Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
8. ఏబదిమూడు పాచికలు ఫలకము మీద విహరించునపుడు సత్యస్వరూప సూర్యుడు లోకములందు సంచరించుచున్నట్లుండును. ఎంతటి బలవంతుడైనను పాచికను పట్టి ఉంచజాలడు. రాజులు సహితము పాచికకు నమస్కరింతురు.
9. పాచికలు ఒకపరి ఎక్కును ఒకపరి దిగును పాచికలకు చేతులు లేవు. కాని చేతులున్నవాని చేతబడి ఓటమి చవిచూచును. పాచికలు సంపన్నములు. మండుచున్న నిప్పు కణికలవలె ఫలకము మీద కూర్చుండును చేతికి చల్లగనే తాకును. గుండెను మండించును.
10. జూదరి భార్య దీనురాలై విలపించును - అతని బిడ్డలు వీధులవెంట తిరిగుదురుఅని జూదరి తల్లి మనోవ్యధలో పడిపోవును. జూదరికి అప్పుపెట్టిన వాడు తన డబ్బు తిరిగిరాకను గురించి సందేహించును. పాపం జూదరి మరొకరి ఇళ్లలో రాత్రులు గడుపును.
]
11. తన భార్య దశను చూచి జూదరి గుండెపగులును. ఇతరుల భార్యల సౌభాగ్యములు, వారి మేడలు చూచి జూదరి క్రుంగి పోవును. ఉదయమున జూదరి గుఱ్ఱము మీద అట్టహాసముగా వచ్చును. ఆజూదరియే సాయంత్రము దరిద్రుడై చలికాచు కొనుటకు మంటముందు చేరును. వంటి మీద బట్టకూడ మిగలదు.
12. పాచికా! నీ బలమున ప్రధాని ఉన్నాడు. సేనాని ఉన్నాడు. మహారాజు ఉన్నాడు. వారి అందరకు చేతులు జోడించి నమస్కరింతును. నేను సత్యము పలుకుచున్నాను. నిన్ను మాత్రము ధనము అడుగను.
13. ఓరే! జూదరీ! జూదము ఆడకుము పొలము దున్నుకొనుము. వ్యవసాయమున వచ్చిన దానిచే తృప్తినొందుము. కృతార్ధుడనను కొనుము. అందువలన భార్య లభించును. అనేక గోవులు లభించును. ఈ మాట నాతో సూర్యుడు చెప్పినాడు "తన్మేవిచేష్టేసవితాయ మార్యః"
14. పాచికలారా! మమ్ము మీ బంధువులుగా భావించండి మాకు శుభములు సమకూర్చండి మీ దుర్ధర్ష ప్రభావమును మా మీద ప్రయోగించకండి. మా శత్రువు మాత్రమే మీ కోపదృష్టిలో పడవలెను.
ఆలోచనామృతము
మనిషి ఎంత విచిత్రుడండీ! తన అంతరంగమును మార్చలేడు. బహిరంగమును బ్రహ్మాండముగా మార్చును!! "స్వభావో దురతిక్రమః" అన్నాడు వాల్మీకి మనము వేషము మార్చగలము. మనసు మార్చులేము. మనసు మార్చుటన్న మాటలు కాదురా!" అన్నాను నేను ఒక చోట! నేడు మనిషి గ్రహాంతరాల మీద అడుగులు వేయుచున్నాడు! సంతోషమే! కాని తన ఈర్ష్యాద్వేషాలను అభిమాన దురభిమానాలను సంస్కరించు కొనలేక పోతున్నాడు వదలు కొనుట అసాధ్యము. అసంభవము. సంస్కారమే జరుగలేదా అనిన దిగమ్రింగు చున్నాడు. బయట పడలేక పోవుచున్నాడు. ఇది వదలుటకాదు మరింత ఉడికించుట! వేదము మనిషిని అధ్యయనము చేసినది. మనిషి స్వభావమును చదివినది. మనిషి మనసును చూచినది. మానవ స్వభావపు నిత్యసత్యములను చాటినది! నాటి నుంచి నేటి వరకు ఏనాటికైనా మారునది మనిషి స్వభావము కాదు వేషము మాత్రమే! పయనమునకు నాడురథము నేడు విమానము చక్ర భ్రమణమను మూలసూత్రమున మార్పు లేదు మార్పు ఆకారమునందు మాత్రమే! ఈ సూత్రము అన్నింటికి చెల్లును. అన్వయంచు కొనవలెను అంతే!
2.వ్యసనము మనిషి ఏర్పరచుకున్నది. భగవద్దత్తము కాదు. భగవంతుడు ప్రసాదించిన వన్నియు మానవుని శ్రేయస్సునకే అగును. మానవుడు విచిత్రప్రాణి. తనను తాను ధ్వంసము చేసికొనుటలో నిపుణుడు! ఈనైపుణ్యము ఇతర ప్రాణులకు లేదు!! వ్యసనముగా మనిషి ఏర్పరచుకున్నాడు. ఎంతో నాగరికుల మనిపించు కొను జాతులు సహితము నేటికిని ఈ వ్యసనమునుండి బయట పడలేకున్నవి! సత్యమేమనగా ఈ నాగరకత మనిషికి మత్తునిచ్చి జూదపు సంకెలలందు బంధించినది! నేటి నగరకత ప్రధాన లక్షణమేమనగా ఇది బంధములను తెలియనీదు!! కట్లలో క్రుంగువాడు సహితము తాను స్వతంత్రుడను అనుకొనును!!!
3. ఈ సూక్తము జూదమును గురించి సుందరముగా వివరించింది. నాకు తెలిసినంతవరకు ఇంత కొద్దిలో వేదమును గురించిన ఇంత వివరణ సాహిత్యమున అగుపించలేదు. ఇంత వివరించినను తరువాతి వారగు ధర్మరాజు, నలుడు జూదముననే కదా నలిగినారు! మనిషి వేదము చెప్పినది విననంతవరకు చెడుచున్నాడు!!! అందుకు ఇది నిదర్శనము.
ఒకవ్యసనమును కలిగించుట సులభము. మాన్పించుట సుమారు అసాధ్యము. వ్యసమును వ్యక్తి అధిగమంచ వలసి ఉన్నది! అందుకే వేదము వ్యసనపరునేసంబోధించినది అక్షౌర్మాదీవ్యః కృషిమిత్కృష జూడమాడకుము కృషిచేయుము కృషిచేయుము అని!
"త్రిపంచాశః" అన్నాడు పాచికలు ఏబది మూడట! నేటిపేకముక్కలు ఏబదిరెండు! సంఖ్యలో ఒకటి తగ్గించినాము వ్యసనము ఎంత పెంచినామో! కుటుంబమును గురించి వేదమునకు ఎంత ఆవేదన! కుటుంబమే కదా లోకమునకు మూలము! "శీతాఃసన్తో ద్హృదయం నిర్వహంతి" ఎంత చక్కగా చెప్పినాడు! చల్లగా ఉండి గుండె కాల్చునది! "అపూర్వోదృశ్యతేవాహ్నిః కామినీ కుచమండలే దూరతో దహతే గాత్రం హృదిలగ్నస్తుశీతలే." అను భర్తృహరి శ్లోకమునకు పైమంత్రము ప్రేరణవలె ఉన్నది. 'కామినీ కుచమండలంలో అపూర్వం అయిన అగ్ని మండుచున్నది. అది దూరంనుంచి కాలుస్తుంది.' గుండెకు హత్తుకుంటే చల్లగా ఉంటుంది, అని ఆశ్లోకపు తాత్పర్యం.
ఋషి పాచికలకు నమస్కరించిన సొంపు:-
యోవః సేనానీర్మహతో గణస్యరాజా వ్రాతస్యప్రథమో బభూవ|
తస్మైకృణోమినధనారుణధ్మిదశాహం ప్రాచీస్తదృతంవదామి||
ముప్పది అయిదవ సూక్తము
ఋషి - ధనాకపుత్ర లుశస్యుడు. దేవత - వైశ్వదేవతలు.
ఛందస్సు - జగతి, 13,14, త్రిష్టప్
1. అగ్నిమేల్కోన్నాడు. అతనితో ఇంద్రుడు మేల్కోన్నాడు. ప్రభాతము అంధకారమును అన్యదేశములకు తరిమినపుడు అగ్ని జ్వాలలను అందుకుని జ్వలించును. విశాలములగు ద్యులోక, భూలోకములు చైతన్యవంతములు కావలెను. దేవతలు మమ్ము రక్షించ వలెనని ప్రార్థించుచున్నాము.
2. మేము ప్రార్థించుచున్నాము. ద్యావాపృథ్వులు మమ్ము రక్షించవలెను. నదులు తల్లులవలె రక్షించవలెను. శర్యావతము వద్దగల పర్వతము రక్షించవలెను. మేము అపరాధులము కారాదని సూర్యుని, ఉషాస్సును ప్రార్థించుచున్నాము. సమర్పించబడిన సోమములు మాకు శుభములు సమకూర్చవలెను.
3. ద్యావాపృథ్వులు మాకు తల్లిదండ్రుల వంటివారు. ఈ ఇద్దరు మహాదేవతల ముందు నిరపరాధులము కావలెను. వారు మమ్ము రక్షించి సుఖములు కలిగించవలెను. ఉషాదేవి అంధకారములను, మాపాపములను దూరము చేయవలెను ప్రదీప్త అగ్నిముందునిలిచి మేము శుభములు యాచిస్తాము.
4. ఉషధనవతి. ముఖ్య పాపపరిహార. ఆమె మాకు ఉత్తమ ధనములు ఫ ఇవ్వవలెను. మేము దానిని పంచుకొందుము. మేము దుష్టుల క్రోధమునకు దూరముగా ఉండవలెను. ప్రజ్వలిత అగ్నిని మేము శుభములు యాచింతుము. "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
5.ఉషస్సులు సూర్యకిరణములతో కలియును. వెలుగులు దాల్చును చీకట్లను నాశము చేయును. "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
6. వ్యాధిరహితలగు ఉషస్సులు మా వద్దకు చేరవలెను. మహా ప్రకాశయుక్త అగ్ని తలెత్తవలెను. అశ్విద్వయము మా వద్దకు వచ్చుటకు వేగవంతములగు అశ్వములను రథమునకు కట్టవలెను. "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
7. సూర్యదేవా! నీవు కోరికలు తీర్చువాడవు. నేడుమాకు అత్యంత ఉత్కృష్ట ధనభాగమును పంచియిమ్ము. "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
8. మానవులు దేవతల కొరకు సంకల్పించు యజ్ఞములందు నా మనసులగ్నము కావలెను. ప్రతి ఉదయం సమస్త వస్తువులను స్పష్టము చేయుటకు సూర్యుడు ఉదయించును "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
9. యజ్ఞముకొరకు నేడు కుశలు పరచబడును. సోమము సమర్పించుటకు శిలలు కూర్చబడును. అభీష్టసిద్ధికి ద్వేషశూన్య దేవతలను శరణు కోరవలెను. యజమానీ! అనుష్ఠానము చేయుచున్న నీకు ఆదిత్యులు సుఖములు ప్రసాదించవలెను. "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
10. అగ్నీ! మేము యజ్ఞానుష్ఠానము చేయుచున్నాము. సకల దేవతలు ఇచట కూడి ప్రమోదించ వలసిఉన్నది. ఈ యజ్ఞమునకు ప్రకాండ ద్యులోకమున ఉన్న దేవతలను, ఏడుగురు హోతలను, ఇంద్ర, మిత్ర, వరుణలను ఆహ్వానింపుము. ధన ప్రాప్తికిగాను నేను అందరిని స్తుతింతును. "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
11. ప్రసిద్ధ ఆదిత్యులారా! మీరు విచ్చేయండి. మీరు వచ్చినంత సకల సమృద్ధి కలుగును. మా సంపదలు పెంపొందుటకు అందరము ఒకచో చేరి యజ్ఞము చేయుదము. బృహస్పతి, పూష, భాగ. "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
12. దేవతలారా! మీ యజ్ఞముల సమగ్రతసమార్జించండి ఆదిత్యులారా! మాకు ధనపూర్ణము, రాజయోగ్యమగు గృహమును ప్రసాదించండి. మేము మా పశు, పుత్ర, పౌత్ర, పరమాయువు మున్నగు వానిఒ విషయమున "స్వస్త్యగ్నిం సమీధానమీమహే"
13. మరుత్తులందరు మమ్ము అన్ని విధముల రక్షించవలెను. సమస్త అగ్నులు ప్రజ్వలించవలెను. సకల దేవతలు మమ్ము రక్షించుటకు విచ్చేయవలెను సకలవిధ అన్నములు, సంపదలు మాకు లభింవలెను.
14. దేవతలారా! మీరు అన్నము అందించి కాపాడువారు ఉన్నారు. మీరలు రక్షించువారున్నారు. మీరు పాపవిముక్తులను చేసినవారును. సంపదలను పెంచి సంపన్నులను చేసినవారును ఉన్నారు. మీ ఆశ్రయమున భయమనుమాట ఎరుగనివారున్నారు. మేము దేవ కార్యములందు వ్యగ్రులమై అటువంటి వారలము కావలెను.
ముప్పది ఆరవ సూక్తము
ఋషి - ధనాకలుశస్యుడు. దేవత - విశ్వేదేవతలు. ఛందస్సు -
1-12 జగతి 13,14 త్రిష్టుప్
1. ఉష, రాత్రి, మహతి సుసంఘటిత శరీర ద్యావాపృథ్వి, వరుణ, మిత్ర, ఆర్యమ, ఇంద్ర, మరుద్గణ పర్వతగణ, జలగణ, ఆదిత్యగణములను అంతరిక్ష, స్వర్గములను ఈ యజ్ఞమునకు ఆహ్వనించుచున్నాను.
2. ప్రశస్తచిత్తలు, యజ్ఞానుష్ఠాన స్వరూపులగు ద్యావాపృథ్వులు మమ్ము పాపములనుండి కాపాడ వలెను. శత్రువునుండి విడిపించవలెను. దుష్టాశయముల మృత్యువు అధికారము మా మీద ఉండరాదు. మేము దేవతలను విశిష్టరక్షణలకని ప్రార్థించుచున్నాము "దేవానామవో అద్యావృణీమహే".
3. ధనికులగు మిత్రా వరుణులు జనని అదితి మమ్ము పాపములనుండి కాపాడవలెను. మాకు సర్వప్రకారముల అవినాశ్య జ్యోతిలభించవలెను. "దేవానామవో అద్యావృణీమహే".
4. సోమమును పిండు శిలలధ్వని రాక్షసులను దూరముగా పారద్రోల వలెను- దుస్వప్న, మృత్య, సకల శత్రువులను దూరము చేయవలెను. మేము ఆదిత్యులు, మరుత్తులనుండి సుఖములు పోందవలెను. "దేవానామవో అద్యావృణీమహే".
5. ఇంద్రుడు రావలెను. కుశల మీద కూర్చుండవలెను. విశేషస్తుతులను ఉచ్చరించవలెను. ఋక్, సామములతో బృహస్పతి అర్చించవలెను. మాకు ఉత్తమోత్తమ అభిలషణీయ పదార్థములు లభించవలెను. మేము చిరంజీవులము కావలెను. "దేవానామవో అద్యావృణీమహే".
6. అశ్వినులారా! మా యజ్ఞమును స్వర్గమును అంటునట్లు చేయుడు. సమస్త విఘ్నములను దూరము చేయండి. మా కోరికలు తీర్చండి. మాకు సుఖములు కలిగించండి. అగ్నికి ఘృతము సమర్పించి ఆహుతలు ఇచ్చుచున్నాము. ఆ జ్వాలలను దేవతల వద్దకు పంపండి. "దేవానామవో అద్యావృణీమహే".
7. మరుత్తులు అందరిని పరిశుద్ధులను చేయుదురు. వారు సుందరులు. వారినుంచే శుభములు ఉత్పన్నములగును. వారు ధనములను పెంచుదురు. వారి నామము మనసులకు ఆహ్లాదము కలిగించును. విశిష్టరూప అన్నము కోరి నేను వారిని ఆహ్వానింతును. ప్రార్థింతును. "దేవానామవో అద్యావృణీమహే".
8. జలములందు కలియునదియు, ప్రాణులకు స్వేచ్ఛ ప్రసాదించునదియు. దేవతలను తృప్తులను చేయునదియు, పేర్కొన్నంత ఆనందము కలిగించునదియు, యజ్ఞములను శోభిల్ల చేయునదియు, ఉత్కృష్ట దీప్తత సోమమును ఆశ్రయింతుము. అతనిని బలములు యాచింతుము. "దేవానామవో అద్యావృణీమహే".
9. మేము, మాపుత్రులు చిరంజీవులము కావలెను. అపరాథులము కారాదు. మేము పుత్రాదులతోకలసి సోమమును పంచుకొని పానము చేయుదుము. సుత్తిద్రోహులు సమస్త పాపములందు పడవలెను. "దేవానామవో అద్యావృణీమహే".
10. దేవతలారా! మీరు మానవుల యజ్ఞములు అందుకొనుటకు యోగ్యులు. మేము మిమ్ము కోరినవి ప్రసాదించండి. మేము బలవంతులమగు జ్ఞానము ప్రసాదించండి ధనము, భౌతికబలము యశము ప్రసాదించండి. "దేవానామవో అద్యావృణీమహే".
11. దేవతలు ప్రకాండులు మహితాత్ములు. నిశ్చలులు. మేము వారినుండి అటువంటి రక్షణలనే ప్రార్థించుచున్నాము. మేము ధనమును, భౌతికబలమును పొందవలెను. "దేవానామవో అద్యావృణీమహే".
12. ప్రజ్వలిత అగ్ని వలన మాకు విశిష్టసుఖములు లభించవలెను. మిత్రావరుణుల వద్ద మేము నిరపరాధులము కావలెను. మాకు శుభములు కలుగవలెను. సూర్యుడు మాకు సర్వోత్కృష్ట శాంతిని ప్రసాదించవలెను. "దేవానామవో అద్యావృణీమహే".
13. సత్యస్వభావ దేవతలు సూర్య, మిత్ర, వరుణులు యజ్ఞములకు విచ్చేయుదురు. వారు మాకు సౌభాగ్యము, లౌకికబలము, గోవులు, పుణ్యకార్యములు, వివిధ ధనములు ప్రసాదించవలెను.
14. తూర్పేమి, పడమరేమి, దక్షిణమేమి, ఉత్తరమేమి సూర్యదేవుడు అన్నిదిశలందు మాకు సంపదలు సమృద్ధములు చేయవలెను. దీర్ఘమగు ఆయువు ప్రసాదించవలెను "సవితానో రాసతాందీర్ఘమాయుః"



