Home » Yandamuri veerendranath » Prarthana


    - వ్రాసి కాగితాన్ని రవి ముందుకు తోసేడు. రవికి అర్థంకాలేదు. కనులు లేకపోవటంచేత, వ్రాసిన లైనుమీదే పేషెంటు రెండో లైను వ్రాసేడు - అని గ్రహించాడు. అదేమిటో తెలుసుకోవాలంటే తిరిగి ఒక్కొక్క అక్షరమూ వ్రాస్తూండగా చూడాలి. అతడు వ్రాసిందేమిటో తనకి అర్థం కాలేదనీ; మళ్ళీ ఇంకోసారి వ్రాయమని అతనికి ఎలా చెప్పాలి. కమ్యూనికేషన్ గాప్ అంటే ఇదే. శేఖరంవేపు అతడు జాలిగా చూసేడు. ఇక జీవితాంతం ఇతడు ఇలాగే బాధపడాలి.

 

    డాక్టర్ మౌనాన్ని శేఖరం మరో విధంగా అర్థం చేసుకున్నాడు. మళ్లీ కాగితంమీద వ్రాసేడు.


           

 

    అతడు కాగితంమీద వ్రాసింది రవికి అర్థం కాలేదు కానీ- వ్రాస్తూవుండగా ఒక్కో అక్షరమే వెనుక నిలబడి చదివాడు కాబట్టి తెలిసింది. శేఖరం వ్రాసింది ఇది - "అన్నీ నేనే చెప్తాను. నేను చెప్పేది అబద్దమైతే నా చేతిని ఒకసారి కొట్టండి మీ చేతితో. నేను వ్రాసింది నిజమైతే రెండు సార్లు కొట్టండి. మీరు నాకు ఏ విషయమూ వివరంగా చెప్పలేరు. కాబట్టి ప్రశ్న అడగటంద్వారా మీనుంచి సమాధానాలు వివరంగా ఒక్కొక్కటే రాబట్టుకుంటాను. నేను చెపుతున్నది మీకు అర్థమవుతుందా?"

 

    డాక్టరు అతడి చేతిమీద రెండుసార్లు తట్టాడు.

 

    ఆ తరువాత శేఖరం తను అడిగిన మొట్టమొదటి ప్రశ్న తిరిగి అడిగాడు. "ప్రస్తుతం నేనెక్కడున్నాను? ఆస్పత్రిలోనేనా?"

 

    డాక్టర్ అవునన్నట్టూ రెండుసార్లు తట్టాడు.

 

    "ఎంతకాలం నుంచి? ఎన్ని రోజులయితే అన్నిసార్లు కొట్టండి" డాక్టరు కొట్టాడు.

 

    కొద్దిగా వంగి వ్రాయటం వల్ల వెన్నులో తిరిగి అమితమైన బాధ మొదలయింది. ఒక్కో అక్షరం వ్రాయటానికి చాలా శ్రమ తీసుకోవలసి వస్తూంది. అక్షరాలు మరింత అలుక్కుపోతున్నాయి. డాక్టర్ వూపిరి మెడవెనుక తగులుతూంది. అంటే వాక్యం పూర్తయేసరికి అది అలుక్కుపోతూ వుందన్నమాట. ఈ విధంగా ఎంతకాలం కొనసాగుతుంది? వేరే మార్గం ఆలోచించాలి. అతడు తిరిగి వ్రాయబోతూంటే వెన్నులో కలుక్కుమంది. సన్నగా బాధతో మూలిగాడు. ఇక ప్రశ్నలు చాలు అన్నట్టు డాక్టరు కాగితం తీసేసుకోబోయేడు.

 

    "మూడే ప్రశ్నలు డాక్టర్ ఆఖరివి ... ప్లీజ్".

 

    డాక్టర్ కాగితం తిరిగి వదిలేసేడు.

 

    "నాకు వెన్నెముక సరి అవుతుందా?"

 

    'అవుతుంది' అన్నట్టు రెండుసార్లు తట్టాడు.

 

    "నాకు శాశ్వతంగా అంధత్వం వచ్చినట్టేనా?"

 

    డాక్టర్ మౌనంగా వుండిపోయాడు. శేఖరం కాగితం మీద 'ప్లీజ్... ప్లీజ్...' అని వ్రాసేడు.

 

    వచ్చినట్టే.

 

    ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి శేఖరం కొంచెంసేపు అచేతనంగా వుండిపోయాడు. తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్టూ చివరిదీ ఆఖరిదీ అయిన వాక్యాన్ని వ్రాసేడు.

 

    "నాకు బ్రెయిలీ లిపి నేర్పే మాస్టారు ఒక గంటలో కావాలి, తెప్పించ గలరా?"

 

    డాక్టర్ రవి నమ్మలేని విస్మయంతో శేఖరంవేపు చూశాడు. మూర్తీభవించిన వ్యక్తిత్వం- పట్టుదలా అతడిలో కనబడ్డాయి. ఇదే ఇంకెవరయినా పేషెంట్ అయితే ఏడ్చి, గోలగోలగా అల్లరిచేసి వుండేవాడు. ఇంత ప్రాక్టికల్, మెటీరియలిస్టిక్ మనిషిని అతడు జీవితంలో యిదే మొదటిసారి చూడటం. ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు...? ఎంత బింకంగా ప్రవర్తిస్తున్నాడు... అతడిమీద ఒక్కసారిగా గౌరవం కలిగింది. బ్రెయిలీ గురించి అంత తొందరెందుకు? అని అడుగుతున్నాడు. కానీ ప్రపంచంతో ఆ పేషెంట్ ఏర్పర్చుకోవాలన్న కమ్యూనికేషన్ గురించిన ఆతృత అర్థమైంది. ఈ లోపులో శేఖరం తిరిగి వ్రాసేడు. "చెప్పండి డాక్టర్! తెప్పించగలరా?"

 

    'తెప్పించగలను' అన్నట్టూ డాక్టర్ అతడి భుజం మీద రెండుసార్లు తట్టాడు.

 

    ఆ తరువాత కాలం చాలా వేగంగా పరుగెత్తింది.

 

    డాక్టర్ రవికి అదో మహత్తరమైన అనుభవం... శేఖరాన్ని గమనిస్తూ వుండటం!! డాక్టరుగా అతడు చాలా మందిని చూసేడు. కానీ రచయితగా అంతకన్నా ఎక్కువమందిని పరిశీలించాడు. శేఖరం కేసురాగానే- ఒక ప్రత్యేకమైన కొత్త తరహా పాత్ర రచనకి లభించిందనుకున్నాడు. అతడి స్థితిని గమ్మత్తుగా - సానుభూతి పొందేలా వర్ణించవచ్చు ననుకున్నాడు.

 

    కానీ అతడి అంచనాలన్నీ ఇప్పుడు తారుమారయ్యేయి. శేఖరం సానుభూతికి చోటు ఇవ్వనేలేదు. ఒక సాధారణమైన కుర్రవాడికి ఆరు నెలలు పట్టే లిపిని శేఖరం చాలా కొద్దిగంటల్లో నేర్చుకున్నాడు. రెండ్రోజులు తిరిగే సరికల్లా బ్రెయిలీ నేర్పటానికి వచ్చిన మాస్టారితో చాలా మామూలుగా లోకాభిరామాయణం కొనసాగించాడు.

 

    మొదటిరోజు సాయంత్రమే తన బ్యాంకు బాలెన్స్, రావలసిన అరియర్స్ లెక్కకట్టి తెప్పించుకున్నాడు. ఆ మరుసటి రోజు ప్రొద్దున్న పరామర్శించటానికి వచ్చిన శంకర్ లాల్ తో తన ఉద్యోగం విషయం చర్చించాడు.

 

    తను బ్రెయిలీలో వ్రాసిస్తే- దాన్ని ఇంగ్లీషులోకి తర్జుమాచేసి టైపు చెయ్యటానికి పార్టుటైమ్ మీద ఒక అసిస్టెంటుని కుదుర్చుకున్నాడు. ఆ అసిస్టెంటు పేరు ప్రియ. చక్కని అమ్మాయి. వయసు కూడా ఎక్కువేమీ కాదు. పదిహేడో - పద్దెనిమిదో వుంటుంది. ఆ అమ్మాయి తండ్రి ఓ ఆర్మీ ఆఫీసరు, విమాన ప్రమాదంలో చచ్చిపోయాడు. ఓడలు బండ్లయ్యాయి. పధ్నాలుగు సంవత్సరాల వయసులో కుటుంబ భారం మీద పడింది. టైపు, షార్టుహాండ్ నేర్చుకుని ఉద్యోగంలో ప్రవేశించింది. ఆ అమ్మాయిలో ప్రత్యేకత ఏమిటంటే- మొహంమీద చక్కటి చిరునవ్వు ఎప్పుడూ చెదరకుండా వుండటం! ఆమెని చూసిన వారెవరూ అంతచిన్న వయసులో ఒక కుటుంబం మొత్తాన్నీ పోషిస్తూ వుందని అనుకోరు.

 

    ఒక పార్టుటైం ఉద్యోగం వుందని చెప్పగానే వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడవుతాయి కదా అని వప్పుకుంది. ఉద్యోగం వివరాలు తెలిసాక ఆశ్చర్యపోయింది. మొదట్లో కాస్త కష్టంగా వుండేది. అతడు వ్రాసిన రికెనర్ ద్వారా ఒక్కో అక్షరమే ఇంగ్లీషులోకి తర్జూమా చేసుకుని టైపు చెయ్యటం...! కాని తొందరలోనే అలవాటయిపోయింది.

 

    అంధులు మిగతా ప్రపంచంతో ఏర్పరచుకునే కమ్యూనికేషన్ ని 'బ్రెయిలీ' అంటారు. ఒక కాగితంమీద గుండుసూదితో గుచ్చితే ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది. అలాటి చుక్కల్ని చూపుడు వేలుతో స్పృశిస్తే ఎన్ని చుక్కలు వున్నదీ, ఏ పొజిషన్ వున్నదీ తెలుస్తుంది. మొత్తం ఆరుచుక్కలు.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More