Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
8. ప్రవాహజలామా! నీ గర్భస్వరూపమును మధురరస యుక్తమును అగు నీ తరంగమును ఇంద్రునివైపు పంపుము. సంపన్న జలమా! మా ఆహ్వానము వినుము. నా ఆహ్వానమందు యజ్ఞపు ఘృతదానము నిన్ను స్తుతించుట ఉండును.
9. జలమా! నీ తరంగములు ఇహ, పరలోకములకు హితకరములగును. అవి బలము కలిగించును. కోరికలు పెంచును. అవి ఆకసమున పుట్టును. త్రిలోకములందు సంచరించును. దేవతల కొరకు పైకి ఎగయును. అట్టి తరంగములను ఇంద్రుని పానము కొరకు పంపుము.
10. ఇంద్రుడు జలముల కొరకు యుద్ధములు చేయును. ఇంద్రుని ఆజ్ఞచొప్పుననే మరల మరల పడుచుండును. సోమములో కలియు చుండును. జలము లోకములకు తల్లివంటిది. రక్షకుని వంటిది జలము సోమముతో కలియునది ఆత్మీయమైనది ఋషీ! అట్టి జలమునకు నమస్కరించుము. "వందస్వ"
11. జలమా! దేవతలు యజ్ఞమునకుగాను మా యజ్ఞకార్యమునకు సాయపడుము. ధనప్రాప్తికొరకు మాకు పవిత్రత ప్రసాదించుము. యజ్ఞానుష్ఠానకాలమున నీ దుగ్ధద్వారములు తెరువుము. మాకు సుఖ కరమవగుము.
12. జలమా! ఇది ధనములకు ప్రభుస్వరూపము. కళ్యాణ కరమగు యజ్ఞము దీనిని పూర్తి చేయించుము. అమృతము అందించుము. ధనములను, ఉత్తమ సంతానములను రక్షింపుము. స్తోతకు సరస్వతి ధనమును ప్రసాదించుము.
13. జలమా! నేను చూచి ఉన్నాను. నీవు వచ్చునపుడు ఘృతము దుగ్థము, మధువు తెచ్చి ఉన్నావు. పురోహితులు స్తుతుల ద్వారమున నీతో సంభాషించి ఉన్నారు. ఉత్తమ రూపమున సమర్పిత సోమమును నీవు ఇంద్రునకు అందించి ఉన్నావు.
14. అదిగో! జలము అరుదెంచుచున్నది. జలము ధనమునకు ఆధారము. ప్రాణమునకు హితకరము. పురోహిత బంధువులారా! జలమును స్థాపించండి. వర్ష అధిష్ఠానదేవతకు జలము చిరపరిచితాము. జలము సోమరసమునకు అనుకూలము. జలమును కుశల మీద స్థాపించండి.
15. జలము ఏకాగ్రముగా కుశలవైపు సాగుచున్నది. తిలకించండి! జలము దేవతలను చేరుటకు యజ్ఞస్థానమున ఆసీనమైనది.
పురోహితులారా! ఇంద్రునకు సోమము సమర్పించండి. జలము వచ్చినందున ఈ నాటి మీ దేవ పూజ సాధ్యమైనది "సుశకాదేవయజ్వా".
ముప్పది ఒకటవ సూక్తము
ఋషి - కవషుడు. దేవత - వైశ్వదేవతలు. ఛందస్సు - త్రిష్టుప్.
1. మా స్తుతులు దేవతలకు చేరవలెను. యజ్ఞదేవతలు మమ్ము సమస్త శత్రువులనుండి రక్షించవలెను. ఆ దేవతలతో మాకు స్నేహము కలుగ వలెను. మమ్ము పాపములన్నియు వదలిపోవలె "తరన్తో విశ్వా దురితాస్యామ."
2. మానవుడు సకల ధనములను కోరవలెను. సత్యమార్గమున, పుణ్యానుష్ఠానమున మగ్నుడు కావలెను. తన కర్మములచే శుభములు పోందవలెను. వనసునకు సుఖములు కలుగవలెను "క్షమం మనసా జగృభ్యాం".
3.యజ్ఞకార్యము ప్రారంభమైనది సమయాను సారముగ అవసరమగు చిన్న - పెద్ద యజ్ఞద్రవ్యములన్నియు సిద్ధముగ ఉన్నవి. ఇవి దృశ్యమానములు రక్షకములు రక్షకములు మేము అభిషుత సోమమును ఆస్వాదించినాము. దేవతలకు ఇవన్నియు తెలియును.
4. అవినాశ్యప్రజాపతి దాతమనసును తనలో దాల్చి అనుగ్రహించవలెను. సవిత యజ్ఞకర్తకు శుభములు కలిగించవలెను. భగ, ఆర్యములు స్తుతికి ప్రసన్నులై స్నేహ పూర్ణులు కావలెను అన్య దేవతలు యజమానికి అనుకూలురు కావలెను.
5. స్తోతల స్తుతులు అందుకొనగోరిన దేవతలు కోలాహలమున, మహావేగమున అదిగో వచ్చుచున్నారు. అప్పుడు పృథ్వి ప్రాతఃకాలము వంటి అందములు సంతరించుకున్నది. సుఖములనిచ్చు వివిధ అన్నములు మాకు లభించవలెను.
6. ఇప్పుడు మాస్తోత్రము చిరపరిచితమై విశాల భావము ధరించి సమస్త దేవతల వద్దకు చేరుటకు రెక్కలు విప్పుచున్నది. ఈనాటి మాయజ్ఞమునకు సమస్త దేవతలు విచ్చేసి తమతమ స్థానములందు ఆసీనులు కావలెను. సమస్త శుభములు ప్రసాదించవలెను. అందువలన నేను బలశాలినగుదును.
7. ఏ అరణ్యము, ఏవృక్షమునుండి గ్రహించిన పదార్థములతో ఈ ద్యులోక భూలోకములు నిర్మించబడినవో! ప్రాచీన దినములు, ఉషస్సులు జీర్ణములగుచున్నది కాని ద్యావాపృథ్వులు సంయుక్తములు, ఏకభావములై ఉన్నవి పాతపడవు జీర్ణములు కావు.
8. ద్యులోక, భూలోకములు అంతముకావు. వానిపైన మరేదో ఉన్నది. అతడు సృష్టికర్త. ద్యావాపృథ్వులను ధరించువాడు. అతడు అన్నములకు ప్రభువు. సూర్యుడు రథమునకు గుఱ్ఱముల అమర్చకముందే అతడు ఆవిర్భవించినాడు.
9. కిరణధారి సూర్యుడు పృథ్వివి అతిక్రమించడు. వాయువు వృష్టిద్వారాఛిన్నాభిన్నము చేయడు. మిత్రావరుణులు ప్రత్యక్షమై అరణ్యమధ్యమున పుట్టిన అగ్నివలె నలుదిశల కాంతులు ప్రసరింతురు.
10. రేతస్సువలన గోవు ప్రసవించినట్లు అరణి వలన అగ్ని ఉత్పన్నమగును. అరణిని రక్షించిన వారి వద్దకు కష్టములు చేరవు. అగ్ని ప్రాచీన కాలము నుండియే అరణి స్వరూప మాతా పితరుల వలన జన్మము గ్రహించినాడు. ఈ అరణి స్వరూపగోవు శమీ వృక్షమగును. అది అచటనే పుట్టును. దాని అన్వేషణ జరుగు చుండును.
11. కణ్వఋషిని నృషదపుత్రునిగా చెప్పబడినది. అన్నయుక్త, శ్యామ వర్ణ కణ్వునకు ధనము లభించినది. ఆశ్యామ వర్ణ కణ్వునకే అగ్ని తనరోచక రూపమును కనబరచినాడు. అగ్నినిగూర్చి కణ్వుడు కాక మరొకడు అంతటి యజ్ఞము చేయలేదు.
ముప్పది రెండవ సూక్తము
ఋషి - దేవతే పూర్వవత్. ఛందస్సు - 1-5 జగతి 6-9 త్రిష్టుప్
1. యజ్ఞకర్త ఇంద్రుని ధ్యానించుచున్నాడు. అతని సేవలు అందుకొనుతాకు ఇంద్రుడు తన గుఱ్ఱములను యజ్ఞమువైపు తోలుచున్నాడు. హర్యశ్వములు విచిత్రగతులతో వచ్చుచున్నవి. ప్రసన్నమనస్క యజమాని ఉత్తమోత్తమ ద్రవ్యములను సమర్పించుచున్నాడు. ఇంద్రుడు ఉత్తమోత్తమ వరములు తెచ్చుచున్నాడు. ఇంద్రుడు సోమరసమును, ఆహార పదార్థములను ఆస్వాదించినపుడు స్తోత్రములను, హోమద్రవ్యములను సహితము స్వీకరించును.
2. ఇంద్రా! నిన్ను అనేకులు స్తుతింతురు. నీవు వెలుగులు పెంచుచు విభిన్న స్వర్గధామములందు సంచరింతువు. నీవు జ్యోతినందుకొని భూలోకమునకు ఏతెంచెదవు. మేము నిర్థనులము. నిన్ను యజ్ఞమునకు కొనిపోవు అశ్వములు మాకు ధనమును ఇవ్వవలెను. ధనము కొరకే మేము ఇన్ని ప్రార్థనలు చేయుచున్నాము.
3. పుట్టిన బిడ్డకు లభించుపితృధనమువంటి విచిత్ర ధనమును ఇంద్రుడు మాకు ప్రసాదించవలెను. భార్య మధుర వచనములతో భర్తను పిలిచినట్లు సోమరసము పురుషార్థిని ఆహ్వానించును.
4. స్తుతిరూప కిరణములు కలుసుకొను స్థానమును ఉజ్వల ప్రభామయము చేయుము. స్తోత్రముల ప్రాచీన మాతలగు ఏడుఛందస్సులు ఆస్థానమునందే ఉన్నవి.
5. దేవతల వద్దకేగు అగ్ని మీమేలు కోరి దర్శన మిచ్చును. అగ్ని వంటరిగనే రుద్రుల సహితుడై తనస్థానము చేరును. అమరులగు సమస్త దేవతలకుగాను బంధు సహితులై ఇంద్రునకు సోమము సమర్పించండి. వారు మీకు వరములు ఇవ్వగలరు.
6. దేవతల కొరకు చేయు అనుష్ఠానమును విద్వాంసుడగు ఇంద్రుడు రక్షించును. అగ్ని జలములందునిగూఢ రూపమున ఉన్నాడని ఇంద్రుడు చెప్పి ఉన్నాడు. అగ్నీ! ఆ ఉపదేశమును అనుసరించియే నేను నీ వద్దకు వచ్చినాను.
7. దారి తెలియనివాడు తెలిసినవానిని అడుగును. అట్లు తెలిసికోని గమ్యస్థానము చేరును. అభిజ్ఞులుచెప్పిన చోట జలము కొరకు వెదకిన జలము లభించును.
8.ఇప్పుడిప్పుడే అగ్ని పుట్టినాడు. తల్లిపాలు త్రావివాడు. తెలివి తెచ్చుకున్నాడు. వయసుతోనే వార్ధక్యము అందుకున్నది. అతడు సులభసాధ్యుడు. ధనాఢ్యుడు మనోవికాసపు వాడైనాడు.
9. ఇంద్రా! నీవు సకల కళాపరిపూర్ణుడవు. స్తుతుల శ్రోతవు. ఈ స్తుతులన్నియు నీ కొరకే రచించా బడినవి. పూజనీయులగు స్తోత్రరూపధనవంతులారా! ,మీకు ఇంద్రుడు ధనదాత కావలెను. నా హృదయ మందున్న సోమము సహితము వారికి ధనదాత కావలెను.
శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత పదవ మండలమున ఏడవ అష్టకము ఏడవ అధ్యాయము సమాప్తమ.
ఓం నతామినన్తిమాయినో నధీరావ్రతాదేవనాం ప్రథమాధ్రవాణి
నరోదసీ అద్రుహావేద్యాభిర్న పర్వతానినమే స్థివాంసః
ఎనిమిదవ అధ్యాయము ముప్పది మూడవ సూక్తము
ఋషి - ఐలూష పుత్ర కవషుడు. దేవత - వైశ్వదేవతలు. ఛందస్సు - 1
త్రిష్టుప్ 2,3, బృహతి 4,9 గాయత్రి
ఓమ్ ప్రమాయుయుజ్రోజనానాం వహామిస్మపూషణమన్త రేణ |
విశ్వేదేవాసో అధమా మరక్షిమ్దః శాసురాగాదితిఘోష ఆసీత్ ||
1. ఎల్లరిని పనులకు పురమాయించు దేవత నన్ను ప్రోత్సహించినాడు. నేను మార్గమందు పూషను దర్శించినాను. కవషుడనను నన్ను విశ్వేదేవతలు రక్షించినారు. దుర్థర్షుడను, ఋషివచ్చుచున్నాడని నలుదిశలు ఘోషించినవి.
2. పరిస్థితులు శత్రువులవలె నన్ను బాధించుచున్నవి. దుర్బుద్ధినాకు కంటక ప్రాయమైనది నేను దీన హీన, క్షీణుడనగు చున్నాను. పక్షివలె మనసు చంచలమగుచున్నది.
3. ఇంద్రా! ఎలుకలు త్రాళ్లను కొరికినట్లు నీ భక్తుడనైన నన్ను మనోవ్యధలు కొరకుచున్నవి. ధనికఇంద్రా! ఒక్కసారి నాపై నీ కృపాకటాక్షములు కురిపింపుము. తండ్రివంటి వాడవగుము - "పితేవనోభవ".
4. నేను కవషఋషిని త్రసదస్యు పుత్రుడు కురు శ్రవణుడు గొప్పదాత. అందువలన ఆరాజును యాచించుటకు వెళ్లినాను.
5. నాకు అతడు ఇచ్చిన దక్షిణ వేలలో ఉండినది. సకలజనులు దానిని శ్లాఘించినారు. నేను ఎక్కిన రథమును మూడు హరితవర్ణ అశ్వములులాగినవి.
6. నా తండ్రి కీర్తి శ్లాఘనీయము పితృవచనము సేవకులకు సుక్షేత్రమువలె ప్రసన్నదాయకమగును.
7. ఉపమశ్రవసా! నీవు మిత్రాతిథిపుత్రుడవు. నావద్దకురమ్ము. నేను మిత్రాతిథియొక్క స్తోతను. ఏడవకుము. దాతవ్య ధనము నాకు దానము చేయుము.
8. ఒకవేళనేను అమరులగు దేవతలకు, మర్త్యులగు మానవులకు ప్రభువై యుండిన ధనవంతుడగు మిత్రాతిథి తప్పక బ్రతికి ఉండునది.
9. వందప్రాణములు ఉన్నను దేవతలను ఎదిరించి ఎవడును జీవించజాలడు. అందువలననే మా సహచరులు మమ్ము విడిచి పోయినారు.
(మిత్రాతిథి అను రాణి పరలోకగత అయినది కవషుడు ఆమె పుత్రుడు ఉపశ్రవుని ఓదార్చిన వృత్తాంతము)
ముప్పది నాలుగవ సూక్తము
ఋషి - క్వషుడు లేక అక్షిస్యుడు. దేవతలు - వేరు వేరు.
ఛందస్సు - త్రిష్టుప్ -7 జగతి.
1. పెద్ద పెద్ద పాచికలు ఫలకము మీద నడచినపుడు నేను వానిని చూచినపుడు నాకు ఎంతో ఆనందము కలుగును. మజవాన పర్వతమున పుట్టిన సోమలత యొక్క రసము మరింత ఆనందము కలిగించును. వీభీరక వృక్షముతో చేసిన పాచికలు నాకు నిత్యము ఆనందకరములగును.
2. నా భార్య అందమైనది. ఆమె నావలన ఎన్నడును ఉదాసీన కాలేదు - లజ్జిత కాలేదు. ఆమె నాకు, నాబంధువులకు ఎన్నో సేవలు చేసినది. అయినను కేవలము పాచికల కారణముగా అనురాగవతి అయిన భార్యను త్యజించినాను.
3. జూదము ఆడు జూదరిని అత్త తిట్టును - భార్య వదిలివేయును. జూదరి అడిగినప్పుడు ఎవ్వడు ఇవ్వడు. ముసలిగుఱ్ఱమును కొనువాడుండడు. జూదరిని అడుగు వాడుండడు.
4. పాచికలు పట్టిన వాడు విడుచుట దుర్లభము. ఒకని ధనము మీద పాచిక పాడు కన్నుపడెనా వాని భార్యవ్యభిచారిణి అగును. జూదరి తల్లిదండ్రులు అన్నదమ్ములు "వీనినిమేమెరుగము. జూదరులారా! పట్టుకొని పొండి. అని పట్టి ఇత్తురు."
5. జూదము ఆడను. అనుకున్నప్పుడు జూదరులకు దూరముగా ఉందును. కాని ఫలకము మీద పసుపురంగు పాచికలు చూచినపుడు మనసు నిలువదు. చెడిన ఆడది మిండని వద్దకు పోయినట్లు మరల జూదగృహమునకు చేరుదును.
6. జూదరి రొమ్ము చరచి జూదమున దూకును. 'గెలుపునాదే' అని విర్రవీగును. ఒక్కొక్కసారి పాచిక జూదరి కోరిక తీర్చును. మరొకసారి పాచిక ఎదుటివాడు అనుకున్నట్లు పడును.
7. కాని ఒక్కొక సారి పాచిక చేతనిలువదు. అది అంకుశమువలె గ్రుచ్చును. బాణమువలె పోడుచును. కత్తి వలె కోయును. కాల్చినట్లు తపింపచేయును.
గెలిచిన వానికి పాచిక కొడుకు పుట్టినంత ఆనందము కలిగించును. మధురముగా ఉండును. మధుర భాషణ వలె ఉండును. కాని ఓడిన వాని ప్రాణములు తీయును.



