Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


                                   ముప్పది ఏడవ సూక్తము
                ఋషి - సూర్యపుత్ర అభితపుడు. దేవత - సూర్యుడు.
                               ఛందస్సు - జగతి - 10 త్రిష్టప్.


    1. సూర్యుడు మిత్రావరుణులను చూచును. అతని దీప్తి అత్యంత ఉజ్వలము. అతడు దూరమునుండియే సకల పదార్థములను వీక్షించును. అతడు దేవతల వంశమున జన్మించిన వాడు. సకల పదార్థాములకుస్వచ్ఛత ప్రసాదించువాడు. ఆకాశమునకు పుత్ర స్వరూపుడు. అట్టి సూర్యునకు నమస్కరించండి. పూజించండి. స్తుతించండి.

    2. ఇది సత్యవాక్కు ఆకాశము, దినములు సత్యమును అవలంబించియే ప్రవర్తిల్లు చున్నవి. సకలలోకములు, సకల ప్రాణిజాలము సత్యమునే ఆశ్రయించి ఉన్నది. సత్యప్రభావముననే జలములు ప్రవహించు చున్నవి -సూర్యుడు ఉదయించుచున్నాడు. ఆసత్యవాక్కు నన్ను రక్షించవలెను. -  "సా మాం సత్యోక్తిః పరిపాతు."

    3. సూర్యదేవా! నీవు  వేగవంతములగు అశ్వములను రథమునకు పూన్చెదవు. ఆ రథమున ఆకాశమున పయనింతువు. అప్పుడు దేవశూన్యయగు ఏ ప్రాణియు నిన్ను చేరజాలదు. నీ జ్యోతి చిరపరచితమయ్యుసాధారణము. ఆ జ్యోతిని అవలంబించియే నీవు ఉదయింతువు.

    4. సూర్యదేవా! నీ జ్యోతి అంధకారములను నష్టపరచునది. నీ కిరణములు లోకములను ప్రకాశింపచేయును. ఆ జ్యోతి ఆ కిరణములచే మా సకల  దారిద్ర్యములను నష్టపరచుము. మా పాపములు, వ్యాధులు, దుఃఖములను దూరము చేయుము.

    5. సూర్యదేవా! నీవు అనాయాసముగా సకల లోకముల కార్యకలాపములను రక్షింతువు. నీవు ప్రాతః కాల హోమము నుండి ఉదయింతువు. మేము నీ నామమును ఉచ్చరించునప్పుడు  దేవతలు మా యజ్ఞమును రక్షించవలెను.

    6. ద్యావాపృథ్వులు, జలములు, మరుత్తులు, ఇంద్రుడు మా పిలుపును ఆలకించవలెను. మాపై సూర్యుని కృపాదృష్టి ఉండగా దుఃఖములు మమ్ము చేరరాదు. మేము దీర్ఘజీవుల  మై వృద్ధావస్థ పర్యంతము సౌభాగ్యశాలులమై ఉండవలెను. "భద్రంజీవన్తో జరణామశీమహి."

    7. సూర్యదేవా! నీవు బంధువులను సత్కరించువాడవు. నీవు నిత్యము ఉదయించినట్లే మేము నిత్యము నీ ప్రశస్తమనమును చక్షువును దర్శించవలెను. నిత్యము మేము ఆరోగ్యవంతులము కావలెను. మాపుత్ర పౌత్రులు మమ్ము చుట్టుముట్టి ఉండవలెను. సకల దోషములకు దూరముగా ఉండి నిన్ను దర్శించగలుగవలెను. మేము చిరంజీవులము కావలెను.

    8. సర్వదర్శక సూర్యదేవా! నీవు ప్రకాండ జ్యోతివి. నీ దీప్తి ఉజ్వలము. అందరి కన్నులందు నీవు సుఖకరుడవు. నీ మూర్తి ఆకాశమును ఆరోహించినపుడు మేము ప్రదీప్తశరీరులమై నిత్యము నీ మూర్తిని దర్శింతుముగాత.

    9. సూర్యదేవా! నీ పతాకముతోనే జగములు వెలుగులు పొందును. ప్రతిరాత్రి అంధకారమైనపుడు నీ పతాకము మాయమగును. పింగళకేశసూర్యా ! ఆ ఉత్తమ పతాకము పట్టుకొని ఉదయించుము. మేము దోషరహితులమై నీ పతాకము దర్శింతుము.

    10. నీ వీక్షణము మాకు శుభములు ప్రసాదించవలెను. దినము, నీకిరణము, నీ శీలము, నీ ఉత్తాపము శుభప్రదములు కావలెను. మేము ఇంట ఉన్నను, దారిలో ఉన్నను, ప్రయాణ మందున్నను శుభములు కలుగవలెను. సూర్యదేవా! మాకు వివిధ సంపదలు ప్రసాదించుము.

    11. దేవతలారా! మా వద్ద  ఉన్న ద్విపద, చతుష్పాత్తు లన్నింటికి సుఖములు కలుగవలెను ప్రాణులన్నింటికి ఆహారము కలుగ వలెను. అవి పుష్టివంతములు, బలిష్ఠములు కావలెను. మా సహితముగా వాటికి కూడా అప్రమత్తత లభించుగాత.

    12. ధినసంపన్న దేవతలారా! మాటలో, మనసులో, పనిలో మేము దేవతల విషయమున అపరాధము చేసిఉండవచ్చును. అట్టి అపరాధమును దానధర్మములకు విముఖునకు, మాకు  అనిష్టము చేయువానికి అంటగట్టండి.
   
                               ముప్పది ఎనిమిదవ సూక్తము
       ఋషి -  ముష్కవిశిష్ట ఇంద్రుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - జగతి.

    1. ఇంద్రా! ఇది యుద్ధము. ఇందు కీర్తిలభించును. దెబ్బమీద దెబ్బపడును. అట్టి యుద్ధమున నీవు ప్రతాపజ్వాలను ప్రదర్శింతువు. శత్రువులనుండి గెలిచిన గోవులను సురక్షితముగా ఉంచుదువు. యుద్ధమున దీప్యమాన బాణములు ప్రబల శత్రువుమీద పడును. యుద్ధమున చూచి జనులు హతాశులు అగుదురు.

    2. అట్లుగాన ఇంద్రా! మా ఇంటిని విశేషధనధాన్యములతో, గోవులతో నింపుము. నీవు  విజయుడవైనంత నీకు స్నేహపాత్రులము కావలెను. మాకు మేము  అభిలషించు ధనమును ప్రసాదించుము.

    3. అనేకులచే స్తుతుడవైన ఇంద్రా! ఆర్యుడైనను, అనార్యుడైనను - దేవశూన్యుడు - మాతో యుద్ధము చేయ సంకల్పించినపుడు వాడు మా చేత సులభముగా పరాజితుడు కావలెను. నీదయవలన మేము అట్టివారిని యుద్ధములందు ఓడించవలెను.

    4. ఇంద్రుని కొద్దిమంది పూజింతురు. ఎక్కువమంది పూజింతురు. ఇంద్రుడు దుస్సాధ్యయుద్ధమున విజయుడగును. ఉత్తమోత్తమ పదార్థములను సాధించును. అతడు  యుద్ధమందు  స్నానము చేయగలడు. సుప్రసిద్ధ యశస్కుడు. ఆశ్రయము కొరకు మేము ఆ ఇంద్రుని అనుకూలుని చేసికొందుము.

    5. ఇంద్రా! నీవు నీ  భక్తులను ఉత్సాహవంతులను చేయుదువు. మరి  మమ్ము ఎవడు  ఉత్సాహవంతులను చేయును? నీవు నీ  బంధనములు త్రెంచుకొనగల సమర్థుడవని మాకు తెలియును. కావున కుత్సుని బంధములు త్రెంచుకొమ్ము. విచ్చేయుము. నీ వంటివాడు ముష్కరుల బంధములనేల సహించును?

    (కుత్సుడు, లుశుడు ఒకేసారి తమ యజ్ఞములకు ఇంద్రుని ఆహ్వానించినారు. ఇంద్రునకు గల స్నేహమున మొదలు కుత్సుని వద్దకు వెళ్లినాడు. లుశుడు ఇంద్రుని కుత్సుడు బంధించినాడనుకున్నాడు.)

                             ముప్పది తొమ్మిదవ సూక్తము
ఋషి - కక్షీవత పుత్రి ఘోష, దేవత - అశ్వినులు. ఛందస్సు - జగతి చివరిది త్రిష్టుప్.

    1. అశ్వినులారా! మీ రథము సర్వత్ర సంచారి. చక్కగా నిర్మించబడినది. ఆ రథమును రాత్రింబవళ్లు పిలుచుట యజమాని కర్తవ్యమైఉన్నది. ఆరథపు పురాతన నామమును మేము ఉచ్చరింతుము. తండ్రి పేరు పలుకుటలో పుత్రునకువలె ఆరథపు పేరు పలుకుటలో మాకు ఆనందమున్నది.

    2. మాతో మధుర వాక్యము ఉచ్ఛరింప చేయండి. మా కార్యములు పూర్తిచేయండి. మంచి బుద్ధులు కలిగించండి. ఇదిగో ఇవే మా కోరికలు. అశ్వినులారా! అతిప్రశంసిత ధనపు భాగమును మాకు ఇవ్వండి. సోమరసము ప్రీతిప్రదము అగును. అట్లే  మమ్ము సహితము యజమానులకు ప్రీతిప్రదులను చేయండి.

    3. అశ్వినులారా! తండ్రి ఇంట ఒకసారి ఘోష - వృద్ధురాలగు చున్నది. మీరు ఆమెకు సౌభాగ్య స్వరూపుడైన వరుని తెండి. మీరు నడవలేని వానికి, నికృష్టునకు ఆశ్రయము కల్పించండి అంధులు. దుర్బలులు దుఃఖితులు, రోగగ్రస్తులు మిమ్ము చికిత్సకులని నమ్ముతారు.

    4. ఒకడు పాత రథమునకు కొత్తరూపమిచ్చి నడిపించును. అట్లే మీరు జరాజీర్ణ చ్యవనుని యువకుని చేసినారు. తుగ్రపుత్రుని నిరపాయముగా జలమునుండి బయటికి తీసినారు. మీరు చేసిన ఈ ఘనకార్యములు యజ్ఞములందు వర్ణించయోగ్యములు.

    5. మీరు చేసిన సకల వీరకృత్యములను నేను జనులకు వివరిస్తాను. అంతేకాదు. మీరు మాత్రమే నిష్ణాతులగు వైద్యులు. కావుననే మీ ఆశ్రయము కొరకు నేను మిమ్ము స్తుతిస్తాను. నా స్తుతులను యజమాని తప్పక విశ్వసించును.

    6. అశ్వినులారా! నేను మిమ్ము పిలుచుచున్నాను. వినండి తండ్రి బిడ్డకు బోధించినట్లు నాకు బోధించండి. నాకు నిజమైన బంధువులు లేరు. నేనుజ్ఞాన శూన్యను. నాకు ఒక  కుటుంబము లేదు. ఒక బుద్ధిలేదు. నాకు ఎటువంటి దుర్గతి కలుగక ముందే దానిని తొలగించండి.

    7. పురుమిత్రుని పుత్రిక 'శున్ధ్యువ' ను మీరు రథము మీద తీసికోని వెళ్లినారు. విమదునితో ఆమె పెండ్లి జరిపించినారు. వధ్రిమతి మిమ్ము పిలిచినది. మీరు ఆమె మాట  విన్నారు. ఆమె ప్రసవ వేదన తగ్గించినారు. ప్రసవింప చేసినారు.

    8. 'కలి' అనువాడు మీ స్తోత. అతడు ఎంతో వృద్ధుడు అయినాడు. మీరు అతనిని ప్రాయపు వానిగ చేసినారు. 'వందను'ని బావినుంచి బయటికి తీసినారు. కుంటి 'విశ్వల'కు ఇనుపకాలు అమర్చినారు. నడిపించినారు.

    9. కోరికలు తీర్చు అశ్వినులారా! రేభుడను వానిని శుత్రువులు మృత ప్రాయుని చేసినారు. గుహలోపడవేసినారు. అప్పుడు మీరే అతనిని సంకటమునునుండి రక్షించినారు. అత్రిఋషిని ఏడుకట్లు కట్టి అగ్నికుండమున వేసినారు. అప్పుడు మీరే అగ్ని కుండమును ఆర్పివేసినారు.

    10. అశ్వినులారా! రాజగు 'పేరు'నకు తొంబది తొమ్మిది అశ్వములతో బాటు ఒక ఉత్తమ, శుభ్రవర్ణ అశ్వమును ఇచ్చినారు. అది విచిత్ర తేజస్సుగలది. దానిని చూడగనే శత్రువులు పారి పోవువారు. అది మానవులకు బహుమూల్య ధనము. దాని పేరు విన్నంత ఆనందము కలుగును. దానిని చూచినంత సుఖములు కలుగును.

    11. అశ్వినులారా! మిమ్ము కీర్తించినంత ఆనందము కలుగును. మీరు మార్గమున సాగునపుడు జనులు మిమ్ము నలువైపుల నుంచి స్తుతింతురు. మీరు దంపతులను మీ రథపు ముందరి భాగమున కూర్చుండ పెట్టి ఆశ్రయమిచ్చినను వారికి పాపము దుర్గతి, ఆపద అంటరాదు.

    12. అశ్విద్వయమా! ఋభుదేవులు మీకు రథము సమర్పించినారు. ఆరథము వెలువడినంత ఆకాశమందు ఉషస్సు అవతరించును. సూర్యుని నుండి ఎంతో అందములగు రాత్రింబవళ్లు కలుగును. అట్టి మనసుతోనే ఆరథమువెక్కియే మీరు విచ్చేయండి.

    13. అశ్వినులారా! మీరు ఆ  రథముననే పర్వత మార్గమున పయనించండి. 'శయు' నామకుని వృద్థగోవును పాదియావును చేయండి మీ శక్తి ఎంతటిదనగా తోడేలు నోట బడిన వర్తిక పక్షిని తోడేలు నోటినుండి తీసి రక్షించినారు.

    14. భృగసంతానములు రథములు చేసినట్లు అశ్విద్వయమా! మీకు రథము సమర్పించబడినది. మామ కూతురునిచ్చునపుడు అల్లునగు వస్త్రాది భూషణములచే అలంకరించినట్లు నేను మీ కొరకు  ఈ స్తోత్రమును అలంకరించినాను.

                                  నలుబదవ సూక్తము
                               ఋష్యాదులు పూర్వమువలె

    1. అశ్వినులారా! మీరు కర్మబోధకులు. మీ మహారథము ప్రాతః కాలమున బయలు దేరును. ఒక ప్రత్యేక వ్యక్తినుండి ధనము అందుకొనును. సాగును. అప్పుడు తన యజ్ఞసాఫల్యమునకని ఏ యజమాని ఉజ్వలమగు మీ రథమును  కీర్తించునో ఆరథముఏది?

    2. అశ్విద్వయమా! మీరు రాత్రింబవళ్లు ఎచటి కేగుదురు? ఎచట కాలము గడుపుదురు? శయన కాలమున విధవ తన బావను, సధవ తన భర్తను సమాదరించినట్లు యజ్ఞములందు మిమ్ము సమాదరించి ఎవరు ఆహ్వానింతురు?

    (శయుత్రా విధవేవ దేవరం శయన కాలమున విధవ తన బావను అను మంత్ర భాగము భావగర్భితముతో వివరణ అవసరము. 1. విధవలకు అంతటి దుర్గతి లేదు. 2. విధవకు బావతో సంబంధము ధర్మమైనట్లున్నది 3. ఇదియే దేవరన్యాయము ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అట్లు జన్మించినవారే 4. పంజాబు ప్రాంతమందు దేవరన్యాయము నేటికి చెల్లుబాటులో ఉన్నది.)

    3. వృద్ధరాజులనువలె ప్రాతఃకాల స్తోత్రపాఠములు మమ్ము మేల్కోలుపును. యజ్ఞములు అందుకొనుటకు నిత్యము మీరు ఎవరి ఇంటికి చేరుకుందురు? ఎవని పాపములు దూరము చేయుదురు?  రాజకుమారులవంటి మీరు ఎవరి యజ్ఞములకు సాగుదురు?

    4. వేటకాడు శార్దూలము కొరకు చూచినట్లు యజ్ఞద్రవ్యములు అందుకోని రాత్రింబవళ్లు మీ కొరకు చూచుచున్నారు. కాలమును అనుసరించి జనులు మీ కొరకు హోమములు చేయుదురు. మీరు జనులకు అన్నము అందింతురు. మరి మీరే కదా శుభములకు అధిపతులు!

    5. ఉపదేశక ద్వయమా! నేను రాజకుమారి ఘోషను. నేను నలుదిశల మీకథలే చెప్పుదును. మిమ్ములనే ఆలోచిస్తాను. రాత్రనకు, పగలనక మీరు నా  వద్దనే ఉందురు రథయుక్తుడు, అశ్వసంపన్నుడగు నా అన్నకొడుకును నిరసింతురు.

    (ఘోష కన్య తండ్రి ఇంట ఉన్నది సోదరలు ఆమెను సహించకుండవచ్చును. వారి కొడుకులు అత్తను  సహింతురా? అందుకే నిరసన కావచ్చును)

    6. కవిద్వయమా! మీరు రథము అధిరోహించిఉన్నారు మీరు కాత్సునివలె రథమెక్కి స్తోత ఇంటికి చేరుదురు. మీ వద్దనున్న మధువు అత్యధికము - తేనెటీగలు గ్రహించునంతటిది! వ్యభిచారిణివలె తేనెటీగలు నీ మధువు వెంటపడును.       


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More