Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


            శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
            ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

          శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత
                               ఎనిమిదవ అష్టకము 
                            పదవ మండలము
                మొదటి అధ్యాయము             నాలుగవ అనువాకము
                                 నలుబది ఆరవ సూక్తము
        ఋషి - భాలందన వత్స ప్రేరుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.

        ఓమ్ ప్రహోతాజాతోమహాన్నభోవిన్నృషద్వా సీదదపాముపస్ధే |
        దధిర్యోధాయిసితేవయాంసి యన్తా వసూని విధత్తే తనూపాః ||

    1. అగ్ని మానవులందున్నాడు జలములందున్నాడు. ఆకాశమున జ్ఞాని రూపమున ఉన్నాడు. అగ్ని సద్గుణములవలన పూజ్యుడు. యజమానులకు హోత అయినాడు. అగ్ని యజ్ఞధర్త అయి వేదిమీద ఉంచ బడినాడు. వత్సప్రేరా ! నీవు అగ్నిని పూజింతువు. అగ్ని నిన్ను రక్షించును. నీకు అన్నము సంపద ప్రసాదించవలెను.

    2. జలమధ్యమున ఉన్న అగ్నిని పరిచారకులగు ఋషులు దొంగిలించబడిన పశువునువలె వెదకినారు. ఋషులందు భృగువంశీయులు అగ్నిని అభిలషించినవారు. విప్రులు వారు స్తుతించుచు ఏకాంతమున ఉన్న అగ్నిని కనుగొన్నారు.

    3. విభూవస పుత్రుడు త్రితుడు అగ్నిని అన్వేషించ దలచినాడు. అతడు మహా అగ్నిని భూమి మీద కనుగొన్నాడు. అగ్ని సుఖవర్థకుడు. యజమానుల గృహములందు ఉత్పన్నుడు. తరుణుడు స్వర్గమునకు నాభివంటివాడు "నాభిర్యువాభవతి రోచస్య"

    4. అగ్ని మదకరుడు. హోత ఆహ్వానీయుడు. యజ్జీయుడు యజ్ఞప్రాపకుడు గతిశీలుడు శోధకుడు హవివాహకుడు మానవులందున్నవాడు. అగ్నిని అర్చించు ఋషులు అగ్నిని స్తుతించి ప్రసన్నుని చేసినారు.

    5. అగ్ని విజయుడు. మహానుడు విప్రులను భరించువాడు. జ్ఞాని, పురధ్వంసి, అరణిగర్భుడు, స్తుత్యుడు, హరితలోముడు జ్వాలాయుక్తుడు స్తోత్రప్రియుడు. స్తోతలారా! అట్టి అగ్నిని స్తుతించండి. మానవులు అగ్నికి హవి సమర్పించి తమపనులు నెరవేర్చు కొందురు. 

    6. అగ్నికి గార్హపత్యాది మూడు రూపములు ఉన్నవి. అతడు యజమాని గృహమును స్థిరపరచువాడు. జ్వాలావంతుడు అగ్ని యజ్ఞగృహమున తన వేదిపై ఆసీనుడగును. అగ్ని ప్రజలు అందించిన హవి అందుకొనును. యజమానికి దానము ఇవ్వదలచును. ప్రజల శత్రువులను హతమార్చును. అట్లే దేవతల వద్ద కేగును.

    7. ఈ యజమాని వద్ద అనేక అగ్నులు ఉన్నవి. అవి అన్నియు అజరములు. శత్రుశాసకములు పూజనీయజ్వాలావంతులు. శోధకులు, శ్వేత వర్ణులు. క్షిప్రధర్ములు భరణశీలులు వనములందుండునవి సోమమువంటి శీఘ్రగాములు.

    8. అగ్ని తన జ్వాలలవలన కర్మములను సాధించును. పృథ్విని రక్షించుటకు అనుగ్రహపూర్వకముగ స్తోత్రములను స్వీకరించును. గతిశీల మానవులు - దీప్త, శోధక, స్తవనీయ, ఆహ్వాత, యజనీయ - అగ్నిని అర్చింతురు.

    9. ఈ అగ్నియే ద్యావాపృథ్వులకు జన్మనిచ్చినాడు. ఈ అగ్నినే జలము, త్వష్ట, భృగువులు మున్నగువారు స్తోత్రములు చదివి సంపాదించినారు. ఈ అగ్నినే వాయువు, అన్యదేవతలు మానవులు యజ్ఞమునకుగాను - నిర్మించినారు.

    10. అగ్నీ ! నీవు హవ్యవాహనుడవు. దేవతలు నిన్ను పోషించినారు. అభిలాషులగు మానవులు యజ్ఞము కొరకు నిన్ను అర్చించినారు. అగ్ని దేవభక్తులగు యజమానులకు యశస్సు కలిగించును. అగ్ని! ఈ యజ్ఞమందు స్తోతలగు నాకు అన్నము ప్రసాదించుము.
                                నలుబది ఏడవ సూక్తము
        ఋషి - ఆంగిరస సప్తగుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు అనేక ధనములకు స్వామివి. మేము ధనాభిలాషులము. నీ కుడిచేయి పట్టుకుంటాము. శూర ఇంద్రా ! నిన్ను అనేక గోవుల స్వామిగా ఎరుగుదుము. "మాకు విచిత్రమువర్ధకమగు ధనమును ప్రసాదించుము." "చిత్రం వృషణంరాయిందాః"

    2. ఇంద్రా ! నీవు శోభన అస్త్రవంతుడవు. శోభన రక్షావంతుడవు. సుందర నేత్రుడవు. నాలుగు సముద్రములను జలములతో నింపువాడవు. మరల స్తుతించదగిన వాడవు. ధనస్వామివి దుఃఖనివారకుడవు. "చిత్రం వృషణంరాయిందాః"

    3. ఇంద్రా ! మాకు స్తుతిపరాయణ, దేవభక్త, మహా, మహా, విశాలస్వరూప, సుప్రతిష్ఠత, ప్రసిద్ధజ్ఞాన, తేజస్వి, శత్రుదమనకర్త, పూజ్య, వర్షక పుత్రరూపధనమును ప్రసాదించుము. "చిత్రం వృషణంరాయిందాః"

    4. ఇంద్రా ! అన్నవంత, మేధావి, తారక, దనపూరక, వర్ధమాన శోభనబల, శత్రుఘాతక, శతృపురధ్వంసక, సత్యకర్మ, విచిత్ర వర్షక పుత్రరూప ధనమును ప్రసాదించుము. "చిత్రం వృషణంరాయిందాః"

    5. ఇంద్రా ! అశ్వయుక్త, రథి, పౌరుషసంపన్న, అసంఖ్యాక గోయుక్త, అన్నవంత, కళ్యాణ సేవక యుక్తవిప్రపరివేష్ఠిత, సర్వ సేవ్యుడగు పూజ్యపుత్రరూపధనమును ప్రసాదించుము. "చిత్రం వృషణంరాయిందాః"

    6. నేను సప్తగుడను. సత్యకర్మను, శోభనప్రజ్ఞుడను, మంత్రిస్వామిని, స్తుతులు నన్ను చేరును. నేను అంగిరగోత్రో ద్భవుడను. నమస్కరించి దేవతల వద్దకు వెళ్లుదును. నాకు విచిత్ర, వర్షక ధనమును ప్రసాదించుము. "చిత్రం వృషణంరాయిందాః"

    7. నేను సుందర సురుచిత భావపూర్ణ స్తుతులు రచిస్తాను. వానిని మనసా పఠింతును. ఈ స్తుతులు శ్రోతల హృదయ స్పందకములు. శ్రోతలు - దూతలవలె - ఇంద్రుని ప్రార్థింతురు. నాకు విచిత్ర, వర్షక ధనమును ప్రసాదించుము. "చిత్రం వృషణంరాయిందాః"

    8. నేను కోరినది నాకు ప్రసాదించుము. ఇతరులవద్ద లేనటువంటి వంద నివాసస్థానములను ఇమ్ము. ద్యావాపృథ్వులు దీనిని ఆమోదించవలెను. నాకు విచిత్ర, వర్షక ధనమును ప్రసాదించుము. "అస్మాభ్యంచిత్రం వృషణంరాయిందాః."

    (వికుంఠియను సురస్త్రీ తనకు ఇంద్రుని వంటి పుత్రుని ప్రసాదించుమని వ్రతము చేసినది. ఆమెకు ఇంద్రుడే పుత్రుడుగా జన్మించినాడు. ఇది అందుకు సంబంధించిన సూక్తమని శాయణుడు పేర్కొన్నాడు)

                               నలుబది ఎనిమిదవ సూక్తము
   ఋషి - ఇంద్రుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - జగతి - 7, 10, 11, త్రిష్టుప్.

    1. నేనే ధనములకు ప్రధానప్రభువును. శత్రుధనమును జయించువాడను నేనే. నన్నే మానవులు ఆహ్వానింతురు, తండ్రి పుత్రునకు ధనమునిచ్చును. అట్లే నేను హవిర్దాత యజమానికి అన్నము కలిగింతును.

    2. నేనే దధ్యంగుని శిరచ్చేదము చేసినాను. బావిలో పడిన త్రితుని ఉద్ధరించుట మేఘములందు జలము ఉంచినాను నేను శత్రువుల ధనము గుంజుకున్నాను. మతరిశ్వపుత్రుడు దధీచి కొరకు వర్షముకలిగించ దలచినాను. జలరక్షక మేఘమును భేదించినాను.

    (దధ్యంగుడు అధర్వుని పుత్రుడు. ఇంద్రుడు వారించినను మధువిద్యను అశ్వినులకు బోధించినాడు అందువలన ఇంద్రుడు దధ్యంగుని తల నరికినాడు.)

    3. త్వష్ట నా కొరకు ఇనుముతో వజ్రాయుధము నిర్మించినాడు. నా కొరకు దేవతలు యజ్ఞములు చేయుదురు. నా సేన సూర్యునివలె దుర్గమము. వృత్రుని వధించుట వలన అందరు నా దగ్గరకే వచ్చెదరు.

    4. యజమానులు నన్ను స్తోత్రములు, సోమము సమర్పించి సంతృప్తుని చేయుదురు. అప్పుడు నేను. ఆయుధము ధరించి శత్రువుల గోవులు, అశ్వములు, హిరణ్యము, క్షీరాది యుక్త పశుగణమను జయింతును. అంతేకాదు యజమాని శత్రువులను నాశనము చేయుటకు అనేక ఆయుధములకు పదును పెట్టుదును.

    5. నేను సకల ధనములకు స్వామిని. నా ధనమును ఓడించగల వాడు లేడు. నా భక్తులకు మృత్యుభయము ఉండదు. యజమానులారా ! కోరిన ధనము నన్నే అడగండి మానవులు నా స్నేహము విడువరాదు.

    6. కొందరు ప్రబలులు ఊపిరి బిగపట్టి ఆయుధము ధరించిన నాతో యుద్ధము చేయుటకు ఇద్దరిద్దరు వచ్చినారు. కొందరు స్పర్థతో నాతో తలపడదలచినారు. వారిని హుంకరించినాను. అంతే పడిపోయినారు చచ్చినారు. నేను మాత్రము తల వంచలేదు.

    7. ఒక శత్రువురానీ - ఓడింతును. ఇద్దరు వత్తురా ఓడింతును. ముగ్గురు వచ్చి మాత్రము నన్నేమిచేయగలరు? ధాన్యము నూర్చురైతు పాతపురులను నలిచి వేసినట్లు వారిని నలిచి వేతును. ఇంకను నిష్ఠుర శత్రువును హతమార్తును.

    8. గుంగువుల దేశమున ప్రజలమధ్య అతిధిగ్వ పుత్రుడు. దివోదాసును నేను ప్రతిష్ఠించినాను. వారుగుంగువుల శత్రువులను సంహరింతురు. ఆపదలను నివారింతురు. అన్నమువలె వారిని పాలింతురు. పర్ణయ, కరంజ నామకశత్రువధ జరిగిన సంగ్రామమున నేను విఖ్యాతుడను అయినాను.

    9. నా స్తోతలు అందరకు ఆశ్రయణీయులు. అన్నవంతులు భోగదాతలు నా స్తోతలను జనులు గో దాతలుగను. మిత్రులుగను. భావింతురు. నా స్తోత విజయము కొరకు యుద్ధమున నేను ఆయుధము ధరింతుము. స్తోతలను స్తుత్యులను చేయదును.

    10. ఇరువురిలో ఒకడు సోమయజ్ఞము చేయును. ఇంద్రుడు వజ్రము ధరించి అతనిని సంపన్నుని చేయును. మరొక యజ్ఞకర్తతో శత్రుయుద్ధమునకు తలపడిన తీక్ష్ణ సోమము అంధకారమున కట్టుబడినాడు.

    (దేవతను గూర్చి ఋషులు చెప్పు పద్ధతినుంచి దేవత స్వయముగా చెప్పుకొను పద్ధతి ప్రారంభమైనది. అనంతరకాలమున విభిన్నమతములు ఈ పద్ధతిని అవలంబించినవి. శ్రీమద్భగవద్గీత యందు శ్రీకృష్ణపరమాత్మ దీనినే అనుసరించినాడు.)

    11. ఆదిత్యులు, వసువులు, రుద్రపుత్రుల స్థానములకు ఇంద్రుడు హవి కలుగనివ్వడు. నేను అపరాజితుడను. అహింసితుడను. అనభిభూతుడను. దేవతలు నన్ను శుభముల కొరకును, అన్నము కొరకున సృష్టించినారు.

                             నలుబది తొమ్మిదవ సూక్తము
           ఋషిదేవతే పూర్వవత్ ఛందస్సు - జగతి 2, 11, త్రిష్టుప్.

    1. స్తోతకు నేనే ముఖ్యధనము ఇచ్చినాను. యజ్ఞములు నా కొరకే వర్థిల్లుచున్నవి. నా కొరకే యజమాని ధనమును పెంపొందింతును. యజ్ఞము చేయని వానిని సకల సంగ్రామములందు ఓడింతును.

    2. స్వర్గదేవతలు, భూచర, జలచర ప్రాణులు నన్ను ఇంద్రుడు అన్నారు. నా అశ్వములు హరితవర్ణలు పౌరుషశాలులు, వివిధ కర్ములు, లఘుగాములు. యుద్ధమునకు వెళ్లుటకు ఆ అశ్వములను రథమున పూన్చెదను. జలము కొరకు ధర్షక వజ్రమును పట్టుదును.

    3. ఉశ్న ఋషికి శుభములు కలిగించుటకు 'అత్క' నామక వ్యక్తిని బాదినాను. రక్షణకు ఉపయుక్తములగు అనేక కార్యములు చేసి 'కుత్సు'ని కాపాడినాను. 'శుష్ణు'ని వధించుటకు వజ్రము పట్టినాను. దస్యునకు ఆర్యుడను పేరు పెట్టలేదు.

    4. 'వేతసు' దేశమునకు కుత్సఋషిని - తండ్రివలె అధిపతిని చేసినాను. తుగ్రుని, స్మదభుని కుత్సునకు వశపరచినాను. నేను అజమానుని శ్రీసంపన్నుని చేయుదును. అతనిని పుత్రునిగా భావించి అతనికి ప్రియవస్తువులు ఇచ్చి అతనిని దుర్ధర్షుని చేయుదును.

    5. శ్రుతర్వుడు నన్ను స్తుతించినపుడు మృగయాసురని అతనికి వప్పగించినాను. నేను 'వశుని' ఆయువునకు 'షట్ గృభు' ని సత్యమునకు వప్పగించినాను.

    6. నవవాస్తవుడు, బృహద్రథుడు వృత్రునితో సమముగా వర్థిల్లు చున్నపుడు వారిద్దరిని వధించినాను వారిని ఈ లోకము నుండి బయటికి గెంటినాను.

    7. శీఘ్రగామి అశ్వములు నన్ను వహించును. వాటిపై నేను సూర్యుని నలుదిక్కుల ప్రదక్షిణము చేయుదును. యజమాని సోమాభిషవమునకు నన్ను పిలిచినపుడు ఆయుధమున వధించదగు శత్రువును దూరము చేయుదును.

    8. నేడు ఏడు శత్రునగరములను ధ్వంసము చేయువాడను. అందరిని మించిన బంధన కర్తను. తుర్వశ, యదువులు బలశాలురని ఎరిగినాను. వారిని ప్రసిద్ధులను చేసినాను. ఇతర స్తోతలను బలిష్ఠులను చేసినాను. నేను తొంబది తొమ్మిది నగరములను ధ్వంసము చేసినాను.

    9. నేనే జలవర్షకుడను. సప్త సింధునదులు ద్రవరూపమున భూమి మీద ప్రవహించు చున్నవికదా - వానిని నేనే ఆయాస్థానములందు ఏర్పరచినాను. నేను శోభన కర్మను. నేనే జలవితరణ చేయుదును. నేను యుద్ధము చేసి యజ్ఞకర్త మార్గమును సుగమము చేసినాను.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More