Home » Yandamuri veerendranath » Prarthana


    ఆమె అతడి దగ్గిర్నుంచి కాగితాన్ని అందుకుని చూసి, "ఐ ఫౌండ్ ఇట్" అంటూ అక్షరాల్ని చదివింది.

 

    భార్గవకి వెంటనే నాల్గురోజుల క్రితం తమ మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. శేఖరం చంపాలాల్ యింటికి రహస్యంగా వెళ్ళిన తరువాత తాము కలుసుకోలేదన్న విషయం కూడా జ్ఞాపకం వచ్చింది. ఈ ఉత్తరం ఎవరిచేతిలోనైనా పడితే ప్రమాదమని యిలా వ్రాసేడా అనుకున్నాడు. అదే అడిగాడు.

 

    "ఉహు, కాదు, ఆయన కళ్ళకి దెబ్బ తగిలింది. అందుకే బ్రెయిలీ నేర్చుకున్నారు".

 

    భార్గవ అదిరిపడి, "కళ్ళకి దెబ్బ తగిలిందా" అన్నాడు.

 

    "అవును. తాత్కాలికంగా అంధత్వం వచ్చింది".

 

    "గాడ్ ... అతడు ఎక్కడ... ఎక్కడ వున్నాడు?"

 

    "ఆస్పత్రిలో ... కానీ ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తారు".           

 

    అతడు ఆమె మాటలు వినిపించుకోలేదు. మెదడు నిండా హోరుమనే ఆలోచనలు. శేఖరం గుడ్డివాడయ్యాడంటే అతడు నమ్మలేకపోతున్నాడు. అసలా వూహే భయంకరంగా వుంది. మొన్న మొన్నటివరకూ నవ్వుతూ హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ యువకుడు యిప్పుడు గోడల్నీ, తలుపుల్నీ తడుముకుంటూ తిరగడం అనే దృశ్యాన్ని ఊహించుకుంటూనే వళ్ళు గగుర్పొడుస్తూంది.

 

    "అసలు ఎలా ... ఎలా ... జరిగింది యిది" తడబడుతూ అడిగాడు.

 

    "చిన్న ఆక్సిడెంట్ జరిగింది. మీరేమీ కంగారు పడకండి. ఇప్పుడాయన బాగానే వున్నారు".

 

    "వెంటనే నాకు ఎందుకు చెప్పలేదు?"

 

    "ఎవరూ! ఆయనా?"

 

    "అవును తనే."

 

    "తను ఫోన్ లో చెప్పలేడు భార్గవగారూ!"

 

    "ఎవరితోనైనా చెప్పించవచ్చుగా"

 

    "అదీ చేయలేడు. అయన నాలిక తెగిపోయింది. మాట్లాడటం కష్టం".

 

    భార్గవ గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. "ఏమిటి-" అని అరవబోయాడు. మాట రాలేదు. కళ్ళప్పగించి ఆ అమ్మాయి వైపే శిలలా చూస్తూ వుండిపోయాడు. ఆ అమ్మాయి అతడిని మాట్లాడించలేదు. ఈ షాక్ ని తట్టుకోవటానికి అతడికి కొంత సమయం పడుతుందని తెలుసు. ఆమె అంచనా నిజమయింది. అతడు తేరుకుని "పద వెళ్దాం" అన్నాడు కదులుతూ.                          


    పది నిముషాలు అయ్యేసరికి యిద్దరూ ఆస్పత్రిలో వున్నారు. శేఖరం గదిలోకి ప్రవేశిస్తూనే భార్గవ అతడి ఆకారాన్నీ, కళ్ళకి కట్టిన కట్టును చూస్తూ "మైగాడ్ ఇది ...ఇదంతా ఎలా జరిగింది?" అని అడిగాడు కంగారుగా.

 

    వెనుకనుంచి ప్రియ నెమ్మదిగా "మీరు మాట్లాడేది ఆయనకి వినిపించదు భార్గవగారూ! చెవి ఎముకలు విరిగిపోయాయి" అంది.

 

    అన్ని విషయాలు ఒక్కసారే కాకుండా, ఒక్కొక్కటే చెప్పమని వెళ్ళబోయేముందు శేఖరం ఆమెని హెచ్చరించాడు. ఒక్క బాధ్యతాయుతమయిన ఉద్యోగిగా యజమాని సూచనని అక్షరాలా అమలు జరిపిందామె.

 

                                             9

 

    మొత్తం జీవరాసు లన్నింటిలోకి అత్యంత అసమర్థమైన, బలహీనమైన ప్రాణి "మనిషి". అతడి ఆకారంతో సమానమైన ఆకారం వున్న చాలా జంతువులతో పోల్చుకుంటే బలంతో వాటి సమానవుజ్జీ కాదు. తన కన్నా చిన్న జంతువైన లేడితోగాని, పెద్ద జంతువైన జీబ్రాతోకానీ సమానంగా పరుగెత్తలేడు. గబ్బిలంలా శబ్దగ్రహణం చేయలేడు. గద్దలాగా దూరంనుంచి చూడలేడు. కప్పలాగా ఉభయచరం కాదు. పురుగులకుండే ఎడాప్టబులిటీ లేదు. చీమలా దూరంనుంచి వాసన పసిగట్టగలిగే నేర్పులేదు. అంతవరకూ ఎందుకు? ఎముకల పొందిక కూడా సరీగ్గా లేనిది ఒక్క మనిషికే. అందుకే రెండు కాళ్ళమీద నిలబడి ఎక్కువసేపు పనిచేస్తే నడుమునొప్పి వచ్చేది కనీసం మనిషికే. తన శతృవుల్ని చంపటంలో వైరస్ కున్న ప్రజ్ఞ కూడా కనీసం మనిషికి లేదు. ప్రొటోజోవా నుంచి వెర్టిబ్రేటా వరకూ ఏ ప్రాణితో పోల్చుకున్నా మనిషి అధముడే. అయినా ఈ సకల జలాచర ప్రపంచాన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుని ఏలుతున్నాడంటే దానిక్కారణం అతడి మెదడు. ఒక జంతువుకి వేగం, ఒక ప్రాణికి బలం, ఒక పక్షికి రెక్కలు, ఒక చేపకి మొప్పలు ఇచ్చిన దేవుడు, మనిషికి అతడి వంతుగా "మెదడు" ని ఇచ్చాడు. అదే చాలని నిరూపించాడు మనిషి. ఐజాక్ ఆసిమోవ్ ఇచ్చిన ఈ సిద్ధాంతం నా మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది.   

 

    మనిషికి కావల్సిన మూడు ఇంద్రియాల్నీ నేను కోల్పోయానని తెలిసిన మరుక్షణం నా ఆలోచన ఆత్మహత్యవైపు వెళ్లింది. కానీ కుదురుగా ఒక్కక్షణం ఆలోచిస్తే దానంత వెధవ ఆలోచన మరొకటి వుండదని అనిపించింది. తమ మానసిక బలహీనతల్ని అధిగమించలేని వారికి మాత్రమే ఆత్మహత్యల అవసరం కలుగుతూ వుంటుంది. అన్నీ పోయినా నాకు మెదడుంది చాలు అనుకున్నాను. ఎప్పుడో జరిగిన సంఘటన గుర్తువచ్చింది. అప్పుడే కాలేజీ చదువు పూర్తిచేసి పై చదువుల్లో అడుగుపెట్టాను.     

 

    కాలేజీలో నాతోపాటూ ఒకతను చదివేవాడు. పెద్ద తెలివైనవాడు కూడా కాదు. బొటాబొటి మార్కులతో పాసయ్యాడు. మనిషే అదోలా వుండేవాడు. రోజుల తరబడి గడ్డం పెంచేవాడు. మునిగిపోతున్న పడవని సానుభూతి చూపేవాడిలా ఈ ప్రపంచాన్నీ, మనుష్యుల్నీ పరికించేవాడు. "నేనో బ్రద్దలవబోయే అగ్నిపర్వతాన్ని...." లాటి అర్థం పర్థంలేని వాక్యాల్ని పుస్తకాల్నిండా వ్రాసుకునేవాడు. చదువు పూర్తయ్యాక రెండు మూడు సంవత్సరాల వరకూ అతడికి ఉద్యోగం రాలేదు. తనకి ఉద్యోగం రాకపోవటానికి కారణం కంపూచియా అనీ, తన చెల్లెలికి పెళ్ళి కాకపోవటానికి కారణం రష్యా సామ్రాజ్యవాదం అనీ నమ్మేవాడు. తమలాటి ఎందరో నిర్భాగ్యుల జీవితాలు మారాలంటే మొత్తం వ్యవస్థే మారాలనీ, అసలు లొసుగు అంతా ఈ వ్యవస్థలోనే వుంది అనీ అనేవాడు. 'అంతంత పెద్ద పెద్ద పదాలెందుకు- నీ వరకూ నీ వేదైనా సమాజానికి మేలు చేయరాదా' అనేవాడిని. 'ఏం చెయ్యను' అని అడిగాడు. అమ్మయ్య- ఆ మాత్రం ఆసక్తి చూపించాడు కదా అని సంతోషించి ఓ సూచన ఇచ్చాను.           

 

    మన వూరు మెయిన్ రోడ్డు మధ్యలో ఓ సమాధి వుంది. రెండు వందల సంవత్సరాల క్రితం ఎవడో అనామకుడయిన సన్యాసి శవం అది. మత సంబంధమైన గొడవ లొస్తాయని రోడ్డు మధ్యలో దాన్ని అలాగే వదిలేసింది ప్రభుత్వం. అక్కడి కొచ్చేసరికి రోడ్డు ఇరుకై ప్రతీ వాహనమూ వేగం తగ్గించాలి. అలా తగ్గించి తిరిగి వేగం పెంచటానికయ్యే ఆయిల్ ఖర్చు లీటర్ లో వందో వంతు - అంటే ఆరు పైసలు అవుతుందనుకుందాం. మెయిన్ రోడ్డు మీద సగటున రోజుకి అయిదువేల వాహనాలు వెళతాయి- అనుకుంటే, మన నేషనల్ ఇన్ కమ్ సంవత్సరానికి దాదాపు లక్షా పదివేలు ఆ రూపేణా వృధా అవుతుందన్నమాట.

 

    ఏ ప్రాముఖ్యతాలేని ఒక సమాధి గురించి ఇంత వేస్ట్ ఎందుకు? రాత్రికి వెళ్లి ఆ సమాధిని అక్కణ్నుంచి తవ్వెయ్యకూడదూ... పట్టుబడితే ప్రాణాలు పోతాయి. కానీ దేశం కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యటంలో తప్పులేదుగా... అన్నాను. అతడు వెంటనే జవాబు చెప్పలేదు. గాఢంగా ఆలోచించి, 'అసలు వాహనాలే బూర్జువా వ్యవస్థకి నిదర్శనాలు. అవి ఎవరికీ వుండకూడదు' అన్నాడు. నా తల తిరిగిపోయింది. తిరిగి అతనే "అయినా మా ఆశయం చాలా పెద్దది. దానిముందు ఈ బ్రద్దలు కొట్టటాలూ అవీ చిన్న విషయాలు" అన్నాడు. మరి ఆ ఆశయం కోసం, ఈ వ్యవస్థని పూర్తిగా మార్చటంకోసం నువ్వేం చేస్తున్నావ్ అని అడిగాను. నన్నో పురుగును చూసినట్టూ చూశాడు. "నేను పేలి, ఆ విస్ఫోటనంలోంచి లక్ష నేనులు ఉద్భవిస్తాను" అన్నాడు. నిశ్చయంగా మా ఇద్దరిలో ఒకరికి మతిపోయి వుంటుందనుకున్నాను. "చూడు మిత్రమా! ఎందుకీ నినాదాలు. శ్రమ శక్తిని నమ్మేవాడివి కాబట్టి ఏదయినా పని చేసుకోకూడదూ" అన్నాను. 


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More