Home » Yandamuri veerendranath » Rudranethra


    అయితే ప్రతిమ ఇంకా ఆ వృత్తికి కొత్తది. సర్పభూషణరావు తాలూకు వివరాలు సంపాదించమని మాత్రమే  డిపార్ట్ మెంట్  ఆమెను కోరింది. అది పూర్తయ్యాక ఆమె పని కేవలం నేత్రకు సాయం చేయడమే ఇప్పుడు  జరిగిన విషయాన్ని ఆమె  అంత సులభంగా జీర్ణం చేసుకోలేక పోతోంది.

 

    ఏ ధైర్యంతో హంసలేఖ ఇంత  పెద్ద అబద్ధం చెపుతోంది?

 

    ఆమె రెండుగంటల్లో హంసలేఖ గురించిన వివరాలన్నీ సేకరించింది. తన సి.బి.ఐ. అనుభవంతో ఆమె కనుక్కున్న వివరాలు ఆమె అయోమయాన్ని మరింత పెంచినయ్. హంసలేఖకు వేరే  ఎవరూ మగస్నేహితులు లేరు. పైకి చాలా ఫాస్ట్  అమ్మాయిలా కనిపిస్తుంది కానీ ఆమె చాలా రిజర్వుడు టైపు. ఇంగ్లీషులో అద్భుతమైన కవిత్వం వ్రాసినట్టే- మనిషి కూడా ఎంతో  భావుకత  నిండివున్న వ్యక్తి.

 

    మరిలా ఎలా జరిగింది?

 

    ఆలోచనతోనే - ఆమె ఇంటికి చేరుకుంది.

 

    "నాయనమ్మా- నేనొక ప్రశ్న అడుగుతాను సమాధానం చెపుతావా?"

 

    "ఏమిటి?"


    
    "ఇద్దరు మనుష్యుల జీవితం కేవలం నీ సమాధానం మీద ఆధారపడి వుంది నాయనమ్మా. సిగ్గు పడకుండా చెప్పాలి?"

 

    "అమ్మో...... అంత జీవితానికి సంబంధించిన విషయమైతే నేనేం చెప్పగలనే? అయినా అడుగు. సిగ్గుపడడం దేనికి?"

 

    "పిల్లలెలా పుడతారు నాయనమ్మా?"

 

    ఆవిడ వున్నట్టుండి రోదిస్తూ "అయ్యో! ఏం కొంపముంచావే తల్లీ......" అంటూ ఆరున్నొక్క రాగం తీసింది.

 

    ప్రతిమ  కంగారుపడి "నేనేం మునగలేదు నాయనమ్మా. ఒక భారత సీక్రెట్  ఏజెంట్ ని  ట్రాప్ చెయ్యడానికి విదేశీ శక్తులు ఆడుతున్న నాటకంలో నిజం ఎంతో తెలుసుకుందామని అడుగుతున్నాను."

 

    "అయినా ఇంత వయసొచ్చింది. నీకు తెలీదుటే?"

 

    "తెలుసు నాయనమ్మా- నాకు తెలుసు. కానీ మనకు తెలిసిందే వేదం అనుకోకూడదన్నమాట ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనపడుతున్నాయి. నాకు తెలియక కాదు నిన్ను అడుగుతూంట. నువ్వేమైనా చెపుతావేమోనని......"

 

    "ఈ వయసులో నేనెలా చెప్పనే?"

 

    "కేవలం ముద్దు మాత్రమే పెట్టుకున్నానంటున్నాడు నేత్ర. ఆ అమ్మాయేమో తనే కారణం అంటూ వుంది. ఎందులో నిజముంది?"

 

    "వాళ్ళు చెప్పడమూ సరే, నువ్వు అడగడమూ సరే - ఇంతకూ ముద్దు పెట్టుకున్నాడా?"

 

    "అవున్నాయనమ్మా!"

 

    "ఒక్క ముద్దే పెట్టుకున్నాడా?"

 

    "అవును. ఒకటి. కేవలం ఒక్కటంటే ఒక్కటి.... నిర్హేతుకమైన, నిర్జీవమైన, నిరపాయకరమైన ఒకే ఒక ముద్దు"

 

    అంతా విని నాయనమ్మ  నిట్టూర్చింది.

 

    ఆ తరువాత సాలోచనగా, "ఇప్పుడన్నీ మిషన్లేగా. పుంజుల్లేకుండా కూడా గుడ్లట! మరి కొత్త పద్ధతులేమయినా వచ్చాయేమో నాకు తెలీదుకానీ, మా రోజుల్లో అయితే-" అంది.

 

    "ఊ..... మీ రోజుల్లో అయితే!"

 

    "అబ్బో- దానికి చాలా తతంగం వుండేదమ్మా. ఎంతో కష్టపడే వాళ్ళం-'

        
                                                            *    *    *

 

    సర్పభూషణరావు ఇంటి చుట్టూ సి.బి.ఐ. వల పన్నింది. నేత్ర  స్వయంగా తన ప్లాట్ లో  కూర్చుని బైనాక్యులర్స్ తో ఆ ఇంటివైపే చూస్తున్నాడు. రాబోయే పన్నెండు గంటలూ చాలా ముఖ్యమైనవని అతడికి తెలుసు. పన్నెండు గంటల్లోగా  యస్బీఆర్ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు. ఈ లోపులో అతడు తన  పనులు  పూర్తి చేసుకుంటాడు. ఆ సందర్భంగానయినా అతడిని పట్టుకుని ఏదో ఒక  కేసులో ఇరికించకపోతే అతడు చేతుల్లోంచి జారిపోవడం ఖాయం.

 

    ఒకటి...... రెండు...... మూడు గంటలు. ఏమీ  జరగలేదు.

 

    దాదాపు మూడున్నర గంటల  తరువాత  ఫోన్ మోగింది. యస్బీఆర్  ఇంటికి వచ్చిన ఫోన్ అది. దాని నుంచి ఈ ఫోన్ లోకి లైన్ ట్రాప్ చెయ్యబడింది. నేత్ర  చప్పున  వెళ్ళి ఫోన్ అందుకున్నాడు.

 

    అట్నుంచి ఫోన్ లో యస్బీఆర్  "హల్లో" అన్నాడు.

 

    అవతలి వ్యక్తి "బాగున్నావా?" అని ఫోన్ పెట్టేశాడు.

 

    ఇటువైపు యస్బీఆర్ కూడా ఫోన్ పెట్టేశాడు.

 

    అదీ కోడ్. నేత్రకి అర్థమైంది.

 

    అతడనుకున్నట్టే అయిదు నిమిషాల తరువాత యస్బీఆర్ కారు బయల్దేరింది. ముందు వ్యక్తికి తెలియకుండా నేత్ర ఫాలో అయ్యాడు. యస్బీఆర్ కారు అయిదు నిమిషాలు ప్రయాణం చేసి ఒక పబ్లిక్  ఫోన్ ముందు  ఆగింది నేత్రకి మొత్తం  విషయం అర్థమయింది.

 

    యస్బీఆర్ తన ఫోన్ లోంచి మాట్లాడడు. ఇలా ఫోన్ రాగానే బయటకొచ్చి మాట్లాడతాడన్నమాట.

 

    నేత్ర వైర్ లెస్ లో తన డిపార్ట్ మెంట్ కి సూచన్లు ఇచ్చాడు. క్షణాల్లో టెలిఫోన్ ఎక్సేంజి ఎలర్ట్  అయింది. యస్బీఆర్ ఏ పబ్లిక్  బూత్  నుంచి మాట్లాడుతున్నాడో- ఆ ఫోన్ సంభాషణ టేప్ అయింది.

 

    "మిస్టర్ క్యూ-"

 

    "స్పీకింగ్-"

 

    "యస్బీఆర్ హియర్-"

 

    "ఇక అరగంటలో స్వర్ణరేఖని చంపెయ్యాలి. మనం వెళ్ళిపోవచ్చు."

 

    "ఎప్పుడు వెళ్తున్నాం?"

 

    "వెంటనే-! స్వర్ణరేఖ మరణించిన తరువాత ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ వుండకూడదు. ఆ మరణం తెలిశాక ఇక  ఇంటర్ పోల్ మిమ్మల్ని వదల్దు."

 

    "ఆ పని వెంటనే ముగిస్తాను."

 

    ఫోన్ కట్ అయింది.

 

    నేత్ర  నిటారుగా  అయ్యాడు. వెంటనే వెళ్ళి యస్బీ ఆర్  ని అరెస్టు చెయ్యాలన్న కోర్కెని బలవంతంగా  అణుచుకున్నాడు. దానివల్ల ఏ లాభమూ లేదు. స్వర్ణరేఖని పట్టుకోవాలి. ఆమె ఎక్కడుందో తెలీదు. అతడు వేగంగా ప్లాట్  కొచ్చాడు. ప్లాట్ లోంచి టెలిస్కోప్ గుండా  స్వర్ణరేఖ గదిలోకి చూశాడు. ఆమె ఎక్కడికో తయారవుతోంది. అతడి దృష్టి కారు గ్యారేజీ మెడ పడింది. యస్బీ ఆర్ గ్యారేజీలోంచి బైటకొస్తున్నాడు.

 

    నేత్ర భృకుటి ముడివడింది.

 

    స్వర్ణరేఖ  కారు గ్యారేజీవైపు వెళ్తూ. తండ్రితో ఏదో  మాట్లాడుతూంది నవ్వుతూ.

 

    నేత్ర పరుగెత్తుకుంటూ లిప్ట్ దగ్గరకొచ్చాడు. అతడు  కిందికి దిగి, ప్లాట్ బయటకొచ్చేసరికి స్వర్ణరేఖ కారు  అవతల ఇంటిలోంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు ఎక్కింది.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More