Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
10. గోవు స్తనములందు నేనే స్పృహణీయ, దీప్త మధుర, దుగ్ధములను ఏర్పరచినాను. ఈ పనిని మరొక దేవత చేయజాలడు. గోస్తనము నదివలె పాలను పారించును. సోమముతో కలసినంత దుగ్ధము ఎంతో సుఖకరమగును.
11. ఋషి రూపమున ఇంద్రుడు చెప్పినది:-
ఈ విధానముగా ఇంద్రుడు తన ప్రభావమున దేవతలను మానవులను సంపన్నులను చేసినాడు. ఇంద్రుని వద్ద ధనమున్నది. వాస్తవముగ ఇంద్రుడే ధనవంతుడు. వివిధకర్మ, అశ్వయుక్త ఇంద్రా ! నీ పనులు నీ ఆధీనమున ఉన్నవి. ఎంతో ప్రభావితులైన ఋత్విక్కులు నీ ఘన కార్యములను ప్రశంసింతురు.
ఏబదవ సూక్తము
పూర్వవత్ ఋషి దేవతే. ఛందస్సు - విరాజ - జగతి అభిపారిణి.
1. స్తోతా ! నీ మహాసోమమునకు ఇంద్రుడు ప్రసన్నుడగును. అతడు అందరకు నేత - అందరి సృష్టికర్త. ఇంద్రుని శక్తి ఆశ్చర్యకరము - కీర్తి విపులము - సంపద సుఖకరము. వాటిని ద్యులోక, మానవలోకములు ప్రశంసించును. నీవు ఇంద్రుని పూజించుము.
2. ఇంద్రుడు అందరకు స్తుత్యుడు. ఎల్లరకు ప్రభువు. మానవులకు బంధువు వంటి, హితము కోరువాడు. నా వంటి నరుడు అతనిని సదా సేవించవలెను. ఇంద్రా ! నీవు వీరుడవు సాధువులను పోషించువాడవు ఘనకార్యములు చేయుటకు, బలసాధ్య కార్యములు చేయుటకు, వర్షము కొరకును నిన్నే పూజించ వలసి ఉన్నది.
3. ఇంద్రా ! నీ వలన అన్నము, ధనము, సుఖము సంపద పొందగల అదృష్టవంతుడు ఎవడు? నీవు అసురవధ బలము పొందుటకు నీకు సోమము పంపువాడెవడు? తన భూమి మీద వృష్టి కలుగుటకును, పౌరుషము సాధించుటకును నీకు సోమరసము అర్పించువాడెవడు?
4. ఇంద్రా ! నీవు యజ్ఞానుష్ఠానము చేసి మహామహుడవు అయినావు. సకల యజ్ఞములందును యజ్ఞభాగము అందుకొను అధికారము గలవాడవు. నీవు సకల యుద్ధములందు ప్రముఖ శత్రు సంహారకుడవైనావు. విశ్వదర్శక ఇంద్రా ! నీవు సర్వ శ్రేష్ఠమంత్ర రూపుడవు "మంత్రో విశ్వచర్షణ"
5. నీవు సర్వ శ్రేష్ఠుడవు యజమానులను రక్షింపుము. నీవు గొప్పగా రక్షించ గలవాడవని నరులు ఎరుగుదురు. నీవు అజరుడవగుము. వర్థిల్లుము. ఈ సోమ యజ్ఞమును పూర్తి చేయుము.
6. బలశాలి ఇంద్రా ! నీవు వరించిన సోమ యజ్ఞములను త్వరగా ముగింప చేయుదువు. నిన్ను ఆశ్రయించుటకు ఈ సోమపాత్ర ఈ యజ్ఞము. ఈ మంత్రము, ఈ పవిత్ర వచనము సిద్ధములై ఉన్నవి. "యజ్ఞోమన్త్రో బ్రహ్మోద్యతంవచః"
7. విప్ర ఇంద్రా ! స్రోత్రమగ్నస్తోతలు వివిధ ధనములు కోరి - ఒకచోటకూడి సోమ యజ్ఞము చేయుదురు. వారికి సోమ రూప అన్నము అందినంత వారి ఆనంద ప్రమోదములు మొదలైనంత స్తుతిరూప సాధమున సుఖములు కలుగవలెను.
(యస్యవాక్యమ్ సఋషిః యాతేనోచ్యతేసదేవతా, చెప్పినవాడు ఋషి - చెప్పబడినవాడు దేవత అనునది వ్యాయము. గత సూక్తములు ఇంద్రుడు తనను గురించి చెప్పుకున్నాడు. అందువలన ఋషియు దేవతయు అతడే అయినాడు. ఈ సూక్తమున రెండు పాత్రలు వహించినాడు ఋషిగా చెప్పినాడు దేవతగా చెప్పబడినాడు.)
ఏబది ఒకటవ సూక్తము
ఋషి - దేవతలు అగ్ని. దేవత - అగ్ని - దేవతలు. ఛందస్సు - త్రిష్టుప్.
1. దేవతలు అనుచున్నారు :-
అగ్నీ ! నీవు అత్యంత ప్రకాండుడవు. స్థూలాచ్చాదనమున వేష్టితుడవై జలములందు ఆసీనుడవైనావు. జ్ఞాత ప్రజ్ఞ అగ్నీ ! నీ యొక్క అనేక ప్రకార దేహమును ఒక దేవత చూచినాడు.
(సౌచకి అగ్ని హవిని వహించుచు దేవతలకు జంకి నీటిలో దాగినాడు. అగ్ని కొరకు వెదకుచున్న దేవతలకు చేప జలమున అగ్నిని చూపినది. అప్పుడు అగ్నికి దేవతలకు జరిగిన సంవాదము.)
2. అగ్ని అనుచున్నాడు :-
నన్ను చూచిన వాడెవడు? నా యొక్క అనేక ప్రకార దేహములను చూచిన దేవత ఎవరు? మిత్రావరుణులారా! చెప్పండి అగ్ని యొక్క దీప్తము, దేవయాన సాధన దేహము ఎచట ఉన్నది?
3. దేవతలు అనుచున్నారు :-
జ్ఞాతప్రజ్ఞ అగ్నీ ! జలములందును, ఓషధులందును నీవు ఉన్నావు. మేము మీ కొరకు వెదకినాము. విచిత్ర కిరణ అగ్నీ ! యముడు నిన్ను చూచినాడు. గుర్తించినాడు. అతడు చూచినపుడు నీవు నీ దశస్థానములను మించి వెలుగొందుచున్నావు.
(మూడు లోకములు 4.అగ్ని 5.వాయువు 6.ఆదిత్యులు 7.జలముల 8.ఓషధులు 9.వనస్పతులు 10.ప్రాణుల శరీరము. ఈ పది అగ్ని స్థానములు)
4. అగ్ని అనుచున్నాడు :-
వరుణా ! నేను హోత కార్యమున భీతిల్లినాను. వదలి వచ్చినాను. ఇక నన్ను దేవతలు హోమకార్యమున నియమించవలదని నా కోరిక. అందువలననే నా దేహము నానా స్థానములకు చేరినది. నేను అగ్నిని. ఆకార్యమును అంగీకరించను "నా చికేతాహమగ్నిః"
5. దేవతలు అనుచున్నారు:-
అగ్నీ ! లెమ్ము, రమ్ము నరుడు యజ్ఞాభిలాషి అయినాడు. అతడు యజ్ఞపు ఏర్పాట్లన్నియు చేసినాడు. నీవు తమస్సున ఉన్నావు. దేవతలనుండి హోమ ద్రవ్యములు అందుకొనగోరుము. మార్గము సుగమము చేయుము. ప్రసన్న చిత్తుడవగుము. హవిని వహించుము.
6. అగ్ని అనుచున్నాడు :-
దేవతలారా ! రథికుడు దూరమార్గమునకు వెళ్లిపోవును. అట్లే నా అన్నలు ముగ్గురు - భూపతి, భువనపతి, భూతపతి ఈ కార్యము చేయుచు చేయుచునే విగతులైనారు. ఆ భయముననే నేను ఇంత దూరము వచ్చినాను. జింక వేటగాని ధనుష్టంకారమునకు వలె నేను బెదిరినాను.
7. దేవతలు :-
జ్ఞాత ప్రజ్ఞఅగ్నీ ! మేము నీకు జరారహిత ఆయువును ఇచ్చుచున్నాము. అందువలన నీకు మరణము కలుగదు. కళ్యాణచిత్త అగ్నీ! ప్రసన్న చిత్తుడవగుము. దేవతభాగపు హవిస్సు అందించుము "దేవేభ్యోహవిషః సుజాత"
8. అగ్ని :-
దేవతలారా! యజ్ఞపు ప్రథమ హవిర్భాగము ప్రయాజ, శేషహవిర్భాగము - అనుయాజ, అత్యంత విపుల భాగము నాకు అందవలెను. జలముల సారమగు ఘృతము, ఓషధులనుండి ఉత్పన్నమగు ప్రధాన భాగము, ఆయువును నాకు ఇవ్వండి.
9. దేవతలు :-
అగ్నీ! ప్రయాజ, అనుయాజ, విపుల, అసాధారణ హవిర్భాగములు నీకే అందగలవు. సకల యజ్ఞములు నీవే కాగలవు. సకల దిశలు నీ ముందు అవనతములు కాగలవు.
(ఇది సమ్మె జరుగుట - సంభాషణలు పరిష్కారము వలె ఉన్నది.)
ఏబది రెండవ సూక్తము
ఋషి - సౌచీక అగ్ని. దేవత - వైశ్వదేవతలు. ఛందస్సు - త్రిష్టుప్.
1. విశ్వదేవతలారా! మీరు నన్ను హోతగా వరించినారు. నేను ఇచట ఉండి చదువ వలసిన మంత్రములను గురించి వివరించండి. నా భాగము ఎంత? మీ భాగమెంత? తేల్చిచెప్పండి. నేను మీ వద్దకు హోమ ద్రవ్యములు తేవలసిన మార్గమెద్దియో కనబరచండి.
2. హోతనై యజ్ఞము చేయుదును. అందుకే ఇచ్చట ఉన్నాను. సకల దేవతలు, మరుత్తులు నన్ను ఈకార్యమునకు నియమించినారు. అశ్వినులారా ! మీరు ప్రతిరోజు అధ్వర్యుకార్యము నిర్వహించ వలసి ఉండును. ఉజ్వల సోమము స్తోత్రరూపము దాల్చుచున్నది మీరిరువురు సోమపానము చేయుదురు.
3. హోత చేయవలసిన కార్యమెద్ది? హోత యజమాని ద్రవ్యమును హవనము చేయును. అది దేవతలకు లభించును. ప్రతిరోజు, ప్రతిమాసము హోమము జరుగును. ఈ హవ్యవాహక కార్యమునకు దేవతలు అగ్నిని నియమించినారు "దేవాదధిరేహవ్యవాహమ్"
4. నేను పలాయనము చిత్తగించినాను. నేను అనేక కష్టములు పడినాను. దేవతలు నన్ను హవ్యవాహకమునకు నియుక్తుని చేసినారు. అగ్ని విద్వాంసుడు, సర్వము తెలిసినవాడు. మా యజ్ఞమును ఏర్పరచును. యజ్ఞము అయిదు విధములది. అందు మూడు త్రిసవనము సోమనిష్పీడితములు మిగిలినవి సప్తఛందస్తవములు.
5. దేవతలారా ! నేను మీకు సేవలు చేయుదును. కావున నాకు అమరత్వము, సంతానము ప్రసాదించండి. నేను ఇంద్రుని రెండు చేతులకు వజ్రము నందింతును. అది అందుకొనియే అతడు సకల శత్రుసేనలను ఓడించును.
6. మూడువేల మూడువందల ముప్పది తొమ్మిది 3339 మంది దేవతలు అగ్నిని సేవించినారు. వారు అగ్నిని ఘృతాభిషిక్తుని చేసినారు. కుశలమీద ఆసీనుని చేసినారు. అగ్నిని హోతరూపమున యజ్ఞమునందు ప్రతిష్ఠించినారు.
ఏబది మూడవ సూక్తము
ఋషి - దేవతలు. దేవత - సౌచీక అగ్ని. ఛందస్సు - జగతి - త్రిష్టుప్.
1. మేము మనసా కోరిన అగ్ని విచ్చేసినాడు. అగ్నికి యజ్ఞము తెలియును. అతడు తన అవయములను పరిపూర్ణము చేసికొనును. అతని వంటి యజ్ఞకర్త లేనేలేడు. యజనీయ దేవతల మధ్య అగ్ని వేదిపై ఆసీనుడై ఉన్నాడు అతడు మా యజనము చేయవలెను.
2. అగ్ని హోత శ్రేష్ఠయజ్ఞకర్త అతడు వేదిమీద కూర్చున్నాడు. ఆహుతి యోగ్యుడైనాడు ఆహుతి యోగ్య దేవతలకు త్వరగా యజించుటకును. స్తుత్యదేవతలను స్తుతించుటకును. అగ్ని అచట ఉంచినారు. పురోడాశాదులను నలువైపుల నుండి వీక్షించు చున్నాడు.
3. మాది దేవాగమన పూర్వక యజ్ఞకార్యము అగ్ని దానిని సుసంపన్నము చేయవలెను. యజ్ఞపు నిగూఢ జిహ్వ - అగ్ని మాకు లభించినది. అగ్ని సురభియై, దీర్ఘాయువై విచ్చేసినాడు. దేవాహ్వాన రూప యజ్ఞమును అగ్నియే పూర్తి చేసినాడు.
4. అసురులను పరాభవించగల సర్వశ్రేష్ఠవాక్కును మేము ఉచ్చరించవలెను. అన్న భక్షక, యజ్ఞయోగ్య, పంచజనులారా ! మీరు మా హోమ కార్యమును సేవించండి.
5. పంచజనులారా ! నా హోమమును సేవించండి. హవ్యము కొరకు పుట్టిన వారును, యజ్ఞార్హులగు దేవతలు నా హోమమును సేవించండి. పృథ్వి మమ్ము పాపములనుండి రక్షించవలెను. అంతరిక్షము పాపములనుండి కాపాడవలెను.
(1. దేవతలు 2.మానవులు 3.గంధర్వులు అప్సరలు 4.సర్పములు 5. పితరులు వీరు పంచజనులు)
6. అగ్నీ ! యజ్ఞమును విస్తరించుము. లోకములకు వెలుగు నిచ్చు సూర్యునకు అనుగామి వగుము. సత్కర్మలు చేయుట వలన లభించిన జ్యోతిర్మయ మార్గములను దేవయానములను రక్షించుము. అగ్ని స్తోతల కార్యములను నిర్దోషము చేయవలెను అగ్నీ ! నీవు స్తవనీయుడవగుము. దేవతలను యజ్ఞాభిగాములను చేయుము.
7. సోమయోగ్య దేవతలారా ! రథములకు తగిన గుర్రములను రథములకు కట్టండి. గుర్రపు పగ్గములు పరిశుభ్రము చేయండి. గుర్రములను అలంకరించండి. ఎనిమిదిమంది సారథులు కూర్చుండ దగిన రథమును - సూర్యరథముతో పాటు యజ్ఞమునకు తరలించండి. ఈ రథమునందే దేవతలు సహితము పయనింతురు.
8. అశ్మన్వతినది ప్రవహించుచున్నది దీనిని దాటండి. మిత్ర దేవతలారా! కలిగిన బాధలను వదలండి. నది దాటిన మనకు అన్నము లభించును.
9. త్వష్టకు పాత్రలు చేయుట తెలియును. అతడు దేవతల కొరకు అందమగు పాన పాత్ర చేసినాడు. అతడు మంచి ఇనుముతో చేసిన గొడ్డలి పదును పెట్టుచున్నాడు. దానితోనే బ్రహ్మణస్పతికి యోగ్యమగు పాత్రను చేయు కర్రను కొట్టుము.
10. విప్రులారా ! అమృతపానము కొరకు పాత్రను చేయుటకుగాను గొడ్డళ్లకు పదును పెట్టండి. విద్వాంసులారా! దేవతలు అమరులైనటువంటి గోపనీయ వాసస్థానమును ఏర్పరచండి.
11. ఋభువులు దేవతలు కాదలచినారు. వారు ఒకానొక ఆవు కళేబరమును, దానిముందు దూడ కళేబరమును ఉంచినారు. ఈ కార్యము సాధించుటకు వారికి కుఠారము ఉపకరించినది. ప్రతినిత్యము ఋభుగణములు తమకు యోగ్యములగు ఉత్తమోత్తమ స్తవములను గ్రహించినారు. వారు వాస్తవ శత్రుంజయులు.
ఆలోచనామృతము
ప్రకృతివిచిత్రాతి విచిత్రము నిగూఢాతి నిగూఢము - విశాలాతి విశాలము ఇంకేమనగలము? ఇంతే ప్రకృతి ఇంతేనా? కాదు. భాష ఇంతే ! భాష పరిమితము ప్రకృతి అపరిమితము. అపరిమితమును పరిమితముతో చెప్పరాదు. అందుకే వాల్మీకి "గగనం గగనాకాశం సాగరస్సాగరోపమః" అన్నాడు. ఆకాశం ఆకాశం వంటిది సముద్రానికి సముద్రమే ఉపమానం.



