Home » Yandamuri veerendranath » Prarthana
అతడు హతాశుడవటం ఆమెకు సంతోషాన్ని కలుగచేసింది. నవ్వాపుకుంది. "నాకో రోజు శలవు కావాలి! మళ్ళీ రేపు ఈ టైమ్ కి వస్తాను".
"ఎందుకు?"
"ఒకరోజు శలవుపెడితే కారణం అడిగేంత ఇంటరెస్టు వుందా నా మీద మీకు?"
అతడు తడబడ్డాడు. "లేదు, లేదు, వెళ్ళిరా".
ఆమె వెళ్ళిపోయింది.
అతడి ఒంటరితనం అతడికేమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. పనిచేసే ఒక్క నాసిక ఆమెమీద నుంచీ వచ్చే గాలిని ఆస్వాదించి ఒంటరితనాన్ని పోగొట్టింది! ఆ రోజంతా అతడు అసహనంగానే గడిపాడు. అయితే ఆ దిగులు ఆమె వెళ్ళిపోవటంవల్ల వచ్చిందికాదు. తన ఒంటరితనం వల్ల వచ్చింది.
మరుసటిరోజు ఆమె వస్తూ తనతోపాటూ ఓ కాగితాల కట్టని తీసుకువచ్చింది. బ్రెయిలీలో టైపు చేసివున్న దాదాపు నాలుగువందల పేజీలు అవి. అతడికి అందించింది.
రాత్రంతా నిద్ర లేనట్టూ ఆమె కళ్ళు ఎర్రగా వున్నాయి. ముఖంలో అలసట కొట్టిచ్చినట్టి వుంది. అతడు విస్మయం చెంది "ఏమిటి ఇవి" అని అడిగాడు.
"ప్రేమికులమధ్య మాటలు అవసరంలేదని, నిజమయిన ప్రేమ వున్నచోట మాటలు అక్కరలేదని తెలియచెప్పే నవల నొకదానిని నేను కొంతకాలం చదివాను. అందులో నిజం వున్నట్టూ కనబడింది. దాన్ని మీతో కూడా చదివిద్దామని..."
అతడు దిగ్భ్రాంతుడయ్యాడు. "అందుకోసం... అందుకోసం రాత్రంతా కూర్చుని అన్ని పేజీల్ని బ్రెయిలీలోకి తర్జుమాచేసి దాన్ని టైప్ చేసేవా ప్రియా?"
"నాది ఇన్ ఫాక్చుయేషన్ కాదు"
అని మాటని తిప్పికొట్టింది. దెబ్బతిన్నట్టు కనిపించాడు. కానీ అందులోనూ రవ్వంత ఆనందముంది. తర్వాత ఆమె వ్రాసినదంతా చదవటానికి అతడికి రెండు గంటలు పట్టింది. అంతసేపూ ఆమె ఆత్రంగా అతడివైపే చూస్తూ వుంది. అతడు చదవటం పూర్తి చెయ్యగానే 'ఎలా వుంది?' అని ప్రశ్నించింది.
"కథ బాగానే వుంది. పాత్రల పోషణ విషయం తీసుకుంటే..."
ఆమె రోషంగ "నేనడిగింది దానిమీద మీ అమూల్య అభిప్రాయం కాదు... మన సంగతి" అని వ్రాసింది.
అతడి మొహంలో సీరియస్ నెస్ ఇంకా అలానే వుంది. కానీ కాగితం మీద మాత్రం తాపీగా వ్రాసేడు.
"నేను ఒప్పుకుంటున్నాను".
మొదట ఓ క్షణం ఆమెకి అతడు చెపుతున్నది అర్థంకాలేదు. అవగానే చిన్నపిల్లలా గాలిలోకి గెంతులేసి హుషారుగా అరిచేసింది.
"ఏం చేస్తున్నావు నువ్వు".
"ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను".
"ఆ విషయం నాకెలా తెలుస్తుంది మరి?"
అతడి ప్రశ్నకి తనలో తాను నవ్వుకుని చేతులు వెనక్కి కట్టుకుని మూతి సున్నాలా చుట్టి, వంగి అతడి పెదవులమీద క్షణంలో వెయ్యవవంతు పాటు ముద్దు పెట్టుకుని, లేచి నిలబడింది. అ పరిమళానికి అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కానీ వెంటనే తేరుకున్నాడు.
"ప్రతీది వ్రాసి చూపించటం కుదరదు కాబట్టి ఇకనుంచి కొన్ని నిత్యావసరమైన వాటికి మనం సైగలు ఏర్పరచుకుంటే సమయాన్ని ఆదాపర్చవచ్చు"
ఈ సూచన ఆమెకి బాగా నచ్చింది. "నిజమే చెప్పండి. భోజనం కావాలంటే ఏం సైగ చేస్తారు? అలాగే దాహానికి..." అతడి బాధ్యతలు స్వీకరించటానికి సిద్ధపడుతూ అడిగింది.
"నేను చెప్పేది ఇంకా ముఖ్య నిత్యావసర వస్తువుల గురించి".
"ఇంకానా? ఇంకా ముఖ్యమైనవి ఏమిటి?"
"ఉదాహరణకి నువ్వు నాకో ముద్దు ఇవ్వాలనుకో"
"వ్హాట్"
"కుడి అరచేతిలో ఎడమచెయ్యి పిడికిలి బిగిస్తే ఎక్కడున్నాసరే దగ్గరకొచ్చి ముద్దు ఇవ్వాలి! అలాగే కుడిచేతి చూపుడువేలుమీద ఆలయ గోపురంలా అన్నాననుకో- అప్పుడే కౌగిలింతకు దగ్గిరకు రావాలి. పోతే మూడో ముఖ్యావసరం గురించి పెళ్ళయ్యాక చెప్తాను"
ఆమె ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఆఖరివాక్యం అర్థంకాలేదు. అయినా దాని గురించి పట్టించుకోకుండా "నేనిప్పుడే రవి అన్నయ్యకు ఈ విషయం గురించి చెపుతాను" అని వ్రాస్తూ లేచింది. ఆమెని శేఖరం దగ్గిర ఉద్యోగానికి పెట్టింది రవే. ప్రియ తండ్రి చచ్చిపోయాక అతడు ఆ కుటుంబానికి దగ్గిరయ్యాడు.
"ఎందుకు అంత తొందరగా చెప్పటం?"
"తెలుసుగా, రవి అన్నయ్య రచయిత! మీ జీవితంలో జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటన అతడిలో ఎంతో కుతూహలాన్ని రేపింది. దీన్నే ఓ రచన చేద్దామనుకుంటున్నాడు అతడు, ఈ ముగింపు గురించి చెప్పి వస్తాను".
"ఈ కథకి ముగింపు ఇదికాదు ప్రియా! అంతకన్నా థ్రిల్లింగ్ అయినది మరొకటి వుంది. నీ నిర్ణయం మీదే కథ సుఖాంతం అవ్వాలా మనం విడిపోవాలా అన్న నిర్ణయం ఆధారపడి వుంది. నువ్వేం చెప్పినా వింటాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవను. వివాహం జరగాలంటే దీనికి నువ్వు సిద్ధపడి తీరాలి. నాకీ సాయం చేయాలి."
ఎందుకో ఆమె మనసు కీడు శంకించింది. "ఏ సాయం?" అని అడిగింది.
"సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీ అధినేత నాయుడిని చంపటంలో సాయం..."
పక్కనే అగ్నిపర్వతం బ్రద్దలయినట్టయి ఆమె కంపించిపోయింది. అతడు మాత్రం ఏదీ పట్టనట్టు వ్రాసుకుపోతున్నాడు. "చాలా కామ్ గా అతడు- చీమలు నా చేతిని కుట్టటాన్ని చూసేడు. ఇప్పుడూ అంతే కామ్ గా అతడిని మరణం వైపుకి చీమలు తీసుకుపోవటాన్ని నేను గమనించాలి!! దానికి నువ్వు సాయపడేట్టయితే, మన ప్రేమకి నాకు అభ్యంతరంలేదు. కానీ ఈ ప్రేమకన్నా నాకు పగ ముఖ్యం. పగ. పగ. అదే నా జీవితాశయం. ఇప్పుడు చెప్పు సాయపడతావా- నన్ను వదులు కుంటావా?"
ఏమి చెపుతుంది ఆమె? వారిద్దామన్నా వినేటట్టు లేడు. ఒక దృఢనిర్ణయం అతడి మొహంలో ప్రతిబింబిస్తూ వుంది. కానీ సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టి- చదువుకుని పైకి వచ్చిన ఒక చిన్నపిల్లని పట్టుకుని 'నాతో కలసి మర్డర్ చేస్తావా, తేల్చుకో' అని అడిగితే ఆమె ఏం సమాధానం చెపుతుంది? ఒక మనిషిని చంపటం... ఆ ఆలోచనతోనే ఆమె చిగురుటాకులా వణికిపోయింది. అతడినెలా కన్విన్స్ చేయగలదు? మనసునిండా పగనిండిన వాడితో ఎలా-ఎలా సాటిమనిషిని చంపటం నేరమని నచ్చచెప్పగలదు.
ఈ ప్రేమ- మలుపుతో వివాహంవైపు కాదు, ఉరికంబంవైపు దారి తీస్తుందని ఎలా ఎలా ఒప్పించగలదు? ఇప్పటివరకూ సరదాగా వచ్చిన కథకు ఇది ముగింపు అని ఎలా చెప్పగలదు? అలా అని చెప్పి, నేను నీకు సాయపడలేను అని మాత్రం ఎలా అనగలదు? ఆమె నిశ్శబ్దాన్ని అతడు మరోలా అర్థం చేసుకున్నాడు.



