Home » Yandamuri veerendranath » Prarthana


    "అవతలి మనుష్యులు తమ మనసుల్లో భావాల్ని మాటల రూపంలోకి అనువదిస్తే, వాటిని నువ్వు చుక్కలు చుక్కలుగా కాగితంమీద పొడిస్తే తడిమి, స్పృశించి కష్టపడి అర్థంచేసుకోగలను. కానీ ఏ వెంకటస్వామి నాయుడో- ఈమని శంకరశాస్త్రో మాటలకన్నా అతీతమైన భావాల్ని తీగెలమీద రవళిస్తే ఆ కంపనాల్ని ఏ భాషలోకి అనువదించి నాకు చెప్పగలవు సెక్రటరీ?"

 

    ఆమె కళ్ళల్లోకి జివ్వున నీళ్ళు చిమ్మినయ్. ఇంతవరకూ అతడు ఎక్కడా తొణకలేదు. ఇప్పుడు- ఒక తీగె ప్రకంపనముతో అతడి మనసు తన స్థిరత్వాన్ని కోల్పోయింది.

 

    కానీ వెంటనే అతడూ ఆ విషయాన్ని తెలుసుకున్నాడు - క్షణంలో సర్దుకున్నాడు.

 

    జీవితంమీద గొప్ప కమేండ్ వున్నవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. ఎంతో కష్టపడితే తప్ప వాళ్ళ మనసు తొణకదు. తొణికినా అది క్షణమో- అరక్షణమో. తరువాత బేలతనాన్ని 'ఈగో' డామినేట్ చేస్తుంది. మళ్ళీ మెటీరియలిజం ముసుగు వేసుకుంటారు, చుట్టూ వున్నవాళ్ళు ఆ ఆత్మస్థయిర్యాన్నే అహం అనుకుంటారు.

 

    ఆమె అతడివేపు జాలిగా, ఆప్యాయంగా చూసింది. ఈ మొగవాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఎంత పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో స్థిరత్వంతో బైట ప్రవర్తించినా- కనీసం ఒక్కక్షణమైనా తనకు దగ్గిరగా వచ్చిన ఒకానొక స్త్రీ దగ్గిర ఆ బింకం వదిలేసి ఓదార్పు పొందగలిగితే... అంతటి పురుషుడూ నాజూగ్గా తన ఒడిలో ఓటమిని వప్పుకున్నందుకు ఆ స్త్రీ సామ్రాజ్యాలు గెల్చినంత సంతృప్తి పొందుతుందనీ-

 

    అదే ప్రేమనీ!

 

    ఆమె ఆ ఆలోచనల్లో వుండగా, ఆ మౌనాన్ని మరోలా అతడు అర్థం చేసుకున్నాడు. తన మూడ్ వల్ల ఆ చిన్న అమ్మాయి మనసు నొప్పించటం ఇష్టంలేకపోయింది. తనకా హక్కు లేదుకూడా. తన మనసులో భావాలు తనలోనే ఇంకిపోవాలి. పైకి చాలా రఫ్, మోటుగా కనబడాలి.

 

    మాట మారుస్తూ "ఇక నువ్వు వెళ్ళిరా, రేప్రొద్దున రా. చాలా పనివుంది చెయ్యవలసింది" అని వ్రాసేడు.

 

    ఆమె లేచింది.

 

    ఒక కాగితం తీసుకుని దానిమీద ఎనిమిది అక్షరాలు వ్రాసి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది.

 

    ఆమె వెళ్ళిన కొంచెం సేపటికి అతడూ లేచి లోపలికివెళ్తూ, బల్లమీద కాగితాలు సర్దేడు. చేతికి కాగితం తగిలింది. చూపుడు వేలుతో అక్షరాల్ని తడిమి చూసేడు.


                   


    అర్థంకాలేదు. మళ్ళీ తడిమాడు, అర్థంకాలేదు.

 

    ఈసారి కాగితాన్ని తిప్పి చదివాడు.

 

    అతడి మొహంలో విస్మయంతో కూడిన ఒక అనూహ్యమైన భావం కదలాడింది.

 

                                         *    *    *

 

    "ఇది.... ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రియా?" అని మాట్లాడలేదు. దాదాపు అరగంటనుంచి ఈ వాగ్వివాదం కొనసాగుతూనే వుంది. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. ఆమె మరుసటిరోజు రాగానే ఈ టాపిక్ మొదలుపెట్టాడు.

 

    "అయినా నా గురించి ఏమీ తెలియకుండానే రెండ్రోజుల్లో ప్రేమేమిటి?"

 

    "సంవత్సరంపాటూ సినిమాలకీ, హోటళ్ళకీ తిరిగి ప్రేమించేశామనుకున్న అమ్మాయిలకన్నా నేను ఎక్కువే మీ గురించి తెలుసుకున్నాననుకుంటున్నాను".

 

    "కానీ నీ వయసేమిటి- నా వయసేమిటి?"

 

    "ప్రేమకి వయసుతో నిమిత్తం లేదంటే అది మళ్ళీ ఇంకో సినిమా డైలాగ్ అవుతుంది?"

 

    అతడు విసుగ్గా వ్రాసేడు. "నా పూర్వజీవితం గురించి నీకు తెలీదు. నా భవిష్యత్తు ఎలా వుంటుందో నీకు తెలీదు. అసలు నా గురించి నీకు ఏమి తెలుసని? నీ వయసులో ఇవన్నీ థ్రిల్లింగ్ గా వుంటాయి. ఇదంతా ఇన్ ఫాక్చుయేషన్, అంతే అనుభవంలోకి రావటం మొదలు పెట్టాక ఇలాటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా చింతిస్తావు...?"

 

    అతడెంత స్థిరంగా తన అభిప్రాయాలు వ్రాసేడో, ఆమెకూడా అంత స్థిరంగా తన నిర్ణయాన్ని వ్రాసింది. "మనిషి అసలు స్వరూపం అతను కష్టాల్లో వున్నప్పుడే బయటపడుతుందంటారు. మీకు వచ్చిన కష్టం మామూలు మనుషులు కలలో కూడా వూహించుకోలేనంతగా ఘోరమయినది. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరేమీ తొణక్కుండా కామ్ గా మీ పని మీరు చేసుకుపోవటం... అదిగో నాకు నచ్చింది. మీరన్నారే ఇన్ ఫాక్చుయేషన్ అని.... హంకీ పాంకిలో కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ కొత్తగా రిలీజయిన పిక్చర్ లోని డిస్కోడాన్స్ గురించి డిస్కస్ చేస్తూ "హాయ్ మై లవ్" అని అరిచే అరుపు కాదండి నాది! మన పరిచయం చాలా కొద్దిరోజులదే. కానీ కొద్ది రోజుల్లోనూ, అనుక్షణమూ మిమ్మల్ని గమనిస్తూ వచ్చాను. ఐ హావ్ బీన్ వాచింగ్ యు ది మూమెంట్ ఐ కేమ్ టు యూ! నేను చిన్నపిల్లనే- కాదన్ను- కానీ చాలామంది "పెద్ద" పిల్లల కంటే మానసికంగా మెచ్యూర్ అయ్యాను. ప్రతీ అమ్మాయి అలానే అనుకుంటుందని మీరంటే నేనేమీ చెప్పలేను. కానీ, చిన్నప్పట్నుంచీ కష్టాల్లో పెరుగుతూ రావటం వల్లనేమో ఒక తోడుకోసం ఎన్నో అలసిపోయిన సాయంత్రాలు అర్రులు సాచేను. గుడ్డివాడూ, కుంటివాడూ సహజీవనం సాగించినట్టూ మనం కలిసి జీవిద్దాం కాదనకండి".

 

    చదువుతూ వుంటేనే అతడి మనసంతా అదోలా అయిపోయింది. ఇంతవరకూ అతడు ఆ అమ్మాయిపట్ల అదోలాంటి కమేండ్ తో ప్రవర్తించే వాడు. స్త్రీలో ఇంతటి ఆర్థ్రత వుంటుందని ఇప్పుడే తెలిసింది. అదికాదు అతడు ఆలోచిస్తున్నది! జీవితపు వాస్తవిక-నగ్న-చేదు నిజాల గురించి. కొంచెంసేపటికి అతడో నిర్ణయానికి వచ్చాడు.

 

    "ఊహూఁ లాభంలేదు ప్రియా! ఎంత ఆలోచించినా నాకు నీ నిర్ణయం మంచిది కాదనే అనిపిస్తూంది. ప్రేమికులూ, భార్యాభర్తలూ, మనిషీ- మనిషీ- ఎంతో నాజూకు భావాల్ని, సున్నితమైన అనుభవాల్నీ పంచుకోవాలనుకుంటే మాటలు చాలా ముఖ్యం. ఏదో నువ్వు అడిగావు కదా అని ఇప్పుడు ఒప్పేసుకుంటే తర్వాతంతా నీకు ద్రోహము చేసినట్టే అవుతుంది. నీ కన్నా పెద్దవాడిగా, నీ కన్నా ఎక్కువ జీవితం చూసిన వాడిగా నేను దీనికి ఒప్పుకోను - క్షమించు."  

 

    ఆమె లేచి నిలబడింది. "ప్రేమకీ, ఆప్యాయతకీ మాటలే ముఖ్యమనీ, అవి లేని కారణంగా మన స్నేహం కొనసాగదనీ మీరంటున్నారు అంతేనా."

 

    "అవును".

 

    "నేను వెళ్ళొస్తాను. నాకు శలవు కావాలి".

 

    అతడు విస్మయం చెందాడు. "ఏమిటి? ఉద్యోగం వదిలేస్తున్నావా ప్రియా?"


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More