Home » Yandamuri veerendranath » Rakshasudu
"అయితే నువ్వేనన్నమాట- అర్థరాత్రి కూడా అడవిలో జంతువుల మధ్య సంచరించేవాడివి.... గుడ్. నీ గురించి మా వాళ్ళు చాలా చెప్పారు. నాకు టైమ్ వేస్ట్ చేయటం ఇష్టం లేదు. అసలు విషయానికి సూటిగా వస్తాను" అంటూ ఆగాడు.
అతడేం చెపుతాడా అని వూపిరి బిగపట్టాడు.
"ఈ అరణ్యానికి అవతలవైపు ఇలాటి స్థలమే కొంత చూశాను. అక్కడ కూడా తోట వెయ్యాలనివుంది. దానికి నీలా ధైర్యంగల గార్డులు కొంతమంది కావాలి. రేపు నాతో కూడా ప్రయాణమవ్వు".
అతడు చప్పున కళ్ళు మూసుకున్నాడు. కలలో కూడా వూహించని అవకాశం.
గా... ర్డ్...
ఇంతకన్నా శుభ్రమైన జీవితం. శుభ్రమైన తిండి- కాసింత స్వేచ్చ....
మొదట్లో తన మీద కొంతకాలం నిఘా వుంటుంది. తరువాత వుండకపోవచ్చు. తప్పించుకునే అవకాశం కూడా దొరకవచ్చు.
కానీ... కానీ... తనని నమ్ముకున్న రాజన్... సింహం... ఉహూ- తను వాళ్ళని వదిలి వెళ్ళలేడు. కావాలంటే వాళ్ళతోపాటే వేట కుక్కల బారినైనా పడతాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్. కొంతకాలం అడవి చదును చెయ్యాలి. జంతువుల గురించి తెలిసినవాడు కావాలి".
అతడికి చప్పున అర్థమైంది! గార్డు అని ఆశ పెట్టి తీసుకువెళ్తున్నది ఆ ప్రదేశంలో వున్న మృగాల్ని ముందు హతమార్చటానికి! తరువాత తననీ హతమారుస్తారు... 'గార్డు' అన్నది వంక ... అంతే ... తను మరింత ఉత్సాహంతో పనిచేస్తాడని ... లేకపోతే ఒక బానిసకి గార్డు అవకాశం ఇచ్చి రైఫిల్ చేతికి ఎందుకిస్తారు?
"ఏమిటి - కళ్ళు మూసుకుని మీనమేషాలు లెక్క వేస్తున్నావు?"
అతడి ప్రశ్నలోంచి సమాధానం తీసుకుని "అవును. జ్యోతిష్యం లెక్కకడుతున్నాను" అన్నాడు.
"నీకు క్యోతిష్యం కూడా తెలుసా ?"
"ఏదో కొద్దిగా! మీతోపాటు రేపు రాలేను. పౌర్ణమి దాటనివ్వండి ... ప్రారంభోత్సవానికి- అప్పుడే మంచి ముహూర్తం వున్నది".
"చాలా తొందరగా లెక్కకట్టావే- ఏదీ నా గురించి కొంత చెప్పుచూద్దాం".
అవతలి వ్యక్తి ఈ విషయంలో ఇంత ఉత్సాహం చూపేసరికి అతడికి నవ్వొచ్చింది. మరికొంత ఆడుకోదలిచాడు. దూరంగా బ్రీఫ్ కేస్ మీద వున్న 'విఆర్.' అన్న అక్షరాలు తన కంటపడ్డాయని అవతలి మనిషికి తెలియకుండా వుండటం కోసం వెంటనే కళ్ళు మూసుకుని, నెమ్మదిగా అన్నాడు- "ఈ లెక్కలు కట్టడం ద్వారానే ఏ రోజు అడవికి వెళితే మంచి వేట దొరుకుతుందో చెప్పగలుగుతున్నాను. ఇకపోతే మీ గురించి అంటారా- మీ పేరులో 'ర' 'వీ' లకు సంబంధించిన అక్షరాలున్నాయని నా మనసు తెలుపుతూ వుంది. నిజమేనా?"
"నిజమే. సరిగ్గా చెప్పావే - ఇంకా చెప్పు"
"ఇంకా చెప్పాలంటే మీ జన్మస్థలము, నామము, నక్షత్రమూ చెప్పవలసి వుంటుంది".
అతడు మొదటిదీ, మూడవదీ చెప్పి - రెండవది చెప్పటానికి తటపటాయించి ఇంత అడవి మధ్య తన పేరు తెలుస్తే ఏం నష్టంలే అన్న ధైర్యంతో పేరు చెప్పాడు-
"వంకచెక్కా రామ్మూర్తి"
"ఒక వ్యక్తి మీ మీద పగపట్టి వున్నాడు. సింహం బోనులో నుంచి బయటికి వచ్చినట్టు అతడు కొద్ది రోజుల్లో బయటకువచ్చి మీ మీద పగ తీర్చుకుంటాడు. ఇంతమంది మనుష్యుల్ని మానవత్వం మరిచి బానిసలుగా చేసి హింసించినందుకు వారి తరఫు ప్రతినిధిగా నీ రక్తం కళ్ళజూస్తాడు".
చివరి వాక్యం చెప్పలేదు. మొదటి రెండే అన్నాడు. రామ్మూర్తి మొహంలో పూర్వపు కఠినత్వం వచ్చింది. "ఎవరది?" అని అడిగాడు. "తెలీదు. నా మనసుకు తోచింది చెప్పాను. పౌర్ణమినాడు నాకు కబురు పంపించండి" అంటూ అతడు సెల్యూట్ చేసి డేరా బయటకి వచ్చేశాడు.
వచ్చేస్తూ వుంటే లోపల తెరల వెనుకనుంచి, అప్పటి వరకూ అతడు ఆడిన నాటకాన్ని గ్రహించినట్టు బిగపట్టిన నవ్వు- వదిలేసిన ధ్వని. సన్నగా .... గాజుల చప్పుడు. ఆ చప్పుడు-
అతడు ఆగాడు. ఎక్కడో విన్నాడా ధ్వనిని. సగం నగ్నంగావున్న శరీరాన్ని నీళ్ళలో పట్టుకున్నప్పుడు వచ్చిన గాజుల చప్పుడు అది.
* * *
పైకి మామూలుగా ఉన్నాడు కానీ అతడి మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తూంది. వచ్చే పౌర్ణమిలోగా అక్కడ నుంచి బయటపడకపోతే మరో ప్రదేశానికి వెళ్ళకతప్పదు. ఇన్నాళ్ళ నుంచీ వేసిన ప్లాను, చేసిన పనీ వృధా అవుతాయి.
పడవ విషయం అతడిని కలవర పెడుతూంది. అంత అకస్మాత్తుగా అది ఎలా మాయమైందో అర్థం కావటం లేదు. ఒకవేళ కనబడినా, పౌర్ణమిలోగా దాన్ని రేవు వరకూ తీసుకెళ్ళటం ఎలానో తెలియటం లేదు.
అతడు వంకచెక్కా రామ్మూర్తి దగ్గర్నుంచి తన టెంట్ దగ్గిరకి వచ్చేసరికి బాగా రాత్రయింది. చెక్కలు పాతి పైన తారుపూసిన గుడ్డకప్పిన టెంట్లు అవి. ఒకోదానిలోనూ ఇరవైమంది దాకా పడుకుంటారు. 'నిగ్గర్' లు ఒక మూలకి చేరతారు. వాళ్ళెప్పుడూ రాత్రికోసం చూస్తూ వుంటారు. నిస్సారమైన జీవితంలో కాణీ ఖర్చులేనిది అదే. దాదాపు ప్రతీవాడు అక్కడ ఎంతో కొంత కాలానికి 'నిగ్గర్' గా మారతాడు. తోటివాడిని ఎన్నుకుంటాడు. ఇవిగాక అప్పుడప్పుడు పాములు కూడా వచ్చి వెచ్చగా పక్కలో దూరి పడుకుంటాయి. జెర్రుల సంగతి చెప్పక్కర్లేదు.
అతడు టెంట్ కి వచ్చి, కంచం తీసుకుని వంటశాలవైపు వెళ్ళాడు. అక్కడో పెద్ద క్యూవుంది. అయిదు నిమిషాల్లో భోజనం (లాటిది) ముగించి తిరిగి టెంట్ కి వచ్చాడు. అక్కడంతా హడావుడిగా వుంది.
అప్పుడే 'హైకమాండ్' భార్య వచ్చి ఆ టెంట్ లన్నీ చూసి వెళ్ళిందనీ, పరిస్థితులని సమీక్షించిందనీ తెలిసింది. గార్డులు ఇంకా ఆ ఆకస్మిక పరిణామం నుంచి తేరుకోలేదు.
ఒక టెంట్ లో ఒక మూల చెక్కలు ఊడి లూజ్ గా వున్నందుకు గార్డులని చివాట్లు పెట్టినట్టు కూడా తెలిసింది. వాటిల్లోంచి ఎవరైనా రాత్రి పూట తప్పించుకు పోవచ్చునన్న ఆలోచన వాళ్ళకెందుకు రాలేదని నిలదీసిందట. టెంట్ నుంచి బయటపడిన వాళ్ళెవరూ ఆ అడవిలో ఎక్కడికీ పారిపోలేరని చెప్పినా వినిపించుకోలేదట. రాత్రి పదింటికి, మళ్ళా తెల్లవారుఝామున అయిదింటికి కూలీల లెక్కింపు జరుగుతుంది. పడుకోబోయే ముందు గార్డు వచ్చి కూలీల్ని లెక్క పెడతాడు. మళ్ళీ ప్రొద్దున్నా అంతే. అర్థరాత్రి కూడా వచ్చి ఒకసారి లెక్క పెట్టమని ఆమె సూచన లిచ్చిందట.
అతడు కృంగిపోయాడు. తప్పించుకునే ఛాన్సు పూర్తిగా పోయింది. అర్థరాత్రి గార్డు లెక్కపెట్టాక బయల్దేరితే, తెల్లవారేలోపులో ఎంతో దూరం చేరుకోలేరు.



