Home » Kommuri Venugopala Rao » Vugave Uyyaala
"హలో... నేను రాజా అనే పేషెంటుని ట్రీట్ చేస్తున్నాను. మీకూ అతను తెలుసు."
"తెలుసును."
"అతని జీవిత చరిత్రను మీరు సీరియల్ గా రాస్తున్నారు."
"అవును."
"దయవుంచి ఆ నవలను రాయడం ఆపెయ్యాలి."
"ఎందుకు?" ఆమె గొంతులో ఉలికిపాటు.
"ఆ నవల్లో ఉద్రిక్త వాతావరణం వచ్చినప్పుడల్లా అతను ఎక్సయిట్ అయిపోయేందుకు అవకాశముంది. ఈ వారం మీరేదో రాశారు. అది చదివాక అతనికి ఫిట్సు వచ్చాయి. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించింది."
"రాజాకు ప్రమాదంగా వుందా?" అన్నదామె ఆందోళనగా.
అతను జరిగినదంతా చెప్పాడు.
"అయ్యో! రాజాకి ఇంకా తెలివి రాలేదా?"
"లేదు"
"వస్తుందా?"
"వస్తుంది లెండి. మీరుకూడా ఒక డాక్టరు. పెద్ద రచయిత్రి. రచయిత్రిగా మానవ స్వభావాన్ని ఎలా తరచి చూడగలరో, డాక్టరుగా పేషెంట్ మనస్తత్వాన్ని మధించగలరు. రెండిటిరీత్యా మీకు నైతిక బాధ్యత చాలావుంది. చెప్పండి, మీరు సీరియల్ రాయడం ఆపుచేస్తారా?"
"ఆపుచేస్తాను."
"థాంక్స్" అని ఫోన్ పెట్టేశాడు.
ర్యాడ్ స్మిత్ కు చేసిన లండన్ కాల్ కు కొంతసేపట్లో జవాబొచ్చింది. ఆయన అవుటాఫ్ స్టేషన్. మరునాటికి వస్తారట.
జయచంద్ర రాజాను మరోసారి పరీక్షచేసి ఆ రాత్రంతా జాగ్రత్తగా చూస్తుండమని హెచ్చరించి వెళ్ళిపోయాడు.
నరేంద్ర మాలతిని పిలిచాడు. "మాలతీ! నువ్వు ఈ రాత్రికి ఇక్కడే వుండు. అతన్ని క్లోజ్ గా వాచ్ చేస్తూ వుండు" అని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పాడు. రాత్రి పదిగంటలకు నరేంద్రకూడా వెళ్ళిపోయాడు.
హాస్పిటలంతా నిశ్శబ్ద వాతావరణం ఆక్రమించింది. మాలతి రాజా వున్న గదిలోకి రాబోతుంటే బయట వరండాలో దిగాలుపడిన ముఖంతో కూర్చుని వున్న సీతారామారావుగారు ఆమెను పిలిచారు. అంతవరకూ జరుగుతున్న దానికి ప్రేక్షకుడిగా వుండటంతప్పిస్తే పెదవి విప్పి ఒక్కమాట కూడా ఆయన మాట్లాడలేదు.
"ఏమ్మా! డాక్టర్లేమన్నారు?"
ఆమె ఆయన ముఖంలోకి చూసింది. వడిలిపోయి వుంది. సంవత్సరాల తరబడి హాస్పిటల్స్ లో తిరిగీ తిరిగీ ఆయన వయస్సు పదేళ్ళు పెరిగిపోయినట్లయింది. వృద్ధాప్యం మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆమెకు ఎక్కడలేని జాలి వేసింది.
"మీ రాజాకేం భయంలేదండీ. ఇది తాత్కాలికపు ఉపద్రవం మాత్రమే. అతను తప్పకుండా కోలుకుంటాడు" అంది.
"నిజమేనా?"
"నిజమండీ. నేనబద్ధం చెప్పడంలేదు."
"నీ నోటి చలవవల్ల రాజా ఒడ్డున పడాలమ్మా!"
సుధాకర్ ఒంగోలు వెళ్ళాడు. సీతారామారావుగారు ఒక్కరే రాజాను చూసుకుంటూ హైదరాబాద్ లో వుంటున్నాడు.
* * *
అర్థరాత్రి దాటింది. ఎక్సయిట్ అయినప్పుడల్లా ప్రమీలాదేవికి ఆస్థమా ఎక్కువవుతూ వుంటుంది. ఎక్సయిట్ మెంట్ ఓ ఎలర్జీలా విజృంభిస్తుంది.
ఆమె వీక్లీ సంపాదకుడికి ఫోన్ చేసి చెప్పింది- తానా నవల రాయబోవటం లేదని. అతను చాలా ఖంగారుపడ్డాడు. హార్ట్ ఎటాక్ వచ్చినంతపనయింది. ప్రస్తుతం వున్న సీరియల్స్ లో ఇదొక్కటే జనం క్రేజీగా చదువుతున్నారు. మిగతావన్నీ డల్ గా నడుస్తున్నాయి. ఇట్లా అర్థాంతరంగా ఆపేస్తే ఎలా అన్నాడు. ఏ కారణాలవల్ల తాను నవల రాయడం ఆపదలుచుకున్నదో ఆమె వివరించలేదు. అనారోగ్య కారణంగా రాయలేనన్నది. అతను ప్రాధేయపడ్డాడు. ఒత్తిడి చేశాడు. కొంచెం కోపంకూడా తెచ్చుకున్నాడు. అయినా ఆమె చెక్కు చెదరలేదు. ఇంకోసారి ఆలోచించమని బాధగా ఫోన్ పెట్టేశాడు.
ఆమెకూ అంతకన్నా బాధగా వుంది. నవల మధ్యలో ఆపేయడం ఆమెకు సరదా ఏం కాదు. తన ప్రాణం పోగొట్టుకున్నంత వెలితిగా వుంది. కానీ...
టేబిల్ మీద ఫోన్ మ్రోగింది.
అర్థరాత్రిపూట ఈ ఫోన్లేమిటి? మళ్లీ ఎవరు? ఆ పత్రికా సంపాదకుడేనా? ఆస్థమాబాధ వుండటంవల్ల ఆమెకు చిరుకోపం కూడా వస్తోంది. తిరిగి ఆ ప్రసక్తి తీసుకొస్తాడు. ఘర్షణ పడాల్సివస్తుంది. ఫోన్ ఎత్తకుండా వుంటే....?
కుర్చీలోంచి లేవకుండా తనని తాను నిగ్రహించుకుంటూ అలాగే కూర్చున్నది. అయినా ఫోన్ రింగవటం ఎంతకూ ఆగలేదు. విధిలేక లేచివెళ్ళి రిసీవర్ తీసింది.
"నమస్తే!" అంది అవతలినుంచి ఓ స్త్రీ కంఠం. అదే గొంతు... పోయిన వారం కథలో మెలిక చెప్పిన గొంతు.
"ఏమిటి?" అంది బలహీనంగా ప్రమీలాదేవి.
"మీరు నిద్రపోవటంలేదు, నవల రాయబోవటంలేదని వీక్లీ ఎడిటర్ కి ఫోన్ చేశారు. అతను ఒప్పుకోలేదు. మీరు రాయకూడదనే పట్టుదలతోనే వున్నారు. రాయననే చెప్పారు. చెప్పారుగానీ చాలా బాధపడుతున్నారు. ఆ బాధతో మీకు నిద్రపట్టక నలిగిపోతున్నారు."
ఆమె అదిరిపడింది. "మీకెలా తెలుసు?" అనడిగింది. గొంతు కొంచెం వణికింది.
అవతలనుంచి నవ్వు వినబడింది. ఆ నవ్వుకూ, మామూలుగా అందరూ నవ్వే నవ్వుకూ చాలా బేధం కనిపించింది.
"చెప్పమంటారా?"
"......"
"మాట్లాడరేం? పోనీ చెబుతున్నాను వినండి. మీరు నాకు స్పష్టంగా కనిపిస్తున్నారు కాబట్టి...."
ఒళ్ళు ఝల్లుమంది. చప్పున తల త్రిప్పి అటుఇటూ చూసింది. కిటికీ తెరలన్నీ మూసేసివున్నాయి. ముదురు ఆకుపచ్చ రంగు తెరలు కావటంవల్ల బయటినుంచి చూస్తే లోపల నీడైనా కనబడటానికి వీల్లేదు.
"అబద్ధం" అన్నది అరుస్తున్నట్లు.



