Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda


    2. అన్నము తినువాడు కాదలచినవాడు 'అగ్నయేన్నవతే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యః అగ్నిమే మన్నాదగం స్వేనభాగధేయేనోపధావతి. సఏవైనమన్నాదం కరోతి. అతడు అన్నాద ఏవ భవతి.

    3. అన్నములకు స్వామి కాదలచినవాడు 'అగ్నయేన్నవతే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యః అగ్నియేవాన్న పతిగం స్వేన భాగధేయేనోపధావతి. సవైన మన్న పతిం కరోతి. అతడు అన్నపతిర్యేవభవతి.

    4. దీర్ఘరోగము కలవాడు, పాపములను ప్రక్షాళించు అగ్నయే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యః పావకుడగు అగ్నయే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యః దీప్తి గల అగ్నయే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యః

    పాపములను ప్రక్షాళించు అగ్నికి నిర్వాపనము చేయుట వలన అతడు ప్రాణములను రక్షించుచున్నాడు.

    పావక అగ్నికి నిర్వాపనము చేయుట వలన అగ్ని వాక్కును కాపాడుచున్నాడు.

    దీప్తికారకుడు అగ్నికి నిర్వాపనము చేయుట వలన అగ్ని యజమాని యందు ఆయువును చేర్చుచున్నాడు.

    5. నేత్రములు కోరువాడు పవమాన అగ్నిని యజించ వలెను. అందువలన అతడు ప్రాణములను రక్షించును.

    పావకాగ్నికి నిర్వాపనము చేయవలెను. అప్పుడు అగ్ని వాక్కును రక్షించును.

    దీప్తికారకుడగు అగ్నికి నిర్వాపనము చేయుట వలన అగ్ని నేత్ర పాటవమును ప్రసాదించును. యద్యన్దోప్రైవ పశ్యతి - గ్రుడ్డివాడయినను చక్కగా చూడగలడు.

    6. సంతానము కోరువాడు పుత్రులను కలిగించు శక్తి గల అగ్నయే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్, పుత్రవృద్ధి కారకుడగు ఇంన్ద్రాయ పురోడాశమేకాదశ కపాలం నిర్వపేత్. అగ్నిరేవాస్మై ప్రజాం ప్రజనయతి - అతనికి అగ్నియే సంతానము కలిగించును. వృద్ధామిన్ద్రః ప్రయచ్చతి - ఇంద్రుడు పుత్రపౌత్రాభివృద్ధిని కలిగించును. 

    7. క్షీర దధ్యాది రసోపేతుడు కాదలచినవాడు అగ్నయే రసవతే జక్షీరే చరుం నిర్వపేద్యః - రసప్రదుడగు అగ్నికి మేకపాల చరును, నిర్వాపనము చేయవలెను. రసవన్త్యామగ్నిమేవ స్వేన భాగధేయేనోపధావతి, సఏవైనం రసవన్తం కరోతి. యజమాని రసవానేవ భవతి.

    మేకపాలు అగ్నిదేవతాకమగుచున్నవి. అందువలన యజమానికి క్షీరదధ్యారసములు శీఘ్రముగా కలుగుచున్నవి.

    8. ధనవంతుడు కావలెనని కోరుకొనువాడు 'అగ్నయే వసుమతే పురోడాశమష్టా కపాలం నిర్వపేత్. అగ్నిమేవ వసుమన్తగం స్వేన భాగధేయేనోపధావతి. సఏవైనం వసుమన్తం కరోతి. యజమాని వసుమానేవ భవతి.

    9. యుద్ధము కలిగినపుడు ఎవడు శత్రువు యొక్క అన్నమును హరించగోరునో, మరియు యుద్ధమున జయించకోరునో అట్టివాడు అగ్నయే వాజస్పతే పురోడాశమష్టా కపాలం నిర్వపేత్. అగ్నియే కదా దేవతలందరిలో శత్రువు యొక్క అన్నమును హరించగలవాడు! అగ్నియేవ వాజస్పతగం స్వేన భాగేనోపధావతి. యజమాని అన్నముల కొరకు పరువెత్తును. శత్రువును హతమార్చును. అగ్నివలె అందరిని ధిక్కరించువాడగుచున్నాడు.    

    10. ఎవడు ఆహవనీయాగ్నిని ఉద్దరించ దలచునో అట్టివాడు 'అగ్నయేగ్నివతే పురోడాశమష్టా కపాలం నిర్వపేత్' ఈ అగ్నులందు ఒకటి నిర్దిష్ట భాగము కలది. ఈ రెండును కలిసి యజమానిని రక్షించుచున్నవి. యజమాని బాధలను ఈశ్వరుడు నివారించుచున్నాడు. అగ్నికి నిర్వాపము చేయుట - స్వభాగ ధేయమున ఈ అగ్నులను - శాంతింప చేయుట అగుచున్నది. అందువలన యజమానికి బాధలు కలుగవు. శాంతి లభించును.

    11. గార్హపత్యము నుండి తెచ్చిన అగ్ని హోమము నందు చేర్చుచుండగా చల్లారినపుడు అగ్నయే జ్యోతిష్మతే పురోడాశమష్టా కపాలం నిర్వపేత్.

    12. రెండవ అగ్నిని ప్రజ్వలించి పూర్వోద్ధరణమును అనుసరించి గ్రహించదగినది అని కొందరు చెప్పుచున్నారు. కాని దేనిని అనుసరించి అగ్ని తొలుత గ్రహించబడినదో దాని కొరకు మరొకదానిని ఏల ఉద్ధరించవలెను? చల్లారగా మిగిలిన అగ్ని కణికలను ఉంచి అరణులచే అగ్నిని మధించ వలెను.

    13. ప్రథమం జజ్ఞే అగ్ని స్స్వాద్యోనే రధి జాతవేదాః అగ్ని సర్వజ్ఞుడు. అతడు స్వస్థానమగు ఇచటి నుండియే తొలుత ఆవిర్భవించినాడు. మరల అచటి నుండియే జన్మించును. అతడు గాయత్రి, త్రిష్టుప్, జగతి ఛందస్సులచే - దేవతలకు ఇవ్వదగిన భాగములను ఎరిగి - హవిస్సులు వహించుచున్నాడు.

    14. యజమాని ఛందస్సులచే అగ్నిని అతని జన్మస్థలము నుండియే పుట్టించ వలెను. ఏషవాశసోగ్నిరిత్యాహుః ఇదియే ఆ అగ్ని అగునని పెద్దలు చెప్పుచున్నారు.

    15. అగ్ని యొక్క జ్యోతిస్సే నష్టమైనదని వారు హేతువు చెప్పుదురు.

    16. యజమాని జ్యోతిష్మంతుడగు అగ్నికి నిర్వాపము చేయవలెను. అందువలన నష్టమైన అగ్ని జ్యోతిస్సును అతడు పొందును.

                                       అయిదవ అనువాకము

    1. పాపము చేయకపోయినను చేసినట్లు దూషింపబడువాడు వైశ్వానరాగ్ని దేవతాకమగు పన్నెండు పాత్రల పురోడాశమును - వరుణ దేవతాక చరును, దధిక్రావన్ దేవతాక చదువును నిర్వాపము చేయవలెను.

    ద్వాదశ కపాల పురోడాశము వైశ్వానర దేవతాకమగును. అతడే సంవత్సరాభిమాని దేవత అగుచున్నాడు. యజమాని సంవత్సరము వలననే బంధువులకు అనుకూలుడు అగుచున్నాడు. ఆరోపించబడిన పాపము నుండి విముక్తుడు అగుచున్నాడు.

    వరుణ యాగమున వరుణ పాశ విముక్తుడు అగుచున్నాడు. దధిక్రావన యాగమున పవిత్రుడు అగుచున్నాడు.

    2. ఈ కర్మ యందు బంగారము దక్షిణయగును. బంగారము పవిత్రమైనందున అది యజమానిని నిశ్చయముగా పవిత్రుని చేయును.

    సంతానము కోరువాడు పూర్వము చెప్పిన ఇష్టినే ఆచరించవలెను. ఒకడు సంతానము కలిగించ సమర్థుడు అగును. అతనికి సంతానము కలుగదు. అట్లగుట వలన సంవత్సారాధి దేవత యగు అగ్ని శాంతి పొందకున్నాడు. అందువలన అతడు గర్భధారణ శక్తిని దహించివేయుచున్నాడు. కావున అతనికి సంతానము కలుగకున్నది.

    ద్వాదశ కపాల పురోడాశము విశ్వానరము. అతడే సంవత్సరాధిదేవత. యజమాని సంవత్సరాధి దేవతను స్వభాగధేయమున శాంతింపచేయవలెను. అప్పుడు ఆ దేవత శాంతుడగును. భార్య గర్భధారణ స్థానమున నిలుచును. సంతానము కలిగించును.

    అతడు వరుణ యాగమున వరుణ పాశ విముక్తుడు అగుచున్నాడు. దధిక్రావన యాగమున పవిత్రుడు అగుచున్నాడు. ఈ కర్మయందు బంగారము దక్షిణ. బంగారము పవిత్రమైనందున అది యజమానిని నిశ్చయముగా పవిత్రుని చేయును.

    3. పుత్రుడు కలుగగనే తండ్రి వైశ్వానర దేవతాకమగు ద్వాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను.

    అష్టా కపాలము గాయత్రీ ఛందము అగును. అది ఆ శిశువునకు బ్రహ్మ వర్చస్సు కలిగించును. నవ కపాలము త్రివృత్ స్తోత్రమగును. అది శిశువునకు తేజస్సు కలిగించును. దశ కపాలము విరాట్ ఛందము అగును. అది శిశువును అన్నాద్యుని చేయును. ఏకాదశ కపాలము త్రిష్టుప్ అగును. అది పుత్రునకు ఇంద్రియ సామర్థ్యము కలిగించును. ద్వాదశ కపాలము జగతీ ఛందము అగును. అది పుత్రునకు పశు సంపద కలిగించును.

    పుత్రుడు కలుగగానే ఈ ఇష్టిని చేయువాడు పవిత్రుడు, తేజస్వి, అన్నాదుడు, సామర్థ్యము కలవాడు, పశువంతుడు అగుచున్నాడు.

    4. దశపూర్ణమాస యాగములను చేయునపుడు అమావాస్య ఇష్టిని గాని, పూర్ణిమనాటి ఇష్టిని గాని అతిక్రమించిన వాడు స్వర్గ భ్రష్టుడు అగుచున్నాడు. అందువలన ఆ ఇష్టులను అతిక్రమించినపుడు వైశ్వానర దేవతాకమగు ద్వాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అందువలన అతడు సంవత్సరాధి దేవతయగు వైశ్వానరాగ్నిని సంతోష పెట్టిన వాడగును. సంవత్సరాధి దేవతయగు వైశ్వానరాగ్ని యజమానిని దేవతలకు సన్నిహితుని చేయును. తరువాత అతడు దేవతలను ఆశ్రయించి స్వర్గమును పొందును.

    5. అగ్నిని ఉద్వాసన చేయువాడు అగ్నిని హత్య చేసినవాడు అగుచున్నాడు. పూర్వము సత్యవచనులగు బ్రాహ్మణులు అట్టివాని అన్నమును బహిష్కరించినారు. కావున అగ్నిని ఉద్వాసన చేయువాడు అగ్ని దేవతాకమగు అష్టా కపాల పురోడాశమును వైశ్వానరాగ్ని దేవతాకమగు ద్వాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను.

    అష్టాకపాల పురోడాశము అష్టాక్షర గాయత్రి అగుచున్నది. అగ్ని గాయత్రి స్వరూపము కావున యజమాని సమగ్ర స్వరూపుడగు అగ్నికి ఆతిథ్యము ఇచ్చినవాడు అగుచున్నాడు. అట్టి ఆతిథ్యము దూరదేశమునకు వెళ్లువారికి అతని ఆప్తులు పాథేయము ఇచ్చినరీతి యగును.

    వైశ్వానర దేవతాకమగు ద్వాదశ కపాల పురోడాశము పన్నెండు నెలల సంవత్సర రూపము అగును. సంవత్సరమే అగ్నికి జన్మస్థానము. అందువలన యజమాని అగ్నిని స్వస్థానమునకు చేర్చినట్లు అగును. అందువలన యజమానికి తగిన అన్నము కలుగుచున్నది.

    6. గ్రామమును కోరువాడు వైశ్వానరం 'ద్వాదశ కపాలం నిర్వపేత్ మారుతం సప్తకపాలం నిర్వపేత్'

    7. మరుత్తులు ఉగ్రదేవతలు. కావున వారికి సంబంధించిన హవిస్సు పాపాధిక్యము కలది. అందువలన ఆ హవిస్సుల విభజన కొరకు యజమాని వైశ్వానరమగు ద్వాదశ కపాలమును ఆహవనీయమందును - మరుద్దేవ తాక సప్త కపాలమును గార్హ పత్యమందును పచనము చేయవలెను. వైశ్వానర దేవతాక ద్వాదశ కపాలము పన్నెండు మాసముల సంవత్సరము అగుచున్నది. కావున సంవత్సరము చేతనే వైశ్వానరాగ్ని యజమాని బంధుమిత్రులను అతనికి వశవర్తులను చేయును.

    8. మరుద్దేవతాకమగు పురోడాశము సప్త కపాలము అగును. దేవతలందు మరుత్తులే పన్ను చెల్లించు ప్రజలు. మరుత్తులు దేవతలకు ప్రజలు. వారే యజమానికి అతని ప్రజను వశవర్తులను చేయుదురు.

    9. సప్త కపాలములు గల మరుత్తులు సప్త గణముల వారు. వారు గణములుగానే యజమానికి అతని ప్రజను వశవర్తులను చేయుదురు.

    10. మంత్రములు చదువబడుచుండగనే యజమాని పురోడాశమును వేదియందు ఉంచవలెను. అది ప్రజను యజమానికి వశవర్తుని చేయును.

                                     ఆరవ అనువాకము

    1. యుద్ధమునకు వెళ్లగోరువాడు ఆదిత్యం చరుం నిర్వపేత్. ఇది అదితి శబ్ద వాచ్యము. పూర్వులు ఈ భూమి యందే ప్రతిష్ఠావంతులు అయినారు.

    2. యుద్ధభూమికి చేరినవాడు వైశ్వానరం ద్వాదశ కపాలం నిర్వపేత్. సంవత్సరోవా అగ్నిర్వైశ్వానరః సంవత్సరమే దేవతలకు స్థానము అగును. ఈ భూమి మీద ఉండియే దేవతలు రాక్షసులను గెలిచినారు. వైశ్వానర ద్వాదశ కపాల నిర్వాపనము వలన యజమాని దేవతల స్థానమునందే ప్రయత్నము చేయుచున్నాడు. అందువలన అతడు యుద్ధమునందు విజయుడు అగుచున్నాడు.

    3. పరస్పరము చంపు కొనుటకు సిద్ధమగు శత్రువుల అన్నము తినువానికి ఆ ఉభయుల పాపము సంక్రమించుచున్నది. అందువలన అతడు వైశ్వానరం ద్వాదశ కపాలం నిర్వపేత్. సంవత్సరోవా అగ్ని ర్వైశ్వానరః అప్పుడు సంవత్సర దేవతచే నిర్దోషీకృతమగు అన్నమునే యజమాని భక్షించును. కావున యజమానికి ఆ పాపము సంక్రమించదు.

    4. ఇద్దరు వ్యక్తులు శపథము చేసినపుడు వారు సంవత్సర దేవత పేర శపథము చేసినవారు అగుచున్నారు. ఆ ఇద్దరిలో తొలిసారి శపథమునకు ద్రోహము చేయువానిని వరుణుడు తన పాశములచే కట్టివేయును. శపథము చేసినవారిలో మొదట ద్రోహము చేసినవాడు, వైశ్వానరం ద్వాదశ కపాలం నిర్వపేత్. సంవత్సరోవా అగ్నిర్వైశ్వానరః రోగ నివారకమగు సంవత్సర దేవత అనుగ్రహము పొందిన యజమాని ద్రోహ పరిహారము పొందినవాడై వరుణపాశములచే బంధించ పడకుండును.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More