Home » Yandamuri veerendranath » Anaithikam
అతడు ఆ తర్వాత మళ్లీ చాలాకాలం వరకూ కలవలేదు. అయితే ఆ రాత్రి అతను చెప్పిన ఆ నాలుగుమాటలూ నన్ను పునరాలోచించుకునేలా చేశాయి. ఇప్పటివరకూ నేను నా జీవితం ఇలా అయిపోవడానికి నేను "చేసిన" తప్పు ఏమిటాని ఆలోచిస్తూ వచ్చానే కానీ, నేనేం "చేయలేదో" ఆలోచించలేదు. నా ప్రతీ విషాదానికీ మూలకారణం సురేష్ అనుకుంటూ వచ్చానింతకాలం. సురేష్ ఇంతవరకూ చెప్పిన అద్భుతమైన స్త్రీ వాదం స్త్రీకే మాత్రం ఉపయోగపడదని తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. ఎవరెంత చెప్పినా ఒకటి మాత్రం నిజం. స్త్రీకన్నా పురుషుడు శారీరకంగా బలవంతుడు. యవ్వనకాలమూ, ఆకర్షణ శక్తి స్త్రీకన్నా పురుషుడికి ఎక్కువ కాలం వుంటుంది. కాబట్టి స్త్రీకి ఒకటే దారి. వున్న కొద్ది సమయంలో మానసికంగా పరిణితి చెంది తనదంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవాలి. కేవలం మానసిక బలంతోనే పురుషుడితో సమానస్థాయికి చేరుకోగలగాలి. లేదా మా అమ్మలాగ నాన్నమీద నిరంతరం ఆధారపడి అదే సంతృప్తి అనుకుంటూ బతకాలి.
లేదా మా అక్కలాగా తన అందచందాల్నీ, యవ్వనాన్నీ 'బార్టర్ సిస్టమ్' లో అమ్ముకుంటూ సుఖాల్ని కొనుక్కోవాలి.
లేదా మా సురేష్ ని ప్రేమించిన పదహారేళ్ళ అమ్మాయిలాగా అవతలివాళ్ళ 'కన్వీనియెంట్ వాదనల'కి ఒక శలభం కావాలి.
ఈ నాలుగు విభాగాల్లోనూ మొదటిది ఆచరించడమే కష్టం. అందుకనే నాలాటివాళ్ళు చాలామంది చివరి మూడు విభాగాలలో దేంట్లోనో ఒకదాంట్లో చేరిపోయి, ఆ తర్వాత కళ్లు తెరిచి తమ బాధలన్నిటికీ పురుషాహంకారమే కారణమని వాపోతుంటారు.
ఈ సత్యం తెలిసిన తర్వాత నా దృక్పధంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకి నేను మా మేనేజింగ్ డైరెక్టర్ ని కలుసుకున్నాను.
* * *
నేను చెప్పినదంతా ఆయన సావధానంగా విన్నాడు. తాత్కాలికమైన గుర్తింపు కోసం నేను ఎలా నా వృత్తిని నిర్లక్ష్యం చేసిందీ ఒప్పుకున్నాను. మరొకసారి ఛాన్స్ ఇమ్మని అడిగాను. అయితే ఏ నిర్ణయమూ ఆయన వెంటనే చెప్పలేదు. నేను దానికేమీ నిరుత్సాహపడలేదు. భావపరివర్తన రాగానే కథ సుఖాంతం అవడానికి ఇదేమీ నవలకాదు అని నాకు తెలుసు. తిరిగి చదువులో నిమగ్నమయ్యాను.
హాస్టల్లో వుంటూ ఇటు చదువూ అటు ఉద్యోగమూ కొనసాగించడం పెద్ద కష్టం కాలేదు. పైగా చదువుకోవడానికి బోల్డంత సమయం దొరికేది.
సురేష్ వాదనలు ఎంత నిరర్థకమైనవో ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. వెయ్యి రూపాయలు ఇస్తే నాకు హాస్టల్లో భోజనము, వసతి కల్పించారు. నేనేపనీ చెయ్యక్కర్లేదు. భార్యా భర్తల మధ్య ప్రేమ ప్రసక్తి లేనప్పుడు- ఏ పని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు చేయాలన్నదే సంపాదనాపరురాలైన స్త్రీ ప్రశ్న అయినప్పుడు దానికి నా జీవన విధానమే పరిష్కారంగా తోచింది. ఒక మంచి గృహిణి నవ్వాలన్న నా ఆశ నిరాశగా మారిపోయిందేమోనన్న దిగులు నన్ను అప్పుడప్పుడూ స్పృశించేది. అయితే పిల్లా, పీచూ కలిగాక ఇటువంటి పరిస్థితి వస్తే హాస్టల్ లో వుండడం సాధ్యపడదు. తల్లి కాకి పిల్లల్ని పోషించినట్టు వాళ్ళందరినీ ఒకింట్లో పెట్టుకుని నేనే పోషించాలి. బహుశా ఇవన్నీ ఊహించేనేమో ఈ జనారణ్యంలో స్త్రీ పురుషుడికి అణిగి మణిగి పడివుంటోంది.
ఏది ఏమైనా ప్రస్తుతం ఆ సమస్యలన్నీ నావికావు కాబట్టి వాటిని మర్చిపోయి చదువులో మునిగిపోయాను. ఒకే సిట్టింగ్ లో డిగ్రీ పూర్తిచేసే అవకాశాన్ని వినియోగించుకున్నాను. అదంత సులభమైన పనికాదు. కానీ సులభం కాని పనులు విజయవంతంగా పూర్తిచేయడంలో వుండే ఆనందం అర్థమైంది. ఆనందంతో దుఃఖించడం అంటే ఏమిటో కూడా మొట్టమొదటిసారి తెలిసింది. మా రిజల్ట్స్ వచ్చిన రెండవ రోజు ఎం.డి. తిరిగి నన్ను పిలిపించాడు. "మాట నిలబెట్టుకున్నావన్న మాట. గుడ్!" అన్నాడు.
"థాంక్యూ సర్" అన్నాను.
"చాలా మంది ఆవేశంలో చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసేసుకుంటారు. ఆచరణలో ఏమీ వుండవు. వారిలో నువ్వొకదానివి కానందుకు సంతోషంగా వుంది" అంటూ కవరందించాడు.
బ్రాంచి మేనేజర్ గా ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఆర్డరది.
11
నేను ఎం.బి.ఏ. లో జాయినయ్యాను. మొదటి సంవత్సరం చాలా మంచి మార్కులొచ్చాయి. బ్రాంచి మేనేజర్ గా ఊపిరి సలపనంత పనుండేది. ఒకవైపు పనీ, మరొకవైపు చదువూ- వీటితో ఒంటరితనం గురించీ, మానసిక వ్యధల గురించీ ఆలోచించేంత సమయం లేకపోయింది. ఈ ఆలోచనలనేవి పిలవని అతిథులు. కాస్త తీరిగ్గా వున్నామని తెలిస్తే- గుంపులు గుంపులుగా వస్తాయి.
రెండవ సంవత్సరం ప్రారంభంలో కొత్త లెక్చరర్ వస్తున్నాడని తెలిసింది. తీరా చూస్తే శ్రీకాంత్! నన్ను చూస్తూనే విశాలంగా నవ్వి "గుడ్!" అన్నాడు. "...నేను నీనుంచి ఏదైతే ఆశించానో అదే పంథాలో నడుస్తున్నావు".
"ఇన్నాళ్ళూ ఏమయ్యారు మీరు?" నిష్ఠూరంగా అడిగాను.
"ఆ కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్ కి ఎక్కువ జీతం ఇవ్వరు. ఐ.సి.డబ్యూ.ఏ. చదివాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ కి పాఠాలు చెప్తే మరింత ఎక్కువ జీతం వస్తుంది కదా!" అన్నాడు.
"నా ప్రశ్నకి సమాధానం అదికాదు. మనం కలుసుకుని దాదాపు సంవత్సరం దాటింది కదూ! ఆ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఆరోగ్యం కుదుటబడ్డాక మీ గురించి కాలేజీకి వచ్చాను. మీరు రాజీనామా చేశారని తెలిసింది. మీరెక్కడుంటారో తెలియదాయె! మా ఆఫీసు మీకు తెలుసు కాబట్టి కనీసం ఫోనైనా చేస్తారనుకున్నాను" అన్నాను.
"ఎందుకు?"
ఆ మూడక్షరాలూ మూడు బాణాల్లా వచ్చి తగిలాయి. అతడికేసి అయోమయంగా చూస్తూ "ఏమన్నారు మీరిప్పుడు?" అనడిగాను.
"మీ ఆఫీసు అడ్రసు వెతుక్కుంటూ వచ్చి కలుసుకోవడమెందుకని అడిగాను".
నేను కాస్త కోపంగా "మరీ ఆస్పత్రి అడ్రస్ కనుక్కుని ఎందుకు వచ్చారు?" అన్నాను.
"అప్పుడు నువ్వు కష్టాల్లో వున్నావు".
"ఓహో! సానుభూతి చూపిద్దామని వచ్చారా?"



