Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda


    5. ఒకడు దానము చేసిన గొర్రెను మరొకడు గ్రహించిన అట్టివానికి శ్లేష్మ రోగ రూపమగు పాపము కలుగుచున్నది. అట్టివాడు వైశ్వానరం ద్వాదశ కపాలం నిర్వపేత్. సంవత్సరోవా అగ్నిర్వైశ్వానరః ఆ విధముగా చేసిన యజమాని సంవత్సర దేవతచే దోష రహితముగా చేసిన దానిని గ్రహించినట్లగును. అతనికి శ్లేష్మ రోగ రూప పాపము సంక్రమించదు.

    6. రెండువైపుల దంతములు గల అశ్వమును గాని పురుషుని గాని ప్రతిగ్రహించిన వాడు ఆత్మ హింసకు లోనగుచున్నాడు. రెండు వైపుల దంతములు కలవానిని ప్రతిగ్రహించినవాడు వైశ్వానరం ద్వాదశ కపాలం నిర్వపేత్ - సంవత్సరోవా అగ్నిర్వైశ్వానరః అందువలన యజమాని సంవత్సర దేవతచే దోష రహితముగా చేయబడిన దానిని ప్రతి గ్రహించి నట్లగును. అతడు ఆత్మహింసకు లోనుకాడు.

    7. ధనము కోరువాడు వైశ్వానరం ద్వాదశ కపాలం నిర్వపేత్. సంవత్సరోవా అగ్నిర్వైశ్వానరః ధనహీనుడు సంవత్సర కాలము సంపన్నుల సముదాయములందు సంచరించునో అప్పుడు అతడు ధనవంతుడు అగును.

    8. సంవత్సరాధి దేవతను ప్రయోగించి ఉపసంహారము చేయని వాడు ప్రతిష్ఠను కోల్పోవుచున్నాడు. అతడు మరల ఇంటికి వచ్చి వైశ్వానర పురోడాశమును నిర్వాపము చేయవలెను. అతడు మొదట ఏ అగ్నిని ప్రయోగించినాడో ఆ అగ్నినే స్వప్రతిష్ఠ కొరకు విముక్తుని చేసినవాడు అగుచున్నాడు.

    9. దాతలు ఇచ్చిన గోవులలో చివరి దానిని ఏ త్రాటితో కట్టునో ఆ త్రాటిని శత్రువు కొట్టమునకు పంపవలెను. అందువలన శత్రువునకు పాప దేవతను పంపినట్లగును.

                                   ఏడవ అనువాకము

    1. పశువులను కోరువాడు ఇంద్రం చరుం నిర్వపేత్. ఇంద్రావై పశవః - పశువులు ఇంద్ర సంబంధములు. ఇన్ద్ర మేవ స్వేన భాగధేయేనోపధావతి. సవాస్మై పశూన్ర్పయచ్చతి అతడు పశుమానేవ భవతి.

    2. చరు ఇంద్రునిది అగుచున్నది. అతడు పశువులను యోని నుండియే పశువులను కలిగించును.

    3. పశువులను కోరువాడు ఇంద్రియ బలోపేతుడైన ఇన్ద్రాయ పురోడాశ మేకాదశ కపాలం నిర్వపేత్. ఇన్ద్రియం వై పశవః ఇన్ద్రమే వేన్ద్రియావన్తగం స్వేన భాగధేయేనోపధావతి. సః పివాస్మా ఇన్ద్రియం పశూన్ర్పయచ్చతి. అతడు నిశ్చయముగా పశువులు కలవాడు అగుచున్నాడు.

    4. బ్రహ్మ వర్చస్సు కోరువాడు బ్రహ్మవర్చస్సు కల ఇంద్రాయ పురోడాశమేకాదశం నిర్వపేత్. బ్రహ్మ వర్చసమే దీప్తియగుచున్నది. కావున దీప్తిమంతుడగు ఇంద్రుని స్వేన భాగధేయేనోపధావతి. సఏవాస్మిన్ర్బహ్మ వర్చసం దధాతి. అతడు బ్రహ్మ వర్చసీ భవతి.

    5. అన్నము కోరువాడు అన్నవంతుడగు ఇన్ద్రాయ పురోడాశమేకాదశమ్ నిర్వపేత్. అర్కోవై దేవానామన్నమ్. అర్క శబ్దమే దేవతలకు అన్నము అగుచున్నది. కావున ఇన్ద్రామే వార్క వంతగం స్వేన భాగధేయేనోపధావతి. సఏవాస్మా అన్నం ప్రయచ్చతి. అతడు అన్నాదుడు అగుచున్నాడు.

    6. సంపద కోరువాడు దీప్తివంతుడగు ఇన్ద్రాయ పురోడాశమేకాదశ కపాలమ్ నిర్వపేత్. ఇంద్రుడే సంపద అగుచున్నాడు. బ్రహ్మవర్చస్సు గల ఇంద్రునకు నిర్వాపము చేయుట వలన యజమాని ఉన్నతుడు అగుచున్నాడు. బ్రహ్మవర్చస్సు గల ఇంద్రునకు నిర్వాపము చేయుట వలన యజమానికి దేహపుష్టి కలుగుచున్నది. బ్రహ్మవర్చస్కుడగు ఇంద్రునకు నిర్వాపము చేయుటవలన యజమాని సంపద గలవాడు అగుచున్నాడు. అన్నములందు ప్రతిష్ఠితుడై నిశ్చయముగ ఐశ్వర్యవంతుడు అగుచున్నాడు.

    7. ఎవనిని పాపములు పట్టుకొనునో అతడు పాపములు పోగొట్టు ఇంద్రాయ పురోడాశమేకాదశ కపాలం నిర్వపేత్. నిషిద్ధ కర్మాచరణమే పాపము. పాపములు పోగొట్టు ఇంద్రునే స్వేన భాగధేయేనోపధావతి. ఆ ఇంద్రుడే అతనిని నిషిద్ధ కర్మాచరణము వలన కలిగిన పాపముల నుండి విముక్తుని చేయుచున్నాడు.

    8. ఎవనిని శత్రువులు భయపెట్టుదురో లేక దేశమును నాశనము చేయనుంకింతురో, అట్టివాడు శత్రునాశక ఇన్ద్రాయ పురోడాశమేకాదశకపాలం నిర్వపేత్. శత్రు నాశకుడగు ఇంద్రుని స్వేన భాగధేయేనోపధావతి. ఆ ఇంద్రుడే అతనినుండి శత్రువులను తొలగించుచున్నాడు.

    9. సంకెలలు వేయబడినవాడు కాని, భటులచే నిరోధింపబడినవాడు కాని ఇన్ద్రాయ పురోడాశమేకాదశ కపాలమ్ నిర్వపేత్. ఇన్ద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి. ఆ ఇంద్రుడే అట్టివానిని రక్షించుచున్నాడు.

    10. ఎవనికి అశ్వమేధాది మహాయజ్ఞములు ఫలములను ఇవ్వకున్నవో అట్టివాడు అశ్వమేధ సాధనమగు అగ్ని - అశ్వ మేధ ఫలభూతుడగు ఆదిత్యుని కూడిన ఇన్ద్రాయ పురోడాశమేకాదశ కపాలమ్ నిర్వపేత్. ఆదిత్య, అగ్నులే మహా యజ్ఞములకు ప్రారంభ సమాప్తములందు ఉండువారలు. కావున అగ్ని, ఆదిత్యులతో కూడిన ఇంద్రమేవ స్వేన భాగధేయోనోపధావతి. ఇంద్రుడే యజమాని వద్దకు మహా యజ్ఞమును చేర్చును. అతడు మహా యజ్ఞ ఫలమును పొందుచున్నాడు.

                                     ఎనిమిదవ అనువాకము

    1. గ్రామాధిపత్యము కోరువాడు అనుకూలుడు, రుజుత్వము గల ఇన్ద్రాయ పురోడాశమేకాదశ కపాలమ్ నిర్వపేత్. అనుకూలుడు, రుజుత్వముగల ఇన్ద్రాయ స్వేన భాగధేయేనోపధావతి, ఇంద్రుడే అతనికి భ్రాతృమిత్రాదులను అనుకూలురను చేయును. అతనికి తప్పక గ్రామాధిపత్యము లభించుచున్నది.

    2. ఎవని సేన మందగతి కలది అగునో యుద్దమును ఎదుర్కొన జాలకుండునో అతడు ఇంద్రుని భార్య కొరకు చరును నిర్వాపము చేయవలెను. ఇంద్రాణియే సేనకు దేవత. యజమాని ఇంద్రాణినే స్వభాగధేయమున అర్చించవలెను. ఆమెయే యజమానిసేనకు వాడికలదిగను, యుద్ధమును ఎదుర్కొను దానిగను చేయును.

    3. సమిధలందు తృణ విశేషములను కూడ చేర్చవలెను. గోవులు మూత్ర పురీషములు విడిచిన చోటనే తృణాదులు మొలుచుచున్నవి. అట్లగుటచే యజమాని గోవుల మార్గమును అనుసరించినట్లగును. అతనికి గోవులు కలుగును.

    4. సంగ్రామము సంభవించినవాడు, రోషము ధైర్యము గల ఇన్ద్రాయ పురోడాశమేకాదశ కపాలమ్ నిర్వపేత్. ఆ విధముగా చేసినవాడు రోషము, ధైర్యము కలవాడై యుద్ధమున విజయము సాధించును. కోపము, ధీరత్వము గల ఇన్ద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి. ఆ ఇంద్రుడే యజమాని యందు రోషమును, ధైర్యమును ప్రవేశపెట్టును. అందువలన యజమాని యుద్ధమున గెలుచుచున్నాడు.

    5. ఎవడు వ్యాధులు ద్రవ్యహానుల వలన మనసు చితికినవాడై ఇది తన స్వయంకృత పాపమని క్రుంగుచుండునో, అతడు పైన చెప్పిన ఇష్టినే ఆచరించవలెను. అతని నుండి ఇంద్రియాదులు తొలుగుట వలన చిత్త భ్రమ కలవాడు అగుచున్నాడు. అతడు రోషము, ధీరత్వము గల ఇన్ద్రమేవ స్వేన భాగధేయేనోపధావతి. ఇంద్రుడే అతని యందు వీర్యమును, రోషమును, ధైర్యమును ప్రవేశపెట్టును. అప్పుడు అతడు నష్టచిత్తుడును, భ్రాంతుడును కాకుండును.

    6. ప్రజలు తనకు దానము చేయవలెనని కోరుకొనువాడు దాతయగు ఇన్ద్రాయ పురోడాశమేకాదశ కపాలం నిర్వపేత్. అతడు దాత అయిన ఇన్ద్రమేవస్వేన భాగధేయేనోపధావతి. ఇంద్రుడే ప్రజలను అతనికి దానము చేయువారినిగ చేయును. ప్రజలు అతనికి దానము చేయవలెననుకొందురు.

    7. ఒకనికి దానము అందినట్లుగును. కాని అందదు. అతడు ప్రదాతయగు ఇన్ద్రాయ పురోడాశమేకాదశ కపాలం నిర్వపేత్. ప్రదాతయగు ఇన్ద్రమేవస్వేన భాగధేయేనోపధావతి. అతనికి ఇంద్రుడే దానములు ఇప్పించును.

    8. చిరకాలముగ రాజ్యభ్రష్టుడు గాని, రాజ్యభ్రష్టుడు అగుచున్నవాడు గాని చక్కని రక్షణలు గల ఇన్ద్రాయ పురోడాశమేకాదశపాలమ్ నిర్వపేత్. చక్కని రక్షణలనిచ్చు ఇన్ద్రమేవ స్వేనభాగధేయోనోపధావతి. ఇంద్రుడే అతనిని రక్షించును. అతడు రాజ్యభ్రష్టుడు కాదగినవాడు కాకుండును.

    9. ఇంద్రుడు దేవతలందరి యందు సమానుడై ఉండెను. అతనికి ఆధిక్యత లేకుండెను. అందుకు ఇంద్రుడు ప్రజాపతిని సేవించినాడు. ప్రజాపతి ఇంద్రుని కొరకు ఇంద్రదేవతాకమగు ఏకాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేసినాడు. ఈ నిర్వాపము నందే శక్తిని చేర్చినాడు. శక్వరీ ఛందస్సునకు చెందిన యాజ్యా పురోవాక్యలను నిర్మించినాడు. శక్వరి వజ్రరూపమగును. అది వజ్రమై ఇంద్రుని ప్రకాశింపచేసినది.

    ఇంద్రుడు ఐశ్వర్యవంతుడు అయినాడు. అట్లయి అది తనను కాల్చునేమోయని భయపడినాడు. మరల ప్రజాపతిని సేవించినాడు. ప్రజాపతి శక్వరిని మించినదియు, రేవతీ శబ్ద ఘటితమైనదియునగు ఛందస్సును శాంతి కొరకును, దహించకుండుటకును కల్పించినాడు.

    10. సంపద సంపాదించుటకు సమర్థుడయయు సంపదయందు సామాన్యులతో సమానుడగునో అతడు 'ఐన్ద్రమ్ ఏకాదశకపాలమ్ నిర్వపేత్'. అతడు 'ఇన్ద్రమేవ స్వేనభాగధేయేనోపధావతి.' ఇంద్రుడే అతనికి ఇంద్రియ బలము కలిగించును.

    రేవతీ శబ్ద ఘటిత ఛందస్సు శాంతి కొరకును, దహింపబడుకుండుటకును పురోనువాక్యయగును. శక్వరి యాజ్యయగును. శక్వరి వజ్రమగును. అది యజమానిని ఐశ్వర్యముచే ప్రకాశింపచేయును. అతడు నిశ్చయముగ ధనవంతుడు అగుచున్నాడు. 

                                     తొమ్మిదవ అనువాకము

    1. శత్రువధ కోరువాడు "అగ్నావైష్ణవ మేకాదశ కపాలం నిర్వపేత్." అందు సరస్వతిది ఆజ్యభాగము. చరుబృహస్పతికి సంబంధించినది. ఏకాదశకపాలము అగ్ని, విష్ణు దేవతాకము. అగ్ని సర్వదేవతాస్వరూపుడు. విష్ణువు సర్వయజ్ఞ స్వరూపుడు. అందువలన యజమాని తన శత్రువును దేవతలచేతను, యజ్ఞముల చేతను హింసించువాడగుచున్నాడు. ఆజ్యభాగము గల సరస్వతి వాక్కు అగును. అందువలన అతడు శత్రువును మాటచే హింసించును. చరుకు సంబంధించిన బృహస్పతి దేవతలకు బ్రహ్మ. కావున శత్రువును బ్రహ్మశక్తిచే హింసించును.

    2. తనను హింసించు వానిని హింసించుటకును, తన శత్రువును హింసించుటకును అధిక ప్రయోగార్థము రెండు పురోనువాక్యలను చేయవలెను. హింసింపబడువాడు ఈ ఇష్టినే యజించవలెను. అందువలన అతడు దేవతలచే దేవతలను, యజ్ఞముచే యజ్ఞమును, వాక్కుచే వాక్కును, బ్రహ్మచే బ్రహ్మను, నివారించిన వాడగుచున్నాడు. అతడు దేవతలకు, యజ్ఞములకు నడుమ మసలిన వాడగును. అందువలన అతనికి ఎచటినుండియు హాని కలుగదు. అతనిని హింసించగోరువాడు హింసించజాలడు.

    3. యజ్ఞఫలము పొందనట్టివాడు అగ్నావైష్ణవ మేకాదశకపాలం నిర్వపేత్. అగ్నిస్సర్వాదేవతాః. విష్ణుర్యజ్ఞః అగ్నించైవ విష్ణుం స్వేనభాగధేయేనోపధావతి. వారే అతనికి యజ్ఞఫలమును ప్రసాదింతురు. అతడు యజ్ఞఫలము కలవాడు అగుచున్నాడు.

    4. చూపు కోరువాడు అగ్ని, విష్ణు దేవతాకమగు చరును నేతియందు నిర్వాపము చేయవలెను. మానవులు అగ్నినేత్రముతోను, దేవతలు యజ్ఞనేత్రముతోను చూచుచున్నారు. అగ్నా విష్ణువులను స్వభాగధేయమున సేవించవలెను. వారే అతనికి చూపు కలిగింతురు. అతడు చూపు కలవాడు అగుసున్నాడు. 

    5. ఘృతము ధేనువు బీజము. బియ్యము ఎద్దు యొక్క బీజము. ఈ మిథునము వలననే యజమానికి దృష్టి పాటవము కలుగును. ఘృతము తేజస్సు అగును. నేత్రము తేజస్సు అగును. తేజోరూపమగు ఘృతమున, తేజోరూపమగు నేత్రము కలుగుచున్నది.

    6. యజించు వాడు శత్రువైనప్పుడు అతడు యజించని వాని బలవీర్యములను లాగుకొనును. దానికి ప్రతీకారము చేయదలచినవాడు అధ్వర ప్రాయమగు ఇష్టిని నిర్వాపము చేయవలెను. అందువలన ఇతని బలవీర్యములు యజించు శత్రువునందు చేరవు. వాక్కునకు ముందు నిర్వాపము చేయవలెను. అప్పుడు అతని వాక్కు ఇతని వాక్కునందు చేరును. ఇతని వాక్కును ఇతర వాక్కులు అనుసరించును. అవి యజమాని యందు వీర్యబలశక్తులను చేర్చును.

    7. ప్రాతఃకాల యజ్ఞము సమాప్తమగునంత కాలమున అగ్నావిష్ణువుల అష్టాకపాలమును నిర్వాపము చేయవలెను. ఆజ్యభాగము సరస్వతిది. చరు బృహస్పతిది. అష్టాకపాలము గాయత్రి అష్టాక్షరి యగును. ప్రాతః కాలయజ్ఞము గాయత్రి సంబంధి. ఈ అష్టసంఖ్యచే ప్రాతస్సవనము పరిపూర్ణమగును.

    8. మధ్యాహ్న సవనము సమాప్త మగునంత కాలమున అగ్నావిష్ణువుల ఏకాదశకపాలమును నిర్వాపము చేయవలెను. ఆజ్యభాగము సరస్వతిది. చరు బృహస్పతిది. ఏకాదశ కపాలము త్రిష్టుప్ యొక్క ఏకాదశాక్షరమగును. మధ్యాహ్నసవనము త్రిష్టుప్ సంబంధి. ఈ ఏకాదశ సంఖ్యచే మధ్యాహ్న సవనము పరిపూర్ణమగును.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More