Home » Yandamuri veerendranath » Prarthana


    కూతురు కదిలేసరికి అతడు దూరం జరగబోయాడు. కానీ ప్రార్థన అతడి మెడచుట్టూ చెయ్యివేసి అతడిని కదలనివ్వకుండా, "నేనూ వచ్చేస్తాను నాన్నా. నన్ను తీసుకెళ్ళిపో నాన్నా... ప్లీజ్" అంది దాదాపు రోదిస్తున్నట్టు.

 

    అతడు అప్రతిభుడై "అమ్మా- పన్నూ" అన్నాడు.

 

    "వీళ్ళు నన్ను చంపేస్తున్నారు నాన్నా, బాధపెట్టి చంపేస్తున్నారు. నేనిక్కడ అసలు వుండలేను".

 

    కెమోథెరపీ వల్ల ఎంత బాధపడుతుందో ఆ శరీరమే చెపుతూంది. ఇంకేమీ ప్రశ్నలడగలేదు. అతడు "అలాగేనమ్మా వెళ్ళిపోదాం. సరేనా" అన్నాడు లేవబోతూ అనునయంగా నచ్చచెపుతున్నట్టూ.

 

    ప్రార్థన అతడిని లేవనివ్వలేదు. లేస్తే ఎక్కడ వెళ్ళిపోతాడో అన్న భయంతో అలానే చేతులువేసి వుంచింది. ఆ తండ్రి కూతుళ్ళు ఒకళ్ళ చేతుల్తో ఒకరు నిశ్శబ్దాన్ని పంచుకుంటూ వుండిపోయారు.

 

    అంతలో వెనుక కెవ్వున కేక వినిపించింది. ఆ కేక పెట్టింది నర్స్. యధాలాపంగా లోపలికి రాబోతూ బెడ్ పక్కనే మోకాళ్ళమీద కూర్చున్న ఆకారాన్ని చూసి, ఎవరో పిచ్చివాడనుకుని కేకపెట్టింది. వరుసగా అలా పెడుతూనే వుంది. ఇంటెన్సివ్ కేర్ లో ఖరీదైన పరికరాలమధ్య ఆ బికారిలాటి మనిషిని చూసి బెదిరిపోయింది.

 

    ముందో ఇద్దరు హౌస్ సర్జెన్లు పరుగెత్తుకు వచ్చారు. వెనుకే మరో ఇద్దరు నర్సులు అందరికన్నా చివర డాక్టర్ మహేంద్ర జైన్.

 

    అతడు లోపలికి ప్రవేశిస్తూనే భార్గవని గుర్తించాడు. భార్గవ కేక వినిపించగానే తలతిప్పి చూసేడు. నర్సుని చూసి లేవబోయాడు. కానీ ప్రార్థన వదల్లేదు. ఈ లోపులో మహేంద్ర దగ్గిర కొచ్చాడు. పేషెంట్ శరీరం నుంచి పెరికివేయబడ్డ ట్యూబ్స్ ని చూడగానే కోపంతో అతడి భృకుటి ముడిపడింది.

 

    మిస్టర్ భార్గవా! ఇలా ఇంటెన్సివ్ కేర్ లోకి వచ్చే అధికారం మీకెవరిచ్చారు" అని గద్దించాడు.

 

    "ఇంటెన్సివ్ కేర్ అంటే పేషెంట్ ని గాలికి వదిలేసి బైట తిరగటమా?" అంతే కోపంగా భార్గవ కూడా అడిగాడు. పక్కనున్న నర్సు ముందుకొచ్చి ఏదో చెప్పబోయింది. మహేంద్ర ఆమెని ఆగమని చేత్తో సైగచేస్తూ భార్గవతో, "థాంక్యూ ఫర్ యువర్ కామెంట్స్. విల్ యు నౌ గెటౌట్ ఫ్రం హియర్" అన్నాడు.

 

    "ఎందుకు? నా కూతురిమీద మరిన్ని ప్రయోగాలూ చేయటానికా?"    

 

    అతడి జవాబు చూసి డాక్టరు మరింత మండిపడతాడనుకున్నారు అక్కడివాళ్ళు. కానీ మహేంద్ర మొహం అనూహ్యమైన నెమ్మదితనం నిండివుంది. తాపీగా పక్కకి తిరిగి "పోలీస్ స్టేషన్ కి ఫోన్ చెయ్యండి. వియ్ వెల్ గెట్ దిస్ ఫెలో అరెస్టెడ్" అన్నాడు.

 

    భార్గవ ఒక్క ఉదుటున లేచి "దిసీజ్ ఇడియాటిక్" అన్నాడు. "నేనూ డాక్టర్నే. నా కూతురికి ఎలాటి ట్రీట్ మెంట్ ఇస్తున్నారో చూసుకునే హక్కు నాకు ఎప్పుడూ వుంది".

 

    మహేంద్ర మొహంలో అకస్మాత్తుగా విస్మయం కనబడింది. "మీ కూతురా? మీ కూతురేమిటి? మీరింకా కోర్టు ఆర్డరు చూడలేదా?"

 

    భార్గవ వెన్ను చలితో ఒక్కసారిగా వణికింది. తనకి తెలియకుండానే తన వెనుక దారుణం ఏదో జరిగిపోయిందని మనసు చెప్పింది. "కో... కోర్టు ఆర్డరా" అన్నాడు తడబడుతూ. అతడి మొహం చూస్తుంటే ఈ విషయం ఇంకా అతడికి తెలీదని తెలిసిపోయింది.

 

    మహేంద్ర తన కోటు జేబులోంచి కోర్టు ఆర్డరు తీస్తూ "ఇలా బయటకొస్తే చూపిస్తా" అన్నాడు. భార్గవ ఇంకా అయోమయంలోనే వున్నాడు. నిద్రలో నడుస్తున్న వాడిలా అతడితోపాటు నడిచాడు. బయటికి రాగానే మహేంద్ర ఆ కాగితాన్ని భార్గవకి అందించాడు.

 

    అతడు దాన్ని అందుకుని చదవటం ప్రారంభించాడు. మొదటిది కోర్టు ఆర్డరు. రెండోది వసుమతి ఆస్పత్రి అధికారులకిచ్చిన ఇర్రివోకబుల్ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్.

 

    భార్గవ అనబడే తండ్రి-కూతురు యొక్క ఆరోగ్య విషయంలో సరియైన శ్రద్ధ చూపించటం లేదు. కాబట్టి తల్లి అయిన వసుమతిని గార్డియన్ గా నియమిస్తూ టెంపరరీ ఆర్డరు.

 

    అతడి కళ్ళు మసకలు కమ్మాయి. సంవత్సరాల తరబడి పెంచుకున్న పూలతోటని ఎవరో నిర్ధాక్షిణ్యంగా నాశనం చేసినట్టూ కంపించి పోయాడు.

 

    "ఇది అన్యాయం" దిక్కులు కదిలిపోయేలా అరవాలనుకున్నాడు భార్గవ. కానీ గుండెని ఎవరో నొక్కిపట్టినట్టు గొంతు ఆక్రోశించింది. అక్షరాలు అలుక్కుపోయి కనబడ్డాయి. అన్యాయం... అన్యాయం" అంటూ గొణిగాడు.

 

    "ఏది అన్యాయం డాక్టర్ భార్గవా!"

 

    "నా వాదన వినకుండా కోర్టు ఇలా ఆర్డర్ ఇవ్వటం".

 

    "విషయం అర్జెంట్ కాబట్టి పరోక్షంగా తీసుకోవలసి వచ్చింది. మీకూ నాల్గయిదు రోజుల్లో కోర్టు సమన్లు వస్తాయి. మీ వాదన కూడా వాళ్ళు వింటారు. అప్పుడు వాళ్ళకి ఏది సరిఅయినదని తోస్తే ఆ ప్రకారం పర్మనెంట్ ఆర్డరు ఇస్తారు?"

 

    "దానంతటికీ పది పదిహేను రోజులు పడుతుంది".

 

    "అవును. అంతవరకూ ఈ ఛాయలకి వస్తే కోర్టు ధిక్కరణ నేరం క్రింద మీ మీద చర్య తీసుకోబడుతుంది" నిర్లక్ష్యంగా ఆ డాక్టరు చెపుతూన్న సమాధానాలకి భార్గవ మొహం కందిపోయింది. అంతలో ఏదో స్ఫురించినట్లు "కానీ వసుమతి, ప్రార్థనకి సవతి తల్లి... సవతి తల్లికి న్యాచురల్ గార్డియన్ అయ్యే హక్కు లేదు" అన్నాడు.

 

    "అవన్నీ మీరు కోర్టులో తేల్చుకోవలసి విషయాలు"

 

    "ఎప్పుడు.... ? ఎప్పటికి?? ఎప్పటికి ఇవన్నీ తేలేది???" అరిచాడు భార్గవ. దుఃఖం, నిస్సహాయతా కలిసి అతడి గొంతు బొంగురుపోయింది.

 

    "అదృష్టం బావుంటే మొదటి హియరింగ్ లో... అంటే పది పదిహేను రోజుల్లో..."

 

    "అప్పటి వరకూ నేనిక్కడికి రాకూడదు".

 

    "అది 'కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు' అవుతుంది".

 

    "దూరం నుంచి కూడా చూడకూడదు".

 

    "దానికి రూల్స్ వప్పుకోవు".

 

    "ఇది అన్యాయం".

 

    "మా ట్రీట్ మెంట్ మీద నమ్మకంలేని వాళ్ళ సామీప్యాన్ని మేమంతగా హర్షించము డాక్టర్ భార్గవా! అందుకే ఈ కోర్టు ఆర్డర్ లూ ఇవన్నీ... మీరే గానీ మీ తరఫునుంచి మరో కోర్టు ఆర్డరు తెచ్చి చూపిస్తే మీ కూతుర్ని పువ్వులో పెట్టి మీ కర్పించటానికి మాకేమీ అభ్యంతరం లేదు".

 

    "అవును, అర్పిస్తారు..." కళ్ళనిండా నీళ్ళతో పిచ్చివాడిలా నవ్వేడు భార్గవ. "పదిరోజుల తరువాత నేను వస్తే ఏం అర్పిస్తారు మీరు? పిడికెడు బూడిదని ప్యాక్ చేసి అర్పిస్తారా? లేకపోతే మాట నిలబెట్టుకోవటం కోసం అప్పటివరకూ మార్చురీలో పెట్టి నేనొచ్చాక పాడెచుట్టూ పూలు జల్లి శవాన్ని పూలలో పెట్టి అర్పిస్తారా? నే వచ్చేసరికి ఏమీ మిగలదు! నాకు తెలుసు. నాకు తెలుసు..." అతడికి లోపలనుంచి దుఃఖం తోసుకువచ్చింది. కిటికీవైపు తిరిగి ముఖం చేతుల్లో దాచుకుని రోదించసాగేడు. అంత పెద్దమనిషి చిన్న పిల్లాడిలా రోదించటం చూసే వారికి ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ అతడికి ప్రార్థన ఎంత ప్రియాతి ప్రియమైనదో తెలిసినవారికి మాత్రం అది విస్మయం కలిగించదు. ఈ లోకం అంతా కలిసికట్టుగా ఒక తాటిమీద నిలబడి అతడినించి కూతుర్ని వేరుచేసింది. చివరకు కట్టుకున్న భార్య కూడా వారితో కలిసిపోయింది.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More