Home » Yandamuri veerendranath » Prarthana


    వెళ్ళిపోయేవారికి హృదయ పూర్వకంగా వీడ్కోలు చెప్పటం ఆచారం. ఈ రోజు అలాంటిదేమీ లేదు. నిశ్శబ్దంగా వీలయినంత వరకూ ఎవరికీ తెలియకుండా నిష్క్రమణ జరగాలి.

 

    అతడు బ్రీఫ్ కేసు పట్టుకుని గది మధ్యలో నిలబడ్డాడు.

 

    అద్దాల అవతల్నుంచి లాబ్ కనిపిస్తుంది.

 

    ఆ గదిలోనే తను కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసేడు.

 

    మనిషిని మహమ్మారిలా చంపేస్తూన్న కేన్సర్ కి మందు కనుక్కోవాలని దివారాత్రులూ శ్రమించాడు. ఫలితంగా శూన్యం మిగిలింది. అంతేకాదు, ఏ రోగానికయితే మందు కనుక్కోవాలని తను ఇంతకాలం కష్టపడ్డాడో ఆ రాగమే తను ప్రాణాధికంగా ప్రేమించే కూతుర్ని కబళించి వేస్తూంది. తను ఏమీ చేయలేని స్థితిలో నిస్సహాయంగా చూస్తూ వుండిపోవాల్సి వస్తూంది.

 

    ఈ క్షణంవరకూ కొద్దిగా ఆశ అయినా వుండేది- ఈ పరిశోధనాలయం నుండి ఏదయినా ఒక మహత్తరమైన క్షణం ఒక జీవరహస్యం బయల్పడి తన కూతుర్ని రక్షిస్తుందేమో అని.

 

    ఇప్పుడదీ లేదు.

 

    ఈ ఆశలన్నీ సజీవంగా పూడ్చి పెట్టబడ్డాయి.

 

    అతడు అద్దాల వెనుక వున్న కుందేళ్ళనీ అరల్లో తిరిగే బాతుల్నీ చూసేడు. ఆశయ సిద్ధికోసం ఈ అమాయకమైన జీవుల్ని ఎన్నిటిని చంపేడు. ఇంకా ఎన్ని మరణాలు- ఎన్ని త్యాగాలు జరగాలో, ఈ వ్యాధికి మందు కనుక్కోబడాలంటే- ఇంకా ఎంతమంది రోగులమీద ప్రయోగాలు జరగాలో, ఎంతమంది సమిధలవ్వాలో- అయినా ఫర్వాలేదు.

 

    ఒక ఔషధం కనుక్కోబడుతుందంటే, ఒక రహస్యం శోధింపబడుతుందంటే దానికి ఎంతయినా బలి ఇవ్వవచ్చు.

 

    కానీ భవిష్యత్ చరిత్రలో తానుండడు. మిగతా అందరు ప్రజల్లాగే తనూ ఈ విషయాన్ని పేపర్ లో చదువుతాడు. ఎక్కడో... ఎప్పుడో.... అప్పటికి తను వుండకపోవచ్చు కూడా. ఎంత దయనీయమైన స్థితి ఇది. ఇంతకాలం సాగర మధనం చేసి, సుర ఉద్భవించే సమయానికి వెళ్ళిపోవలసి రావటం.

 

    ఎంతోకాలంగా తనకు పరిచయమైన ఆ గదిలో పరికరాల్ని అతడు ఆఖరుసారి ఆప్యాయంగా చూసుకున్నాడు. ఆ చూపులో "వెళ్ళొస్తాను మిత్రులారా" అన్న వీడ్కోలు వుంది.

 

    ఆ తరువాత అతడు ఆ గదిలోంచి బయటకి వచ్చాడు. మెట్లుదిగి లాబ్ వైపు వెళ్ళాడు. అకౌంట్స్ డిపార్ట్ మెంట్ కి వెళ్ళటం ఇష్టంలేదు. తనకి రావల్సిన డబ్బు శేఖరం ద్వారా తీసుకోవచ్చు. అలా అనుకుని కారు దగ్గరికి వెళుతూ వెళుతూ అతడు మెట్ల సమీపానికి వచ్చాడు. అప్పుడే రమణమూర్తి లోపల్నుంచి బయటకు వస్తున్నాడు.

 

    "ఏమిటి, ఏమన్నా తెలిసిందా?" యధాలాపంగా అడిగాడు భార్గవ. అంత తొందరగా పరీక్ష పూర్తవుతుందనుకోలేదు. కానీ రమణమూర్తి- "కాంబినేషన్ లో మొదటి రెండు గాసెస్ సులభంగానే కనుక్కున్నాను. మూడోదే కాస్త ఇబ్బంది పెట్టింది" అన్నాడు.

 

    "చివరికైనా దొరికిందా?"

 

    "నేను స్వయంగా టేబిల్ దగ్గిర కూర్చుంటే దొరక్కుండా వుంటుందా భార్గవా?" కాస్త ఆత్మస్థయిర్యంతో గర్వంగా అన్నాడు.

 

    "ఏమిటా మూడోది?"

 

    "మెథైల్ కోరిన్ ధెరీన్"

 

    భార్గవ కాళ్ళ క్రింద భూమి కదిలినట్టు అనిపించింది. తూలి పడబోయి తమాయించుకున్నాడు. 'వ్వాట్' అని అరిచాడు కీచుగా.

 

    "మెథైల్ కోరిన్ ధెరీన్ భార్గవా.... అదేమిటి మీరు అలా అయిపోయారు?"

 

    భార్గవ మాట్లాడలేదు. అతడు చెప్పిన వార్త భార్గవని స్థాణువుని చేసింది. మెథైల్... కోరి.. న్ ... ధె....రీ....న్! కేన్సర్ కలుగజేసే ముఖ్యమైన హైడ్రో కార్సిన్ లలో అన్నిటికన్నా ప్రమాదకరమైన కార్సినోజెన్. సామ్సన్ కంపెనీ ఫ్యాక్టరీ గొట్టంలోంచి అదెందుకు వెలువడుతూంది? భార్గవకి వెంటనే సమాధానం దొరికింది.

 

    మెథైల్ కోరిన్ ధెరీన్ ఒక స్టెరాయిడ్ తాలూకు 4-రింగ్ స్ట్రక్చర్- చిత్రమేమిటంటే, సెక్స్ హార్మోన్లన్నీ స్టెరాయిడ్సే!! కేన్సర్ కి కారణం పాడయిపోయిన సెక్స్ హార్మోన్లనుకున్నాం కాబట్టి ....

 

    ఈ ఆలోచన స్ఫురించేసరికి అతడి మొహంలో రక్తం ఇంకిపోయింది.

 

    సామ్సన్ కంపెనీ తయారుచేసే కాన్స్- క్యూర్ ముందు శరీరంలో వుండే కేన్సర్ కణాల్ని తగ్గించటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ మందు తయారుచేస్తూ వుండగా ఉత్పత్తి అయ్యే మెథైల్ కోరిన్ ధెరీన్ కేన్సర్ కణాల్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది.

 

    మొత్తానికి వలయం పూర్తయింది.

 

    కేన్సర్ ని తయారుచేసే పదార్థానికీ, దాన్ని నిరోధించే పదార్థానికీ ఇంత దగ్గర సంబంధం వుండదన్నమాట. అవును.... అందులో చిత్రమేమీలేదు. పెరిగే మామూలు జీవకణం అస్తవ్యస్తం అవుతేనే కదా అది కేన్సర్ కణమై 'తిరిగి పెరగటం' ప్రారంభమవుతుంది. అదీ వలయమే.

 

    కేన్సర్ కణాల్ని చంపటానికి ఒక మందు తయారుచెయ్యాలి అంటే, అందులోంచి మామూలు కణాల్ని కేన్సర్ కణాలుగా మార్చే మెథైల్ కోరిన్ ధెరీన్ తీసెయ్యాలి. సామ్సన్ కంపెనీ చేస్తున్నది అదే. పోతే, ఆ గాలిని శుభ్రపరచకుండా ఊరు మీదకు వదిలేస్తూంది. మైగాడ్!

 

    భార్గవలో ఒక్కసారిగా ఆవేశం పెల్లుబికింది.

 

    దీన్ని ఎలాగైనా అరికట్టాలి.

 

    తను కేన్సర్ కి మందు కనుక్కోలేకపోవచ్చు. కానీ కపాడియా ఇన్ స్టిట్యూట్ ప్రాంతాల్లోనూ, ఆ చుట్టుప్రక్కలా కేన్సర్ ఎందుకు ఎక్కువగా వ్యాపిస్తూందో కనుక్కున్నాడు.

 

    చాలు!

 

    అప్పుడు చప్పున స్పృహలోకి వచ్చినట్టు తలెత్తి రమణమూర్తి వైపు చూసి 'థాంక్స్, చాలా సాయం చేశారు' అని చెప్పి అక్కణ్నుంచి కదిలాడు. కుంటుకుంటూ వడివడిగా వెళ్ళిపోతున్న భార్గవకేసి రమణమూర్తి ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయాడు.

 

                                             6

 

    "నా ప్రియమైన ప్రజలారా! నేడెంతో సుదినం. ఈ రోజు మీ మధ్య- మీ కోసం ఒక హాలు ప్రారంభమవుతుంది. నాటకాలేసుకోవటానికీ, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవటానికీ ఇలాంటి ఓపెన్ థియేటర్ల ఆవశ్యకత ఎంతో వుంది. ఇక్కడ ఈ హాలు కాదు ముఖ్యం, ఈ లొకాలిటీ ప్రజల్లో పెరుగుతున్న ఐకమత్యానికి యిది నిదర్శనం. మీరందరూ చందాలు వేసుకుని పర్మినెంటు స్టేజీని కట్టించినారంటే కళల పట్లా కలుసుకోవటం పట్లా మీకెంత అభిరుచి వుందో అదే చెబుతూంది. మీలాంటి అభిరుచులు వున్న ప్రజలకు సేవ చెయ్యటం మా అదృష్టం..." ఇలా నాన్సెన్సికల్ గా సాగుతూంది మంత్రిగారి ఉపన్యాసం.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More