Home » Yandamuri veerendranath » Rudranethra


    "మళ్ళీ ఇంకొకసారి చెప్పు" అంది అప్రయత్నంగా.

 

     When I looked into the mirror,
    I found your image shine
    It was not an error,
    you are a reflection of mine.

    ........

    Holding under the clouds cover
    Now and then the stars peep,
    Watching us part forever
    They begin to weep
    
    ......

    Not until I met you,
    Love's meaning I knew,
    But when I saw girls in a queue
    I was too scared to say' I Love you'

    .........

    Oh my pen! only when ge falls apart
    you have a miraculous start"

 

    'నేను అద్దంలో చూసుకుంటే కనపడేది నువ్వు.
    అందులో చిత్రం ఏముంది?    
    నా ప్రతిబింబానివే నువ్వు.......    
    మేఘాల వెనుకనుంచి నక్షత్రాలు తొంగిచూస్తున్నాయి.
    మనం విడిపోవడంచూసి అవి దుఃఖిస్తున్నాయి....
    ప్రేమంటే ఏమిటో నిన్ను చూసాకే తెలుస్తూంది.
    కానీ నీకోసం నిలబడ్డ అమ్మాయిల క్యూ చూసి,
    అది చెప్పాలంటే భయం వేస్తూంది.'

 

    చివరివాక్యం ప్రతిమని అంతగా సంతోషపెట్టలేదు. తననీ, అహోబిలనీ క్యూలో నిలబడే  అమ్మాయిల్లా పోల్చడం ఆమెని చురుక్కుమనేలా చేసింది. దాంతో తిరిగి మామూలు ప్రతిమ అయిపోయి, "ఎందుకంత బాధ-" అని అడిగింది కోపంగా.

 

    "మరి బాధకాదా- డాక్టరు మూడోనెల అని చెప్పింది."

 

    ప్రతిమ ఆదిరిపడి, "వ్వాట్?" అని అరిచింది.

 

    "అవును- నేనూ, అక్కయ్యా వెళ్ళాం. నాకు మొదట్నుంచి అనుమానంగానే వుంది. ఇప్పుడు డాక్టరు  కన్ఫర్మ్ చేసింది."

 

    "దానికి....... దానికి నేత్ర కారణమంటావా?" తను నేత్రలా మాట్లాడుతున్నానని మార్చిపోయింది ప్రతిమ.

 

    "అదేమిటి నేత్రా అలా అంటావ్- నామీదేమైనా అనుమానంవుందా నీకు? మైగాడ్, ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది నాకు..... ఆ రోజు జరిగింది నీకు గుర్తులేదూ-" ఆమె చెప్పుకుపోతూంటే ఇక వినలేక ప్రతిమ ఆమె మాటల్ని కట్ చేసి "ఏ డాక్టర్ నీకు చెప్పింది?" అని అడిగింది.

 

    "స్వప్నా నర్సింగ్ హోం-"

 

    ఇంకేమీ మాట్లాడకుండా, ఆమె ఫోన్ పెట్టేసి వెంటనే నర్సింగ్ హోంకి ఫోన్ చేసింది- "మేము సి.బి.ఐ. నుంచి మాట్లాడుతున్నాము. హంసలేఖ అనే ఆమె మీ  దగ్గరకొచ్చింది. ఏ డాక్టర్  ఆమెని టెస్ట్ చేశారో రికార్డు చూసి చెప్పండి-"

 

    "నేనే' అని అట్నుంచి వినపడింది. "ఏమిటి విషయం?"

 

    "డాక్టర్! ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏమిటి?"

 

    "మీరు  పరిశోధించే ఏ కేసు  విషయంలో ఆమె పరిస్థితి మీకు కావాలి-?"

 

    ప్రతిమ తడబడి "అవన్నీ  చెప్పాలా డాక్టర్."

 

    "అవసరంలేదు. మీకేం  కావాలో అడగండి-"

 

    "హంసలేఖకి ప్రస్తుతం......"

 

    "....... మూడో నెల" ఆమె క్లుప్తంగా పూర్తిచేసింది అట్నుంచి.

 

    ప్రతిమ షాక్ నుంచి తేరుకోలేదు. అవతల్నుంచి "హలో..... హలో" అని వినపడుతూంది.

 

    ఆమె చేతిలో ఫోన్ అప్రయత్నంగా జారిపోయింది.

 

    "నాన్సెన్స్, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది?" నేత్ర కోపంగా అరిచాడు.

 

    "నేను కాదు. ఆ అమ్మాయి అంటోంది" అంతకన్నా గట్టిగా  అరిచింది. ప్రతిమ. "-ఇంకొకరు, ఇంకొకరుచెప్తే ఏమోలే  అనుకునేదాన్ని. హంసలేఖే స్వయంగా నాతో చెప్పింది. పోనీ  నన్నేడిపించటానికి చెప్పిందా అనుకుంటే నేనే నేత్రలా మాట్లాడాను. 'మనిద్దరిమధ్యా ఏం జరిగిందో నీకు తెలీదా?' అని ఆ అమ్మాయి స్వయంగా  అడిగింది. నా చెవులారా విన్నాను. ఇంకా ఇంకా  ఇదంతా  అబద్దమంటావా?"

 

    "నిజంగా ఇదంతా అబద్ధమే ప్రతిమా..... నీకు నచ్చచెప్పవలసిన అవసరం నాకు లేదు. కానీ మనస్సాక్షిగా  చెపుతున్నాను. ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు."

 

    "అంటే..... నిన్ను పెళ్ళి చేసుకోవడం కోసం హంసలేఖే ఈ విధంగా  అబద్ధమాడుతుందంటావా?"

 

    "హంసలేఖ అటువంటిది కాదు."

 

    "ఇటు హంసలేఖ మంచిదే. అటు కడుపూ నిజమే. నేను దేన్నీ నమ్మాలి? ఏం చెయ్యాలి?"

 

    "దేన్నీ నమ్మనవసరం లేదు. ఏమీ చెయ్యనక్కర్లేదు. రాబోతూన్న ప్రమాదం సంగతి ఆలోచించు చాలు. ఆ అమ్మాయిని తండ్రి ఫారెన్ తీసుకుళ్తున్నాడంటే, చట్టబద్ధంగా ఈ దేశం వదలి వెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నాడన్నమాట. ప్రమాదం  దగ్గర పడింది...... అందుకే ఇంటర్ పోల్  ఇంటరాగేషన్ కి దొరక్కుండా  వెళ్లిపోతున్నాడు. నా ఉద్దేశం ప్రకారం  అతడు కూతురితోసహా ఏ విదేశంలోనో ఆశ్రయం తీసుకుంటాడు. ఈ ప్రయాణంలో స్వర్ణరేఖని కలపలేదంటే, ఆమెని ఇ....క్క...డే..." అంటూ సాలోచనగా అక్కడినుంచి వెళ్లిపోయాడు.

 

    అతడు నిజమైన సి.బి.ఐ. ఏజెంటు. తన గురించి ఇంత గొడవ  జరిగింది! ప్రతిమ నిలదీసి అడిగింది!! అయినా దాని గురించి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. మాటల సందర్భంలో ఆమె చెప్పిన ఒక్కమాట "నేను మా నాన్నతో కలిసి ఫారిన్  వెళ్తున్నాను" అని హంసలేఖ అన్నది అంటూ ప్రతిమ చెప్పిన ఒక్కమాట ఆధారంగా ఇంత వూహించి, గూఢచారి వృత్తికి తనెంత తగినవాడో నిరూపించాడు. తాన్  వృత్తిలో నిజంగా లీనమైన వాడికి- అతడు రచయితేగానీ, క్రీడాకారుడేగానీ, ఇంటర్ పోల్ ఏజెంటేగానీ..... మనసులో బాధలు, ఇంట్లో గొడవలు, బైట వత్తిడులు వృత్తిపరంగా ఏ మాత్రం  అడ్డురావు. ఆ మాత్రం డిటాచ్ మెంట్ సాధించినవాడే తన రంగంలో పైకి వస్తాడు.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More