Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
9. నా తేజస్సు కొరకును, బలము కొరకును నా ప్రజను రక్షించుటకును మృతుని ధనుస్సు చేతబూని
అనుచున్నాను:-
"మృతుడా! నీవు ఇచటనే ఉండుము. మేము వీరపుత్ర వంతులము గర్వంచిన సకల శత్రువులను జయించగలము" విశ్వాస్పృధో అభిమాతీర్జయేమ."
(ఈ జీవస్రవంతి ఏ ఒక్కడు తొలగుటవలన నిలువదు. ఇది మత్యువును ధిక్కరించి సాగును.)
10. మృతుడా! ఈ భూమి తల్లివంటిది. విశాల సర్వవ్యాపిని. సుఖదాయిని. నీవు నెల తల్లిని చేరుము. ఈమె యువతివలెను, ఉన్నిగొంగళి వలెను. నీకు మెత్తని స్పర్శనిచ్చును. నీవు యజ్ఞ, దానములు చేసి ఉన్నచో ఈ పృథ్వి - మృత్యువాతపడిన నీ అస్థిరూపమును రక్షించును. "పిపాత్వాపాతు నిర్రుతే రుపస్థాత్."
(ఇది ఖననము కావచ్చును.)
11. పృథివీ! ఈ మృతుని పైకి లేపి ఉంచుము. ఇతనిని బాధించకుము. ఆదుకోనుము. సుప్రతిష్ఠ వగుము. తల్లి తన బిడ్డను కప్పినట్లు భూమీ! మృతునీ అస్థిరూపామును కప్పుము "మాతాపుత్రం యథాసిచాభ్యేనం భూమ ఉర్ణుహి."
12. పృథివీ! దీనిమీద స్తూపాకారముగా నిలువుము. వేలదుమ్ములు దీని మీద పడవలెను. మృతుని కొరకు ఇది ఘృత పూర్ణగృహము వంటిది కావలెను. సకలదినములు ఇతనికి ఆశ్రయభూతములగును గాథ "విశ్వాహా స్మై శరణః సన్త్వత్ర"
13. అస్థికలశమా! నిన్ను భూమిని ఎత్తుచేసి ఉంచుదును. మట్టిపది చెడగొట్ట కుండునట్లు నీ మీద మట్టిముద్దా మూత వేయుదును. దీనిని పితరులు స్థిరపరచవలెను. పితృపతి యముడు నీకు చోటు కల్పించవలెను "యమఃసదనాతేమినోతు".
14. ప్రజాపతీ! బాణపు మొదలున పక్షిఈకను పెట్టినట్లు - సంవత్సరరూపుడనగు సంకుసుక ఋషినగు నన్ను సకల దేవతలు దివసములందు ఉంచినారు. పరుగుపెట్టు గుఱ్ఱమును పగ్గముతో ఆపినట్లు నా పూజ్యస్తుతులను నిలిపిఉంచుము.
(శ్రీమదాంథ్ర వచన ఋగ్వేదసంహిత పడవ మండలము ఏడవ అష్టకామున ఆరవ అధ్యాయము సమాప్తము.)
ఓంనతామినన్తి మయినో నధీవ్రతాదేవానాం ప్రథమాధ్రవాణి
నరోదసే అద్రుహో వేద్యాభిర్న పర్వతాని నమే స్థివాంసః
ఏడవ అధ్యాయము పందొమ్మిదవ సూక్తము
ఋషి - యమపుత్ర మథితుడు. దేవత - జలము - గోవులు అగ్ని.
ఛందస్సు - అనుష్టుప్ - 6 గాయత్రి
ఓం నివర్తధ్వంమాను గాతాస్మాన్త్సి రేవతీః
1. గోవులారా! మీరుమావద్దకురండి, మరొకరివద్దకు పోవద్దు ధనవతి గోవులారా! మాకు పాలు అందించండి పోషించండి మరల మరల ధనమునిచ్చు అగ్ని, సొమము. మీరు మాకు ధనము ఇవ్వండి.
2. ఈ గోవులు మరల మరల మా వద్దకు రావలెను. అవి మా అధీనమున ఉండవలెను. ఇంద్రుడు సహితము వీనిని మా అధీనమున ఉంచవలెను. అగ్ని వీనిని ఉపయోగ్యము చేయవలెను.
3. ఈ గోవులు మరల మరల నా వద్దకు రావలెను. నా అధీనము పుష్టికలవి కావలెను అగ్నీ! వీనిని మా వద్ద ఉంచుము ఈ గోధనము మా వద్ద ఉండవలెను.
4. గోసహిత గోష్ఠమును ప్రార్థింతును. గోవులు ఇంటికి రావలెనని ప్రార్థింతును. గోసమూహములను కూడ ప్రార్ధింతును. గోసంచారమును ప్రార్ధింతును. గోవులు మేతమేసి ఇంటికి తిరిగి రావలెనని ప్రార్థింతును. గోపాలుని సహితము ప్రార్థింతును.
5. నలువైపుల గోవులను వెదకు గోపాలుడు గోవులను మేపువాడును, వానిని ఇంటికి తెచ్చువాడునగు గోపాలుడు క్షేమముగా ఇంటికి తిరిగి రావలెను.
6. ఇంద్రా! నీవు మావైపు రమ్ము. గోవులు మావైపు మరల్చుము. మాకు గోవులనిమ్ము. మేము చిరంజీవి గోవుల పాలు సేవించవలెను.
7. దేవతలారా! నేను మీకు విశేష అన్నము, ఘృతము, దుగ్థము మున్నగువానిని నివేదింతును. యజ్ఞయోగ్యదేవత మాకు గోధనమును ప్రసాదించవలెను.
8. గోపాలా! గోవులను మా వద్దకుతెమ్ము గోవులారా! మీరు మా వద్దకు రండి గోపాలా! గోవులను మళ్లింపుము. గోవులారా ! మరలి రండి.
సూక్తకర్తరుషీ! గోవులను ఎచటికి తిరిగి రావలెను? ఎచటినుండి తిరిగిరావలెను?
ఋషి బదులు పలుకుచున్నాడు:-
నలువైపులనుండి మరలిరండి. గోపాలా! అలుదిశల నుండి మరలింపుము.
ఇరువదివ సూక్తము
ఋషి - ఇంద్రలేక ప్రజాపతి పుత్ర విమదుడు లేక వసుక్రపుత్రుడు వసుక్రదుడు.
దేవత - అగ్ని. ఛందస్సు - 1-9 విరాట్ -2 అనుష్టుప్ -10 త్రిష్టుప్ మిగిలినవి గాయత్రి
1. అగ్నీ! మా మనసులకు శుభములు కూర్చుము. మా స్తోత్రములను యోగ్యములను చేయుము.
2. హవి అందుకొను దేవతలందు చిన్నవాడు, యువతముడు. అందరి మిత్రుడు, దుర్థర్షుడగు అగ్నిని - గోస్తనమును ఆశ్రయించి జీవించు వత్సమువలె - స్తుతింతును.
3.కర్మాధార , జ్వాలారూప అగ్నిని స్తోతలు వర్థిల్ల చేయుదురు. అగ్ని అభీష్ట ఫలప్రదాత.
4. అగ్ని యజమానులకు ఆశ్రయణీయుడు. అగ్ని దీప్తుడగును. జ్వాలగాపైకి ఎగుయును. ద్యులోకము వరకు వ్యాపించును. మేఘమున సహితము చొరబడును.
5. యజమాని యజ్ఞమున హవిని గ్రహించు అగ్ని జ్వాలాయుక్తుడై పైపైకి పోవును. అగ్ని ఉత్తరవేదిని కొలతవేయుచు ముందుకుసాగును.
6. అగ్ని సర్వపాలకుడు అతడే యజ్ఞము. అతడే పురోడాశము. అగ్ని దేవతల ఆహ్వాత.
7. అగ్ని దేవతలను పిలుచువాడు. అతనిని శిలాపుత్రుడు అందురు. అతడు యజ్ఞధారకుడు ఉత్కృష్ట సుఖప్రాప్తికిగాను. అట్టి అగ్నినే భజించ దలచినాను.
8. పురోడాశాదుల ద్వారా అగ్నిని సంవర్థిల్ల చేయు మా పుత్ర, పౌత్రాదులు అనుభవయోగ్యమగు పశ్వాదుల మధ్య ఆసీనులగుదురని ఆశింతుము.
9. అగ్ని అధిరోహించు బృహత్ రథము కృష్ణవర్ణము, శుభ్రవర్ణము, రక్తవర్ణము కలిగి సుళువుగా సాగునదియై కీర్తిశాలి యగును. బంగారు జిలుగులనింపి విధాత దానిని నిర్మించినాడు.
10. అగ్నీ! నీవు వృక్షపుత్రుడవు. బలపుత్రుడవు. అమర ధనయుక్తుడవు. తన గొప్ప బుద్ధిమీద ఆధారపడిన విమద ఋషి నీ కొరకు స్తోత్రములు చెప్పినాడు. నీవు ఈ వరిష్ఠస్తుతులను అందుకొనుము. విమదునకు అన్నము, బలము, శుభగేహము మరియు ఇవ్వదగిన ధనములు నన్నింటిని ప్రసాదించుము.
ఇరువది ఒకటవ సూక్తము.
ఋషి దేవతే పూర్వవత్ .ఛందస్సు - ఆస్తారపంక్తి.
1. మేము స్తుతులు రచించినాము. యజ్ఞము విస్తృతకుశవంతము. దానికొరకు అగ్నిని వరించినామ. అగ్నీ! నీవు మహామహుడవు. వృక్షవాసివి. నీ దీప్తజ్వాలలను విమదుని కొరకు వెలిగించుము.
2. అగ్నీ! దీప్త, విశేష ధనిక యజమానులు నిన్ను శోభిల్ల చేయుదురు. ద్రవించునట్టి సరళగతి ఆహుతి తృప్తికొరకు నీ వద్దకు చేరును. నీవు మహామహుడవు - "త్వంవివక్షసే'.
3. యజ్ఞనిర్వాహకులగు ఋత్విక్కులు హోమ పాత్రములందునిన్ను జలము పృథ్విని తడిపినట్లు సేవింతురు. అగ్నీ! దేవతలకు బలము కొరకు నీవు కృష్ణవర్ణ జ్వాలారూపివై సమస్త శోభలను దాల్తువు. నీవు మహామహుడవు "త్వంవివక్షసే".
4. అగ్నీ! నీవు అమరుడవు. బలవంతుడవు. నీవు శ్రేష్ఠమనుకొను విచిత్ర ధనమును మాకు అన్నలాభము కలుగునట్లు తెచ్చిఇమ్ము.
5. అగ్నిని అథర్వఋషి సృష్టించినాడు. అగ్ని సకల స్తోత్రజ్ఞాత "విదద్విశ్వానికావ్యా" అగ్నీ! నీవు దేవతలను పిలువవలసిన యజమాని దూతవు. నీవు యజమానులకు ఇష్టుడవు కమనీయుడవు మహానుడవు "కామ్యోవివక్షసే".
6. అగ్నీ! యజ్ఞారంభమున యజమానులు, ఋత్విక్కులు నిన్ను స్తుతింతురు. నీవు హవిర్ధాత విమదునకు సకల ప్రకార ధనములను ప్రసాదింతువు అందువలన మహామహుడవు. "వివక్షసే".
7. అగ్నీ! యజ్ఞారంభమున యజమానులు, ఋత్విక్కులు నిన్ను స్తుతింతురు. నీవు హవిర్ధాత విమదునకు సకల ప్రకార ధనములను ప్రసాదింతువు అందువలన మహామహుడవు. "వివక్షసే".
8. అగ్నీ! నీవు ప్రదీప్త తేజమున ప్రసిద్ధుడవు. అప్పుడపుడు వృషభధ్వని చేయుదువు. సోదరి వంటి ఓషధులందు బీజములు ఏర్పరతువు. సోమాదులందు మాదకము కలిగినంత మహామహుడవగుదువు. "వివక్షసే".
ఇరువది రెండవ సూక్తము
ఋషి - విమదుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - 1,5 త్రిష్టుప్ 5,7,9
అనుష్టుప్ మిగిలినవి బృహతి
1. ఇంద్రుడు నేడు ఎచట విఖ్యాతుడు? అతడు మిత్రునివలె ఎవరి వద్ద ఉన్నాడు? ఋషుల ఆశ్రమములందో, గహన గుహలందో స్తుతించ బడుచున్నాడా?
2. నేడు ఈ యజ్ఞమందు ఇంద్రుడు విఖ్యాతుడు. మేము అతనిని స్తుతించుచున్నాము. ఇంద్రుడు వజ్రధరుడు. స్తుత్యుడు స్తోతలకు మిత్రుని వంటివాడు. అసాధారణముగా కీర్తించబడువాడు.
3. ఇంద్రుడు బలపతి. అనంతగుణ సంపన్నుడు. స్తోతలకు మహాఅన్నదాత. శత్రువుల రాచిరంపానపెట్టువజ్రము పట్టినవాడు. తండ్రి కొడుకునువలె అతడు మమ్ము ప్రేమించవలెను "పితాపుత్రమివ ప్రియమ్".
4.వజ్రధర ఇంద్రా! నీవు ద్యుతిమంతుడవు. సక్రమ మార్గగామివి హర్యశ్వములను రధమున కూర్చువాడవు. యుద్ధపథమును కల్పించువాడవు. నిరంతరము స్తుతించ బడువాడవు.
5. ఇంద్రా! నీవు మాత్రమే వాయువేగము కలిగి చక్కని నడకలుగల హర్యశ్వములను తొలగలవు. మావద్దకు రాగలవు. నీ హర్యశ్వములను నడుపగలవాడు దేవతలందు మరొకడులేడు. వీటి బలమును తెలియువాడు సహితములేడు.
6. ఇంద్రాగ్నులారా! మీరు మా స్థానములకు చేరునప్పుడు భార్గవ ఉశను, నీతో సంభాషించినారు. మీరు ఏ ప్రయోజనము ఆశించి ఇంత దూరము వచ్చినారు? మీరు ద్యులోక, భూలోకమునుండి నా వద్దకు వచ్చుట మీ అనుగ్రహము మాత్రమే అగును.
7. ఇంద్రా! ఈ యజ్ఞమందు పదార్థములు సమర్పించినాము. నీకు తృప్తికలుగు వరకు ఆరగింపుము. మేము నీ నుంచి అన్నమును, అన్నరక్షణను కోరుచున్నాము. రాక్షసులు నాశనమగునట్టి బలమును కూడ కోరుచున్నాము.
8. మాకు నలుదిక్కుల యజ్ఞశూన్య దస్యుబలములు ఉన్నవి. వారు దేనిని విశ్వసించరు. వారు శృత్యాది కర్మ రహితులు. ఆసురీ ప్రకృతులు. శత్రునాశక ఇంద్రా! ఈ దస్యుజాతిని నాశనము చేయుము.
9. విక్రాంతఇంద్రా! నీవు శూర మరుత్తులతో కూడి మమ్ము రక్షింపుము. నీరక్షణలందు మేము శత్రువినాశక సమర్థులమగుదుము. స్వామిని సేవించుటకు సేవకులు చుట్టు మూగినట్లు నీవు ప్రసాదించిన పదార్థములు స్తోతలచుట్టు చేరును.
10. వజ్రధర ఇంద్రా! నీవు సోత్తలగు కవులు నక్షత్రవాసి దేవతలను గూర్చి రచించిన స్తోత్రములు వినుచున్నప్పుడు వృత్రవధకు ప్రసిద్ధ మరుత్తులను పంపుదువు.
11. శూర, వజ్రధర ఇంద్రా! దానము చేయుటయే నీ గుణము. యుద్ధరంగమున అతిత్వరగా నీ పనిముగియును. నీవు మరుత్తులతో కలసి 'శుష్ణు' ని వంశము సాంతమును నాశనము చేసినావు.
12. శూర ఇంద్రా! మా సదాశయములు వృధాకారాదు. మాసకల ఆశలు ఫలవంతములు, సుఖకరములు కావలెను.
13. నీ అనుగ్రహమున మాకు బాధలు కలుగరాదు. జనులు ఆవుపాలను అనుభవించినట్లు మేము నీ ప్రసాద ఫలములను అనుభవింతుము.
14. దేవతల పనితనము వలన ఈ భూమి - కాళ్లు చేతులు లేకుండ - పెరిగినది. నీవు భూప్రదక్షిణ చేసినావు. నలుదిశల సంచరించినావు 'శుష్ణు' అసురుని హింసించినావు.



