విప్పాడు. క్షణంలో ఎన్ని ఆలోచనలు?
తన తర్కంలో ఇంకా కొన్ని అర్థంకాని పాయింట్లున్నాయి. ప్రయోగంచేసి చూస్తేకాని తెలీదు.
చెయ్యాలా?
అతడు చుట్టూ చూసేడు.
జనం.
కుక్కని తరిమినట్టూ తనను తరిమిన జనం! రాళ్ళతోకొట్టి చెప్పులు విసిరిన జనం!! ఏమీ తెలియనితనం, అన్నీ తెలుసుననే అహంభావంతో వున్న జనం! సోక్రటీసుకు విషమిచ్చిన జనం! భూమి గుండ్రముగా వున్నదన్నందుకు ప్రాణాలు తీసిన జన్మ! ఈ జనం కోసమా తను కష్టపడవలసింది? ఈ జనం కోసమా సర్వం కోల్పోయిన తను తిరిగి సర్వశక్తులూ కేంద్రీకరించుకోవలసింది?
"హారతి తీసుకో నాయనా?"
అతడు పళ్ళెములో వెలుగుతున్న మంటవేపు చూసేడు.
చుట్టూ నీలమూ, మధ్యలో ఎర్రటి మంట. మనిషి మనస్సులో అలజడిని జోకొడుతున్న శాంతిలాగా- మంట అతడి ఆలోచనల సరళిని మార్చింది.
మనుష్యుల తప్పేంలేదు. ప్రతి మనిషికీ తిండీ, బట్టా, ఆరోగ్యమూ సమకూర్చగలిగితే తనపై తనకి విశ్వాసం పెరిగి దేముడిపై ఆధారపడటము తగ్గుతుంది. అది చెయ్యకుండా విగ్రహం బ్రద్దలుకొడితే మరోవిగ్రహం వెలుస్తుంది. కావల్సింది కన్ స్ట్రక్షన్.
అతడి చేతులు మంటమీద పెట్టి కళ్ళకద్దుకున్నాడు. అతడికి దేవుడిమీద నమ్మకంలేదు. నమ్మకం లేదనడానికన్నా దేవుడి అవసరం పడుతూ వుంటుంది. అయితే హారతి తీసుకుంటూ వుండగా అతడి మనసంతా అనూహ్యమైన నిర్మలత్వంతో ఒక విధమైన సంతృప్తికి గురయ్యింది. అదే సంతృప్తి మరో సరికొత్త ఆలోచనకి పునాది అయింది.
ప్రపంచ చరిత్రలో మానవ కళ్యాణం కోసం పాటుపడిన మహనీయులంతా ఈ జనం తమని ఆదరిస్తారా లేదా అన్న ఆలోచనతో తమ కృషి కొనసాగించలేదు. ఆ మాటకొస్తే జనం వాళ్ళని తనకన్నా ఎక్కువగా బాధలుపెట్టారు. అయినా ఆ మహనీయులంతా ఒక అకుంఠిత దీక్షతో తమ గమ్యంవేపు సాగిపోయారు. జనం అజ్ఞానాన్ని చిరునవ్వుతోనూ, జనం కోపాన్ని ఆప్యాయతతోనూ ఆదరించి సహించారు. కొవ్వొత్తిలాగా లోకానికి వెలుగునిచ్చి, తాము కరిగిపోయారు. చరిత్రలో ఒక గొప్ప మలుపుకి కారణభూతులయ్యారు. వాళ్ళ జీవితమంతా కష్టభూయిష్టమే అయింది.
వాళ్ళ కష్టాలతో పోల్చుకుంటే తనదేపాటిది?
అప్రయత్నంగా అతడి పెదవులమీద చిరునవ్వు వెలిగింది. తిరిగి విగ్రహంవైపు చూసేడు. ఒక కుందెలో మంట అశుభసూచకంగా ఆరిపోయి వుంది. అయితేనేం మరో కుందెలో వెలుగు భాస్వంతమై దేదీప్యమానంగా వుంది. ఆ భాస్వంతము భాసంతమై- భావమే భ్రాజితమై- భవ్యమే భావికమై- భవిష్యమైనట్టు తోచింది.
అతడు అక్కణ్నుంచి కదిలిపోయాడు.
చేయవలసినది చాలా వుంది. ముఖ్యంగా తను ఆలోచించిన దానిలో కొన్ని లొసుగులున్నాయి. తలలు చిన్నవి అవటానికి కారణం డీ-హైడ్రేషన్ అయి వుండకూడదు. ఎముకలు ఎలా చిన్నవి అవటానికి కారణం డీ- హైడ్రేషన్ అయి వుండకూడదు. ఎముకలు ఎలా చిన్నవి అవుతాయో లాజిక్ కి దొరకటంలేదు. ఎమినో ఆసిడ్స్ సాధారణ ప్రకృతిలో ఎలా మనగలిగాయో అర్థంకావటంలేదు. ఇవన్నీ చూడాలంటే ఒక పరిశోధనశాల కావాలి. కొన్నిరోజులు టైమ్ కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా- ఒక కేన్సర్ పేషెంట్ కావాలి.
4
ఆ రోజు ఆస్పత్రి మామూలుకన్నా ఎక్కువ రష్ గా వుంది. తెలిసినవాళ్ళు ఎవరూ తనను గుర్తుపట్టటానికి వీలులేకుండా మొహం కాస్త చాటు చేసుకుని లోపలికి ప్రవేశించాడు భార్గవ.



