Home » Yandamuri veerendranath » Anaithikam


    నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నది మా కొలిగ్ మేరీ ఒక్కతే. "ఇక ఆరు నెలల విడాకులు లభించేవరకూ నువ్విలా కష్టపడక తప్పదేమో" అంది. "కనీసం ఆరు నెలల తర్వాతైనా సుఖంగా వుండచ్చన్న ఆశ నీకుంది. నెల నెలా భరణం ఇస్తూ అతన్నుంచి దూరంగా వుండవచ్చు. కానీ నా పరిస్థితి అలా కాదు. పెళ్ళి కెదుగుతున్న ఇద్దరు కూతుళ్ళున్నారు. నా భర్తకి నా మీద చచ్చేంత అనుమానం. ఇద్దరం సమానంగా సంపాదిస్తున్నాం. జీతమంతా అతని చేతిలో పెట్టాలి. అతడి తాగుడుకు పోను మిగిలిన దానితో సంసారం గడపాలి. ఒక చిన్నమాట ఎదురుచెప్తే ఎలా కొడతాడో మీరెవరూ కల్లో కూడా ఊహించలేరు. వెన్నెముక విరిగిపోయిందా, తల్లో నరం చిట్లిందా అనికూడా చూసుకోడు. పైకి కనపడని దెబ్బలు. విడిపోవడం చాలా సులభం. కానీ కూతుళ్ళ పెళ్ళిళ్ళెవరు చేస్తారు? విడిపోతే రకరకాల ప్రచారాలు ప్రారంభమవుతాయి. నా ముసలి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారని భయం. నా చిన్న చెల్లికి పెళ్ళి కాదేమో కూడా! గొప్ప సాంప్రదాయం కల కుటుంబం మాది. అందుకనే అన్నీ నోరు మూసుకుని భరిస్తున్నాను. మా ఏరియా ఇన్ స్పెక్టర్ మా పక్కింట్లోనే వుంటాడు. నన్ను నా భర్త కొట్టకుండా కాస్త బెదిరించమని చెప్పాను. అలాగే బెదిరించాడతడు. నాలుగు రోజులు లాకప్ లో పడేసి కేసు పెడితే ఉద్యోగం పోతుందని హెచ్చరించాడు. మా ఆయన కాస్త బెదిరాడు. ఆ బెదురు పోవడానికి మరింత తాగొచ్చి విపరీతంగా కొట్టాడు. అదీగాక ఈసారి ప్రమాదం మరోవైపు నుంచి వచ్చింది. నా స్థితి తెలుసుకున్న ఇన్ స్పెక్టర్ సానుభూతి పేరిట ఈ అవకాశాన్ని వాడుకోవటానికి ప్రయత్నించాడు. 'ఉమెన్ ప్రొటెక్షన్' కి అర్థం కొత్త కోణంలో చూపించడానికి ప్రయత్నించాడు. నీతో పోల్చుకుంటే నా సమస్య ఎంత పెద్దదో చూశావా?"

 

    నాకో విషయం అర్థమైంది. ఎవరి సమస్యా పెద్దది కాదు. ఎవరి సమస్యా చిన్నది కాదు. 'అత్తగారూ, ఆడపడుచులూ తనతో ఇంటిపనంతా చేయిస్తున్నారు' అన్నదే ఒక విద్యాధికురాలైన గృహిణికి భరించలేనంత సమస్యై, సానుభూతికోసం మరొకరిని ఆశ్రయించవచ్చు. విడిపోతే కూతురి పెళ్ళవదేమోనన్న భయంతో భర్తతో వెన్నెముక విరిగేలా తన్నులు తింటూ సంసారం చేయడం మరొక స్త్రీ సమస్య కావచ్చు. 'విషాదంలోనూ, త్యాగంలోనూ ఆనందం పొందడం' మరొకరి సమస్య కావచ్చు. ప్రతిదీ పరిష్కారంలేని సమస్యగానే కనపడవచ్చు.

 

                                                          *    *    *

 

    నా సమస్యకి పరిష్కారం మాత్రం సులభంగానే లభించింది. ఒకరాత్రి పదింటికి సురేష్ తాగొచ్చి చాలా గొడవ చేశాడు. వెళ్ళి పొమ్మని ఎంత చెప్పిన విన్లేదు. ఆ రోజే మద్రాసు నుంచి వచ్చాడట. అతడి రెండో భార్య (?) కొత్త ప్రపోజల్ చెప్పిందట.

 

    "కావాలంటే నా బాగోగులు చూస్తూ నాతోనే వుండు. ఒక తోడుంటే నాకూ గౌరవంగానే వుంటుంది. అయితే నా వ్యక్తిగత విషయాల్లో ఏమీ జోక్యం కలిగించుకోకూడదు. ఇదంతా చేస్తే దానికి ప్రతిఫలంగా నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను" అందట. అది చెప్తూ సురేష్ ఆవేశంతో వణికిపోయాడు.

 

    "ఆ... (ఓ బూతుమాట) ఎంత మాటందో చూశావా? నేనేమైనా బ్రోకర్నా? ఆవిడ చేసేదంతా నేను సహించాలట. అలా చేస్తున్నందుకు బదులుగా నన్ను పోషిస్తుందట. ఆవిడ రాత్రి ఎంత ఆలస్యంగా వచ్చినా, ఎంత చీదరించుకున్నా సహిస్తూ బతకాలిట. దీనికన్నా ఏదైనా వ్యభిచారుల కొంపలో తార్పుడు పని చేయడం సుఖం. ఆ మాత్రం డబ్బులు అక్కడా వస్తాయి. దీనికి మొగుడుగా బతకడంకంటే అదే మంచిది".

 

    నేను నవ్వాను. పొలమారి కళ్ళవెంట నీళ్ళు వచ్చేంతగా నవ్వొచ్చింది. నేనంతలా ఎందుకు నవ్వుతున్నానో అతడికి అర్థం కాలేదు. నాకేమైనా పిచ్చెక్కిందనుకున్నాడో ఏమో తెలీదుగానీ విస్తుపోయి నా వైపు చూశాడు.

 

    నేనన్నాను- "నువ్వు చివర్లో చెప్పింది నిజమైన పక్షంలో మన దేశంలో యాభైశాతం పైగా స్త్రీలు సంసారాలు చెయ్యడం కన్నా వ్యభిచారం చెయ్యడం మంచిదనుకోవాలి సురేష్! నీ రెండో భార్య చెప్పినదంతా ఒక స్త్రీకి అన్వయించి చూడు. ఈ సమాజంలో ఎంతో మంది మగవాళ్లు ఇన్ డైరెక్టుగా తమ భార్యలకి చేస్తున్న ప్రపోజల్ అదేగా!! 'సమాజంలో మీకు భార్యగా హోదా కల్పిస్తాం. మీ పోషణ బాధ్యత మేము తీసుకుంటాం. మేమేం చేసినా పట్టించుకోకూడదు. మేం తిట్టినా, చీదరించుకున్నా ఎదురు తిరక్కండి' అంటూ సంసారాలు సాగిస్తున్నారు. ఎంతో నిశ్శబ్దంగా, నిస్సహాయంగా, నిర్లిప్తంగా స్త్రీలు ఆ బాధ్యతని గౌరవంగా స్వీకరిస్తున్నారు. దానికన్నా బ్రోకరు పని మంచిదంటావేమిటి సురేష్? గట్టిగా అనకు. ఏ గృహిణి అయినా కొంపదీసి వింటే బాధపడుతుంది". అప్పటికే తాగుడు మత్తులో ఇరిటేటింగ్ గా వున్న సురేష్ ఈ మాటలతో మరింత కృద్ధుడై "ఇలాంటి వాదనలు నేనూ లక్ష చేయగలను" అంటూ ఊహించని వేగంతో వెళ్ళి ముందు తలుపు వేసి వచ్చాడు. నేనా ఇంట్లో దిగి అప్పటికి వారం రోజులే అయింది. ఆ చుట్టు పక్కల ఇళ్ళు లేవు.

 

    అతడు అడుగు ముందుకు వేశాడు.

 

    ఆ ఆలోచనా, అంత శక్తీ నాకెలా వచ్చాయో తెలియదు. రెప్పపాటు కాలంలో లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాను. అతడు బయటి నుంచి బలంగా తలుపులు బాదసాగాడు. నిమిషం తరువాత తలుపు తీశాను.

 

    "ఇంకో అయిదు నిముషాలలో పోలీసులు వస్తున్నారు. సురేష్! ఈ ఇంటికి ఫోన్ వుందనే విషయం నీకు తెలియదు!" అన్నాను అతడేం కంగారుపడలేదు. పైగా బిగ్గరగా నవ్వాడు.

 

    "భార్యభర్తల మధ్య గొడవ ఇది. వాళ్ళేం చేస్తారు. పాపం?" అన్నాడు. అంతలో తలుపు చప్పుడైంది. అతడు స్వయంగా వెళ్ళి తలుపు తీశాడు. వచ్చింది ఏ.ఎస్.పి.

 

    "ఆవిడ విషయంలో నువ్వేం జోక్యం కలిగించుకోకు, మిస్టర్! త్వరలో ఆమెకు విడాకులు రాబోతున్నాయి. ఆమెని శాశ్వతంగా మరిచిపో!' అంటూ హెచ్చరించాడు ఏ.ఎస్.పి.

 

    ఆయన దగ్గరకే గతంలో నేను వెళ్ళి సహాయం చేయమని కోరింది. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమని చెప్పింది ఆయనే.

 

    సురేష్ ఆయనతో వాదించాడు. "ఆమె నా భార్య. ఓ సంసారం నిలబెట్టవలసింది పోయి, మీరే ఇలా మాట్లాడతారా?"

 

    "నీకన్నా ఎక్కువ నక్కజిత్తులు వేసే మగాళ్ళని నేను నా సర్వీసులో లక్షమందిని చూశాను. మళ్ళీ ఇటువైపు వస్తే కాళ్ళు విరగ్గొడతాను".

 

    "ఎందుకు విరగ్గొడతారు? నేను చేసిన తప్పేమిటండీ? వస్తాను. మళ్ళీ వస్తాను. ప్రతిరోజూవస్తాను!" అతడి మాటలింకా పూర్తికాలేదు. ఏ.ఎస్.పి. వేగంగా నా దగ్గరకొచ్చి ఏం జరుగుతుందో నేనూహించేలోగా తన తాళాల గుత్తి తాలూకు చాకుతో నా మోచేతికింద సన్నటి గాటు పెట్టాడు. నిశ్చేష్టుడై చూస్తున్న సురేష్ తో "తాగినందుకు ఒక కేసు, హత్యాప్రయత్నం మీద మరొక కేసు నీ మీద బుక్ చేస్తున్నాను. పద! అంటూ మెడ పట్టుకుని తోసుకెళ్ళాడు.

 

    సురేష్ ని జీప్ ఎక్కిస్తూ నావైపు తిరిగి, "ఈ కేసు ఆధారంగా నీకు విడాకులు తొందరగా లభ్యమయ్యేలా చేసుకోవచ్చమ్మా! మిగతా విషయాలు ఏం చెయ్యాలో మీ లాయర్ నీకు చెప్తాడు. ఇతన్ని మాత్రం లాకప్ లోంచి బయటపడకుండా చూసే బాధ్యత నాది!" అన్నాడు.

 

    "థాంక్స్ ఏ.ఎస్.పి.గారూ! ఈ సమాజంలో స్త్రీకి జరిగే న్యాయం పట్ల నాకున్న కొన్ని అపోహలను తొలగించారు!" అన్నాను చేతులు జోడించి.

 

    "ప్రతీ స్త్రీ సమస్యా ఇంత నాటకీయంగా సుఖాంతం అవుతుందని అనుకుంటే అది పొరపాటమ్మా!" అన్నాడు నవ్వి.

 

                                          * * *


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More