Home » Yandamuri veerendranath » Prarthana
పక్క కుర్చీలో వున్నాయన లేచి మంత్రిగారి చెవిలో ఏదో చెప్పాడు.
"ప్రజలారా! ఇంకో శుభవార్త. న పక్కన కూర్చున్న సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీ పి.ఆర్.ఓ. (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్) ఇప్పుడే ఈ వార్త వెల్లడి చేశారు. మీ సంస్థకి, తమ కంపెనీ తరఫు నుండి కేరమ్స్-టేబుల్ టెన్సీస్ తో సహా వివిధ రకాలైన ఆటసామాగ్రి బహుమతిగా ఇస్తున్నారు. అంతేకాదు, ఈ సంస్థకి ప్రతి సంవత్సరమూ అయిదువేలు చొప్పున తమ కంపెనీ ఇస్తుందని వెల్లడి చేస్తున్నారు?"
ప్రజల్లో ఆగకుండా చప్పట్లు.
"కేవలం లాభాపేక్షతో కాకుండా తమ కంపెనీలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం, తమ లొకాలిటీలో వుండే ప్రజలకోసం ఇలా సహాయం చేస్తున్న ఈ కంపెనీ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. చాలా విశాలమైన కాలనీ ఇది. ఇంతటి కాలనీకి కేవలం ఓపెన్ ఎయిర్ స్టేజీ వుండటం ఏమీ బావోలేదు. వర్షాకాలం మరీ కష్టం. అందుకే దీన్ని ఒక థియేటర్ గా మారిస్తే బావుంటుంది. అప్పుడే దీన్ని కళ్యాణమండపంగా కూడా చేసుకోవచ్చు. ఇంత నవీనమైన లొకాలిటీకి ఒక మంచి థియేటర్ లేకపోవడం మనం విచారించవలసిన విషయం. (గట్టిగా) దీనికి మనం సిగ్గుపడాలి".
ఎందుకో తెలియకపోయినా చప్పట్లు కొట్టారు జనం.
"ప్రజలారా! వచ్చేనెలలో ఎలక్షన్లు. మళ్ళీ ఈ లొకాలిటీ నుంచి నన్నే మీ అభ్యర్థిగా ఎన్నుకుంటే, ఈ కళ్యాణ మండపం కట్టించడానికి అయ్యే ఖర్చులో సగం ప్రభుత్వం తరఫు నుంచి గ్రాంటుగా ఇప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాను".
సభ అనందాతిరేకంతో మళ్ళీ చప్పట్లు కొట్టింది. దూరంగా గడ్డి తింటూన్న దున్నపోతు తలెత్తిచూసి, మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది. మంత్రిగారు ఆహ్లాదంగా ప్రజలకేసి చూసేరు. ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా తన సభకి ఇంతమంది వచ్చారంటే ఆనందించవలసిన విషయమే. వచ్చే ఎన్నికలలో తన గెలుపు తథ్యం.... ఈ సభలోనే మహిళా మండలి విభాగం గురించి కూడా మాట్లాడాలి. ఆయన తిరిగి గొంతు సర్దుకోబోతూ వుండగా స్టేజీ క్రింద అలికిడి వినిపించి తలదించి చూసేడు.
భార్గవ మెట్లు ఎక్కుతున్నాడు.
పిచ్చివాడిలా వున్న అతడిని చూసి ఆయన ముఖం చిట్లించాడు. ప్రక్కనున్న పి.ఆర్.ఓ. మాత్రం భార్గవని గుర్తుపట్టేడు. వంగి మంత్రిగారితో, "ఇతడీ లొకాలిటీవాడే. సైంటిస్టు. ఈ ఇన్ స్టిట్యూట్ లోనే పనిచేస్తున్నాడు" అన్నాడు. ఈ లోపులో భార్గవ దగ్గరకొచ్చి "నేను మైకులో ఒక క్షణం మాట్లాడవచ్చా" అని అడిగాడు.
"దేని గురించి?"
"ఈ లొకాలిటీ వెల్ ఫేర్ గురించి"
"అవశ్యం... అవశ్యం..." అంటూ మైకు పట్టుకుని "ప్రజలారా ఇప్పుడు ఈ కంపెనీలోనే వుండే డాక్టరు గారు మాట్లాడుతారు" అని మైకు భార్గవకి అందించాడు.
ఒక క్షణం తన ముందున్న జనంకేసి కన్నార్పకుండా చూసి, భార్గవ మైకులో "ఫ్రెండ్స్" అని ఆగేడు.
ఆగి మళ్ళీ అన్నాడు.
"మనం ఇంకా మూర్ఖులం"
ఒక శీతల వాయువు మీద నుంచి వెళ్ళిపోయినట్టూ సభ అవాక్కయింది. ఒక అల్లరి కుర్రాడెవరో సన్నగా విజిల్ వేసేడు. భార్గవ కొనసాగించాడు.
"మనం ఇంతకాలం మన మధ్యే వున్న ఈ ప్రమాదాన్ని కనుక్కోలేకపోయాం... మన లొకాలిటీలో ఇంత ఎక్కువ రేట్ లో కేన్సర్ లక్షణాలూ, మిగతా అనారోగ్యాలు కనబడటానికి కారణం నేను కనుక్కున్నాను. ప్రజలారా! ఆ కారణం మరేదో కాదు, సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీ ఫ్యాక్టరీ గొట్టంలోంచి వచ్చే మెథైల్ కోరిన్ ధెరీన్ తాలూకు వాయువు".
అప్పటివరకూ నవ్వుతూన్న పి.ఆర్.ఓ. ఉలిక్కిపడ్డాడు. కుర్చీలోంచి ఒక్క ఉదుటున లేచి 'ఏయ్' అన్నాడు. భార్గవ అతడిని పట్టించుకోలేదు. చెప్పుకుపోతున్నాడు.
"ఆ వాయువు బయటికి వచ్చేటప్పుడు చాలా విషపూరితంగా వుంటుంది. అందుకే ఈ ఫ్యాక్టరీలో కార్మికులు- అంటే మీలో చాలా మంది, ఆ సమయానికి మొహానికి మాస్క్ వేసుకుంటారు. వెలువడిన కొద్దిసేపటికి దాని ప్రభావపు ఉధృతం తగ్గినా ఇంకా విషపూరితమే. అందుకు మన లొకాలిటీలో ఇన్ని..." సడెన్ గా ప్రక్కనుంచి ఒక చెయ్యి వచ్చి అతడిని తోసింది. అయినా భార్గవ మైకు వదలలేదు.
పి.ఆర్.ఓ. ముఖం కందిపోయింది. అతడు ఈ పరిణామాన్ని ఊహించలేదు. తన కంపెనీ మీదే ఈ అటాక్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అలా వూహించి వుంటే మైక్ ఇచ్చేవాడు కాదు. అందుకే తిరిగి లాగేసుకోవటానికి ప్రయత్నించాడు. భార్గవ ప్రజల నుద్దేశించి మరింత బిగ్గరగా, "మీకు తెలుసా?" అని అరిచాడు.
"... ఈ రోజు ప్రొద్దున్న ఏసుపాదం అనే కుర్రవాడు చచ్చిపోయాడు! నా కూతురు నేడో-రేపో అదే స్థితిలో వుంది! ఈ మరణాలన్నిటి వెనుక అదృశ్యహస్తం సామ్సన్ కంపెనీ! ఈ కంపెనీ తయారుచేసే మందులన్నీ బోగస్ వి! వాయువుని శుభ్రపర్చకుండా బయటకి వదులుతున్న ఈ ఫ్యాక్టరీకి మనమందరం కలిసి అల్టిమేటమ్ ఇవ్వాలి. ఈ మార్పు అమలు జరిగేవరకూ ఫ్యాక్టరీ మూసెయ్యాలని చెప్పి మనం అలజడి చెయ్యాలి. ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఇదంతా జరగాలి".
అతడు చెప్పుకుపోతున్నాడు.
ఈ లోపులో ఎవరో వచ్చి మంత్రిగారి చెవిలో ఏదో ఊదారు.
పి.ఆర్.ఓ. అయితే భార్గవని బలవంతంగా తోసేశాడు. ఆ ఊపుకి భార్గవ స్టేజీ చివరకు వెళ్ళి అక్కడ నిలదొక్కుకోలేక క్రిందకి పడ్డాడు. స్టేజీ అంచు తలకి తగిలి రక్తం స్రవించసాగింది. కాలి దగ్గిర కూడా మళ్ళీ ఎరుపు అయింది. అయినా అతడు అతి కష్టంమీద లేచి నిలబడి- "నేను చెప్పేది అర్థంచేసుకోండి. కావాలంటే నేను నిరూపించగలను కూడా. ఈ ఇన్ స్టిట్యూట్ రిసెర్చీ- ఆ కంపెనీ పేటెంట్లూ అంతా అమాయకమైన ప్రజల్ని చేస్తున్న మోసం. ప్రభుత్వం దీనికి అండగా వుండటం మన దౌర్భాగ్యం. ఈ లొకాలిటీ వాతావరణం కాలుష్యంతో శ్మశానంగా మారకముందే మనం మేల్కోవాలి. సమ్మె చెయ్యాలి- నిరాహారదీక్ష చెయ్యాలి. ఎలాగయినా ఫ్యాక్టరీని మూసేయించాలి. అదే ఈ కమ్యూనిటీకి వెల్ ఫేర్!....అదే" నోటికి ఉప్పటి రక్తం తగలటంతో ఆపుచేసేడు.
మైకు లేకపోవటంతో అతడి మాటలు ప్రజలకి వినిపించటం లేదు. ఈ లోపులో మంత్రిగారు మైకు పట్టుకుని సానుభూతిగా చెప్పటం ప్రారంభించాడు.
"ఇంత నిండుగా కళకళలాడ్తున్న ఈ సభలో ఈ చిన్న అపస్వరం ఇలా పలకటం నాకు విచారంగా వుంది. ఈ వ్యక్తిమీద నాకు కోపం కూడా రావటం లేదు. అతడో గొప్ప సైంటిస్టట. ఇక్కడే ఇన్ స్టిట్యూట్ లో పనిచేసేవాడట, పాపం మతిస్థిమితం లేకపోవటంవల్ల ఈ మధ్యనే అతడిని ఉద్యోగంలోంచి తొలగించారట. అందుకే ఇలా ఈ ఇన్ స్టిట్యూట్ మీదా, కంపెనీ మీదా కక్షకట్టి ఆ వ్యధతో మరింత పిచ్చివాడయ్యాడు. అంతటి మేధావి ఇలాంటి పిచ్చివాడుగా మారటం మనం చేసుకున్న దురదృష్టం".
"కాదు..." అరిచాడు భార్గవ. అతడి కంఠం బొంగురుపోయింది. "ఫ్యాక్టరీ విషపూరితమైంది. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి". సభని పాడుచెయ్యటానికి ప్రతిపక్షంవాళ్ళు ప్రయోగించిన నాటకమా అని మంత్రిగారు ఓ క్షణం ఆలోచించారు.
"ఈ లొకాలిటీలో వుండే మీలో చాలామంది ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళే. ఇప్పుడు ఇతగాడు చెప్పిన విధంగా ఫ్యాక్టరీని మూసేస్తే మీరందరూ ఏమవుతారు! అసలు ఫ్యాక్టరీ అంటే ఏమిటి? అది తల్లి లాంటిది. తల్లి మీదే అనుమానం పెంచుకోవటం ఆత్మద్రోహం. ఈ పిచ్చివాడు ఆ పనే చేస్తున్నాడు. అయినా మీరందరూ కావాలంటే వెంటనే ఫ్యాక్టరీ మూయించేసి, ఒక ఎంక్వయిటీ కమిటీ వేయిస్తాను. కానీ అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు. మీ శ్రేయస్సే నా శ్రేయస్సు. చెప్పండి అలా చేయించనా"



