Home » Yandamuri veerendranath » Anaithikam
"చూడమ్మా, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలెన్నో వస్తుంటాయ్. తొందరపడి బతుకు బజారుపాలు చేసుకోకు" అన్నది ఇన్ స్పెక్టరు.
"నేనేం తొందరపడడంలేదు. మేము విడిపోయి చాలాకాలమైంది. అతడిప్పుడొచ్చి గొడవ చేస్తున్నాడు" అన్నాను విసుగ్గా.
"విడిపోయినట్లు రుజువులున్నాయా?"
"అసలు మేము వివాహమే చేసుకోలేదు".
"వివాహం జరగనట్లు రుజువులున్నాయా?"
నేను విస్తుపోయి "జరగనట్లు రుజువులేమిటీ? జరిగినట్లు వుండాలి గానీ" అన్నాను.
"మీరిద్దరూ కలిసున్నారు కదా! వివాహం జరిగినట్టు అదే రుజువు. అయినా మీకు ఏ విధమైన ప్రొటెక్షన్ కావాలి? అతనేమైనా కత్తితో పొడిచాడా? కిరసనాయిలు పోసి తగలెట్టే ప్రయత్నం చేశాడా?"
నాకేం జవాబు చెప్పాలో తెలీక వచ్చేశాను. నేను ఇంటి కొచ్చేసరికి ఇంటి యజమాని నా కోసం ఎదురుచూస్తున్నాడు.
"నువ్వేదో మామూలుగా ఉద్యోగం చేసుకునే అమ్మాయివనుకున్నాను. మొగుడితో గొడవలున్నాయటగా! రాత్రంతా అరుపులూ కేకలూ నట కదా!! చుట్టుప్రక్కలవాళ్ళు ఈ రోజు పొద్దున్నే మాకు ఫోన్ చేసి చెప్పారు. నువ్వు నెలాఖరుకల్లా ఇల్లు ఖాళీ చేస్తే మంచిది" అని క్లుప్తంగా అనేసి లేచి వెళ్ళిపోబోయాడు.
"నేనెందుకు ఖాళీచెయ్యాలి? చెయ్యను" అన్నాను కసి, ఉక్రోష, కోపం మిళితమైన స్వరంతో.
ఆ మరుసటిరోజు పొద్దున ఒక గూండా మా ఇంటికొచ్చాడు. అ వీధికి అతడు పెద్ద రౌడీ అట. త్వరలో మునిసిపల్ కౌన్సిలర్ కాబోతున్నాడు. అతడిని మా ఇంటి యజమాని పంపించాడు. రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చెయ్యాలని అల్టిమేటమ్ ఇచ్చాడు. ఇంటి గదుల్లోకీ, నా శరీరంలోకి తొంగిచూస్తూ "ఒంటరిగా వుంటున్నట్టున్నావ్. కావాలంటే ఇంతకంటే మంచి ఇంట్లో పెడతా. ఆలోచించుకో" అని వెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రం నాకు తెలిసిన మా ఆఫీసు లాయర్ని కలుసుకున్నాను. నేను చెప్పినదంతా ఆయన సావధానంగా విన్నాడు. "అతడు నిన్ను కొట్టడం, తిట్టడం చేయనంతకాలం అతడిపై కేసు పెట్టలేవు. క్రిమినల్ ట్రెస్ పాస్ కింద అరెస్ట్ చేయించాలంటే అతడు నీ భర్త కాదని నిరూపించాలి. లేదా విడాకులు మంజూరు కావాలి. విడాకులు వద్దని అతడు జడ్జీలను బతిమాలిన పక్షంలో, వాటిని నువ్వెందుకు కోరుకుంటున్నవో సహేతుకమైన కారణం చూపగలిగి వుండాలి. నువ్వు ఆర్థికంగా ఉన్నత స్థితిలో వున్నావు కాబట్టి అతడికి ఉద్యోగం లేదు కాబట్టి అతడికి ప్రతి నెలా కొంత భరణం చెల్లించమని కూడా కోర్టు నిన్ను ఆదేశించవచ్చు. ఏది ఏమైనా విడాకుల కేసు తేలడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది" అన్నాడు.
ఈ ఆరునెలల్లోనూ సురేష్ ఎంత ఇబ్బంది కలగజేస్తాడో తలుచుకుంటుంటే ఒళ్ళు జలదరించింది. అంతకన్నా పెద్ద సమస్య ఇల్లు ఖాళీ చేయడం. తిరిగి నా పూర్వపు వర్కింగ్ ఉమన్స్ హాస్టల్ కి వెళ్ళి చేరిపోయాను. మరుసటిరోజు సాయంత్రం సురేష్ అక్కడికి వచ్చాడు. అతనితో నేను మాట్లాడవలసిందేమీ లేదని బయటకి కబురు చేశాను.
"ఆమె నా భార్య. మమ్మల్ని విడగొట్టే అధికారం మీకెవరిచ్చారు? వర్కింగ్ ఉమన్స్ హాస్టల్స్ కి అర్థం ఇదేనా?" అని అతను బయటినుంచి గట్టిగా అరవటం వినిపించింది. నా హాస్టల్ మేట్స్ కొందరు నావైపు సానుభూతిగా, మరికొందరు నాటకీయమైన దయతో, ఇంకొందరు ఏదో జరగాలన్న కుతూహలంతో, ఏమీ జరగలేదన్న నిరాశతో చూడడం గమనించాను.
సమాజం అంటే ఏమిటో అదెక్కడుంటుందో నాకర్థమైంది.
* * *
ఈసారి ఉమన్ ప్రొటెక్షన్ సెల్ లో పై అధికారి అయిన ఎ.సి.పి.ని కలుసుకున్నాను. ఇంత జరుగుతున్నా కూడా ఈ విషయాలేవీ శ్రీకాంత్ కి తెలియడం నాకిష్టం లేకపోయింది. 'స్త్రీకి ఏ కష్టం వచ్చినా చివరికి ఆదుకోవలసింది పురుషుడే' అన్న చేదుసత్యాన్ని కనీసం నేనైనా అబద్ధమని నిరూపించాలని చేస్తున్న ప్రయత్నంలో ఒక భాగమిది.
ఎ.సి.పి. కాస్త తార్కికంగా ఆలోచించగలిగేవాడిలా కనపడ్డాడు. "నీ బాధని నేను అర్థం చేసుకోగలనమ్మా. ఇంతకన్నా ఎక్కువ కష్టాల్లో వున్న స్త్రీల కథలెన్నిటినో నేను విన్నాను. చెప్పుకోవడానికి వీల్లేని కష్టాలవి. చెప్పినా ఎవరూ నమ్మని కష్టాలు. అసలిలాంటి కష్టాలుంటాయా అనుకునే కష్టాలు. ఇదీ ఒక కష్టమేనా అనుకునే కష్టాలు. దీనికి చేతనైనంతలో నేనొక పరిష్కారం చెప్తాను. అతడెలాగు తాగి వస్తున్నాడంటున్నావు కాబట్టి, ఈ సారలా వచ్చినప్పుడు నాకు ఫోన్ చెయ్. ఆ ఒక్క కారణం చాలు. అతడు కనీసం మూడు రోజులు లాకప్ లో వుండాలి. వాడి కీళ్ళు విరగ్గొట్టెయ్యడానికి ఆ మూడు రోజులు చాలు. నీ వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను" అన్నాడు.
సీత, సావిత్రి జన్మించిన దేశంలో పుట్టిన కారణంగా ఏదో బలీయమైన నైతిక నిబద్ధత నన్నలా చేయకుండా ఆపింది అననుగానీ, నాకెందుకో ఆ సలహా అంతగా రుచించలేదు.
ఆ మరుసటిరోజే నేను విడాకులకి పిటిషన్ పెట్టాను. ఇది జరిగిన రెండు రోజులకి మా బాస్ నన్ను పిలిపించాడు. "సురేష్ నిన్న నన్ను కలిసి దాదాపు పావుగంట మాట్లాడాడు. ఉద్యోగం తిరిగి యిమ్మని కోరడాని కొచ్చాడనుకున్నాను. అటువంటి ప్రసక్తి ఏమీ తీసుకురాలేదు. సినిమా డైరెక్టర్ అవుదామన్న ప్రయత్నంలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన మాట వాస్తవమే అయుండచ్చుకానీ, ప్రస్తుతం అతడు నిరాశా నిస్పృహలకి కారణం అది కాదట! నిర్దాక్షిణ్యంగా అతడిని నువ్వు వదిలెయ్యడమే కారణమట!! నీ కెవరితోనో సంబంధాలు వున్నాయనీ, జీవితంలో పైకి రావడంకోసం దేనికైనా తెగిస్తావనీ అభియోగం చేశాడు. ఎలాగైనా సరే తన సంసారం నిలిపే బాధ్యత తీసుకోమని వేడుకొన్నాడు. ఆఫ్ కోర్స్, మీ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం నా అభిమతం కాదనుకో! కానీ ఆ సమస్యల ప్రభావం ఉద్యోగం మీద పడకుండా చూసుకో! ఇక నువ్వెళ్ళవచ్చు" అన్నాడు.
నాకీసారి దుఃఖమూ, ఉక్రోషమూ రాలేదు. పురుషాధిక్య సమాజం అంటే ఏమిటో అర్థమైంది. ఒక పురుషుడు తల్చుకుంటే స్త్రీని కొట్టకుండా, తిట్టకుండా ఎన్నివిధాలుగా బాధపెట్టగలడో తెలిసింది. తనకన్నా ఒకడుగు ముందుకెళ్ళిన స్త్రీని వెనక్కి లాగడానికి ఎన్ని రకరకాల వేషాలు వేసి సమాజపు సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తాడో కూడా తెలిసింది.
సురేష్ ని వద్దనుకోవడంలో నా తప్పేమిటో నాకర్థంకాలేదు. అతడి నుంచి విడివడిన తర్వాత నా బతుకేదో నా మానాన నేను బతుకుతున్నాను. అయినా ఈ దురాక్రమణ ఏమిటి?
ఈ నాటకంలో నా చుట్టూ వున్న ప్రేక్షకులందరూ సురేష్ పట్ల సానుభూతి చూపించడం మరింత బాధాకరం.
'మా సంసారాన్ని నేను కష్టపడి నిలబెట్టుకోదల్చుకుంటుంటే- నా భార్య తనకున్న అక్రమ సంబంధాలతో, అహంభావంతో దాన్ని కూలదోయాలనుకుంటోంది. మీరైనా రక్షించండి' అన్న వాదనని నా భర్త పటిష్టంగా ఏర్పరిచాడు. ఏ న్యాయస్థానంగానీ, ఏ ఉమన్ ప్రొటెక్షన్ సెల్ కానీ ప్రవేశించలేని దుర్భేద్యమైన కోట ఇది.



