Home » Yandamuri veerendranath » Anaithikam


    "కాదు. నీ ఆలోచనలు సరైన దారిలో పెడదామని వచ్చాను. అందుకే ఆ రోజు చచ్చిపోవాలనుకుంటే పొమ్మన్నాను కూడా!!"

 

    నా దగ్గర సమాధానం లేకపోయింది. అతడే కొనసాగించాడు.

 

    "భర్తవల్ల ఒక స్త్రీ చాలా కష్టాల్లో వుండి, మరొక పురుషుడి సహాయంతో ఆ కష్టాలనుంచి బయటపడ్డట్టు వ్రాయడం ప్రస్తుత సాహిత్యంలో ట్రెండ్. ఇది మళ్ళీ తిరిగి పురుషుడి మీద ఆధారపడడమే అవుతుంది కదా! నీ కష్టంలోంచి నువ్వెలా బయటపడతావన్నది నీ ఫ్యూనరల్. అందుకే నిన్ను కలుసుకోలేదు.

 

    "మీరు సవ్యంగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటారు శ్రీకాంత్? మీరు సానుభూతితో చెయ్యందించగానే దాన్నందుకుని ఈ ఊబిలోంచి బయటకి రావడానికి స్త్రీ లందరూ వ్యక్తిత్వం లేని మనుషులనా మీ ఉద్దేశం?" శ్రీకాంత్ నవ్వాడు.

 

    "పైకెన్ని నీతులు చెప్పినా చివరికి జరిగేదదే! నువ్వు కష్టాల్లో వున్నావు. నేను సానుభూతి చూపించే నెపం మీద తరచూ కలుస్తుంటాను. అందువల్ల నీకు నా పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుంది. అది ఆకర్షణకి దారి తీస్తుంది. పవిత్ర స్నేహంతో మొదలై- శారీరక సంబంధానికి దారి తీస్తుంది. నీ సమస్య సమస్యలాగే వుంటుంది. నీ స్వేచ్చ కేవలం దాని కోసమే ఉపయోగపడుతుంది". నా మొహం ఎర్రబడింది. "స్త్రీల స్వేచ్చపట్ల మీకింత హీనమైన అభిప్రాయం వున్నందుకు నాకు చాలా విచారంగా వుంది".

 

    "స్త్రీలపట్ల కాదు. తమ బలహీనతలని ఒప్పుకోలేని హిపోక్రాటిక్ మనుషులందరి స్వేచ్చపట్లా నాకంత హీనమైన అభిప్రాయమే వుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం కొనసాగాలంటే ఒక కామన్ అభిరుచో, వృత్తో, మరింకోటో వుండాలి. కనీసం కలిసి చీరల షాపు కెళ్ళడం లాంటి పరస్పర అవసరమైనా వుండాలి. స్త్రీ పురుషుల మధ్య స్నేహానికి ఇవేమీ అవసరంలేదు. ఇద్దరికీ తెలీని అంతర్లీనమైన ఆకర్షణ చాలు. ఆ తరువాత ఇద్దరికీ కాస్త ధైర్యం వుంటే- నైతిక విలువలపట్ల గాఢమైన నమ్మకం లేకపోతే అదెలాగూ చేతివేళ్ళ స్పర్శకి దారితీస్తుంది. నా ఉద్దేశంలో పైన చెప్పిన ఆకర్షణకీ, చివర్లో చెప్పిన శారీరక సంబంధానికీ పెద్ద తేడాలేదు" అని ఆగి కొనసాగించాడు.

 

    "సమాజం కొన్ని కట్టుబాట్లు ఏర్పరచింది ఈ కారణం వల్లే!! మన పూర్వీకులు మూర్ఖులు కాదు. స్వేచ్చ అనేది నిప్పులాంటిది. సరిగ్గా ఉపయోగించుకుంటే లాభం చేకూరుస్తుంది. ఆత్మావగాహనలేనిస్త్రీకిగానీ, పురుషుడికిగానీ దానిని ఉపయోగించుకోవడం చేతగాకపోతే నిలువునా దహించివేస్తుంది. స్వేచ్చ యొక్క పరిణామం శారీరక సంబంధమే అయితే ఆత్మవంచన, పాపభీతి, అపరాధభావం లేకుండా స్వేచ్చగా సంపర్కం పెట్టుకోవడం ఒక పద్ధతి. ఆ అవసరం లేకుండా బతకడం మరో పద్ధతి. చేతిలో స్వేచ్చ వుంది కదాని ఒకవైపు సంపర్కాలు పెట్టుకుంటూనే- మరోవైపు అలాంటి సంబంధాల పట్ల ఏహ్యభావం నటించడం నీచమైన పద్ధతి. స్వేచ్చకి నిజమైన అర్థ మేమిటోతెలుసా? 'నేను ఫలాని పని గొప్ప ఆత్మావగాహనతో చేస్తున్నాను. దీనివల్ల నాకుగానీ, ఇతరులకిగానీ వర్తమానంలోగానీ, భవిష్యత్తులోగానీ ఏ నష్టమూ జరగదు' అన్న ధీమాతో ఆ పని చేయగలగడం! అంతేకాదు, అటువంటి పనే మరొకరు చేస్తున్నప్పుడు దాన్ని మనస్పూర్తిగా ఒప్పుకోగలగడం!! అన్నిటికన్నా ముఖ్యంగా- అది తన బలహీనత అనో- లేక - తప్పు చేస్తున్నానన్న గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఆ పని చేయగలగడం!!! ఇప్పుడు చెప్పు స్త్రీ స్వేచ్చనెలా నిర్వచిస్తావ్?"

 

                                                                *    *    *

 

    "మనిద్దరం వివాహం చేసుకుందామా?" నా ఎం.బి.ఏ. రెండవ సంవత్సరం పూర్తవుతుండగా శ్రీకాంత్ అడిగాడు.

 

    నేను బ్లాంక్ గా చూశాను.

 

    "తొందరేం లేదు. ఆలోచించుకుని చెప్పు" అన్నాడు.

 

    "ఆలోచించడానికేమీ లేదు. ఏ అభాగిని చరిత్ర అయినా చివరికి పురుషుడి అండవల్లే సుఖాంతం అవుతుందని నిరూపించడం ఇష్టంలేకే మీరు రెండు సంవత్సరాలపాటు నన్ను కలుసుకోలేదన్నారుగా! మళ్ళీ ఇప్పుడిదేమిటాని ఆలోచిస్తున్నాను".

 

    "నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అప్పుడు నువ్వు ఇల్లులేక నిరాశ్రయురాలివై వున్నావు. ఇప్పుడు కష్టపడి నీ ఇంటిని నువ్వే ఎవరి సహాయం లేకుండా నిర్మించుకున్నావ్. అదీ తేడా! ఆ ఇంటికి అలంకరించే అవకాశం నా కిమ్మని అడుగుతున్నాను. ఒకవేళ నా వల్ల నీకేదైనా నష్టం జరిగినా నీ ఇల్లు నీకు మిగుల్తుంది. ఆ ఇంటి పేరు ఆత్మవిశ్వాసం!"

 

    ఎప్పుడూ అతడి మాటలకి బాధపడే నేను ఈసారి బాధపడలేదు. ఈసారి అవి శూలాల్లా గుచ్చుకోలేదు. ఆ మాటల్లోని నిజం బోధపడింది. ఒకప్పుడు నేను నా కలల్నే వ్యక్తిత్వం అనుకునేదాన్ని. ఆశనే భవిష్యత్తు అనుకునేదాన్ని. అంతే తప్ప, అటువంటి భవిష్యత్తు కోసం నేనేం చెయ్యాలో ఆలోచించలేదు. సురేష్ వాదనలన్నీ నాకు అన్వయించుకుని, అంతా కరెక్టే కదా అనుకున్నానే తప్ప, మౌలికంగా అతని సిద్దాంతంలోనే ఒక పునాది లేదని గ్రహించలేకపోయాను.

 

    ఆ పునాది పేరు "ప్రేమ".

 

                                                                     12

 

    శ్రీకాంత్ తో నా వివాహానికి అతడి కుటుంబం వైపునుంచి పెద్ద ఇబ్బంది రాలేదు కానీ సురేష్ వైపునుంచి వచ్చింది.

 

    అతడితో కలిసి వుంటున్న అమ్మాయికి అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చి ఏడాదిలో తారాపథానికి దూసుకుపోయింది. అతను కూడా ఆమెద్వారా ఫీల్డ్ లోకి ప్రవేశిద్దామనుకున్నాడు కానీ ఆమె అప్పటికే మరో దర్శకుడికి రెండో భార్యగా స్థిరపడిపోయింది. అతడు ఓ రోజు రాత్రి నా దగ్గరికి తాగి వచ్చి చాలాసేపు ఏడ్చాడు. నాకతడేం చెప్తున్నాడో అర్థంకాలేదు. "అదేమిటి సురేష్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్త్రీ పురుషులు కలిసి జీవించడానికి వివాహం అవసరం లేదన్నది నువ్వే! ఆ తర్వాత మళ్ళీ ఇంకో థియరీ చెప్పావు. కాస్త డబ్బూ, పేరూ రాగానే 'కేవలం జాలి వల్లే' నాతో కలిసి వుంటున్నానన్నావ్. నాకంటే కాస్త మంచి స్త్రీ దొరకగానే అటువైపు మొగ్గావ్. ఇప్పుడు నీ రెండో భాగస్వామి కూడా ఆ పాఠాన్నే నీకు అప్పజెప్తుంటే ఎందుకిలా విలవిల్లాడిపోతున్నావ్? కావాలంటే వెళ్ళి ఆమె ఇంట్లో వంటచెయ్. నీ శ్రమకి వెలకట్టి డబ్బులిస్తుంది".

 

    "మన సంసారబంధాన్ని నిలబెట్టుకోవాలని నేను తాపత్రయపడుతుంటే నువ్విలా మాట్లాడటం ఏమీ బాగాలేదు" అన్నాడు ఆవేశంగా.

 

    "సంసార బం...ధం... గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వెళ్ళిక్కడి నుంచి" అన్నాను కోపంగా.

 

    అతడు ఇంటికి వెళ్ళి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. రాయబారాలు మొదలయ్యాయి. తెలిసిన వాళ్ళందరూ మా సంసారాన్ని నిలిపే గొప్ప బాధ్యతను భుజాల మీద వేసుకుని నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. సురేష్ మంచితనం గురించి ప్రారంభమైన సంభాషణ, మనుధర్మ శాస్త్రంతో పూర్తయ్యేది.

 

    మరోవైపు సురేష్ తరపు నుంచి న్యూసెన్స్ ఎక్కువైంది. ఇంటికొచ్చి యాగీ చేసేవాడు. అంతేకాకుండా ఆఫీసుకొచ్చి అందరి ముందూ భర్త హోదాతో అసహ్యంగా ప్రవర్తించేవాడు. నాకేం చెయ్యాలో తోచలేదు. ఈ విషయాలన్నీ శ్రీకాంత్ వరకూ తీసుకెళ్ళడం ఇష్టం లేకపోయింది. చివరికి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి ఫిర్యాదు చేయడం కోసమని వెళ్ళాను.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More