Home » Kommuri Venugopala Rao » Vugave Uyyaala


    "కాదు, నిజం."

 

    ఒక్క క్షణం బరువైన నిశ్శబ్దంలో గడిచింది.

 

    "పోనీ ఆ విషయం వదిలెయ్యండి. మీరు నవల రాయటం ఆపట్లేదు, కొనసాగిస్తున్నారు."

 

    "లేదు"

 

    "ఈ నవలవల్ల రాజాకు మానసికమైన ఉద్రేకం కలుగుతుందనీ, దానివల్ల అతనికి ప్రాణాపాయం కలుగుతుందనీ మీరు నమ్ముతున్నారు అవునా?"

 

    "అవును. క్రితంవారం మలుపు కూడా మీరే చెప్పారు. అలా రాయటంవల్లే రాజాకి షాక్ వచ్చింది.. మీ మాట వినను."

 

    "షాక్ వస్తే వచ్చింది. దానివల్ల అతనికి మంచే జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఎదుగుతాడు."

 

    "మీకెలా తెలుసు? మీరేమైనా డాక్టరా?"

 

    ఒక్క క్షణం నిశ్శబ్దం.

 

    "చెప్పండి? మీరేమైనా డాక్టరా?"

 

    "నేను డాక్టర్ని కాను"

 

    "మరి....."

 

    "అంతకన్నా అతీతమైనదాన్ని"

 

    "అంటే?"

 

    మళ్లీ అదే నవ్వు. గాలిలో తెరలు తెరలుగా ధ్వనితరంగాలు కదిలినట్లు...

 

    మళ్లీ ఒళ్ళు ఝల్లుమంది. "చెబితే ఝడుసుకుంటారు. ఇప్పుడా ప్రసక్తి వద్దులెండి. అంతా అయిపోయాక చెబుతాను."

 

    "అంతా అయిపోయాకంటే....?"

 

    "కథ ముగింపుకు వచ్చాక."

 

    "ఎవరి కథ?"

 

    "ఇప్పుడు నడుస్తోన్న కథ."

 

    ప్రమీలాదేవి ఏమీ మాట్లాడలేదు.

 

    "చెప్పండి నవల రాస్తున్నారా లేదా?"

 

    ఆలోచిస్తోంది.

 

    "రాయండి. కథ కూడా చెబుతాను. యాక్సిడెంటయాక ఉదయ్ కోమాలో ఉండిపోయాడు. ఒకటి కాదు...రెండుకాదు...మూడేళ్ళు. అరుదైన సంగతే... కానీ జరిగింది. డాక్టర్ల కృషి ఫలితంగా తర్వాత తెలివొచ్చింది. కానీ గత స్మృతి పోయింది. ఈలోగా ముఖం గుర్తుపట్టటానికి వీల్లేకుండా వికృతంగా తయారైన అనూరాధ అతన్ని వెదుక్కుంటూ చేరింది. గతస్మృతులు కోల్పోయి, జీవితంలో అందరినీ పోగొట్టుకుని ఒంటరివాడైపోయిన ఆ తరుణంలో అండగా నిలిచింది. అతనికి సపర్యలు చేసింది. తనెవరో తెలీకపోయినా అతనికి జీవితం మీద ఆశ జనించేటట్లు చేసింది. ప్రస్తుతానికిది చాలు. మీరు ఏ మానవతా దృక్పధంతో రాయటం మానదలుచుకున్నారో నాకు తెలుసు. మీరు రాయండి. ఉంటాను..."

 

    టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది.

 

    ఒక్కనిముషం ప్రమీలాదేవి అచేతనంగా నిలబడిపోయింది. తర్వాత తెలివి తెచ్చుకుని, వీక్లీ ఎడిటర్ నెంబర్ కి గబాగబా డయల్ చేసింది.

 

    ఏడెనిమిదిసార్లు రింగయాక అవతల ఫోన్ ఎత్తాడు.

 

    ప్రమీలాదేవి గొంతు విన్నాక ఎగిరి గంతేసినంత పని చేశాడు పత్రికా సంపాదకుడు.

 

    కానీ ఆమె అడిగిన ప్రశ్న "మీకెవరైనా ఇంతకుముందు ఫోన్ చేశారా?"

 

    "లేదే?"

 

    "పోనీ నేను సీరియల్ రాయనన్నానని ఎవరితోనైనా చెప్పారా?"

 

    "లేదు."

 

    "సరే!" అని అవతలినుంచి హలో హలో అని పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది.

 

    అయితే ఎవరు?

 

    ఆమె కళ్లముందు-ఎక్కడ్నుంచో వీస్తున్న ఈదురుగాలికి కట్టుకున్న తెల్లటి చీరె రెపరెపలాడుతుండగా, విరబూసుకున్న జుట్టుతో నిలబడిన తెల్లటి స్త్రీ మూర్తి గోచరించింది.

 

    ప్రమీలాదేవికి భయం వేసింది. ఆమె మా....మా....మా....ఇహ ఆలోచించలేకపోయింది.


                                                            * * *


    మాలతి రాజావున్న గదిలో బెడ్ దగ్గర కూర్చుంది. సీతారామారావుగారు బయట వరండాలో వున్న బెంచీమీద పడుకుని వున్నారు.

 

    బెడ్ లైట్ వెలుగు. అర్థరాత్రి దాటాక రాజా శరీరంలో కొద్దిగా హలనం వచ్చింది. మాలతి ముందుకు వంగి ఆతృతగా అతని ముఖంలోకి చూస్తోంది. అయిదు నిముషాలు అలా శరీరం ప్రకంపిస్తోన్న దశలో వుండిపోయాడు. తర్వాత ముఖంలోకి కొత్త కళ వచ్చింది. ఆ తర్వాత కళ్ళు విప్పాడు.

 

    "మా....మా....మాధవీ!" అతని పెదవులు వణుకుతున్నాయి.

 

    "సర్"! ఆమె చేతిని అతని భుజంమీద వేసి తడుతూ పిలిచింది.

 

    "మాధవీ! నువ్వు నన్ను విడిచి ఎక్కడకూ పోలేవుకదూ?"

 

    ఆమెకేమనటానికీ తోచలేదు. అతని పట్టునుండి తనచేతిని విడిపించుకునేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాలేదు.

 

    "మాధవీ! అందరూ అబద్ధం చెబుతున్నారు. నీకేం ప్రమాదం జరగలేదు. నీలో ఏ మార్పూలేదు. నువ్వు బాగానే వున్నావు. ఏం?"

 

    "సర్!"

 

    "మాధవీ! నువ్వు జీవించే వున్నావు. పరిస్థితులకు లొంగి ఎక్కడో దాక్కుని నన్ను పొంచి చూస్తున్నావు కదూ!"

 

    "......."

 

    "నువ్వు వస్తావు."

 

    "........"

 

    "ఎప్పటికైనా నా దగ్గరకొస్తావు 'రాజా' అని పిలుస్తూ నన్ను దగ్గరకు తీసుకుంటావు."

 

    "నా మాట వినిపించుకోండి సర్! నేను...." ఆమె చెయ్యి అతని చేతిలో నిస్సహాయంగా పెనుగులాడుతోంది.

 

    "మాధవీ! రా!"

 

    అతనంత గట్టిగా దగ్గరకు లాక్కుంటాడని ఆమె ఊహించలేదు. ఒక్క ఊపుతో వెళ్లి అతనిమీద పడింది. ఆమె ముఖం అతని ముఖానికి దగ్గరగా వచ్చింది. అతని పెదవులు ఆమె ముఖాన్ని వెతుక్కుంటున్నాయి.

 

    "సర్ ప్లీజ్!" ఆమె బలహీనంగా అంది.

 

    అతని పెదవులు ఆమె పెదవులకు దగ్గరగా వచ్చాయి.


Related Novels


Ayinavaallu Pakkavaallu

Rajahamsa

Kadile Megham

Suryudu Digipoyadu

More