Home » Yandamuri veerendranath » Rudranethra


    నేత్ర ప్లాట్ ముందు ఆపుచేసిన తన కారు  దగ్గరకు పరుగెత్తాడు.

 

    యస్బీఆర్ ఇంటికీ, నేత్ర ప్లాట్ కీ  మధ్యవున్న దారి ఎప్పుడూ చాలా ట్రాఫిక్ తో వుంటుంది. వాహనాలు వేగంగా అటూ, ఇటూ వెళ్తున్నాయి. నేత్ర  తన కార్లో స్వర్ణరేఖ కారును వెంటాడడానికి ప్రయత్నించాడు. అప్పటికే అది చాలాదూరం వెళ్ళిపోయింది. నేత్ర వేగం హెచ్చించాడు.

 

    ముందుకార్లో వెళ్తున్న స్వర్ణరేఖ చాలా స్పీడ్ గా డ్రయివ్ చేస్తోంది. ఏజంట్ క్యూ అర్జెంటుగా రమ్మన్నాడని తండ్రి ఆమెకు చెప్పాడు. ఎందుకో అర్థం కాలేదు కారు నగరం పొలిమేరల దాటింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించడానికి ఆమె కారు స్లో చేసింది.

 

    ఆగలేదు.

 

    ఆమెకో క్షణం అర్థం కాలేదు అదృష్టవశాత్తు లారీ దాటిపోయింది. కారు అస్తవ్యస్తంగా వెళ్ళసాగింది. తెరచివున్న కిటికీల్లోంచి గాలి రివ్వున వస్తోంది. ఆమె  స్టీరింగ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూంది. అయినా లాభం లేకపోయింది.

 

    అప్పుడర్థమయిందామెకు- బ్రేకులు ఫెయిల్ అయ్యాయని! మొహంనిండా చెమటలు పట్టాయి.  పల్లంలో కారు మరింత వేగం పుంజుకుని ఎడమప్రక్కగా  వెళ్తూన్న ఎడ్లబండ్లను వెంట్రుకవాసితో రాసుకుంటూ సాగిపోయింది.

 

    ఆమె తన ప్రాణాలమీద  ఆశ వదిలేసుకుంది. అంతలో ఆమె పక్కనుంచి మరోకారు దూసుకుపోయింది. కొంతదూరం వెళ్ళాక అది నెమ్మదయింది. ముందుకారుకీ, తనకారుకీ మధ్య దూరం క్రమంగా తక్కువ అవడం ఆమె గమనించింది.

 

    కంగారుగా హారన్ కొట్టింది.

 

    తన కారుకి బ్రేకులు లేవన్న విషయం ముందు కారు డ్రైవర్ కి ఎలా తెలియజెప్పాలో ఆమెకి అర్థంకాలేదు.

 

    ముందు కారు మరింత స్లో అయింది. వెనుక కారువేగం కన్నా  ముందుకు కేవలం కొద్దిగా తక్కువ అవడంతో రైలు కంపార్ట్ మెంట్ ల షంటింగ్ లా రెండూ దగ్గర అవుతున్నాయి. ఒక విమానం నేలమీద దిగేటప్పుడు పైలట్  ఎంత  జాగ్రత్త  తీసుకుంటాడో  అంత నేర్పరితనంతో వెనుక కారు బోయినెట్- తనకారు మడ్ గార్డ్ కి అనేలా చేసి తరువాత తన వాహనాన్ని క్రమక్రమంగా ఆపి, డోర్ తెరిచి క్రిందికి దిగాడు నేత్ర.

 

    స్వర్ణరేఖ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. తలలోంచి స్వేదం చెంపల మీదకు కారుతోంది. మృత్యువు తన పక్కనుంచి ఎంతలో వెళ్ళిపోయిందీ ఆమెకి తెలుస్తోంది.

 

    "నీ కారిక ఇప్పట్లో పనిచేయదు. నాతోరా. డ్రాప్ చేస్తాను!"

 

    ఆమె మాట్లాడకుండా కారుదిగి, నేత్ర కారెక్కింది. అతడు తన వాహనాన్ని వెనక్కి తిప్పి  నగరంవైపు పోనిచ్చాడు.

 

    "ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది" అన్నాడు. ఆమె డానికి బదులివ్వకుండా,  "నా కారు  బ్రేకులు  ఫెయిలయ్యాయని మీకెల తెలిసింది?" అని అడిగింది. అతడేదో సమాధానం చెప్పబోయేటంతలో "కంగ్రాచ్యులేషన్స్" అందామె మళ్ళీ.

 

    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు.

 

    "నా కారు బ్రేక్  ఆయిల్ తీసేసి, నన్ను ప్రమాదం నుంచి రక్షించినట్టు నటించి, ఆ విధంగా ఆకర్షించి నన్ను మీవైపు తిప్పుకోడానికి అద్భుతమైన ప్లాన్ వేసినందుకు! ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్  తెలివితేటలు శత్రుదేశపు గూఢచార్లని ఎదుర్కోవడానికే కాదు - అమ్మాయిల్ని వలవేసి పట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయని ఇప్పుడే తెలుసుకున్నాను" అంది.

 

    అతడికి విపరీతమైన కోపం వచ్చింది. అతికష్టంమీద దాన్ని అణుచుకుంటూ "నువ్వు గొప్ప సైంటిస్టువి అయితే అయ్యుండవచ్చు. కానీ, నీకు లోకజ్ఞానం అస్సల్లేదు అని అర్థమవుతూంది. నీ అవసరం  తీరిపోయాక నీ తండ్రే  నిన్ను చంపాలని కారు బ్రేకులు  ఫెయిల్  చేయించాడు. ఇంత  చిన్న విషయం తెలుసుకోకపోవడం నీ దురదృష్టానికి పరాకాష్ట-" అన్నాడు.

 

    "ఎవరి  దురదృష్టాన్నీ ఎవరూ  నిర్ణయించలేరు మిస్టర్  నేత్రా. కేవలం నా తండ్రికి కూతురుగా పుట్టిన నేరానికి నా చెల్లెలు ఇప్పుడు పెళ్ళి కాకుండానే తల్లి కాబోతూంది. దానికి ఎవరు సమాధానం చెప్పగలరు?"

 

    "మనస్సాక్షిగా చెప్తున్నాను. దానికి నేను బాధ్యుడిని కాను-"

 

    "ఆ విషయం నాకు తెలుసు."

 

    ఆమె తాపీగా చెప్పిన ఆ సమాధానానికి నేత్ర విస్మయంతో, "నీ కెలా తెలుసు?" అని అడిగాడు. 'కనీసం నువ్వైనా ఈ విషయాన్ని నమ్మగలుగుతున్నావా?" అన్న ఆశ్చర్యం గొంతులో ధ్వనిస్తూవుండగా.

 

    "అవును. నాకు తెలుసు-"

 

    "అదే! ఎలా అని అడుగుతున్నాను."

 

    "హంసలేఖ గర్భానికి కారణం ఏజెంట్ 'క్యూ ' కాబట్టి"

 

    నేత్ర చేతులు స్టీరింగ్ చుట్టూ బిగుసుకున్నాయి. తన సర్వీసులో ఎప్పుడూ  ఇంతషాక్ అవలేదు అతడు.

 

    "ఏజెంట్ 'క్యూ?" అన్నాడు నమ్మలేనట్టు.

 

    "రెణ్ణెల్లక్రితం మీ పుట్టినరోజని నాటకమాడి మా ఇంటికివచ్చి హంసలేఖని ముద్దు పెట్టుకున్నారు గుర్తుందా?"

 

    "అవును-"

 

    "ఆ రోజు రాత్రి ఆమె చాలా డిస్టర్బ్ డ్ గా  కనిపించింది. నాకు అసలు కారణం తెలీదు. తను నిద్ర పోవడానికి నేను అనుదినం వాడే పెథిడ్రిన్ ఇంజెక్షన్ ఆమెకు ఇచ్చాను. ఆ మత్తులో....."

 

    "ఊఁ..... ఆ మత్తులో?"

 

    "ఆమెని ఏజెంట్ క్యూ అనుభవించాడు."

 

    నేత్ర వెన్నులో సన్నటి జలదరింపు..... అదోరకమైన ఇబ్బందికరమైన భావం..... ఇలా ఎందుకు జరిగింది అన్న ఏవగింపు. పిడికిళ్ళు బిగింపచేసే కసి! ఇంతవరకూ అతడికి క్యూ మీద సిద్ధాంతపరమైన శత్రుత్వమే వుండేది. ఇప్పుడు  అది వ్యక్తిగతంగా మారింది.

 

    స్వర్ణరేఖ చెప్పుకుపోతూంది- "నా కోసం వచ్చిన క్యూ బహూశా మత్తులో వున్నా హంసని చూసి వుంటాడు. ఆ రాత్రి ఆయాచితంగా దొరికిన అవకాశాన్ని వదులుకోలేదు అతడు అతడు  గది నుంచి వెళ్ళిపోవడం నేను చూశాను. ముందు మీరేమో అనుకున్నాను. కానీ, చూస్తే క్యూ! నేను స్థాణువయ్యాను. నా వాడనుకున్న  క్యూని  ఇంకొక అమ్మాయితో  చూసినందుకు కాదు. ఆ స్టేజి, ఈర్ష్య నేనెప్పుడో దాటిపోయాను. అనవసరంగా హంసలాంటి అమ్మాయి పాడయిందే అని  బాధపడ్డాను. అయితే, ఈ విషయం హంసకి చెప్పలేదు. కానీ, విధి  అనుకూలించక హంసని గర్భవతిని చేసింది."

 

    నేత్ర  సరిగ్గా  వినడంలేదు. అతడి తలలో హోరు. 'హంసా....... హంసా' అనుకున్నాడు ఆర్తిగా.

 

    ఆమె అంది- "డాక్టర్ దగ్గరికి వెళ్దామని హంస  అడిగేసరికి  నేను కంగారుపడ్డాను. కారణం ఎవరంటే 'నేత్ర' అని చెప్పింది. మీ  ఇద్దరి  మధ్యా ముందునుంచే అఫైర్ వుందేమో అనుకున్నాను. క్యూ విషయం  పూర్తిగా  దాచేస్తే డానికి మీరు బాధ్యులు అవుతారు కదా అని కూడా అనుకున్నాను. కానీ-"


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More