Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda


    9. సాయంకాల సవనము సమాప్తమగు నంత కాలమున అగ్నావిష్ణువుల ద్వాదశ కపాలమును నిర్వాపనము చేయవలెను. ఆజ్యభాగము సరస్వతిది. చరు బృహస్పతిది. ద్వాదశకపాలము జగతీ ఛందస్సు యొక్క ద్వాదశాక్షరి అగును. సాయంసవనము జగతీ సంబంధి. ద్వాదశ సంఖ్యచే సాయంసవనము పరిపూర్ణము అగును. 

    10. దేవతలచే దేవతలకు యజ్ఞముచే యజ్ఞమునకు వాక్కుచే వాక్కునకు బ్రహ్మచే బ్రహ్మకు ప్రతీకారము చేయనగును. కపాలములు ఛందస్సును - పురోడాశము సవనములకు చేరును.

    11. గోవు యొక్క కాలమందు మిత్రావరుణ దేవతాకమగు ఏకకపాల పురోడాశమును నిర్వాపనము చేయవలెను. ఈ గోవు శత్రువినాశము చేయునది అగును. ఇదియే ఇతని ఏకకపాల పురోడాశము అగును. న హి కపాలైః పశుమర్హత్యాప్తుమ్ - కపాలమునిచ్చి పశువును పొందుటకు అర్హత లేకున్నది.

                                   పదవ అనువాకము

    1. ఒకప్పుడు ఈ సూర్యుడు ప్రకాశింపకుండెను. అప్పుడు దేవతలు సూర్యుని ప్రకాశింప చేయదలచిరి. వారు సోమ రుద్ర దేవతాకమగు చరు నిర్వాపము చేసిరి. అట్లుచేసి సూర్యునకు ప్రకాశము కలిగించినారు.

    2. బ్రహ్మవర్చస్సు కోరువాడు సోమరుద్ర దేవతాకమగు చరు నిర్వాపము చేయవలెను. సోమరుద్రులను స్వభాగధేయమున పూజించవలెను. అప్పుడు వారే అతనికి బ్రహ్మవర్చస్సు కలిగింతురు. బ్రహ్మవర్చసీ భవతి.

    3. ఆ చరును పుష్యమాస పూర్ణిమ నాడు నిర్వాపము చేయవలెను. రుద్రుడు పుష్యము, సోముడు పూర్ణిమ అగుదురు. వారు అప్పుడు పరిపూర్ణులై ఉందురు. అందువలన యజమానికి - నిశ్చయముగా బ్రహ్మవర్చస్సు కలుగుచున్నది.

    4. బ్రహ్మవర్చస్సు పరిగ్రహించుటకు ఆవరణ గల వేదియందు యజించవలెను. తెల్లని దూడగల ఆవుపాలు మధించి ఆజ్యము చేయవలెను. ఆజ్యము ప్రోక్షించుటకు ఉపయోగపడును. ఋత్విగాదులు ఆజ్యము ప్రోక్షించుకొని పవిత్రులు అగుదురు. అది బ్రహ్మవర్చస్సునంతను కలిగించుననియు మరింత బ్రహ్మవర్చస్సు కలిగించుననియు చెప్పుదురు.

    చర్మము చెడు సంశయము కలవాడు, మానవీ ఋక్కులను ధ్యానించవలెను. ఏదిఏది మనువు చెప్పినాడో అదెల్ల ఔషధము అగుచున్నది. అదియే యజమానికి ఔషధము అగుచున్నది.

    5. చర్మము చెడునను భయము కలవాడు, కుష్ఠురోగము వచ్చునని భయము కలవాడు, సోమ పూషదేవతాకమగు చరు నిర్వాపము చేయవలెను. మానవుడు దేవతా సంబంధమున సోమ సంబంధియగుచున్నాడు. పశువులు పూష సంబంధులు అగుచున్నవి. స్వయముగా దేవతల చేతను, పశువుల చేతను యజమాని చర్మము రోగములేనిది అగుచున్నది. దుశ్చర్మాన భవతి. అతడు చెడుచర్మము గలవాడు కాకుండును.

    6. సంతానము కోరువాడు సోమరుద్ర దేవతాక చరు నిర్వాపము చేయవలెను. సోముడు రేతస్సునుంచువాడు, అగ్ని ప్రజలను పుట్టించు వాడు అగుచున్నారు.

    సోముడు ఇతని రేతస్సును గర్భాశయమందుంచును. అగ్ని సంతానము కలిగించును. అతడు సంతానవంతుడు అగును.

    7. శత్రువును వధించదలచిన వాడు సోమరుద్ర దేవతాక చరు నిర్వాపము చేయవలెను. పురుషుడు సోమసంబంధి. అగ్ని రుద్రుడగును. యజమానిని తన దేవతనుండి తీసికొని రుద్రునకు వప్పగించును. అట్లగుటచే శత్రువు సత్వరమే నశించును.

    8. దీర్ఘరోగి సోమరుద్ర దేవతాక చరు నిర్వాపము చేయవలెను. దీర్ఘరోగి శక్తి సోముని, శరీరము రుద్రుని చేరుచున్నవి. నిర్వాపము చేయుట వలన అతడు సోమునినుండి శక్తిని, రుద్రుని నుండి దేహమును పొందుచున్నాడు. ఇతాసుః భవతి యది జీవతి - గతాసువైనను జీవించును.

    9. సోమరుద్రులచే గ్రహించబడిన వానిని హోతవిముక్తుని చేయును. సోమ రుద్రుల చేతబడి నశింపనున్న వాడు హోతకు ఎద్దును దానము చేయవలెను. హోత అగ్నియే. ఎద్దు అగ్నియే. హోత వహ్నిరూపుడై, వహ్నిరూపమగు ఎద్దు వలన తృప్తి నొందుచున్నాడు.

    10. శత్రువు గృహమునందే శత్రువునకు శత్రువును కలిగించ దలచినవాడు వేదిని స్వీకరించి దక్షిణార్థమును మాత్రమే త్రవ్వవలెను. మిగిలిన సగము త్రవ్వరాదు. బర్హిస్సు సగము పరచరాదు. సమిధలందు సగము అగ్నిలో వేయవలెను. సగము వేయరాదు. అందువలన శత్రువునకు అతని గృహమునందే శత్రువు కలుగుచున్నాడు.

                                      పదకొండవ అనువాకము

    1. గ్రామాధికారము కోరువాడు ఇంద్రదేవతాక ఏకాదశకపాలపురోడాశమును, మరుద్దేవతాకమగు సప్తకపాలపురోడాశమును నిర్వాపము చేయవలెను. ఇంద్రుని మరుత్తులను స్వభాగధేయమున సేవించవలెను. వారే అతనికి భ్రాతృమిత్రాదులను సమకూర్తురు. అతడు గ్రామస్వామి అగును.

    2. మరుత్తులు ఉగ్రరూపులు. కావున ఇంద్ర పురోడాశమును, మరుత్తుల పురోడాశమును వేరు వేరు అగ్నులందు ఉంచవలెను. పాపాధిక్యము కలదానిని విడదీయవలెను. అందుకు ఇంద్రపురోడాశమును ఆహవనీయాగ్ని యందును, మరుత్తుల పురోడాశమును గార్హ పత్యాగ్ని యందును ఉంచవలెను. మరుత్తులు సప్తగణములు వారు వారి పురోడాశము సప్తకపాలాత్మకము. మరుత్తులు గణములుగనే యజమానికి పుత్ర, భాతృ, మిత్రాదులను ఏర్పరచుదురు.

    యజమాని - మంత్రము ఉచ్చరించబడుచుండగనే వేదియందు పురోడాశమును ఉంచవలెను. అందువలన ప్రజలు అతనికి అనువర్తులు అగుదురు.

    3. పాలకులకు, ప్రజకు కలహము కలిగించదలచిన వాడు ఈ ఇష్టినే ఆచరించవలెను. ఇంద్రదేవతాకమగు పురోడాశమును వేరుచేసి తీసికొనవలెను. ఇంద్రుని కొరకు "అణుబ్రూహి." అను మంత్రమును ఉచ్ఛరింపుము అనవలెను. అగ్నీధ్రుని శ్రేషట్ మంత్రము పఠింపుమని కోరి మరుత్తులను గూర్చి యాజ్యా మంత్రము ఉచ్ఛరించుము అనవలెను.

    మరుద్దేవతాకమగు పురోడాశమును వేరుచేసి తీసికొనవలెను. మరుత్తుల కొరకు 'అనుబ్రూహి' అను మంత్రము ఉచ్చరించుమని కోరవలెను. ఇంద్రుని గూర్చి యాజ్యామంత్రము ఉచ్ఛరించుము అనవలెను.

    అందువలన స్వభాగధేయము కొరకని పాలకులకు ప్రజలకు మధ్య కలహము కలుగును. వారలు ఒకరి నొకరు బాధించుకొనుచుందురు.

    4. పాలకులను ప్రజలను పరస్పరము అనుకూలురను చేయదలచినప్పుడు ఈ ఇష్టినే ఆచరించవలెను. దేవతానుగుణమున పురోడాశమును వేరుచేయవలెను. వానిని తీసికొని దేవతాను గుణముగ యజించవలెను. ఆ పురోడాశ భాగముల వలననే పాలకులు, ప్రజలు కలసిమెలసి ఉందురు. వారి సమైక్యత నిశ్చయము.

    5. గ్రామాధికారము కోరువాడు ఇంద్రదేవతాకమగు ఏకాదశకపాల పురోడాశమును విశ్వేదేవతాకమగు ద్వాదశకపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అతడు ఇంద్రుని విశ్వేదేవతలను స్వభాగధేయమున సేవించవలెను. వారే అతనికి భ్రాతృ, మిత్రాదులను సమకూర్తురు. అతడు నిశ్చయముగ గ్రామస్వామి అగును.

    6. ఇంద్ర పురోడాశమును, విశ్వేదేవపురోడాశమును వేరు వేరు చేయవలెను. తదుపరి ఇంద్ర పురోడాశమును అందుకొనవలెను. అందువలన అతనికి ఒకవంక బలవీర్యములు, మరొక వంక భ్రాతృ, మిత్రజనులు లభింతురు.

    7. భ్రాతృ, మిత్రాదులు యజమానిని సేవించు సందర్భమున అంచున్న వస్త్రము దక్షిణ అగును.

    8. గ్రామాధికారము కోరుకొనువాడు గోవు పాలయందు ప్రియంగు సంబంధమగు చరును మరుత్తుల కొరకు నిర్వాపము చేయవలెను. మరుత్తులు మచ్చలుగల ఆవు పాలనుండి పుట్టినారు. ప్రియంగువులు మచ్చల ఆవునుండి పుట్టినవి. భ్రాతృ, మిత్రాదులగు వారు దేవతా విషయమున మరుత్సంబంధులు. యజమాని మరుత్తులను స్వభాగధేయమున యజించవలెను. వారే అతనికి ప్రజను సమకూర్తురు. అతడు నిశ్చయముగా గ్రామస్వామి అగును.

    9. యాజ్యా పురోనువాక్యలు ప్రియవతులు అగుచున్నవి. అందువలన యజమానిని సమానులలో ప్రీతిపాత్రుని చేయును. పురోనువాక్య రెండుపాదములది. అందువలన అతనికి రెండు పాదముల ప్రాణులు లభింతురు. యాజ్య నాలుగు పాదములది. దాని వలన అతనికి నాలుగు పాదముల ప్రాణులు లభించును.

    10. దేవతలు, అసురులు యుద్ధమునకు సిద్ధమైనారు. అప్పుడు దేవతలు పరస్పరము కలహించుకున్నారు. వారు ఏ ఒక్కరి ప్రాధాన్యతను అంగీకరించలేదు.

    అగ్ని వసువులు ఒకటిగను - సోమరుద్రులు ఒకటిగను - ఇంద్ర మరుత్తులు ఒకటిగను వరుణ ఆదిత్యులు ఒకటిగను నాలుగు విధములుగా విడిపోయినారు.

    11. అప్పుడు ఇంద్రుడు ప్రజాపతిని సేవించినాడు. ప్రజాపతి ఇంద్రునిచే సంజ్ఞానేష్టిని చేయించినాడు. వసువులతో కూడిన అగ్ని కొరకు అష్టాకపాల పురోడాశమును - రుద్రునితో కూడిన సోముని కొరకు చరును, మరుత్తులతో కూడిన ఇంద్రునకు ఏకాదశ కపాల పురోడాశమును, ఆదిత్యులతో కూడిన వరుణునకు చరును నిర్వాపము చేసినాడు.

    అప్పుడు దేవతలు ఇంద్రుని పెద్దరికమును అంగీకరించినారు.

    12. సమానులందు భేదభావము కలవాడైనపుడు ఈ సంజ్ఞానేష్టిని యజించవలెను. అగ్నితో కూడిన వసువుల కొరకు అష్టాకపాల పురోడాశమును, రుద్రునితో కూడిన సోముని కొరకు చరును, మరుత్తులతో కూడిన ఇంద్రుని కొరకు ఏకాదశకపాల పురోడాశమును, ఆదిత్యులతో కూడిన వరుణునకు చరును నిర్వాపము చేయవలెను. అప్పుడు యజమాని ఇంద్రుడగును. సమానులు అతని పెత్తనమును అంగీకరింతురు.

    సమానానామ్ వశిష్ఠః భవతి. అతడు సామానులందు విశిష్టుడు అగును.

                              పన్నెండవ అనువాకము

    1. ప్రజాపతీ! నీవే విశ్వములందు వ్యాపించి ఉన్నావు.

    2. ప్రజాపతియే హిరణ్యగర్భుడు. ప్రజాపతి రూపుడగు ఆ పుత్రుడు, తండ్రిని ఎరుగును. తల్లిని ఎరుగును. ప్రజాపతి అభిజ్ఞుడు. అతడు ఆ మాతా పితరులకు పుత్రుడు అగును. కావుననే అతడు వారిని ఎరిగియున్నాడు. అతడు యజమానికి తిరిగి ధనమును ఇచ్చుచున్నాడు. అతడు ద్యులోకమును, అంతరిక్షమును, స్వర్గలోకమును ఆవరించినాడు. అతడు భువనముల నన్నింటిని ఆచ్చాదించినాడు.

    3. అగ్ని వంటి సూర్యుని కిరణములు లోకములను చూచుటకుగాను ఆకసమున పెరుగుచున్నవి. ఎరుపు తెలుపు మున్నగు రంగులు గల, సకల ప్రాణి జాలములకు నేత్రము వంటి కిరణ పుంజము వెలువడుచున్నది.

    4. అగ్నీ! పూర్వులు ఉదారులు, ధనికులై ధనమును విస్తరింపచేసినారు. మాకు పూర్వుల సంపాదనలేదు. నీవే మాకు మలినరహితమును, ప్రకాశమానమును అగు ధనమును కలిగించుము. పెంపొందించుము.

    5. అగ్ని మానవుల కొరకని హస్తములందు ధనము ధరించి ఉండువాడు. అతడు సమస్త ధనములకు అధిపతి. సమస్త హిరణ్యములను కూర్చగలవాడు. అతడు తనశక్తిచే యజమానులను నిరంతర అనుష్ఠాతలను - బ్రహ్మసదృశులను చేయును గాత.

    6. సవితృదేవత చేతులనిండ బంగారము ఉన్నది. మేము అతనిని సమీపింతుము. మమ్ము రక్షించుమని ఆహ్వానింతుము. అతడు దేవతా స్వరూపుడు. మాకు యోగ్యమగు స్థానమును ఎరుంగును.

    7. సూర్యదేవా! మాకు ఇప్పుడు అనుభవయోగ్యమగు కర్మఫలమును ప్రసాదించుము. రేపు మరియు ప్రతి దినము మాకు అట్టి కర్మఫలమునొసంగుము.

    దేవా! అనుభవయోగ్యమును, విశాలమును అగు స్వర్గము సిద్ధించుటకు తగిన కర్మను మేము చేయుదుము గాత.

    8. భూదేవీ! నీవు అభిముఖము కలదానవు. మహిమాన్వితవు. నీ మహిమచే పర్వతములను సంతోషపెట్టుచున్నావు. అదే మహిమచే పర్వతముల దుఃఖమును భరించుచున్నావు.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More