Home » Yandamuri veerendranath » Prarthana


    "నీకు వెంటనే నిర్ణయం చెప్పటం కష్టమైతే ఓ నాల్గు అయిదు గంటలు టైమ్ తీసుకో. నీకు ఇష్టం లేకపోతే నా సెక్రటరీగానే వుండవచ్చు. దానికి నాకు అభ్యంతరంలేదు. కానీ ఏ విషయమూ మాత్రం నాకు ఈ సాయంత్రంలోగా తెలియాలి. ఎందుకంటే నేను ఈ రాత్రికే నేననుకున్నది అమలుజరప దల్చుకున్నాను... ఇంతకాలం ఆగింది నా ఒంట్లో ఈ మాత్రం సత్తువరావటం కోసమే. ఇక ఆలస్యం జరగటానికి వీలులేదు. చెప్పు... రాకపోతే నేను వంటరిగా అన్ని పనులూ చేసుకోవాలి. కాబట్టి- సాయంత్రం వరకూ టైమ్ తీసుకో..."

 

                                              3

 

    "గోవిందా... గోవిందా" అని తనలో తనే గొణుక్కుంటూ ముందుకు సాగిపోతున్నాడో వృద్ధుడు. అతడి వెనకాలే భార్గవ వున్నాడు. భార్గవ వెనుక పొడవాటి క్యూ వుంది.

 

    కొండమీద గుడి అవటంవల్ల గాలి బలంగా వీస్తూంది. అయినా జనం కిక్కిరిసి వుండటంవల్ల కాస్త ఉక్కగానే ఉంది. సాయంత్రపు లేయండ పాలరాతిమీదపడి ప్రతిబింబిస్తూ వుంది. బైటనుండి ప్రారంభమయిన 'క్యూ' చాలాదూరం అలాగే సాగి గుడి అంతర్భాగంలోకి ప్రవేశిస్తూంది. కొంతమంది చేతులు ముడుచుకుని వున్నారు. కొందరు కళ్ళు మూసుకుని భక్తిగీతాన్ని మనసులోనే గొణుక్కుంటున్నారు. మరికొంతమంది సినిమా క్యూలో నిలబడ్డట్టూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. రకరకాల వ్యక్తులు...

 

    ఎందుకో తెలీదు. అకారణంగా, హఠాత్తుగా అతడికి వసుమతి గుర్తు వచ్చింది. తననుంచి తన ప్రార్థనని చట్టరీత్యా వేరుచేసిన వసుమతి, ఆమెతోపాటూ కూతురి జ్ఞాపకాలు కూడా. ఆస్పత్రినుంచి వెళ్ళగొట్టబడ్డాక ప్రొద్దున్నించీ తనేమో చెట్టులూ, పుట్టలూ పట్టుకు తిరుగుతున్నాడు. అక్కడ తన కూతురు ఇప్పుడు ఎలా వుండి వుంటుంది? మరణించి వుంటుందా? ఇంటికి తీసుకొచ్చి వుంటారా? ఇంటికి తీసుకొచ్చేస్తే తనకోసం ఆగుతారా? చీకటి పడిపోతుందని శ్మశానానికి తీసుకువెళ్ళి వుంటారా? అసలు తనకోసం చూసి వుంటారా? చట్టరీత్యా విడిపోయిన వాడికోసం చూసేదేమిటని అనుకోని వుంటారా? వెనుకనుంచి ఎవరో 'కాస్త కదులుబాబూ' అని అనటంతో అతడు ఉలిక్కిపడ్డాడు. ముందు మనుష్యులు విగ్రహం ముందు అడ్డంగా కట్టిన గొలుసుల దగ్గరికి చేరుకుని వరుసగా నిలబడ్డారు. అతడు వెళ్ళి ముందు అనుకున్నట్టే కుడివైపు చివర నిలబడి సర్దుకుంటూ 'ఇదేమిటి నా కూతురి గురించి నేను ఇంత నిర్వేదంగా ఆలోచిస్తున్నాను' అనుకున్నాడు. ఒళ్ళు జలదరించింది. పందెం పేరుతో తననో మూర్ఖుణ్ణి చేసిన దేముడు ఎదురుగా వున్నాడు. అ దేముణ్ణి కొలిచే భక్తులు చుట్టూ వున్నారు. ఈ జనమే తను కనుక్కున్న సత్యాన్ని నిండు సభలో వెల్లడిస్తే తనో మూర్ఖుడనుకొని మీదకు చెప్పులు విసిరారు.   

 

    తనని ఇంత హీన స్థితికి దిగజార్చిన ఈ దేముడి మీదా, ఈ జనం మీదా పగ తీర్చుకునే సమయం ఆసన్నమైంది.

 

    అతడు అప్పటివరకూ దాచిన ఎక్స్ ప్లోజివ్ ని బయటకు తీసేడు. పూజారి ఒక్కొక్కరి దగ్గిరకూ హారతి పళ్ళెంతో వస్తున్నాడు. ఒక్కొక్కరు దగ్గిరకు వంగి కళ్ళు మూసుకుని హారతి కళ్ళకద్దుకుంటూంటే, వారి వూపిరికి పళ్ళెంలో మంట మినుక్కు మినుక్కుమంటూ ఆరిపోవటానికి సిద్ధమవుతూంది. పూజారి హారతి ఇవ్వటానికి తన ముందుకు వచ్చినప్పుడే సరియైన సమయం!!! విసిరెయ్యటానికి అదే అనువైనది. తన ముందు పూజారి వుంటాడు. దూరంగా- లోపల విస్ఫోటనం జరిగిన ప్రాణహాని వుండదు ఎవరికీ.

 

    ఇద్దరి మనుష్యుల అవతల వున్నాడు పూజారి.

 

    ఎక్స్ ప్లోజివ్ పేలాలంటే ఏం చెయ్యాలో చెప్పాడు పాత్రో... సీల్ తీసెయ్యాలి. భార్గవ కుడిచేత్తో దానిని పట్టుకున్నాడు.

 

    పూజారి పక్క మనిషి దగ్గిరకు వచ్చాడు.

 

    అతడి వూపిరికి పళ్ళెంలో మంట మళ్ళీ ఒకసారి కాస్త సన్నదైంది. అతడు దగ్గిరకొస్తూంటే భార్గవలో టెన్షన్ ఎక్కువయింది. తలతిప్పి విగ్రహంవైపు చూసేడు. విగ్రహానికి చెరోవైపునా వున్న కుందుల మీద అతడి దృష్టి పడింది. ఎడమకుంది నుంచి వచ్చే పొగకి, కుడివైపు కుందిలో దీపం రెపరెపలాడి మళ్ళీ ఉజ్వలత్వాన్ని సంతరించుకుంది. పూజారి భార్గవ ముందుకు వచ్చాడు. భార్గవ అతడివైపు చూడటంలేదు. విగ్రహంవైపే చూస్తున్నాడు. దూరంగా వున్న మనుష్యుల కదలికకి ఒక దీపపు పొగ దీపంమీదకు వెళుతూంది. హారతి పళ్ళెంలో జరుగుతున్నది కూడా అదే.

 

    ... సడెన్ గా భార్గవకి ఏదో స్ట్రయిక్ అయింది.

 

    ఉజ్వలంగా వెలుగుతూన్న దీపం క్షణకాలం క్షీణ మవటానికి కారణం- పక్కనుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ అయితే, ఆరోగ్యంగా పనిచేసుకుంటున్న మనిషి ఫ్యాక్టరీలో మాస్క్ వేసుకోకపోతే స్పృహ తప్పి పడిపోవటానికి కారణం మెధైల్ కోరిన్ ధెరీన్!   

 

    నృత్యం చేస్తున్న కోయలు ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవటానికి కారణం కూడా విప్పసారాకాదు. పొదలు కాల్చటంవల్ల వచ్చే పొగ- కార్సినోజిన్!!! మూలికలు రసాయనంలో వేసిన శత్రువుల తలలు చిన్నవి అవటానికి కారణం కూడా ఆ రసాయనం కాదు, కార్సినోజిన్నే-

 

    అతడు కళ్ళు మూసుకున్నాడు. చూసేవాడికి, అతను ముందు వెలుగుతున్న హారతిని చూసి భక్తిభావంతో కళ్ళు మూసుకున్నాడనిపిస్తుంది. కానీ, అతడు క్షణమాత్రపు కాలంలోనే సర్వశక్తులూ కేంద్రీకరించి, తనకు వచ్చిన ఊహకు లాజిక్ ఏదయినా వుందా- లేక అది నిరర్ధకమైనదా- ని ఆలోచిస్తున్నాడు. ఉజ్వలంగా వెల్గుతున్న మంటని క్షీణపరిచేది పొగ- జీవనాకృతితో సహజంగా జరిగే మైటాసిస్ ని ఆటంకపరిచేదీ కార్సినోజిన్నేనా?

 

    సైన్స్ చరిత్రలో గొప్ప గొప్ప సత్యాలన్నీ సైంటిస్టుల చిన్న చిన్న అనుభవాలవల్లే బయటపడినయ్. మామూలు మనిషి మామూలుగా చూసి వదిలేసిన విషయాన్ని సైంటిస్టు తర్కంగా ఆలోచిస్తాడు. చలనసూత్రాలూ, గురుత్వాకర్షణ శక్తి, ఎక్స్ రే థియరీ ఇలాగే కనుక్కోబడ్డాయి. ఇంతకన్నా చిత్రమైన ఉదాహరణ బెంజిన్. బెంజిన్ లో ఆరు ఉదజని పరమాణువులూ, ఆరు కార్బన్ పరమాణువులూ వుంటాయని మొట్టమొదటిసారి కనుక్కోబడి నప్పుడు సైంటిస్టులందరికీ మతిపోయింది. ఎందుకంటే ఆరు కార్బన్ పరమాణువులు తమతోపాటూ పధ్నాలుగు ఉదజని పరమాణువుల్ని బంధించి వుంచుతాయి. (సి. 6 హెచ్. 14) కానీ అప్పుడది హెక్సిన్ అనే పదార్ధం అవుతుంది. కానీ బెంజిన్ అవదు. మరి ప్రకృతిలో బెంజిన్ ఎలా తయారవగలదు? ఒకవేళ అది CH-C-CH-CH-CH2 స్ట్రక్చర్ లో వుంటుందనుకుంటే, అదే స్ట్రక్చరులో ఇంకేవో పదార్థాలు తయారవుతున్నాయి. కానీ బెంజిన్ అవటంలేదు.
           

 


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More