Home » Yandamuri veerendranath » Prarthana
"వద్దు వద్దు" అని అరుపులు సభలోంచి వినబడ్డాయి. ఒక ఆవేశపూరితుడైన యువకుడు లేచి, "ఆ పిచ్చోడిని తన్ని తగలెయ్యక ఎందుకండీ టైమ్ వేస్టు" అన్నాడు.
"మూర్ఖులారా?" అంటూ అరిచాడు భార్గవ.
"నేను కాదు పిచ్చోడిని మీరు, మీరందరే పిచ్చోళ్ళు. పొంచివున్న ప్రమాదాన్నే పసిగట్టలేకపోతున్నారు. నేనెంతో కష్టపడి కనుక్కున్నాను. ఈ విషయాన్ని. దీన్ని సేకరించటంలోనే ఉద్యోగం కోల్పోయాను. ఈ కష్టమంతా మీ కోసం, మీ సంక్షేమం కోసం. మెథైల్ కోరి..." ఒక రాయి రివ్వున వచ్చి అతడి మొహానికి తగిలి ఆవేశానికి ఆనకట్ట వేసింది.
'అమ్మా' అంటూ మొహాన్ని చేతుల్తో కప్పుకుని అతడు కుప్ప కూలిపోతూ వుండగా, ఒక చెప్పు గాలిలోకి ఎగిరింది.
దున్నపోతు ఈ గొడవకి దూరంగా వెళ్ళిపోయింది.
ఆ సభలో కొందరు ప్రతిపక్షం వాళ్ళు కూడా వున్నారు. అదే అదను అనుకుని మంత్రిమీద కుళ్ళిన కోడిగ్రుడ్లు విసరటం ప్రారంభించారు. వాళ్ళు ఇలా సభ పాడవటం కోసమే చూస్తున్నారు. క్షణంలో దూరంగా వున్న పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీచార్జి మొదలైంది. టమాటాలూ, పాత చెప్పులూ గాలిలోకి ఎగిరే స్టేజివేపుకి వస్తున్నాయి. పైకి రానివి క్రింద భార్గవకి తగులుతున్నాయి. జనం పరుగెడుతున్నారు. ఎవరో దొంగ ఇదే అదనుగా భావించి భార్గవ చేతిలోంచి బ్రీఫ్ కేస్ లాక్కొని పరుగెత్తాడు. అతడి వస్తువులూ, జీవితాంతం కష్టపడి తయారుచేసుకున్న రీసెర్చి పేపర్లూ అన్నీ పోయాయి. వెళుతున్న వాడిని నిరోధించటం కోసం అతడు లేవబోయాడు. ఒక లాఠీ వచ్చి బలంగా మొహంమీద తగిలింది.
అతడికి స్పృహ తప్పింది.
7
తిరిగి అతడికి స్పృహ వచ్చేసరికి దాదాపు సాయంత్రం కావొస్తూంది. బల్లలమధ్య పడి వుండటంతో అతడినెవరూ గమనించలేదు. సభ చిందర వందర అయినట్టూ అక్కడ విరిగిన వస్తువులే చెపుతున్నాయి.
అతడు కళ్ళు విప్పగానే, అతడిపక్కన తోకాడించుకుంటూ నిలబడ్డ కుక్క పక్కకి వెళ్ళిపోయింది. మొహానికి ఈగలు ముసురుకున్నాయి. అతడు లేవబోయాడు. వళ్ళంతా పట్టేసినట్టూ బాధ కలిగింది. అతికష్టం మీద లేచి నిల్చున్నాడు.
దూరంగా ఇద్దరు పనివాళ్ళు సామానులు సర్దుతున్నారు. ఇతడిని పట్టించుకోలేదు.
భార్గవకి అకస్మాత్తుగా కూతురు జ్ఞాపకం వచ్చింది. దాదాపు రెండ్రోజులైంది ప్రార్థనని చూసి. ఆ ఆలోచన రాగానే శారీరక బాధకన్నా మానసిక వ్యధ ఎక్కువైంది. ఇక్కడ తనేమో తన శోధనలలోనూ పరిశోధనలోనూ నిమగ్నమై వున్నాడు. అక్కడ కూతురు గురించి అసలు పట్టించుకోలేదు. ఆ ఆలోచన రాగానే అతడి అడుగుల వడి పెరిగింది.
ఎలా చేరుకున్నాడో తెలీదు. ఆస్పత్రి చేరుకున్నాడు. అదృష్టవశాత్తు గూర్ఖాలేడు. అతడు లోపలికి ప్రవేశించి మెట్లెక్కి కూతురి గది వున్న వార్డులోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా అతడి మనసు కీడును శంకించింది.
వరండా నిర్మానుష్యంగా వుంది.
అంతలో లోపల్నుంచి ఒక నర్సు బయటకు వచ్చింది.
"ప్రార్థనకెలా వుంది?" అని అడిగాడు. ప్రార్థన ప్రసక్తి వచ్చేసరికి ఆమె మొహంలో సడెన్ గా మార్పు వచ్చింది. అనుమానంగా 'ప్రార్థనకి నువ్వేమవుతావు' అని అడిగింది.
"తండ్రిని".
"మైగాడ్! తండ్రివై వుండి ఇప్పుడా రావటం".
ఒక్కసారిగా భార్గవ గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. తడారిన గొంతుకతో "ప్రార్థనకి... నా ప్రార్థనకి ఏమైంది" అన్నాడు.
"పేషెంట్ నెం. 226 గురించే కదా మీరు చెపుతున్నది" అని అడిగింది నర్సు.
"అవును".
"మధ్యాహ్నం వరుసగా నాలుగు వాంతులు అయ్యాయి. అండ్ దేర్ వజ్ బ్లడ్ ఇన్ ఇట్".
"బ్ల... డ్ ...??"
"అవును. నేను డ్యూటీలో లేనప్పుడు. కానీ డాక్టర్ మహేంద్ర చెపుతూ వుండగా విన్నాను? సమ్ ట్రబుల్ విత్ స్ల్పీన్ ఐ థింగ్..."
"ప్రార్థన ఎక్కడుంది?"
"ఇంటెన్సివ్ కేర్".
అతడు అక్కడకు చేరుకొని ఆత్రంగా లోపలికి అడుగు పెట్టబోయి హఠాత్తుగా ఆగిపోయాడు.
తన కూతురేనా? ... ప్రార్థనేనా?... కళ్ళనే నమ్మబుద్ధి కావటం లేదు. సరీగ్గా పదిరోజుల క్రితం ఎంతో ఆరోగ్యంగా స్కిప్పింగ్ చేసిన చేతులు ఇప్పుడు వడలిపోయిన తామర తూడుల్లా వ్రేలాడుతున్నాయి. విపరీతంగా మందులు వాడటంవల్ల జుట్టు వూడిపోయి నుదురు మరింత విశాలంగా కనిపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కెమికల్ రియాక్షన్ వల్ల చర్మమంతా రింగులుగా మచ్చలు ఏర్పడ్డాయి.
అతడు స్థబ్దుడై నిర్వీర్యుడై కూతురి ఆకారంవైపు చూసేడు. తన మీద దొంగతనం మోపబడ్డప్పుడు దుఃఖం రాలేదు. బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు దుఃఖం రాలేదు. ప్రజలు వెలివేసి కొట్టినప్పుడు దుఃఖం రాలేదు. ఇప్పుడు వచ్చింది. తన నుంచి తనను ఎవరో బలవంతంగా విడదీస్తున్న భావనతో- దుఃఖం.
ఆమె ఛాతి ఎగిరెగిరి పడుతూంది. ఊపిరి బలంగా తీస్తుంది. అతడు కూతురు దగ్గరకు వెళ్ళి మొహంలోకి చూశాడు. ఆమె శరీరం నుంచి ఎలక్ట్రోకార్డియో గ్రాఫిక్ జతచేయబడి వున్న వైర్లు, ఆమె శరీరం నుంచి బయటికి లాగిన రక్తనాళాల్లా వున్నాయి. గ్రాఫ్ లో చిన్న వెలుతురు చుక్క ఈ చివరన మొదలై కెరటం పయనిస్తూ అవతలి అంచుకు చేరుకుంటూంది. రోగి అలా వుంటే అక్కడ ఎవరూ లేకపోవటం ఆశ్చర్యంగా వుంది.
నాసికా రంధ్రంలోకి వెళ్ళిన ట్యూబ్ మెలికపడి వుండటం చూసి దాన్ని నెమ్మదిగా లాగేడు. చేతికి ఐ.వి. అలాగే వుంది. ఆ అలికిడికి ప్రార్థన కళ్ళు విప్పింది. తండ్రిని చూడగానే ఒక్కసారి ఆ చిన్నపాప మొహంలో వెయ్యికాంతులు ప్రజ్వరిల్లాయి. ఉద్వేగంతో "నాన్నా" అంది.



