Home » Yandamuri veerendranath » Anaithikam
అధ్యాయం - 4
శ్యామల చెప్పిన కథ :
హోటల్ గదిలో అసహనంగా పచార్లు చేస్తున్నాను. నా మూడ్ ఏమీ బాగాలేదు. తిరిగి వెళ్ళిపోవడానికి వెంటనే టిక్కెట్ దొరకలేదు. తప్పనిసరిగా మరో రెండు రోజులు ఇక్కడే వుండవలసిన పరిస్థితి ఏర్పడింది. నా అసహనానికి అది ముఖ్యకారణం కాదు.
నా తండ్రి ఇంట్లో మా పిన్ని- అంటే ఆయన రెండో భార్యతో సహా అందరూ నన్ను బాగానే చూసుకున్నారు. అయితే అదంతా నా పట్ల ఆప్యాయతగా కనపడలేదు. ప్రపంచపు స్త్రీల ప్రతినిధిగా- ఒక ప్రముఖ కేస్ ని టేకప్ చేసిన లాయర్ గా నన్ను గౌరవిస్తున్న హిపోక్రసీ వారి ప్రవర్తనలో స్పష్టంగా కనబడింది. తమ కుటుంబం తాలూకు ఒక స్టేటస్ సింబల్ గా నన్ను తమ చుట్టు ప్రక్కల వారికి పరిచయం చేయడం నాకు మరింత చికాకుని కలిగించింది. "మా అమ్మాయండీ! మొన్న బి.బి.సి. టీ.వీ.లో చూసే వుంటారు" అంటూ వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేశాడు నా తండ్రి. వీటన్నిటికన్నా విసుగు కలిగించిన విషయం మరొకటుంది. నా తల్లి గురించి వాళ్ళు మాట్లాడే విధానమది!
నా తల్లి చర్యల పట్ల అయిష్టంతో ఆమె నొదిలేసి నేను వచ్చినమాట నిజమే! అయితే గ్రామఫోను రికార్డు పెట్టినట్టు అనుక్షణమూ వాళ్ళు అదే పాయింట్ ని రకరకాలుగా విశ్లేషించి చెబుతూ వుండటంతో నాకో విధమైన నిర్లిప్తత ఆవరించింది.
ఒక కూతుర్ని కలుసుకున్న సంతోషంకన్నా, ఒక ప్రముఖ వ్యక్తి తన వాదనని సమర్ధిస్తోంది అన్న సంతృప్తే నా తండ్రి కళ్ళలో కనపడింది. నేనేమి ఆశించి వచ్చానో అది ఆ ఇంట్లో దొరికినా కూడా ఏదో తెలియని అంతర్లీనమైన లౌక్యం, కనపడని స్వార్థం నాకు అక్కడ కనపడ్డాయి. ఇక అక్కడ వుండలేక, నన్ను కలుసుకునేందుకు చాలామంది ప్రముఖ సంస్థల ప్రతినిధులు వస్తారనీ, వారికి వీలుగా వుంటుందన్న నెపంతో హోటల్ గదికి మారిపోయాను.
ఇంగ్లండ్ వెళ్ళాక నేనేం చేయాలని ఆలోచిస్తుండగా, రిసెప్షన్ నుంచి ఫోన్ వచ్చింది. నన్ను కలుసుకోడానికి ఎవరో అనుమతి కావాలని కోరారు. చేసే పనిలేదు కాబట్టి రమ్మన్నాను.
* * *
" 'ది ఉమన్' అన్న పుస్తకాన్ని బాన్ చేయమని వాదించిన లాయర్ ఇక్కడున్నారంటే ఆసక్తితో వచ్చాను. ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలని నా స్నేహితుడైన ఒక రచయిత ఉద్దేశ్యం. ప్రస్తుతం అతను ఊళ్ళో లేడు. తిరిగి మీరు వెళ్ళిపోతారు కాబట్టి, అతని తరఫున మీతో కొంతసేపు మాట్లాడాలనుకుంటున్నాను- మీకేమీ అభ్యంతరం లేకపోతే".
"ఒక పుస్తకాన్ని శాశ్వతంగా నిషేధించాలని వాదించిన నాతో- ఆ పుస్తకాన్ని మరో భాషలోకి అనువదించాలనుకునే మీరేం మాట్లాడతారు? ఏముంటుంది మాట్లాడడానికి".
"దానిదేముంది? మనం చేస్తున్న పనులకీ, మనం వెలిబుచ్చే భావాలకీ పొంతన లేని వ్యక్తులు ఈ ప్రపంచంలో చాలామంది వుంటారు. మీరుకూడా ఆ కేటగిరీకి చెందినవారైతే, మనం కూడా హాయిగా ఈ మనుషుల గురించీ, వాళ్ళ అమాయకత్వం గురించీ బోలెడు మాట్లాడుకోవచ్చు".
నేను మొహం చిట్లించి, కోపంగా- "మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతోందా?" అన్నాను.
"ఒక స్త్రీ అనాలోచితంగా ఒక పని చేసింది. దాని పరిణామానికి బద్ధులై తన బతుకేదో తను బతుకుతోంది. ఇందులో తప్పేముంది? స్త్రీల తరఫున అంతర్జాతీయ స్థాయిలో వాదించిన మీరు- ఆ స్త్రీ తరఫున సానుభూతి...క్షమించాలి. సానుభూతి అన్న పదం స్త్రీలపట్ల ఉపయోగిస్తే మీకు కోపం వస్తుందేమో! ఆ స్త్రీని అర్థం చేసుకుని మానసిక స్థయిర్యాన్ని ఇవ్వడం పోయి, మీరు 'చెప్పేది ఒకటి; చేసేది ఒకటి' కేటగిరిలోకి వస్తారనుకున్నాను". అతడి మాటల్లోకి ఎగతాళికి నాకు విపరీతమైన కోపం వచ్చింది. "మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?" అన్నాను విసురుగా.
"నీ తల్లి పట్ల నీ ప్రవర్తన గురించి".
"నా తల్లి గురించి మీకేం తెలుసు?"
"బాగా తెలుసు. ఆ మాటకొస్తే నీకన్నా బాగా తెలుసు".
"అదే ఎలా అని అడుగుతున్నాను".
"తల్లి పుట్టిల్లు మేనమామకి తెలియదా, శ్యామలా?" అన్నాడు.
ఒక్కక్షణం విస్తుపోయి, నెమ్మదిగా తేరుకుని, "...శ్రీకాంత్ మావయ్యా?" అన్నాను.
అవునని తలూపాడు. నేను నవ్వేశాను.
"ఒకటి రెండుసార్లు ఫోన్ లో మాట్లాడటమే కానీ, ఇదే మొదటిసారి చూడటమవడంతో గుర్తుపట్టలేకపోయాను. నిజంగానే మీ స్నేహితుడు ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాడా?"
"లేదు. అలా చెప్తే తప్ప ఇంటర్వ్యూ ఇవ్వవనుకున్నాను. అసలే చాలా వేడిమీద ఇండియా వచ్చావు కదా! ముందు కాస్త వేడి టీ తెప్పించు. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం!"
2
"మీరెంత వాదించినా సరే, ఎందుకో నా తల్లి చేసిన పని కరెక్ట్ అని సమర్ధించుకోలేకపోతున్నాను".
"కరెక్టని నేనూ వాదించడం లేదు. చాలా సామాన్యమైన..... ఒక చిన్న పొరపాటుకి నువ్వు ఆమె పట్ల అంత విరక్తి చెందడం అనవసరమని వాదిస్తున్నాను".



