Home » Yandamuri veerendranath » Prarthana
కాగితం మీద సూదితో గుచ్చుకుంటూ వెళ్ళిన చుక్కల్ని తడుముకుంటూ చదవటం ఊహించటానికి కష్టంగా వుంటుంది. కానీ అలవాటయితే మనం చదివినంత వేగంగా వాళ్ళూ చదువుతారు. బ్రెయిలీ లిపిలో చందమామ లాంటి పుస్తకం నుంచి సైన్సు పుస్తకాలదాకా వున్నాయి. మన టైప్ మిషన్లలాగే, బ్రెయిలీలో కూడా టైపు వుంది. రంధ్రాలు పొడుచుకుంటూ సాగిపోతుంది.
కళ్ళకి ఆపరేషన్ జరిగిన నాలుగు గంటలకి అతడు లేచి కూర్చోగలిగాడు. అదృష్టవశాత్తు నాలిక తెగినచోట ఇన్ ఫెక్షన్ రాలేదు.
కళ్ళని పరీక్షించిన డాక్టరు, అతడికి దృష్టి రావటం అసాధ్యం అని చెప్పాడు. మాట ఎలాగూరాదు... పోతే చెవుల విషయమే డాక్టర్ కొద్దిగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకటి రెండు సంవత్సరాలు పోయాక మళ్ళీ ఆపరేషన్ చేస్తే అవి పనిచేసే వీలున్నదని అతడు అభిప్రాయపడ్డాడు. కానీ శేఖరం ఈ క్రొత్త జీవితానికి ఆపాటికే అలవాటు పడిపోయాడు. ఒక రకంగా ఈ జీవితమే బావుంది కూడా. ప్రపంచపు సంకీర్ణ ధ్వనుల్నుంచీ, డేపంజాతి వ్యక్తుల మాటల్నుంచీ దూరంగా వుండొచ్చు. చెడు వినక్కరలేదు. చూడక్కరలేదు. మాట్లాడనవసరం లేదు.
కొంచెం ఓపిక రాగానే అతడు డబ్ల్యు.బి.ఓ. (వరల్డ్ బ్లయిండ్ ఆర్గనైజేషన్) తో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలుపెట్టాడు. మొదటి ఉత్తరానికి యింకా జవాబు రాలేదు. కానీ వస్తుందని నమ్మకంగా వున్నాడు.
అతడు చేసిన మరో పని ఏమిటంటే... తన ఆక్సిడెంటు సంగతి ఎవరికీ తెలియనివ్వక పోవటం!
సానుభూతి అతడికిష్టంలేదు.
మామూలు మనుష్యులతో సమాన స్థాయికి వచ్చేక అతడు తన విషయం లోకానికి వెల్లడించటానికి ఇష్టపడ్డాడు. అ స్థితికి చేరుకున్నాక మొట్టమొదటి పనిగా శంకర్ లాల్ కి కబురు పంపాడు. లాల్ వచ్చాక అయిదు నిముషాల్లో ఆఫీసుతో ఋణం తీరిపోయింది. శంకర్ లాల్ సానుభూతి చూపించి వెళ్ళిపోయాక రెండో పని మొదలుపెట్టాడు. అతడు కలవదల్చుకున్న రెండో వ్యక్తి భార్గవ. భార్గవకి కనుక్కున్న విషయాన్ని తెలియపర్చటం అతడు అనుకున్న "రెండోపని".
ఆ తర్వాత "మూడోపని!" అదే జీవితంలో చేయదల్చుకున్నదీ- అతి ముఖ్యమైనదీ!! ఆ ఒక్కటీ మిగిలిపోతుంది. అయితే అది చెయ్యటానికి కొంచెం టైమ్ కావాలి.
* * *
చుట్టూ పరిసరాలన్నీ నిశ్శబ్దంగా వున్నాయి.
గదిలో ఒక మూల స్టాండులో వున్న కుందేలు పిల్ల కన్నార్పకుండా చూస్తోంది.
బయట ఎక్కడా అలికిడి లేదు.
భార్గవ గదంతా కలియజూసేడు. ఎన్నో సంవత్సరాలుగా ఒక రహస్యాన్ని విచ్చిన్నం చేయటానికి తనతోపాటు తోడ్పడిన ఆ పరికరాల్ని- తన ఓటమి వప్పుకుంటున్నట్టూ వీడ్కోలు అడిగాడు. తరువాత కళ్ళు మూసుకున్నాడు.
కానీ అంతలో బయట దూరంగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో వస్తున్న ధ్వని. సిరెంజి గుచ్చేసుకోవచ్చు. కానీ ఆత్మహత్య గురించి- ది ఫెయిలయితే దాని ప్రయత్నం గురించి- అంత తొందరగా బయటకి తెలియటం యిష్టంలేకపోయింది.
చప్పున ఇంజెక్షన్ ని డ్రాయర్ సొరుగులోకి తోసేసేడు. బాటిల్ ని జేబులో పెట్టుకున్నాడు. చెదిరిన క్రాఫ్ సర్దుకుని మామూలుగా తయారవుతూ వుంటే బయట తలుపు కొట్టిన ధ్వని వినిపించింది. తనకోసం ఈ సమయంలో వచ్చిన వాళ్ళెవరూ అని ఆశ్చర్యపడ్డాడు. ప్రయత్నం విఫలమై ఆలస్యం అయినందుకు చిరుకోపం, కాస్త విసుగూ కూడా వుంది. వెళ్ళి తలుపు తీశాడు.
బయట ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి నిలబడి వుంది. ఆమె మొహంలో అలసట కనపడుతూంది. ముంగురులు చెమటతో నుదుటికి అతుక్కుపోయి ఉన్నాయి. ముఖంమీద మాత్రం చక్కటి చిరునవ్వు వుంది. ఆ నవ్వులో ఒక అమాయకమైన ఆహ్లాదకత్వం వుంది.
"మీరేనా భార్గవ! అబ్బ చచ్చానుబాబూ మీ గది కనుక్కోలేక" అంది చనువుగా.
ఆమెని చూడగానే అతడికి తన కూతురు ప్రార్థన గుర్తొచ్చింది. అదే నవ్వు. పెద్దయితే ఇలాగే వుండేదేమో.
"ఎవరు నువ్వు" అని అడిగాడు.
"నేను ... ఐ మీన్... నా పేరు ప్రియ. శేఖరంగారి అసిస్టెంటుని" అంది.
అతడికి అర్థంకాలేదు. "శేఖరం అసిస్టెంటా?"
ఆమె నవ్వి "మీకో కవరు ఇమ్మని పంపారు" అంటూ అందించింది. చిన్న గులాబీ పువ్వు ముద్రించిన నీలంరంగు కవరు. అతడు అయోమయంగానే దాన్ని అందుకున్నాడు. చింపి, లోపల్నుంచి రోజ్ కలర్ ఉత్తరాన్ని బయటకి తీసేడు. అయితే అతను అనుకున్నట్టు అందులో ఉత్తరమేమీ లేదు. కొన్ని చుక్కలు మాత్రం వున్నాయి.
అతడికి అర్థంకాలేదు, "ఏమిటిది?" అని అడిగాడు.
"బ్రెయిలీ" అంది.
అతడికి బ్రెయిలీ అంటే తెలుసు. కానీ శేఖరం ఇలా ఎందుకు పంపేడో తెలియలేదు. కొత్తగా వచ్చిన ఈ సెక్రటరీ ఎవరో కూడా అర్థంకాలేదు.
"ఈ అక్షరాల అర్థం ఏమిటి?"



