Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    సృష్టి మొదలై ఇప్పటికి 195,58,85,169 సంవత్సరాలు పాశ్చాత్యులు పేర్కొంటున్న "చరిత్ర" అనే పదానికి కనీసం వెయ్యేళ్లులేవు. ఈ పరిజ్ఞానంతో అనంతమైన కాలాన్ని కొలవటానికి ప్రయత్నించటం కాళిదాసు అన్నట్లు "గమిష్యా మ్యపుహాస్యతామ్."

    నగరకతలు ఎన్ని వచ్చినవో, ఎన్ని భూస్థాపితములైనవో "రాతియుగం" వంటి కొలమానానికి అందనిది. ఇందులోని తాత్వికత ఏమనిన ఏదీ ఎప్పటికీ ఎదుగుచుండదు. పెరుగుట కూలుట ప్రకృతి నియమము. ఈ చిన్న విషయం తెలియని వాళ్లు చెప్పే " చరిత్ర" అనే దానిని అనంత చరిత్రగల భారతీయులం మనసా, వాచా, కర్మణా నమ్ముతున్నాం ! ఇది పతనానికి పరాకాష్ట!

    ఈ అనంతమైన కాలక్రమమున భూమిమీదినుంచి అగ్ని అదృశ్యమైన కాలం ఉండవచ్చును. అగ్ని ఆకాశమున భూమిమీద, జలములందున్నాడు. భూమి మీది అగ్ని అదృశ్యమైనపుడు జలములందలి అగ్నిని ఆవిష్కరించుకు జరిగిన బృహత్ ప్రయత్నపు సంకేతమే ఈ సూక్తముగా కనిపించుచున్నది.

    అదృశ్యమైన అగ్నిని పునః ప్రతిష్ఠించుట సామాన్య విషయము కాదు. ఇది వేదకాలమునందే జరిగియుండనవసరము లేదు. అంతకు ముందు ఎన్నడో జరిగిన దానిని వేదము ఉల్లేఖించి ఉండవచ్చును. రెండు వేల యేండ్లనాటి బైబిలు నందు సృష్టి ఆదిని గురించి చెప్పబడినది !

    2. ఋభువులు గోవు చర్మమున, గోవును దూడను చేసినారు. చర్మపు దూడతో తల్లిని మురిపించి పాలు పిండుట మనము ఎరుగుదుము. ఇట్టి ప్రయోగమే గోవు విషయమున జరిగి ఉండవచ్చును.

                                 ఏబది నాలుగవ సూక్తము
   ఋషి - వామదేవ బృహదుక్థ్యుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.

    1. ధనిక ఇంద్రా ! నీ మహాకీర్తిని నేను వర్షింతును. ద్యావాపృథ్వులు ఒకపరి నిన్ను భయము భయముగా పిలిచినవి. అప్పుడు నీవు దేవతలను రక్షించినావు. దస్యు బలములను సంహరించినావు. యజమానికి బలము కలిగించినావు.

    2. ఇంద్రా ! నీవు నీ శరీరమును పెంచినావు. సకల కార్యములను ప్రకటించినావు. బలమువలన సాధ్యములగు పనుల నన్నింటిని పూర్తి చేసినావు. ఇవన్నియు మీ మాయ వలన సాధ్యమైనవి. నీవు చేసిన సకల యుద్ధములందు మాయనిండి ఉన్నది. ఇప్పుడు నీకు శత్రువన్నవాడు లేడు. ఇంతకుముందు ఉండెనా? అది సహితము అసంభవము.

    3. ఇంద్రా ! నాకన్న ముందు ఏ ఋషియైనను నీ మహిమల పారమును దర్శించినాడా? నీవు స్వశరీరమునుండి నీ తలిదండ్రులగు ద్యావాపృథ్వులను కల్పించినావు "జనయథాస్తన్వ స్వాయాః"

    4. నీవు మహామహుడవు. నీకు నాలుగు అసురఘాతక దేహములున్నవి. వానిని ఎవడును హింసించజాలడు. ఆ శరీరములతోనే నీవు మహా, మహా కార్యములను సాథింతువు.

    (1. ఉత్తరసూక్త 2.ఉపాంతవర్జిత 3. దూరత 4. మంత్రములను నాలుగు ఇంద్రుని శరీరములని శాయణడు)

    5. గుప్త సంపదలకు, కనిపించు సంపదలకు నీవే అధిపతివి. ఇంద్రా ! నా కోరికలు తీర్చుము. నీవే ఆజ్ఞాపించు వాడవగుదువు. నీవే దాతవగుదువు "త్వమాజ్ఞాతా త్వమిన్ద్రాసిదాతా"

    6. జ్యోతిర్మయ పదార్థములందు జ్యోతిని ప్రసాదించినవాడు ఇంద్రుడు. సోమరసాదివస్తువులందు మాధుర్యమును ప్రవేశపెట్టిన వాడు ఇంద్రుడు. బృహదుక్థమంత్ర కర్తయగు ఋషి ఇంద్రునకు ప్రియములు, బలకరములగు స్తోత్రములు కల్పించినాడు.

                                ఏబది అయిదవ సూక్తము
                                      ఋష్యాద్యాః పూర్వవత్

    1. ఇంద్రా ! నీ దేహము దూరమందున్నది. పరాఙ్మఖులైనమానవులు దానిని దాచిపెట్టినారు. ద్యావాపృథ్వులు దానిని భయమున పిలుచును. అప్పుడు నీవు నీ వద్దనున్న మేఘరాశిని ప్రదీప్తము చేయుదువు. పృథ్వినుండి ఆకాశమును పైకి లేపి ఉంచుదువు.

    2. నీ యొక్క గుహ్యదేహము విస్తృత స్థానములందు పరివ్యాప్తమై ఉన్నది. అది అత్యంత ప్రకాండము దానితో నీవు భూత భవిష్యత్తులను సృజించినావు. నీవు జ్యోతిర్మయ వస్తువులను సృష్టించదలచినపుడు సకల ప్రాచీన పదార్థములు ఉత్పన్నములైనవి. అప్పుడు పంచజనులు ప్రసన్నులైనారు.

    3. సూర్యాత్మక ఇంద్రా ! నీ తేజమున ద్యులోక, భూలోక అంతరిక్షములను నింపినావు. నీ యొక్క ప్రదీప్తములగు నానా విధకార్యములచే అవసరమును బట్టి పంచజనులను, సప్త తత్త్వములను కలిగింతువు. ఇట్టి ఏకభావ కార్యమున నాముప్పది నాలుగు మంది దేవతలు ఇంద్రునకు సాయము చేతురు.

    (1. పంచజనులు -1 దేవతలు 2. నరులు 3అసురులు అప్సరలు 4సర్పములు 5పితరులు ఏడుగురు మరత్తులు, ఏడు సూర్యకిరణములు, ఏడులోకములు సప్తతత్త్వములు. 8మంది వసువులు +11మంది రుద్రులు +12మంది ఆదిత్యులు +వషట్కార +విరాట్ ముప్పదినాలుగు మంది దేవతలు)

    4. ఉష, నక్షత్రాదులందు నీవే తొలుత వెలుగు కలిగించినావు పుష్టివంతములకు మరింత పుష్టి కలిగించినావు. నీవుపైన ఉందువు. అయినను క్రింద ఉన్నమానవులతో బంధుత్వము కలిగి ఉందువు. ఇది నీ మహత్వము. మహత్తర బలములు కూడిన ప్రభావమగును.

    5. కాలాత్మకుడగు ఇంద్రుడు యువకుడై ఉన్నపుడు సకల కార్యములు చేయును. అతని భయమున యుద్ధములందు ఎందరో శత్రువులు పారిపోవుదురు. ఇంద్రుని మాహాత్మ్యము చూడండి - నిన్న మరణించినవాడు. ఈ రోజు జీవించియున్నాడు.

    (కాలము మరణించినను మరల పుట్టునని భావము 1.దూర 2.గుహ్య 3.సూర్యాత్మక 4.కాలాత్మక ఇంద్రులను చెప్పినాడు.)

    6. అదిగో సుందర అరుణవర్ణ పక్షి వచ్చుచున్నది. దాని బలము అద్భుతము సర్వసమర్థము. అది గొప్పది. విక్రాంతము. ప్రాచీనము గూడులేనిది! అది చేయదలచినది తప్పక జరుగును. అది కోరదగిన సంపదలను గెలుచును. స్తోతలకు ఇచ్చును.  

    (పక్షి సూర్యుడు చెప్పినది సూర్యరూప ఇంద్రుని గూర్చి)

    7. వజ్రధర ఇంద్రుడు మరుత్తులతో కలసి వర్షించు జలమును సాధించినాడు. అతడు మరుత్ యుక్తుడై వర్షము కలిగించినాడు. వృత్రుని వధించినాడు పృథ్విని అభిషిక్తను చేసినాడు. ఇంద్రుడు మహామహుడు. అతడు ఇతర కార్యములందున్నపుడు మరుత్తులు వర్షోత్పత్తి కార్యమున నిమగ్నులగుదురు.

    8. మరుత్తుల సాయమున ఇంద్రుడు ఇన్నిపనులు చేసినాడు! ఇంద్రుని తేజము స్వర్గమునకు చేరునది. అతడు రాక్షసులను వధించును. అతని మనస్సు విశ్వవ్యాప్తి. అతడు క్షిప్రవిజయుడు ఇంద్రుడు ఆకసము నుండి వచ్చినాడు. సోమపానము చేసినాడు. దేహమును పెంచినాడు ఆయుధము అందుకున్నాడు. అసురులను వధించినాడు.

                             ఏబది ఆరవ సూక్తము
    ఋషి - వామదేవ బృహదుక్థ్యుడు. దేవత - విశ్వేదేవతలు. ఛందస్సు - 1 -
                              3,7, త్రిష్టుప్ 4-6జగతి

    1. బృహదుక్థ్యుడు తన మృతపుత్రుడు 'వాజి' ని అన్నమాటలు :-

    నీలో ఒక అంశము అగ్ని - రెండవది వాయువు. మూడవది జోతిర్మయము. నీవు ఈ మూడింటిలో ప్రవేశించుము. అప్పుడు నీవు కళ్యాణమయుడవగుము. దేవతలందు సర్వ శ్రేష్ఠుడు, పితృస్వరూప సూర్యలోమునకు ప్రియస్వరూపుడవు అగుము.

    2. వాజీ ! పృథ్వి నీ దేహమును దాచుకొనును. భూమి మాకు ప్రీతి జనకము కావలెను. నీకు శుభములు కలిగించవలెను. నీవు స్థానభ్రష్టుడవు కారాదు. నీవు జ్యోతిర్మయుడవు కావలసి ఉన్నది. దేవతలందును. ఆకసమున ఉన్న సూర్యుని యందును. నిన్ను విలీనము చేసికొనుము - "జ్యోతిః స్వామిమీయాః"

    3. కొడుకా! నీవు అందగాడవు. బలశాలివి. నీవు ఉత్తమ స్తుతులు చేసినావు. ఉత్తమ స్వర్గమునకు చేరుము. ఉత్తమ ధర్మమును అనుష్ఠించినావు. ఉత్తమ ఫలము పొందుము. ఉత్తమ దేవతలందు, ఉత్తమ సూర్యుని యందు కలసిపొమ్ము.

    4. మా పితరులు దేవతలతో సమానమగు మహిమగలవారైనారు. వారికి దేవత్వము కలిగినది. వారు దేవతలతో కూడి కార్యములు చేయుచున్నారు. సకల జ్యోతిర్మయ పదార్థములకు వెలుగు ప్రసాదించు వానితో కలసి పోయినారు. వారు మరల దేవతల దేహములందు విలీనులు అయినారు.

    5. మా పితరులు స్వశక్తిచే సకల బ్రహ్మాండములందు సంచరించినారు. ఇంతవరకు ఎవరును చేరని ప్రాచీన భువనములందు వారు ప్రవేశించినారు. తమదేహములచే సకల భువనములను దాల్చినారు. ప్రజలందు తమప్రభావమును విస్తరింప చేసినారు.

    6. దేవతలు సూర్యపుత్రరూపులు. వారు తమ సృజన కార్యమున సర్వజ్ఞుడు, బలశాలి - సూర్యునకు ఉభయ సంధ్యలు కల్పించినారు. మా పితరులు సంతానము కన్నారు. సంతానమున పైతృక బలమును ప్రవేశపెట్టినారు. వంశమును చిరస్థాయిని చేసినారు.

    7. జనులు పడవలలో నీటిని దాచినట్లు - శుభములు కలిగి ఆపదలనుండి బయటపడినట్లు బృహదుక్థ్యఋషి స్వశక్తిచే తన మృతపుత్రుని అగ్నిమున్నగు పార్థివ పదార్థములందును దూరమందున్న జ్యోతిర్మయ పదార్థములందును విలీనము చేసినాడు.

                                ఏబది ఏడవ సూక్తము
  ఋషి - సుబంధు మున్నగువారు. దేవత - మనస్సు. ఛందస్సు - గాయత్రి.

    1. ఇంద్రా ! మేము సన్మార్గమునుండి దుర్మార్గమునకు పోరాదు. సోమముగల గృహమునకు దూరముగా పోరాదు. మా మధ్య శత్రువులు చేరరాదు.

    2. అగ్ని వలన యజ్ఞమునకు సిద్ధి కలుగును. అగ్ని పుత్రస్వరూపుడై దేవతలవరకు చేరును. అట్టి అగ్నికి హవనము చేయవలెను. మాకు అగ్ని లభించవలెను.

    3. నరాశంస సంబంధ సోమమున మనసును పిలుచు చున్నాము. పితరుల స్తోత్రములచే మనసును పిలుచుచున్నాము.

    4. నీ మనసు మరలి రావలెను పనిచేయవలెను. బలము ప్రకటించవలెను జీవించవలెను సూర్యుని దర్శించ వలెను.

    5. మా పూర్వులు మనసును మరలింపవలెను. దేవతలు మనసును మరలింపవలెను. మాకు ప్రాణవ్రాతము లభించవలెను.

    6. సోమమా ! మా దేహమందు మనసును దాల్తుము. మేము సంతతి యుక్తులమగుదుము. నీ పనులందు చేరుదుము.

    (అసముడనువాడు ఇక్ష్వాకురాజు అతనికి బంధు, సుబంధు, శ్రుతబంధు, విప్రబంధు అను సోదరులు పురోహితులు ఆరాజు వీరిని వదిలి మాయావులను పురోహితులుగా వరించినారు. అందుకు బంధ్వాదులు కోపించినారు. అది తెలిసి మాయావులు బంధు, సుబంధులను చంపినారు. మిగిలిన సోదరులు శ్రుతబంధు, విప్రబంధువులు మృతసోదరులను పునర్జీవించ వలసినది అన్నారు.)

                               ఏబది ఎనిమిదవ సూక్తము
         ఋషి - బంధ్వాదులు. దేవత - మనసు. ఛందస్సు - అనుష్టుప్.

    (సుబంధు దేహమున మరలి ఇంద్రియ సహితమగు మనసు ప్రవేశించ వలెనని కోరుట)

    1. వివస్వతుని పుత్రుడు యముడు అతని వద్దకు నీ మనసు చేరినది. మేము దానిని తిరిగి రప్పింతుము. నీవు ఈ లోకమున ఉండుటకు జీవింతువు. "ఇహక్షయాయజీవసే"

    2. నీ మనసు సుదూరమునకు స్వర్గమునకు, భూమిమీదకు పోయినది మేము దానిని తిరిగి రప్పింతును. "ఇహక్షయాయజీవసే"

    3. నీ మనసు నలుదిశల దొర్లుచున్నది బహుదూర దేశమునకు చేరినది. మేము దానిని తిరిగి రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"

    4. నీ మనసు నలుదిశల అతిదూర ప్రదేశమునకు పోయినది మేము దానిని తిరిగి రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"

    5. నీ మనసు బహుదూరమున నున్న జలపూర్ణ సముద్రమునకు చేరినది. మేము దానిని తిరిగి రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"

    6. నీ మనసు నలువైపుల వ్యాపించిన కిరణమండలము చేరినది. మేము దానిని తిరిగి రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"

    7. నీ మనసు దూరమందున్న జలమధ్యమందలి వృక్షలతాదుల మధ్యకు చేరినది. మేము దానిని తిరిగి రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"

    8. నీ మనసు దూరమందున్న ఉషమధ్యమున చేరినది. మేము దానిని తిరిగి రప్పింతుము. "ఇహక్షయాయజీవసే"


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More